కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

యెహోవా నా ప్రాణాన్ని భద్రంగా చుట్టాడు!

యెహోవా నా ప్రాణాన్ని భద్రంగా చుట్టాడు!

సాధారణంగా ఎవరైనా నా జీవితం గురించి అడిగినప్పుడు, “నేను యెహోవా చేతిలో ఒక సూట్‌కేస్‌ లాంటి వాణ్ణి!” అని అంటాను. అంటే సూట్‌కేస్‌ తీసుకుని నాకు నచ్చిన చోటుకు ఎలా వెళ్లిపోతానో, అదేవిధంగా యెహోవా అలాగే ఆయన సంస్థ నన్ను ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లాలన్నదే నా కోరిక. నేను ఎన్నో నియామకాల్ని చేశాను, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. కొన్నిసార్లయితే, ప్రమాదపు అంచుల దాకా వెళ్లొచ్చాను. కానీ వీటన్నిటిలో యెహోవా మీద నమ్మకం ఉంచడం వల్లే నేను ధీమాగా ఉండగలిగాను.

యెహోవా మీద నమ్మకం అనే ప్రయాణం మొదలైంది

నేను 1948లో నైజీరియాలోని ఒక చిన్న గ్రామంలో పుట్టాను. ఆ సమయంలో మా చిన్నాన్న ముస్తఫా, మా పెద్ద అన్నయ్య వహాబీ బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షులు అయ్యారు. నాకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. మా నాన్న ఇక లేడు అని తెలుసుకుని నా గుండె పగిలిపోయింది. అప్పుడు మా పెద్ద అన్నయ్య, పునరుత్థానమయ్యాక నాన్నను మళ్లీ చూడవచ్చు అని చెప్పాడు. అది నాకెంతో నచ్చి, బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాను. 1963లో నేను బాప్తిస్మం తీసుకున్నాను. మా ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు కూడా బాప్తిస్మం తీసుకున్నారు.

1965లో లాగోస్‌లో ఉంటున్న మా అన్నయ్య విల్సన్‌​ దగ్గరికి నేను వెళ్లాను. అక్కడ ఇగ్బోబి సంఘంలో ఉంటున్న క్రమ పయినీర్లతో నేను ఎక్కువ సమయం గడిపేవాణ్ణి. వాళ్ల ముఖాల్లో కనిపించే ఆనందం, వాళ్లు పరిచర్యలో చూపించే ఉత్సాహం చూసి నేనూ పయినీరు అవ్వాలనుకున్నాను. అందుకే 1968, జనవరిలో పయినీరు సేవ మొదలుపెట్టాను.

బెతెల్‌లో సేవ చేస్తున్న ఆల్బర్ట్‌ ఒలుగ్‌బేబి అనే బ్రదర్‌, యౌవనస్థులతో ఒక మీటింగ్‌ ఏర్పాటు చేశాడు. ఉత్తర నైజీరియాలో ప్రత్యేక పయినీర్ల అవసరం ఉందని ఆయన ఆ మీటింగ్‌లో చెప్పాడు. ఆ రోజు బ్రదర్‌ ఉత్సాహంగా చెప్పిన మాటలు, నా చెవిలో ఇప్పటికీ వినబడుతున్నాయి. ఆయన ఏమన్నాడంటే: “మీరు యౌవనస్థులు, యెహోవా కోసం మీ బలాన్ని, సమయాన్ని ఉపయోగించండి. పరిచర్యలో మీకోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి!” యెషయా ప్రవక్త లాంటి స్ఫూర్తినే చూపిస్తూ, ప్రత్యేక పయినీరు సేవ కోసం అప్లికేషన్‌ నింపాను.—యెష. 6:8.

