యెహోవాకు నమ్మకంగా ఉండండి
“యెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక.”—1 సమూ. 20:42.
1, 2. నమ్మకంగా ఉండే విషయంలో దావీదు యోనాతానుల స్నేహం ఎందుకు ఒక అసాధారణమైన ఉదాహరణ?
చిన్నవాడైన దావీదుకున్న ధైర్యాన్ని చూసి యోనాతాను ఆశ్చర్యపోయుంటాడు. దావీదు భారీకాయుడైన గొల్యాతును చంపి, ఆ ‘ఫిలిష్తీయుని తలను’ యోనాతాను తండ్రి దగ్గరకు అంటే ఇశ్రాయేలు రాజైన సౌలు దగ్గరకు తీసుకొచ్చాడు. (1 సమూ. 17:57) దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడని యోనాతాను గుర్తించాడు. అప్పటినుండి యోనాతాను, దావీదులు ప్రాణస్నేహితులయ్యారు. వాళ్లు ఎప్పటికీ ఒకరికొకరు నమ్మకంగా ఉండాలని మాటిచ్చుకున్నారు. (1 సమూ. 18:1-3) యోనాతాను తన జీవితాంతం దావీదుకు నమ్మకంగా ఉన్నాడు.
2 ఇశ్రాయేలుకు రాజుగా యెహోవా యోనాతానును కాకుండా దావీదును ఎన్నుకున్నప్పటికీ, యోనాతాను దావీదుకు నమ్మకంగా ఉన్నాడు. తన స్నేహితుడైన దావీదును చంపడానికి సౌలు ప్రయత్నించినప్పుడు యోనాతాను కంగారుపడ్డాడు. దావీదు హోరేషు దగ్గరున్న ఎడారిలో దాక్కున్నాడని యోనాతానుకు తెలుసు కాబట్టి ఆయన అక్కడికి వెళ్లి, యెహోవా మీద ఆధారపడుతూనే ఉండమని దావీదును ప్రోత్సహించాడు. ఆయనిలా అన్నాడు, “నా తండ్రియైన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీయులకు రాజవగుదువు, నేను నీకు సహకారినౌదును.”—1 సమూ. 23:16, 17.
3. యోనాతాను జీవితంలో ఏది అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం? అది మనకెలా తెలుసు? (ప్రారంభ చిత్రం చూడండి.)
3 సాధారణంగా మనం నమ్మకస్థులను అభిమానిస్తాం. అయితే కేవలం దావీదుకు నమ్మకంగా ఉన్నందుకే మనం యోనాతానును అభిమానించాలా? లేదు. దేవునికి నమ్మకంగా ఉండడమే యోనాతాను జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం. అందుకే, తనకు బదులు దావీదు రాజు అవుతాడని తెలిసినప్పటికీ యోనాతాను అసూయపడలేదు. బదులుగా దావీదుకు నమ్మకంగా ఉన్నాడు. దావీదు యెహోవా మీద ఆధారపడడానికి కూడా యోనాతాను సహాయం చేశాడు. వాళ్లిద్దరూ యెహోవాకు అలాగే ఒకరికొకరు నమ్మకంగా ఉన్నారు. అంతేకాదు, “యెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక” అని వాళ్లు చేసుకున్న ఒప్పందానికి కట్టుబడివున్నారు.—1 సమూ. 20:42.
4. (ఎ) ఏది నిజమైన సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది? (బి) ఈ ఆర్టికల్‌లో మనమేమి చర్చిస్తాం?
4 మనం కూడా మన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సంఘంలోని తోటి సహోదరసహోదరీలకు నమ్మకంగా ఉండాలి. (1 థెస్స. 2:10-12) అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మనం యెహోవాకు నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే మనకు జీవాన్నిచ్చింది ఆయనే. (ప్రక. 4:10, 11) మనం ఆయనకు నమ్మకంగా ఉన్నప్పుడు నిజమైన సంతోషాన్ని, సంతృప్తిని పొందుతాం. కష్టసమయాల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉండాలని మనకు తెలుసు. అయితే, (1) అధికారంలో ఉన్న ఓ వ్యక్తి మన గౌరవానికి అర్హుడు కాదని అనిపించినప్పుడు, (2) ఎవరికి నమ్మకంగా ఉండాలో నిర్ణయించుకోవాల్సి వచ్చినప్పుడు, (3) నాయకత్వం వహిస్తున్న సహోదరుడు మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు, (4) ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కష్టంగా అనిపించినప్పుడు మనం యెహోవాకు నమ్మకంగా ఉండడానికి యోనాతాను ఉదాహరణ ఎలా సహాయం చేస్తుందో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
అధికారంలో ఉన్న ఓ వ్యక్తి మన గౌరవానికి అర్హుడు కాదని అనిపించినప్పుడు
5. సౌలు రాజుగా ఉన్నప్పుడు ప్రజలు దేవునికి నమ్మకంగా ఉండడం ఎందుకు కష్టంగా అనిపించింది?
