అధ్యయన ఆర్టికల్ 28
దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తుంది!
“ఈ లోక రాజ్యం మన దేవునిది, ఆయన క్రీస్తుది అయింది.”—ప్రక. 11:15.
పాట 22 రాజ్యపాలన మొదలైంది—అది భూమ్మీదికి రావాలి!
ఈ ఆర్టికల్‌లో. . . a
1. ఇప్పుడు ఏ ప్రవచనం నెరవేరుతుంది? అది ఏ విషయాన్ని రుజువు చేస్తుంది?
చుట్టూవున్న పరిస్థితుల్ని గమనిస్తే మనం అసలు సంతోషంగా ఉండగలమా అనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ తగ్గిపోయింది. చాలామంది ప్రజలు క్రూరంగా, స్వార్థంగా ప్రవర్తిస్తున్నారు. అలాగే చాలామందికి అధికారుల్ని నమ్మడం కష్టమైపోతుంది. కానీ ఇలాంటి పరిస్థితులన్నీ చూసినప్పుడు మనం నిరాశపడాల్సిన అవసరంలేదు. ఎందుకంటే “చివరి రోజుల్లో” ఇలాంటి ప్రజలు ఉంటారని బైబిలు ముందే చెప్పింది. (2 తిమో. 3:1-5) ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుందని అందరూ ఒప్పుకోవాల్సిందే. అలాగే ఆ ప్రవచనం నెరవేరడంవల్ల దేవుని రాజ్యానికి రాజుగా యేసు పరిపాలిస్తున్నాడని రుజువౌతుంది. కానీ దేవుని రాజ్యానికి సంబంధించిన ప్రవచనాల్లో కేవలం ఇది ఒకటి మాత్రమే. అయితే గత కొన్ని సంవత్సరాలుగా నెరవేరిన వేరే ప్రవచనాల్ని ఇప్పుడు పరిశీలించి మన విశ్వాసాన్ని బలపర్చుకుందాం.
2. ఈ ఆర్టికల్‌లో మనమేం చూస్తాం? ఎందుకు? (కవర్ పేజీ మీదున్న చిత్రం గురించి చెప్పండి.)
2 ఈ ఆర్టికల్‌లో మనం, (1) దేవుని రాజ్యం పరిపాలించడం మొదలైందని అర్థంచేసుకోవడానికి సహాయంచేసే ఒక ప్రవచనాన్ని, (2) దేవుని రాజ్యానికి యేసు రాజయ్యాడని గుర్తించడానికి సహాయంచేసే ప్రవచనాల్ని అలాగే (3) దేవుని రాజ్య శత్రువులు ఎలా నాశనమౌతారో తెలిపే ప్రవచనాల్ని చూస్తాం. ఈ ప్రవచనాలన్నీ ఒక పెద్ద చిత్రంలోని చిన్నచిన్న భాగాల్లాంటివి. వాటన్నిటినీ కలిపి చూసినప్పుడు ఇప్పటికే నెరవేరిన ప్రవచనాలు, భవిష్యత్తులో నెరవేరాల్సిన ప్రవచనాలేంటో మనకు అర్థమౌతాయి.
దేవుని రాజ్యం ఎప్పుడు మొదలైందో మనకెలా తెలుసు?
3. దానియేలు 7:13, 14 లోని ప్రవచనం బట్టి మనమేం అర్థంచేసుకోవచ్చు?
3 దానియేలు 7:13, 14 లోని ప్రవచనం బట్టి, దేవుని రాజ్యానికి యేసుక్రీస్తే సరైన రాజని మనం అర్థంచేసుకోవచ్చు. అన్ని దేశాల ప్రజలు ఆయన్ని సంతోషంగా సేవిస్తారు. అలాగే ఆయన స్థానంలో వేరే ఏ పరిపాలకుడూ రాడు. అంతేకాదు ఏడు కాలాల తర్వాత యేసు పరిపాలించడం మొదలుపెడతాడని దానియేలు పుస్తకంలోని ఇంకో ప్రవచనం చెప్తుంది. మరి యేసు ఎప్పుడు రాజయ్యాడో మనం తెలుసుకోగలమా?
4. దానియేలు 4:10-17 వచనాల్నిబట్టి యేసు ఏ సంవత్సరంలో రాజయ్యాడో వివరించండి. (అధస్సూచి కూడా చూడండి.)
4 దానియేలు 4:10-17 చదవండి. ఈ “ఏడు కాలాలు” 2,520 సంవత్సరాల్ని సూచిస్తున్నాయి. ఆ కాలం, యెహోవా నియమించిన చివరి రాజును, బబులోనీయులు యెరూషలేము నుండి క్రీ.పూ. 607 లో తీసేసినప్పుడు మొదలైంది. అలాగే ‘చట్టబద్ధ హక్కుదారుడైన’ యేసును, యెహోవా పరలోక రాజ్యానికి రాజుగా క్రీ.శ. 1914 లో నియమించినప్పుడు అది ముగిసింది. b—యెహె. 21:25-27.