ఉత్తర నైజీరియాలోని కానో నగరానికి 1968, మే నెలలో నన్ను ప్రత్యేక పయినీరుగా నియమించారు. సరిగ్గా అప్పుడే బైఫ్రన్‌ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం 1967-1970 వరకు కొనసాగింది. ఆ యుద్ధంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు, చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత్తర్వాత ఆ యుద్ధం తూర్పు నైజీరియాకు కూడా పాకింది. అందుకే అది తెలిసిన ఒక బ్రదర్‌, మంచి ఉద్దేశంతోనే నన్ను అక్కడికి వెళ్లొద్దని సలహా ఇచ్చాడు. అప్పుడు నేను ఆయనతో ఇలా అన్నాను: “నా గురించి ఆలోచించి, నన్ను పట్టించుకొని సలహా ఇచ్చినందుకు థ్యాంక్యూ. కానీ ఈ నియామకం చేయమని యెహోవా కోరుకుంటున్నాడంటే, ఆయన నా చెయ్యి ఎప్పుడూ విడిచిపెట్టడని నాకు నమ్మకం ఉంది.”

యుద్ధం వల్ల చిన్నాభిన్నమైన నగరంలో యెహోవా మీద నమ్మకముంచడం

కానోలోని పరిస్థితులు నన్ను కంటతడి పెట్టించాయి. యుద్ధం వల్ల ఆ మహానగరం చిత్తుచిత్తు అయిపోయింది. కొన్నిసార్లు మేము ప్రీచింగ్‌కి వెళ్లినప్పుడు అక్కడక్కడ శవాల్ని కూడా దాటుకుంటూ వెళ్లేవాళ్లం. కానోలో చాలా సంఘాలు ఉన్నా, మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ చాలామంది వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. తక్కువలో తక్కువ 15 మంది ప్రచారకులు మాత్రమే అక్కడ మిగిలివున్నారు. వాళ్లు కూడా తమ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని, బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. మేము ఆరుగురు ప్రత్యేక పయినీర్లం వెళ్లేసరికి వాళ్ల ప్రాణాలు లేచి వచ్చాయి! వాళ్లకు మేము ధైర్యం చెప్పి, ప్రోత్సహించాక కాస్త కుదుటపడ్డారు. ఆ తర్వాత వాళ్లు మళ్లీ మీటింగ్స్‌, ప్రీచింగ్‌ ప్రారంభించేలా సహాయం చేశాం. అలాగే క్షేత్ర సేవా రిపోర్టులు, ప్రచురణల ఆర్డర్లు బ్రాంచికి పంపించడం మొదలుపెట్టాం.

ప్రత్యేక పయినీర్లమైన మేము హౌస భాషను నేర్చుకోవడం మొదలుపెట్టాం. ప్రజలకు తమ సొంత భాషలో మేము మంచివార్త చెప్పినప్పుడు వాళ్లు దాన్ని వినడానికి ఇష్టపడ్డారు. కానీ ఒక మతం వాళ్లు మాత్రం మమ్మల్ని బాగా వ్యతిరేకించేవారు. కానోలో ఆ మతం వాళ్లు చాలామంది ఉన్నారు. కాబట్టి మేము చాలా జాగ్రత్తగా ప్రీచింగ్‌ చేయాల్సి వచ్చింది. ఒక సందర్భంలోనైతే నేనూ, ఇంకో బ్రదర్‌ ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు ఒకతను కత్తితో మమ్మల్ని తరిమాడు. అది చూసి మేము వెంటనే తల వెనక్కి తిప్పకుండా పారిపోయాం! ఇలాంటి ప్రమాదాలున్నా యెహోవా మమ్మల్ని “సురక్షితంగా” కాపాడాడు. అలాగే ప్రచారకుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. (కీర్త. 4:8) ప్రస్తుతం కానోలో 11 సంఘాలు ఉన్నాయి. 500 కన్నా ఎక్కువమంది ప్రచారకులు ఉన్నారు.