5 యోనాతాను, ఇశ్రాయేలులోని ప్రజలు ఓ కష్ట పరిస్థితిలో ఉన్నారు. యోనాతాను తండ్రి సౌలు అవిధేయత చూపించడంవల్ల యెహోవా అతన్ని తిరస్కరించాడు. (1 సమూ. 15:17-23) కానీ చాలా కాలంపాటు అతనే రాజుగా ఉండడానికి దేవుడు అనుమతించాడు. చాలా చెడ్డపనులు చేసే రాజు “యెహోవా సింహాసనమందు” కూర్చున్నప్పుడు దేవునికి నమ్మకంగా ఉండడం అక్కడి ప్రజలకు కష్టంగా అనిపించింది.—1 దిన. 29:23.
6. యోనాతాను యెహోవాకు నమ్మకంగా ఉన్నాడని మనకెలా తెలుసు?
6 కానీ యోనాతాను దేవునికి నమ్మకంగా ఉన్నాడు. సౌలు, దేవునికి అవిధేయత చూపించడం మొదలుపెట్టిన వెంటనే యోనాతాను ఏమి చేశాడో ఓసారి ఆలోచించండి. (1 సమూ. 13:13, 14) ఆ సమయంలో ఫిలిష్తీయుల గొప్ప సైన్యం 30,000 రథాలతో ఇశ్రాయేలు మీద దాడి చేయడానికి వచ్చింది. సౌలు దగ్గర 600 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. అంతేకాదు అతని దగ్గర, యోనాతాను దగ్గర మాత్రమే ఆయుధాలు ఉన్నాయి. అయినప్పటికీ యోనాతాను భయపడలేదు, యెహోవా ‘తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను విడనాడడు’ అని సమూయేలు ప్రవక్త చెప్పిన మాటల్ని గుర్తుతెచ్చుకున్నాడు. (1 సమూ. 12:22) అంతేకాదు, “అనేకులచేతనైనను కొద్దిమందిచేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా” అని తన తోటి సైనికునితో చెప్పి ఫిలిష్తీయుల గుంపు మీద దాడిచేసి వాళ్లిద్దరూ దాదాపు 20 మందిని చంపారు. ఆ సమయంలో యెహోవా భూకంపాన్ని తెప్పించడంతో ఫిలిష్తీయులు భయపడి ఒకరినొకరు చంపుకున్నారు. అలా యోనాతానుకు యెహోవా మీద ఉన్న విశ్వాసం వల్ల ఇశ్రాయేలీయులు యుద్ధంలో గెలిచారు.—1 సమూ. 13:5, 15, 22; 14:1, 2, 6, 14, 15, 20.
7. యోనాతాను తన తండ్రితో ఎలా ప్రవర్తించాడు?
7 సౌలు యెహోవాకు అవిధేయత చూపిస్తూనే ఉన్నప్పటికీ యోనాతాను వీలైనప్పుడల్లా తన తండ్రి మాట విన్నాడు. ఉదాహరణకు, యెహోవా ప్రజల్ని రక్షించడానికి వాళ్లిద్దరు కలిసి యుద్ధం చేశారు.—1 సమూ. 31:1, 2.
8, 9. మనపై అధికారం ఉన్నవాళ్లను మనమెందుకు గౌరవించాలి?