5. “ఏడు కాలాల” ప్రవచనం గురించి తెలుసుకోవడం వల్ల మనకొచ్చే ఒక ప్రయోజనం ఏంటి?
5 ఈ ప్రవచనాన్ని అర్థంచేసుకోవడం వల్ల మనకెలాంటి ప్రయోజనం ఉంది? “ఏడు కాలాల” గురించి తెలుసుకోవడం వల్ల యెహోవా తాను చేసిన వాగ్దానాల్ని సరైన సమయంలో నెరవేరుస్తాడని మన నమ్మకం బలపడుతుంది. ఆయన ఎలాగైతే తాను నిర్ణయించిన సమయంలో యేసును రాజుగా చేశాడో అలాగే, ఇతర ప్రవచనాలన్నిటినీ తాను నిర్ణయించిన సమయంలోనే నెరవేరుస్తాడు. కాబట్టి యెహోవా రోజు అస్సలు “ఆలస్యం అవ్వదు!”—హబ. 2:3.
దేవుని రాజ్యానికి క్రీస్తు రాజయ్యాడని మనకెలా తెలుసు?
6. (ఎ) క్రీస్తు పరలోకంలో రాజయ్యాడని నిరూపించే ఏ సంఘటనల్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం? (బి) ప్రకటన 6:2-8 లో ఉన్న ప్రవచనం కూడా ఏ విషయాన్ని రుజువు చేస్తుంది?
6 యేసు తాను చనిపోవడానికి కాస్త ముందు, కొన్ని సంఘటనల గురించి శిష్యులకు చెప్పాడు. వాటివల్ల యేసు పరలోకంలో పరిపాలించడం మొదలుపెట్టాడని వాళ్లు అర్థం చేసుకోగల్గుతారు. వాటిలో కొన్ని యుద్ధాలు, కరువులు, భూకంపాలు. అంతేకాదు “ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో” పెద్దపెద్ద అంటువ్యాధులు వస్తాయని కూడా ఆయన చెప్పాడు. ప్రస్తుతం మనందరం ఎదుర్కొంటున్న కరోనా దానికి ఒక ఉదాహరణ. ఇవన్నీ క్రీస్తు ప్రత్యక్షతకు సంబంధించిన ‘సూచనలో’ ఒక భాగం. (మత్త. 24:3, 7; లూకా 21:7, 10, 11) తాను చనిపోయి, పరలోకానికి తిరిగి వెళ్లిన 60 కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత, యేసు అపొస్తలుడైన యోహానుకు ఈ సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయని ఇంకొన్ని రుజువులు ఇచ్చాడు. (ప్రకటన 6:2-8 చదవండి.) ఆయన 1914 లో దేవుని రాజ్యానికి రాజైనప్పటి నుండి ఈ సంఘటనలు జరుగుతున్నాయి.
7. యేసు రాజైనప్పటి నుండి భూమ్మీద పరిస్థితులు ఎందుకింత ఘోరంగా తయారయ్యాయి?
7 పరలోకంలో యేసు రాజైనప్పటి నుండి భూమ్మీద పరిస్థితులు ఎందుకు ఘోరంగా తయారయ్యాయి? దానిగురించి ప్రకటన 6:2 ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తుంది. యేసు రాజైన వెంటనే సాతానుతో, అతని చెడ్డ దూతలతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో సాతాను ఓడిపోయి, తన చెడ్డ దూతలతో పాటు ఈ భూమ్మీదకు పడేయబడ్డాడని ప్రకటన 12వ అధ్యాయం చెప్తుంది. అప్పటినుండి సాతాను కోపంతో రగిలిపోతూ మనుషుల మీద దాడిచేయడం మొదలుపెట్టాడు. దాంతో భూమ్మీద అందరికీ శ్రమలు మొదలయ్యాయి.—ప్రక. 12:7-12.
8. రాజ్యానికి సంబంధించిన ప్రవచనాలు నెరవేరడం చూసినప్పుడు మనమెలా ప్రయోజనం పొందుతాం?