నైజర్‌లో ఎదురైన వ్యతిరేకత

నైజర్‌లోని నియామేలో ప్రత్యేక పయినీరుగా సేవ చేస్తున్నప్పుడు

కానోలో కొన్ని నెలలు ఉన్న తర్వాత 1968, ఆగస్టులో నన్ను రిపబ్లిక్‌ ఆఫ్‌ నైజర్‌కి రాజధానియైన నియామే నగరానికి పంపించారు. నాతోపాటు ఇంకో ఇద్దరు ప్రత్యేక పయినీర్లను కూడా పంపించారు. మేము దక్షిణ ఆఫ్రికాలోని నైజర్‌కి వెళ్లిన కొన్నిరోజులకే ఆ ప్రాంతం ఈ భూమ్మీదే అత్యంత వేడిగా ఉండే ప్రాంతం అని అర్థమైంది. మేము అక్కడ వేడికి అలవాటుపడుతూనే, అక్కడి అధికారిక భాష ఫ్రెంచ్‌ని కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. ఇన్ని సవాళ్లున్నా, మేము యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచి, అక్కడున్న కొంతమంది ప్రచారకులతో కలిసి ప్రీచింగ్‌ చేయడం మొదలుపెట్టాం. ఎంతోకాలం గడవకముందే నియామేలో చదువు వచ్చిన ప్రతీఒక్కరికి, నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకాన్ని ఇవ్వగలిగాం. కొంతమందైతే, ఆ పుస్తకం తీసుకోవడానికి పనిగట్టుకొని మరీ మా దగ్గరికి వచ్చేవాళ్లు!

ఎంతోకాలం గడవకముందే, అక్కడి అధికారులకు యెహోవాసాక్షులంటే గిట్టదని మాకు అర్థమైంది. 1969, జూలైలో ఆ దేశంలోనే మొట్టమొదటి ప్రాంతీయ సమావేశానికి మేము కలుసుకున్నాం. ఆ సమావేశానికి దాదాపు 20 మంది హాజరయ్యారు. ఇద్దరు ప్రచారకులు తీసుకోబోయే బాప్తిస్మం కోసం మేము ఎదురుచూస్తున్నాం. ఇంతలోనే సమావేశం మొదటి రోజున కార్యక్రమాన్ని ఆపడానికి పోలీసులు వచ్చారు. వాళ్లు ప్రత్యేక పయినీర్లను, ప్రాంతీయ పర్యవేక్షకుణ్ణి స్టేషన్‌కి తీసుకెళ్లారు. మమ్మల్ని రకరకాల ప్రశ్నలు అడిగిన తర్వాత, మరుసటి రోజు కూడా స్టేషన్‌కు రమ్మన్నారు. అధికారులు దీన్ని రాద్ధాంతం చేసేలా ఉన్నారని మాకు అర్థమైంది. దాంతో, ఒక బ్రదర్‌ వాళ్ల ఇంట్లో బాప్తిస్మ ప్రసంగాన్ని ఏర్పాటు చేశాం. ఆ తర్వాత రహస్యంగా ఆ ఇద్దరి ప్రచారకులకు నదిలో బాప్తిస్మం ఇప్పించాం.

కొన్ని వారాల తర్వాత ప్రభుత్వం నన్నూ, ఆ ఐదుగురు ప్రత్యేక పయినీర్లను దేశం వదిలి వెళ్లమని చెప్పింది. మేము ఆ దేశాన్ని వదిలి వెళ్లడానికి కేవలం 48 గంటలే ఇచ్చారు. అదికూడా మేమే సొంతగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. మేము దానికి లోబడి, నేరుగా నైజీరియా బ్రాంచికి వెళ్లాం. అక్కడ మాకు కొత్త నియామకాలు ఇచ్చారు.

నన్ను నైజీరియాలోని ఓరిసన్‌బారీ అనే పల్లెటూరికి నియమించారు. అక్కడున్న చిన్న గుంపుతో కలిసి ప్రీచింగ్‌ చేయడాన్ని, బైబిలు స్టడీలు చేయడాన్ని చాలా ఆనందించాను. కానీ ఆరునెలల తర్వాత, బ్రాంచి కార్యాలయం నన్ను మాత్రమే తిరిగి నైజర్‌కు వెళ్లమని చెప్పింది. మొదట్లో చాలా ఆశ్చర్యపోయాను, పైగా అక్కడికి వెళ్లాలంటే కాస్త భయంగా కూడా అనిపించింది. కానీ నైజర్‌లో ఉన్న బ్రదర్స్‌-సిస్టర్స్‌ని కలవాలని ఎంతో ఎదురుచూశాను!

