కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 30

మనందరికీ ఎంతో ప్రాముఖ్యమైన ఒక ప్రవచనం

మనందరికీ ఎంతో ప్రాముఖ్యమైన ఒక ప్రవచనం

“నేను నీకూ స్త్రీకీ, . . . మధ్య శత్రుత్వం పెడతాను.”ఆది. 3:15.

పాట 15 యెహోవా మొదటి కుమారుణ్ణి కీర్తించండి!

ఈ ఆర్టికల్‌లో. . . a

1. ఆదాము, హవ్వ పాపం చేసిన వెంటనే యెహోవా ఏం చేశాడు? (ఆదికాండం 3:15)

 ఆదాము, హవ్వ పాపం చేసిన వెంటనే వాళ్ల పిల్లలందరి జీవితాల్లో ఆశ నింపే ఒక ప్రాముఖ్యమైన ప్రవచనాన్ని యెహోవా చెప్పాడు. దాన్ని మనం ఆదికాండం 3:15 లో చూస్తాం.—చదవండి.

2. ఈ ప్రవచనం ఎందుకు చాలా ప్రాముఖ్యమైంది?

2 ఈ ప్రవచనం బైబిల్లోని మొదటి పుస్తకంలోనే ఉంది. అయితే దానికి బైబిల్లోని వేరే పుస్తకాలన్నిటితో ఏదోక విధంగా సంబంధముంది. దీన్ని అర్థంచేసుకోవడానికి ఒక హారం గురించి ఆలోచిద్దాం. దానిలోని చాలా పూసల్ని కలపడానికి ఒక దారం ఎలాగైతే ఉపయోగపడుతుందో, సరిగ్గా అలానే బైబిల్లో ఉన్న అనేక విషయాల్ని అర్థంచేసుకోవడానికి ఈ ప్రవచనం సహాయం చేస్తుంది. ఆ ప్రవచనంలో దేవుడు ఒక రక్షకుని ద్వారా, అపవాదిని అతని దుష్ట అనుచరులందర్నీ నాశనం చేస్తాడని ఉంది. b అలా జరిగినప్పుడు యెహోవాను ప్రేమించేవాళ్లందరూ ఎంతో సంతోషిస్తారు.

3. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

3 ఆదికాండం 3:15 లో ఉన్న ప్రవచనానికి సంబంధించిన మూడు ప్రశ్నలకు ఈ ఆర్టికల్‌లో జవాబుల్ని తెలుసుకుంటాం. అవేంటంటే: ఆ ప్రవచనంలో ఎవరెవరు ఉన్నారు? ఆ ప్రవచనం ఎలా నెరవేరింది? అలాగే దానివల్ల మనం ఎలా ప్రయోజనం పొందుతాం?

ఆ ప్రవచనంలో ఎవరెవరు ఉన్నారు?

4. “సర్పం” ఎవర్ని సూచిస్తుంది? అలాగని మనమెలా చెప్పవచ్చు?

4 ఆదికాండం 3:14, 15 లో సర్పం, సర్ప సంతానం, స్త్రీ, స్త్రీ సంతానం గురించి ఉంది. వాళ్లు ఎవరెవర్ని సూచిస్తున్నారో బైబిలు చెప్తుంది. c ముందుగా “సర్పం” గురించి ఆలోచిద్దాం. ఏదెను తోటలో యెహోవా చెప్పిన విషయాన్ని, ఒక మామూలు పాము అయితే అర్థంచేసుకోలేదు కాబట్టి అదొక తెలివైన ప్రాణి అయ్యుండాలి. మరి ఆ ప్రాణి ఎవరు? ప్రకటన 12:9 దానికి జవాబిస్తుంది. అక్కడ చెప్పిన “మొదటి సర్పం,” అపవాది అయిన సాతాను అని స్పష్టంగా తెలుస్తుంది. మరైతే సర్ప సంతానం ఎవరు?