8 యోనాతానులాగే మనం కూడా పైఅధికారులకు వీలైనప్పుడల్లా విధేయత చూపిస్తూ యెహోవాకు నమ్మకంగా ఉన్నామని చూపించవచ్చు. ఒకవేళ వాళ్లలో కొంతమంది మన గౌరవానికి అర్హులు కాదనిపించినప్పటికీ మనం విధేయత చూపిస్తాం. ఉదాహరణకు, ఓ ప్రభుత్వ అధికారి అవినీతిపరుడైనప్పటికీ అతని స్థానాన్నిబట్టి మనం అతన్ని గౌరవిస్తాం. ఎందుకంటే మనం ‘పైఅధికారుల్ని’ గౌరవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. (రోమీయులు 13:1, 2 చదవండి.) నిజానికి యెహోవా అధికారం ఇచ్చిన ప్రతీ ఒక్కరినీ గౌరవించడం ద్వారా మనం యెహోవాకు నమ్మకంగా ఉన్నామని చూపించవచ్చు.—1 కొరిం. 11:3; హెబ్రీ. 13:17.
9 దక్షిణ అమెరికాలో ఉంటున్న ఓల్గ [1] అనే సహోదరి అనుభవాన్ని పరిశీలించండి. తన భర్త ఎంత దురుసుగా ప్రవర్తించినా ఆమె మాత్రం అతన్ని గౌరవించేది. అలా ఆమె యెహోవాపట్ల తన నమ్మకాన్ని చూపించింది. ఆమె ఒక యెహోవాసాక్షి అయినందుకు తన భర్త కొన్నిసార్లు ఆమెతో మాట్లాడేవాడు కాదు లేదా బాగా తిట్టేవాడు. తనను వదిలేస్తానని, పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతానని కూడా బెదిరించేవాడు. కానీ ఓల్గ “కీడుకు ప్రతి కీడు” చేయలేదు. ఒక మంచి భార్యగా ఉండడానికి ఆమె చేయగలిగినదంతా చేసింది. అతని కోసం వంట చేసేది, బట్టలు ఉతికేది, అతని కుటుంబసభ్యుల బాగోగుల్ని చూసుకునేది. (రోమా. 12:17) అతని బంధువుల్ని, స్నేహితుల్ని కలవడానికి అతనితోపాటు వీలైనప్పుడల్లా వెళ్లేది. ఉదాహరణకు, అతని తండ్రి అంత్యక్రియల కోసం వేరే ఊరికి వెళ్లాల్సివచ్చినప్పుడు ప్రయాణానికి కావాల్సినవన్నీ ఆమె సిద్ధంచేసి, పిల్లల్ని కూడా రెడీ చేసింది. ఆ తర్వాత చర్చిలో జరిగే అంత్యక్రియల కార్యక్రమం అయిపోయేవరకు ఆమె తన భర్త కోసం బయటే వేచిచూసింది. చాలా సంవత్సరాలు గడిచాక, ఓల్గ వాళ్ల భర్త ఆమెను ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆమె ప్రతీసారి ఓపిగ్గా భరిస్తూ అతనికి గౌరవం చూపించేది. ఇప్పుడు ఓల్గ మీటింగ్స్‌కి వెళ్లడానికి అతను అడ్డుచెప్పట్లేదు, పైగా అతనే స్వయంగా ఆమెను మీటింగ్ హాలుకు తీసుకెళ్తున్నాడు. అప్పుడప్పుడు ఆమెతోపాటు మీటింగ్‌లో కూడా కూర్చుంటున్నాడు.—1 పేతు. 3:1, 2.
ఎవరికి నమ్మకంగా ఉండాలో నిర్ణయించుకోవాల్సి వచ్చినప్పుడు
10. యోనాతాను ఎవరికి నమ్మకంగా ఉండాలో ఎలా నిర్ణయించుకున్నాడు?
10 దావీదును చంపుతానని సౌలు చెప్పినప్పుడు, ఎవరికి నమ్మకంగా ఉండాలో నిర్ణయించుకోవడం యోనాతానుకు కష్టమైంది. ఎందుకంటే, ఆయన తన తండ్రికి నమ్మకంగా ఉండాలని అనుకున్నాడు, అలాగే దావీదుకు కూడా నమ్మకంగా ఉండాలని అనుకున్నాడు. అయితే యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు గానీ సౌలుకు కాదని యోనాతానుకు తెలుసు కాబట్టి ఆయన దావీదుకే నమ్మకంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఆయన దావీదును దాక్కోమని హెచ్చరించి, ఆ తర్వాత సౌలు దగ్గరకు వెళ్లి ఆయన గురించి ‘దయగా మాట్లాడాడు.’—1 సమూయేలు 19:1-6 చదవండి.