నేను నియామేకి తిరిగొచ్చాను. వచ్చిన తెల్లారే నైజర్‌లో ఉన్న ఒక వ్యాపారి, నేనొక యెహోవాసాక్షి అని గుర్తుపట్టి, బైబిలు ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. నేను ఆయనతో కలిసి బైబిలు స్టడీ చేశాను. ఆయన సిగరెట్‌ తాగడాన్ని, మందు తాగడాన్ని మానేసి బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ తర్వాతి సంవత్సరాల్లో నేను, నైజర్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో బ్రదర్స్‌-సిస్టర్స్‌తో కలిసి ప్రీచింగ్‌ చేయడాన్ని ఆనందించాను. ఎంతోమంది సత్యం తెలుసుకొని, బాప్తిస్మం తీసుకోవడం చూసి చాలా సంతోషంగా అనిపించింది. నేను మొట్టమొదటిసారి ఈ దేశానికి వచ్చినప్పుడు కేవలం 31 మంది యెహోవాసాక్షులే ఉండేవాళ్లు. కానీ, నేను ఈ దేశాన్ని వదిలి వెళ్లే సమయానికి 69 మంది ఉన్నారు.

“గినీలో జరుగుతున్న రాజ్య పని గురించి మాకు అంతగా తెలీదు”

1977, డిసెంబరులో నేను ఒక ట్రైనింగ్‌ కోసం నైజీరియాకు వచ్చాను. మూడు వారాల కోర్సు చివర్లో, బ్రాంచి కమిటీ కో-ఆర్డినేటర్‌ బ్రదర్‌ మాల్కమ్‌ విగో, సియర్రా లియోన్‌ బ్రాంచి నుండి వచ్చిన ఒక ఉత్తరాన్ని నా చేతిలో పెట్టి చదవమన్నాడు. అక్కడి సహోదరులు, గినీలో ప్రాంతీయ పర్యవేక్షకుడిగా సేవ చేయగలిగే ఒక ఒంటరి సహోదరుని కోసం వెతుకుతున్నారు. ఆ ఒంటరి సహోదరుడికి మంచి ఆరోగ్యం ఉండాలి, ఇంగ్లీష్‌ అలాగే ఫ్రెంచ్‌ భాషలు తెలిసుండాలి. నిజానికి, నాకు దానికోసమే శిక్షణ ఇచ్చారని బ్రదర్‌ విగో అప్పుడు చెప్పాడు. నా నియామకం అంత తేలిక కాదని కూడా ఆయన మరీమరీ చెప్పాడు. అక్కడికి వెళ్లేముందు, “ఇంకోసారి ఆలోచించుకో” అని చెప్పాడు. నేను వెంటనే ఆయనకు “నన్ను పంపించేది యెహోవా కాబట్టి నేను వెళ్తాను” అని జవాబిచ్చాను.

నేను సియర్రా లియోన్‌కి వెళ్లి, బ్రాంచి కార్యాలయంలో ఉన్న సహోదరుల్ని కలిశాను. ఒక బ్రాంచి కమిటీ సభ్యుడు నాతో ఇలా అన్నాడు “గినీలో జరుగుతున్న రాజ్య పని గురించి మాకు అంతగా తెలీదు.” గినీలో జరుగుతున్న పనిని ఈ బ్రాంచి కార్యాలయమే పర్యవేక్షిస్తున్నా, రాజకీయ పరిస్థితుల్ని బట్టి అక్కడి ప్రచారకులతో మాట్లాడే అవకాశం సహోదరులకు అస్సలు దొరకలేదు. అంతేకాదు, బ్రాంచి తరఫున ఒక సహోదరుణ్ణి ఆ దేశానికి పంపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, కుదరలేదు. అందుకే నన్ను గినీ రాజధాని అయిన కనాక్రీకి వెళ్లి, అక్కడ ఉండడానికి ప్రభుత్వం అనుమతి సంపాదించమని చెప్పారు.