సర్పం

అపవాదైన సాతానే “మొదటి సర్పం” అని ప్రకటన 12:9 చెప్తుంది (4వ పేరా చూడండి)

5. సర్ప సంతానంలో ఎవరెవరు ఉన్నారు?

5 బైబిల్లో సంతానం అనే మాట, అన్నిసార్లూ ఒక వ్యక్తికి పుట్టిన పిల్లల్ని సూచించడంలేదు. బదులుగా కొన్నిసార్లు ఒక వ్యక్తిని బాగా అనుసరించేవాళ్లను సూచిస్తుంది. కాబట్టి సర్ప సంతానంలో సాతానులాగే యెహోవాను ఎదిరించి, తన ప్రజల్ని వ్యతిరేకించే చెడ్డదూతలూ మనుషులూ ఉన్నారు. వాళ్లలో నోవహు కాలంలో పరలోకం నుండి తమ స్థానాల్ని విడిచి వచ్చిన దూతలు అలాగే తమ తండ్రైన అపవాదిలా చెడ్డగా ప్రవర్తించే మనుషులు ఉన్నారు.—ఆది. 6:1, 2; యోహా. 8:44; 1 యోహా. 5:19; యూదా 6.

సర్ప సంతానం

యెహోవాని ఎదిరించి, ఆయన ప్రజల్ని వ్యతిరేకించే చెడ్డ దూతలు అలాగే మనుషులు (5వ పేరా చూడండి)

6. ఆ “స్త్రీ” హవ్వ కాదని ఎలా చెప్పవచ్చు?

6 ఇప్పుడు మనం “స్త్రీ” ఎవరో తెలుసుకుందాం. ఆమె హవ్వ అయితే కాదు, ఎందుకంటే ఆ స్త్రీ సంతానం, సర్పం తలని ‘చితగ్గొడుతుంది’ అని ప్రవచనంలో ఉంది. ఇందాక చూసినట్టు సాతానే ఆ సర్పం. కాబట్టి హవ్వ సంతానమైన అపరిపూర్ణ మనుషులు ఎవ్వరూ అతన్ని నాశనం చేయలేరు. మరైతే సాతాన్ని ఎవరు నాశనం చేస్తారు?

7. ప్రకటన 12:1, 2, 5, 10 ప్రకారం ఆదికాండం 3:15 లో ఉన్న స్త్రీ ఎవరు?

7 ఆదికాండం 3:15 లో ఉన్న స్త్రీ ఎవరో బైబిలు చివరి పుస్తకమైన ప్రకటన చెప్తుంది. (ప్రకటన 12:1, 2, 5, 10 చదవండి.) ఆ స్త్రీ పాదాల కింద చంద్రుడు ఉన్నాడని, ఆమె తలమీద 12 నక్షత్రాల కిరీటం ఉందని, ఆమె దేవుని రాజ్యమనే ఒక బిడ్డకు జన్మనిస్తుందని అక్కడ చదువుతాం. ఆ రాజ్యం పరలోకానికి సంబంధించింది కాబట్టి, ఆ స్త్రీ భూమికి సంబంధించిన మామూలు వ్యక్తి కాదుగానీ పరలోకానికి చెందింది. దీనంతటిని బట్టి, ఆమె నమ్మకమైన దేవదూతలు ఉన్న యెహోవా సంస్థలోని పరలోక భాగాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు.—గల. 4:26.

స్త్రీ

నమ్మకమైన దేవదూతలున్న యెహోవా సంస్థలోని పరలోక భాగం (7వ పేరా చూడండి)

8. స్త్రీ సంతానంలోని మొదటి భాగం ఎవరు? అలా ఆయన ఎప్పుడు అయ్యాడు? (ఆదికాండం 22:15-18)