11, 12. దేవుని మీద ప్రేమ మనం ఆయనకు నమ్మకంగా ఉండడానికి ఎలా సహాయం చేస్తుంది?
11 ఆస్ట్రేలియాలో ఉంటున్న ఆలస్ అనే సహోదరికి కూడా ఎవరికి నమ్మకంగా ఉండాలో నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె బైబిలు స్టడీ తీసుకుంటున్నప్పుడు తాను నేర్చుకుంటున్న విషయాల్ని కుటుంబసభ్యులతో పంచుకుంది. అంతేకాదు, వాళ్లతో కలిసి క్రిస్మస్ ఎందుకు చేసుకోదో కూడా చెప్పింది. మొదట్లో వాళ్లు కాస్త నిరుత్సాహపడ్డారు, కానీ ఆ తర్వాత వాళ్లకు ఆమె మీద చాలా కోపం వచ్చింది. ఆలస్ తమను పట్టించుకోవడం మానేసిందని వాళ్లు అనుకున్నారు. ఆమె ఇలా చెప్పింది, “తనకు నాతో ఏ సంబంధం లేదని మా అమ్మ తేల్చి చెప్పింది. నేను షాక్ అయ్యాను, చాలా బాధనిపించింది. ఎందుకంటే నేను వాళ్లను చాలా ప్రేమించాను. కానీ వాళ్లకన్నా ఎక్కువగా యెహోవాను, యేసునే ప్రేమించాలని నిర్ణయించుకుని, ఆ తర్వాత జరిగిన ఒక అసెంబ్లీలో బాప్తిస్మం తీసుకున్నాను.”—మత్త. 10:37.
12 మనం జాగ్రత్తగా లేకపోతే యెహోవాకు నమ్మకంగా ఉండడం కన్నా ఒక క్రీడా జట్టుకో, స్కూల్‌కో, లేదా ఓ దేశానికో నమ్మకంగా ఉండడమే ప్రాముఖ్యమని అనుకోవచ్చు. ఉదాహరణకు, హెన్రీ అనే సహోదరునికి తన స్కూల్లోని వాళ్లతో చెస్ ఆడడమంటే ఇష్టం. అయితే, ఆయన తన స్కూల్ తరఫున ఆడి తన స్కూల్‌కి ప్రైజ్ తెచ్చిపెట్టాలనుకున్నాడు. కానీ ప్రతీ వారాంతంలో చెస్ ఆడడం వల్ల ప్రీచింగ్‌కి, మీటింగ్స్‌కి వెళ్లలేకపోయేవాడు. దేవునికి నమ్మకంగా ఉండడం కన్నా తన స్కూల్‌కు నమ్మకంగా ఉండడమే తనకు ముఖ్యమైపోయిందని హెన్రీ గ్రహించాడు. దాంతో ఆయన స్కూల్ తరఫున చెస్ ఆడడం మానేశాడు.—మత్త. 6:33.
13. కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఏది సహాయం చేస్తుంది?
13 కొన్నిసార్లు కుటుంబంలో ఉన్నవాళ్లందరికీ నమ్మకంగా ఉండడం కష్టంకావచ్చు. ఉదాహరణకు, కెన్ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “ముసలితనంలో ఉన్న మా అమ్మ దగ్గరకు వెళ్లాలని, అప్పుడప్పుడు ఆమెను మాతో ఉంచుకోవాలని నాకనిపించేది. కానీ మా అమ్మకు, నా భార్యకు ఒకరంటే ఒకరికి పడదు. నేను వాళ్లిద్దరిలో ఎవరో ఒకర్ని నొప్పించాల్సివస్తోంది.” ఈ విషయం గురించి బైబిలు ఏమి చెప్తుందో కెన్ ఆలోచించాడు. ఇలాంటి పరిస్థితిలో భార్యను సంతోషపెట్టి, ఆమెకు నమ్మకంగా ఉండాలని గ్రహించాడు. అందుకే తన భార్యను సంతోషపెట్టే నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత, అత్తతో ఎందుకు దయగా ప్రవర్తించాలో కెన్ తన భార్యకు వివరించాడు. అంతేకాదు, కోడల్ని ఎందుకు గౌరవించాలో తన తల్లికి వివరించాడు.—ఆదికాండము 2:24; 1 కొరింథీయులు 13:4, 5 చదవండి.
ఓ సహోదరుడు మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు
14. సౌలు యోనాతానుతో ఎలా ప్రవర్తించాడు?