“నన్ను పంపించేది యెహోవా కాబట్టి నేను వెళ్తాను”

నేను కనాక్రీకి వచ్చాక, నైజీరియన్‌ ఎంబసీకి వెళ్లాను. అక్కడ ఆ దేశ ప్రతినిధిని కలిశాను. గినీలో ఉండి, ప్రీచింగ్‌ చేయాలని అనుకుంటున్నాను అని ఆయనకు చెప్పాను. ఆయన వెంటనే, ఇక్కడ ఉంటే నిన్ను అరెస్టు చేయవచ్చు లేదా ఇంకేమైనా చేయవచ్చు మాకు సంబంధం లేదు కాబట్టి, “నైజీరియాకు వెళ్లి అక్కడ ప్రీచింగ్‌ చేసుకో” అని చెప్పాడు. దానికి నేను “ఏం జరిగినా సరే, నేను ఇక్కడే ఉంటాను” అన్నాను. దాంతో ఆయన ఈ విషయంలో నాకేమైనా సహాయం చేయగలరేమో అని గినీలోని మంత్రికి ఒక ఉత్తరం రాశాడు. ఆ మంత్రి నాకు చాలా సహాయం చేశాడు.

కొన్నిరోజులకే, నేను సియర్రా లియోన్‌ బ్రాంచికి వెళ్లి, మంత్రి నిర్ణయాన్ని సహోదరులకు చెప్పాను. యెహోవా నా ప్రయాణాన్ని ఎలా దీవించాడో విన్నాక, అక్కడ బ్రదర్స్‌ ఆనందం పట్టలేక గట్టిగా అరిచారు. గినీలో ఉండడానికి ప్రభుత్వం నన్ను అనుమతించింది!

సియర్రా లియోన్‌లో ప్రాంతీయ సేవ చేస్తున్నప్పుడు

1978 నుండి 1989 వరకు నేను గినీలో, సియర్రా లియోన్‌లో ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేశాను. లైబీరియాలో సబ్‌స్టిట్యూట్‌ ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేశాను. మొదట్లో చీటికిమాటికి నా ఆరోగ్యం పాడయ్యేది. కొన్నిసార్లు మారుమూల ప్రాంతాల్లో ఉన్నప్పుడు నాకు అలా జరిగేది. కానీ సహోదరులు నన్ను ఎలాగైనాసరే హాస్పిటల్‌కు తీసుకెళ్లేవాళ్లు.

ఒక సందర్భంలో నాకు మలేరియా వచ్చి, కడుపులో పురుగులు కూడా పడ్డాయి. కొంతకాలం తర్వాత నేను కోలుకున్నాను. నేను కోలుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే, నేను జబ్బు పడినప్పుడు బ్రదర్స్‌ నన్ను ఎక్కడ పూడ్చాలో కూడా మాట్లాడుకున్నారు. ప్రాణం మీదికి వచ్చే ఇలాంటి సంఘటనలు జరిగినా, నా నియామకాన్ని మాత్రం అస్సలు వదిలి పెట్టాలనుకోలేదు. అంతేకాదు, నిజమైన భద్రతను కేవలం యెహోవా మాత్రమే ఇవ్వగలడని నమ్మాను, ఎందుకంటే మనం చనిపోయినా, ఆయన తిరిగి లేపుతాడు!

జంటగా యెహోవా మీద నమ్మకం ఉంచడం

1988లో మా పెళ్లి రోజున

నేను 1988లో, డోర్కస్‌ అనే సహోదరిని పెళ్లి చేసుకున్నాను. ఆమె చాలా వినయస్థురాలు. పైగా, యెహోవా అంటే కూడా ఆమెకు చాలా ఇష్టం. పెళ్లి తర్వాత ఆమె కూడా నాతోపాటు ప్రాంతీయ సేవలో కొనసాగింది. ఆమెకు ఆ నియామకం అంటే చాలా ఇష్టం. దానికోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉండేది. మేము సంఘాల్ని సందర్శిస్తున్నప్పుడు, ఒక సంఘానికి ఇంకో సంఘానికి మధ్య దాదాపు 25 కి.మీ. మా లగేజీ అంతా మోసుకుంటూ నడిచేవాళ్లం. దూరాల్లో ఉన్న సంఘాలకైతే బురద, గుంటలు ఉన్న రోడ్ల మీద ఏ బండి దొరికితే అది ఎక్కి వెళ్లేవాళ్లం.