8 స్త్రీ సంతానంలోని మొదటి భాగం ఎవరో తెలుసుకోవడానికి బైబిలు సహాయం చేస్తుంది. ఆ సంతానం అబ్రాహాము వంశస్థుడై ఉండాలి. (ఆదికాండం 22:15-18 చదవండి.) ప్రవచనంలో ఉన్నట్టే, యేసు అబ్రాహాము వంశం నుండి వచ్చాడు. (లూకా 3:23, 34) కానీ ఆ సంతానం సాతాన్ని ఉనికిలో లేకుండా నాశనం చేయాలి కాబట్టి, మానవులకన్నా శక్తిమంతుడై ఉండాలి. యేసుకు దాదాపు 30 ఏళ్లున్నప్పుడు దేవుడు ఆయన్ని పవిత్రశక్తితో అభిషేకించాడు. అలా ఆయన స్త్రీ సంతానంలోని మొదటి భాగమయ్యాడు. (గల. 3:16) యేసు చనిపోయి పునరుత్థానం అయిన తర్వాత, దేవుడు ‘మహిమను, ఘనతను ఆయనకు కిరీటంలా పెట్టాడు’ అలాగే ‘పరలోకంలో, భూమ్మీద పూర్తి అధికారం’ ఇచ్చాడు. ఆ అధికారంతో యేసు ‘అపవాది పనుల్ని నాశనం చేస్తాడు.’—హెబ్రీ. 2:7; మత్త. 28:18; 1 యోహా. 3:8.

స్త్రీ సంతానం

యేసుక్రీస్తు అలాగే ఆయనతో పరిపాలించే 1,44,000 మంది అభిషిక్తులు (8-9 పేరాలు చూడండి)

9-10. (ఎ) స్త్రీ సంతానంలో ఇంకెవరు కూడా ఉన్నారు? వాళ్లు ఆ సంతానంలో ఎలా భాగమౌతారు? (బి) తర్వాత మనమేం పరిశీలిస్తాం?

9 ఆ సంతానంలో రెండో భాగం కూడా ఉంది. అందులో ఎవరున్నారో చెప్తూ అపొస్తలుడైన పౌలు యూదులు, అన్యులైన అభిషిక్త క్రైస్తవులతో ఇలా అన్నాడు: “మీరు క్రీస్తుకు చెందినవాళ్లయితే, మీరు నిజంగా అబ్రాహాము సంతానం, అలాగే వాగ్దానం విషయంలో వారసులు.” (గల. 3:28, 29) ఒక క్రైస్తవుణ్ణి యెహోవా పవిత్రశక్తితో అభిషేకించినప్పుడు, ఆ వ్యక్తి స్త్రీ సంతానంలో భాగమౌతాడు. కాబట్టి ఆ సంతానంలో యేసుక్రీస్తు అలాగే 1,44,000 మంది ఉంటారు. వాళ్లు ఆయనతో కలిసి పరిపాలిస్తారు. (ప్రక. 14:1) వాళ్లంతా తమ తండ్రైన యెహోవాలా ఆలోచిస్తారు, ప్రవర్తిస్తారు.

10 ఆదికాండం 3:15 లో ఉన్నవాళ్లు ఎవరెవర్ని సూచిస్తున్నారో మనం తెలుసుకున్నాం. అయితే ఆ ప్రవచనాన్ని ఇప్పటివరకు యెహోవా ఎలా నెరవేరుస్తూ వచ్చాడో, దాన్నుండి మనమెలా ప్రయోజనం పొందుతున్నామో ఇప్పుడు చూద్దాం.

యెహోవా ఇప్పటివరకు ఆ ప్రవచనాన్ని ఎలా నెరవేర్చాడు?

11. సర్పం, స్త్రీ సంతానాన్ని “మడిమె మీద” ఎలా కొట్టింది?