14 పెద్దలు మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు కూడా మనం యెహోవాకు నమ్మకంగా ఉండవచ్చు. సౌలు, దేవుడు ఎన్నుకున్న రాజై ఉండి తన కొడుకుతో కఠినంగా ప్రవర్తించాడు. యోనాతాను దావీదును ఎందుకు ప్రేమించాడో సౌలు అర్థంచేసుకోలేదు. అందుకే యోనాతాను దావీదుకు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు సౌలు చాలా కోపం తెచ్చుకుని, యోనాతానును అందరిముందు అవమానించాడు. అయినప్పటికీ యోనాతాను తన తండ్రిని గౌరవించాడు. అదే సమయంలో ఆయన యెహోవాకు, ఇశ్రాయేలుకు తర్వాతి రాజుగా అవ్వబోయే దావీదుకు కూడా నమ్మకంగా ఉన్నాడు.—1 సమూ. 20:30-41.
15. ఎవరైనా మనల్ని అపార్థం చేసుకున్నప్పటికీ మనమేమి చేయాలి?
15 నేడు మన సంఘాల్లో ఉన్న పెద్దలు అందరితో మంచిగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ సహోదరులు అపరిపూర్ణులు కాబట్టి మనం ఫలానా పని ఎందుకు చేశామో వాళ్లు అర్థంచేసుకోలేకపోవచ్చు. (1 సమూ. 1:13-17) అందుకే ఎవరైనా మనల్ని అపార్థం చేసుకున్నప్పటికీ మనం యెహోవాకు నమ్మకంగానే ఉందాం.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కష్టంగా అనిపించినప్పుడు
16. ఏయే సందర్భాల్లో మనం దేవునికి నమ్మకంగా ఉన్నామని చూపించవచ్చు?
16 తన తర్వాత యోనాతాను రాజవ్వాలని సౌలు కోరుకున్నాడు. (1 సమూ. 20:31) కానీ యోనాతాను యెహోవాను ప్రేమించి, ఆయనకు నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి యోనాతాను స్వార్థపరునిగా ఉండే బదులు దావీదుకు స్నేహితునిగా ఉంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. నిజానికి యెహోవాను ప్రేమించి, ఆయనకు నమ్మకంగా ఉండే ఎవరైనా ‘ప్రమాణం చేశాక నష్టం కలిగినా మాట తప్పరు.’ (కీర్త. 15:4) మనం దేవునికి నమ్మకంగా ఉంటాం కాబట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. ఉదాహరణకు, వ్యాపారం విషయంలో మనం ఎవరితోనైనా రాతపూర్వకంగా ఒప్పందం చేసుకున్నాక, ఎంత కష్టమైనా సరే దానికి కట్టుబడివుంటాం. అంతేకాదు వివాహ జీవితంలో ఏవైనా సమస్యలు వచ్చినా మన భర్తకు/భార్యకు నమ్మకంగా ఉండడం ద్వారా యెహోవాను ప్రేమిస్తున్నామని చూపిస్తాం.—మలాకీ 2:13-16 చదవండి.
17. ఈ ఆర్టికల్ మీకెలా సహాయం చేసింది?
17 దేవునికి నమ్మకంగా, నిస్వార్థంగా ఉన్న యోనాతానులాగే మనం కూడా ఉండాలనుకుంటాం. కాబట్టి సహోదరసహోదరీలు మనల్ని నొప్పించినప్పటికీ వాళ్లకు నమ్మకంగా ఉందాం. కష్టపరిస్థితుల్లో సహితం యెహోవాకు నమ్మకంగా ఉందాం. అలా ఉన్నప్పుడు ఆయన చాలా సంతోషిస్తాడు. ఆయన్ను సంతోషపెట్టడమే మనకు అన్నిటికన్నా ఎక్కువ ఆనందాన్నిస్తుంది. (సామె. 27:11) యెహోవా మనకు ఎల్లప్పుడూ మంచే చేస్తాడని, మనల్ని శ్రద్ధగా చూసుకుంటాడని పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. అయితే దావీదు కాలంలో నమ్మకంగా ఉన్న కొంతమంది నుండి, అలాగే నమ్మకంగాలేని కొంతమంది నుండి మనమేమి నేర్చుకోవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
^ [1] (9వ పేరా) అసలు పేర్లు కావు.