డోర్కస్‌కి ధైర్యం ఎక్కువ. ఉదాహరణకు, మేము కొన్నిసార్లు మొసళ్లు ఉన్న నీళ్లల్లో కూడా ప్రయాణించాం. ఒక సందర్భంలో అలాంటి ఒక నదిలో ఐదు రోజులు ప్రయాణించాం. ఆ నదికి ఉన్న చెక్క బ్రిడ్జి విరిగి పోవడంతో, మేము చిన్న పడవలో ప్రయాణించాల్సి వచ్చింది. డోర్కస్‌ ఆ పడవ దిగుతున్నప్పుడు కాలు జారి నీళ్లలో పడింది. నాకు, ఆమెకు ఇద్దరికీ ఈత రాదు. పైగా, నదిలో మొసళ్లు ఉన్నాయని మాకు తెలుసు. మంచి విషయమేమిటంటే, అక్కడున్న కుర్రాళ్లు కొంతమంది వెంటనే దూకి, ఆమెను కాపాడారు. ఆ సంఘటన గురించి కొంతకాలం వరకు మా ఇద్దరికి పీడకలలు వచ్చేవి. అయినాసరే, మా నియామకంలో కొనసాగాం.

నిజంగానే మా ఇద్దరు పిల్లలు జాగిఫ్ట్‌, ఎరిక్‌ యెహోవా ఇచ్చిన బహుమతులు!

1992​లో డోర్కస్‌ గర్భవతని తెలుసుకొని మేము ఆశ్చర్యపోయాం. ఇక ప్రత్యేక పయినీర్లుగా మా సేవను ఆపేయాల్సి వస్తుందేమో అనుకున్నాం. నిజానికి “యెహోవా మాకు ఒక గిఫ్ట్‌ ఇచ్చాడు.” కాబట్టి మా పాపకు జాగిఫ్ట్‌ (Jahgift) అని పేరు పెట్టాం. జాగిఫ్ట్‌ పుట్టిన నాలుగేళ్లకు ఆమె తమ్ముడు ఎరిక్‌ కూడా పుట్టాడు. నిజంగానే మా ఇద్దరు పిల్లలు యెహోవా ఇచ్చిన బహుమతులే! జాగిఫ్ట్‌ కనాక్రీలో ఉన్న అనువాద కార్యాలయంలో (RTOలో) కొంతకాలం సేవ చేసింది. ఎరిక్‌ సంఘ పరిచారకునిగా సేవచేస్తున్నాడు.

డోర్కస్‌ కొంతకాలానికి ప్రత్యేక పయినీరుగా సేవచేయడం ఆపేసింది. కానీ పిల్లల్ని పెంచుతూనే, క్రమపయినీరుగా సేవ చేసింది. యెహోవా సహాయంతో నేను మాత్రం ప్రత్యేక పూర్తికాల సేవలోనే కొనసాగాను. మా పిల్లలు పెద్దయ్యాక, డోర్కస్‌ మళ్లీ ప్రత్యేక పయినీరుగా సేవ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు మేమిద్దరం కనాక్రీలో ఫీల్డ్‌ మిషనరీలుగా సేవచేస్తున్నాం.

యెహోవా నన్ను ‘భద్రంగా చుట్టాడు!’

యెహోవా నన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్లాను. నేనూ, నా భార్య యెహోవా ఇచ్చే కాపుదలను, దీవెనల్ని రుచిచూశాం. వస్తుసంపదల మీద కాకుండా యెహోవా మీద నమ్మకం ఉంచడం వల్ల చాలా సమస్యల్ని, చింతల్ని తప్పించుకున్నాం. “రక్షకుడైన” యెహోవాయే మమ్మల్ని కాపాడాడని నేనూ, డోర్కస్‌ మా సొంత అనుభవం ద్వారా నేర్చుకున్నాం. (1 దిన. 16:35) కాబట్టి యెహోవా మీద నమ్మకముంచే వాళ్లందరి ప్రాణాల్ని ఆయన “జీవపు మూటలో భద్రంగా చుడతాడు” అనే నమ్మకం నాకుంది!—1 సమూ. 25:29.