11 ఆదికాండం 3:15 లో ఉన్న ప్రవచనం ప్రకారం సర్పం, స్త్రీ సంతానాన్ని “మడిమె మీద” కొడుతుంది. సాతాను దేవుని కుమారుణ్ణి చంపేలా యూదులను, రోమన్లను ఉసిగొల్పినప్పుడు ఆ ప్రవచనం నెరవేరింది. (లూకా 23:13, 20-24) ఎవరికైనా మడిమె మీద దెబ్బ తగిలితే కొన్ని రోజులపాటు నడవలేరు. అలాగే యేసు చనిపోయి సమాధిలో ఉన్నప్పుడు కొన్ని రోజులపాటు ఏమీ చేయలేకపోయాడు.—మత్త. 16:21.

12. సర్పం తల ఎప్పుడు, ఎలా చితగ్గొట్టబడుతుంది?

12 ఆదికాండం 3:15 లోని ప్రవచనం నెరవేరాలంటే యేసు సమాధిలోనే ఉండిపోకూడదు. ఎందుకంటే ప్రవచనం ప్రకారం ఈ సంతానం, సర్పం తలను చితగ్గొట్టాలి. దానర్థం యేసు తన మడిమెకు తగిలిన దెబ్బ నుండి కోలుకోవాలి లేదా పునరుత్థానం అవ్వాలి. సరిగ్గా అలానే జరిగింది. ఆయన చనిపోయిన 3వ రోజున అమర్త్యమైన పరలోక ప్రాణిగా తిరిగి బతికాడు. త్వరలోనే దేవుడు నిర్ణయించిన సమయంలో యేసు సాతాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాడు. (హెబ్రీ. 2:14) చివరికి యేసు అలాగే ఆయనతో కలిసి పనిచేసేవాళ్లు, సర్ప సంతానాన్ని లేదా భూమ్మీదున్న దేవుని శత్రువులందర్నీ నాశనం చేస్తారు.—ప్రక. 17:14; 20:4, 10. d

ఈ ప్రవచనం నుండి మనమెలా ప్రయోజనం పొందుతున్నాం?

13. ఈ ప్రవచనం నెరవేరడంవల్ల మనమెలా ప్రయోజనం పొందుతున్నాం?

13 మీరు దేవున్ని సేవిస్తుంటే, ఆ ప్రవచనం నెరవేరడంవల్ల ప్రయోజనం పొందుతున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. యేసు మానవునిగా భూమ్మీదికి వచ్చి, తన తండ్రి చూపించినలాంటి లక్షణాల్ని పూర్తిగా చూపించాడు. (యోహా. 14:9) కాబట్టి మనం యేసు గురించి నేర్చుకోవడంవల్ల యెహోవాను తెలుసుకుని, ఆయన్ని ప్రేమించగలిగాం. యేసు బోధల నుండి, ఆయన క్రైస్తవ సంఘాన్ని నడిపించే విధానం నుండి ప్రయోజనం పొందాం. యెహోవా ఆమోదం పొందేలా మనమెలా జీవించాలో కూడా యేసు నేర్పించాడు. ఆయన మడిమె మీద కొట్టబడడం లేదా చనిపోవడంవల్ల మనమింకా ఎలా ప్రయోజనం పొందవచ్చు? యేసు పునరుత్థానం అవ్వడం ద్వారా మన “పాపాలన్నిటి నుండి మనల్ని పవిత్రుల్ని” చేసే పరిపూర్ణ బలిని అర్పించాడు.—1 యోహా. 1:7.

14. ఏదెను తోటలో యెహోవా చెప్పిన ప్రవచనం వెంటనే నెరవేరలేదని మనకెలా తెలుసు? వివరించండి.

14 ఏదెను తోటలో యెహోవా చెప్పిన మాటల్నిబట్టి ఆ ప్రవచనం పూర్తిగా నెరవేరడానికి కొంచెం సమయం పడుతుందని తెలుస్తుంది. ఎందుకంటే వాగ్దాన సంతానం స్త్రీ ద్వారా రావాలన్నా, సాతాను తన దుష్ట అనుచరుల్ని పోగుచేయాలన్నా, ఆ రెండు గుంపుల మధ్య శత్రుత్వం పెరగాలన్నా సమయం పడుతుంది. అలాగే, సాతాను అదుపు చేస్తున్న లోకం యెహోవా ఆరాధకుల్ని ద్వేషిస్తుందని ఆ ప్రవచనంవల్ల అర్థమౌతుంది. యేసు కూడా తన శిష్యులకు ఆ విషయాన్ని చెప్పాడు. (మార్కు 13:13; యోహా. 17:14) ముఖ్యంగా, గడిచిన వందేళ్లలో ఈ ప్రవచనం ఎన్నో విధాలుగా నెరవేరడాన్ని మనం చూశాం. అదెలాగో ఇప్పుడు పరిశీలిద్దాం.

15. సాతాను లోకంలోని ప్రజలు ఇంతకుముందుకన్నా ఎక్కువగా మనల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? అయినా మనమెందుకు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు?

15 యేసు 1914 లో దేవుని రాజ్యానికి రాజైన వెంటనే సాతాన్ని పరలోకం నుండి పడద్రోశాడు. అప్పటినుండి అతను ఈ భూమికే పరిమితమయ్యాడు. అలాగే తాను నాశనమౌతానని కూడా అతనికి తెలుసు. (ప్రక. 12:9, 12) అయినా సాతాను కోపంతో రగిలిపోతూ దేవుని ప్రజలమీద దాడి చేస్తున్నాడు. (ప్రక. 12:13, 17) అందుకే లోకంలోని ప్రజలు ఇంతకుముందు కన్నా ఎక్కువగా మనల్ని ద్వేషిస్తున్నారు. కానీ మనమైతే సాతానుకి, అతని అనుచరులకి అస్సలు భయపడాల్సిన అవసరంలేదు. బదులుగా అపొస్తలుడైన పౌలులాగే మనం కూడా నమ్మకంతో ఉండవచ్చు. ఆయనిలా రాశాడు: “దేవుడు మన వైపు ఉండగా, ఎవరు మనకు ఎదురు నిలవగలరు?” (రోమా. 8:31) ఆ మాటల్నిబట్టి మనం యెహోవామీద పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. ఎందుకంటే ఆదికాండం 3:15 లోని ప్రవచనం ఇప్పటికే చాలావరకు నెరవేరింది.

16-18. ఆదికాండం 3:15 లో ప్రవచనాన్ని అర్థం చేసుకోవడంవల్ల కర్టీస్‌, ఉర్సూలా, జెస్సికా ఎలా ప్రయోజనం పొందారు?

16 మన జీవితంలో ఎలాంటి కష్టాలనైనా తట్టుకోవడానికి ఆదికాండం 3:15 లో యెహోవా ఇచ్చిన వాగ్దానం సహాయం చేస్తుంది. గ్వామ్‌లో మిషనరీగా సేవచేస్తున్న కర్టీస్‌ ఇలా అంటున్నాడు: “కొన్నిసార్లు నేను అనుకున్నది జరగకపోయినా, కష్టాలు వచ్చినా యెహోవాకు నమ్మకంగా ఉండడం నాకు ఒక పరీక్షలా అనిపించేది. కానీ ఆదికాండం 3:15 లోని ప్రవచనం గురించి లోతుగా ఆలోచించడంవల్ల నా పరలోక తండ్రిమీద నమ్మకాన్ని కాపాడుకోగలిగాను.” మన సమస్యలన్నిటినీ యెహోవా తీసేసే రోజు కోసం కర్టీస్‌ ఎదురుచూస్తున్నాడు.

17 బవేరియా అనే ప్రాంతంలో ఉంటున్న ఉర్సూలా అనే సహోదరి ఈ ప్రవచనం గురించి ఏం చెప్తుందో చూద్దాం. ఆదికాండం 3:15 లోని ప్రవచనాన్ని అర్థం చేసుకోవడంవల్ల బైబిల్ని దేవుడే రాయించాడని ఆమెకు నమ్మకం కుదిరింది. ఈ ప్రవచనానికి, బైబిల్లో ఉన్న ఇతర ప్రవచనాలకు సంబంధముందని తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోయింది. “యెహోవా మనుషుల్ని ఏ ఆశా లేకుండా విడిచిపెట్టలేదు కానీ, ఆయన వెంటనే చర్య తీసుకున్నాడని తెలుసుకోవడంవల్ల నాకు ఆయనమీద ఇంకా ప్రేమ పెరిగింది.”

18 మైక్రోనీసియాలో ఉంటున్న జెస్సికా అనే సహోదరి ఇలా చెప్తుంది: “ఇదే సత్యమని నేను మొదటిసారి తెలుసుకున్నప్పుడు నాకెలా అనిపించిందో నేనెప్పటికీ మర్చిపోలేను. ఆదికాండం 3:15 లో ఉన్న ప్రవచనం నెరవేరుతుందని తెలుసుకోవడం వల్ల, మనం కష్టాలుపడుతూ జీవించాలని యెహోవా అస్సలు కోరుకోవట్లేదని నాకర్థమైంది. అంతేకాదు యెహోవాను సేవించడంవల్ల ఇప్పుడు సంతోషంగా జీవించవచ్చని అలాగే భవిష్యత్తులో ఇంతకన్నా అద్భుతమైన జీవితాన్ని ఆనందించవచ్చనే నా నమ్మకం బలపడింది.”

19. ప్రవచనంలోని చివరి భాగం ఖచ్చితంగా నెరవేరుతుందని మనమెందుకు నమ్మవచ్చు?

19 ఇంతకుముందు మనం చూసినట్టు ఆదికాండం 3:15 లో ఉన్న ప్రవచనం ఇప్పుడు నెరవేరుతూ ఉంది. స్త్రీ సంతానం ఎవరో, సర్ప సంతానం ఎవరో మనకు స్పష్టంగా తెలిసిపోయింది. స్త్రీ సంతానంలోని మొదటి భాగమైన యేసు, తన మడిమె మీద తగిలిన దెబ్బ నుండి కోలుకొని ఎప్పటికీ చనిపోని శక్తివంతమైన రాజుగా ఉన్నాడు. సంతానంలోని రెండో భాగంలో ఎవరుంటారో యెహోవా దాదాపు ఇప్పటికే నిర్ణయించేశాడు. ఆ ప్రవచనంలోని మొదటి భాగం ఇప్పటికే నెరవేరింది కాబట్టి, చివరి భాగం అంటే సర్పం తల చితగ్గొట్టడం కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని మనం నమ్మకంతో ఉండవచ్చు. అది జరిగినప్పుడు దేవుని సేవకులు ఎంతో సంతోషిస్తారు. మన దేవుడు నమ్మకస్థుడు కాబట్టి స్త్రీ సంతానం ద్వారా భూమ్మీదున్న ‘అన్నిదేశాల ప్రజలకు’ లెక్కలేనన్ని ఆశీర్వాదాల్ని ఇస్తాడు. అప్పటివరకు ఆశ వదులుకోకుండా నమ్మకంగా కొనసాగుదాం.—ఆది. 22:18.

పాట 23 యెహోవా పరిపాలన ఆరంభమైంది

a ఆదికాండం 3:15 లో ఉన్న ప్రవచనాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే బైబిల్లోని సందేశాన్ని మనం పూర్తిగా అర్థంచేసుకోలేం. మనం ఈ ప్రవచనాన్ని లోతుగా అధ్యయనం చేసినప్పుడు యెహోవామీద విశ్వాసాన్ని పెంచుకుంటాం. అలాగే ఆయన చేసిన వాగ్దానాల్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడనే నమ్మకంతో ఉంటాం.

b కొత్త లోక అనువాదం బైబిల్లో అనుబంధం B1 లో ఉన్న “బైబిల్లోని సందేశం” చూడండి.

cఆదికాండం 3:14, 15 లో ఎవరెవరు ఉన్నారు?” అనే బాక్సు చూడండి.