8 ఈ ప్రవచనాల్ని అర్థంచేసుకోవడం వల్ల మనమెలాంటి ప్రయోజనం పొందుతాం? ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల్ని బట్టి, ప్రజల మనస్తత్వంలో వచ్చిన మార్పుబట్టి యేసు రాజయ్యాడని అర్థంచేసుకున్నాం. కాబట్టి ఎవరైనా స్వార్థంతో, ద్వేషంతో ప్రవర్తించినప్పుడు మనం బాధపడే బదులు వాళ్ల పనులు బైబిలు ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాయని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దేవుని రాజ్యం పరలోకంలో ఇప్పటికే మొదలైంది. (కీర్త. 37:1) అలాగే హార్‌మెగిద్దోన్ దగ్గరౌతుండగా పరిస్థితులు ఇంకా ఘోరంగా తయారౌతాయని మనం గుర్తుంచుకోవాలి. (మార్కు 13:8; 2 తిమో. 3:13) అయితే ఇప్పుడు ఇన్ని సమస్యలు ఎందుకున్నాయో అర్థంచేసుకోవడానికి మనకు సహాయం చేస్తున్నందుకు మన ప్రియమైన పరలోక తండ్రికి ఎంతో కృతజ్ఞులం.
దేవుని రాజ్య శత్రువులు ఎలా నాశనమౌతారు?
9. దానియేలు 2:28, 31-35 లో ఉన్న ప్రవచనం చివరి ప్రపంచ శక్తి గురించి ఏం చెప్తుంది? అది ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది?
9 దానియేలు 2:28, 31-35 చదవండి. ఈ ప్రవచనం ఇప్పుడు నెరవేరడాన్ని మనం చూస్తున్నాం. నెబుకద్నెజరుకు వచ్చిన కలనుబట్టి క్రీస్తు పరిపాలన మొదలయ్యాక “చివరి రోజుల్లో” ఏం జరుగుతుందో అర్థంచేసుకోవచ్చు. భూమ్మీద యేసు శత్రువుల్లో, చివరి ప్రపంచ శక్తి కూడా ఒకటని బైబిలు ముందే చెప్పింది. అది ‘కొంతభాగం ఇనుముతో, కొంతభాగం బంకమట్టితో’ చేయబడిన పాదాలతో పోల్చబడింది. ఇంతకీ ఈ ప్రపంచ శక్తి ఏంటి? మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్, అమెరికా కలిసి పనిచేస్తూ ఆంగ్లో-అమెరికా ప్రపంచ శక్తిగా ఏర్పడ్డాయి. అది ఇప్పటికీ పరిపాలిస్తుంది. ఈ ప్రపంచ శక్తి, ఇంతకుముందు వచ్చిన ప్రపంచ శక్తుల నుండి కనీసం రెండు విషయాల్లో వేరుగా ఉందని నెబుకద్నెజరుకు వచ్చిన కలలోని ప్రతిమనుబట్టి అర్థంచేసుకోవచ్చు.
10. (ఎ) దానియేలు ప్రవచనం ముందే చెప్పినట్టు నేడు ఆంగ్లో-అమెరికా ప్రపంచ శక్తిలో ఏం కనిపిస్తుంది? (బి) మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? (“ బంకమట్టి విషయంలో జాగ్రత్తగా ఉండండి!” అనే బాక్సు చూడండి.)
10 మొదటిగా, ఆ దర్శనంలో చెప్పబడిన మిగతా ప్రపంచ శక్తుల్లా ఆంగ్లో-అమెరికా ప్రపంచ శక్తి బంగారం వెండిలాంటి వాటితో కాకుండా ఇనుము, బంకమట్టి కలిపి ఉన్న పాదాలతో పోల్చబడింది. ఈ బంకమట్టి ‘మానవజాతి సంతానాన్ని’ లేదా సామాన్య ప్రజల్ని సూచిస్తుంది. (దాని. 2:43, అధస్సూచి) నేడు సామాన్య ప్రజలు ఎన్నికల్లో, పౌరహక్కుల ప్రచార కార్యక్రమాల్లో, ధర్నాల్లో, కార్మికుల సంఘాల్లో చాలా ప్రభావం చూపిస్తున్నారని అందరూ ఒప్పుకుంటారు. దానివల్ల ఈ ప్రపంచ శక్తి అనుకున్నవన్నీ చేయలేకపోతుంది.
11. ఆంగ్లో-అమెరికా ప్రపంచ శక్తి ఇప్పుడు పరిపాలిస్తుంది కాబట్టి మనం దేనిగురించి నమ్మకంతో ఉండవచ్చు?
11 రెండోదిగా, బైబిల్లో ముందే చెప్పినట్టు ఆ ప్రతిమలోని పాదాలతో పోల్చబడిన చివరి ప్రపంచ శక్తి ఆంగ్లో-అమెరికా. దీని తర్వాత ఇంకే ప్రపంచ శక్తి ఉండదు. బదులుగా హార్‌మెగిద్దోన్‌లో దేవుని రాజ్యం దీన్ని అలాగే మిగతా ప్రభుత్వాలన్నిటినీ పూర్తిగా నాశనం చేస్తుంది. c—ప్రక. 16:13, 14, 16; 19:19, 20.
12. మనకు ఓదార్పును, భవిష్యత్తు మీద ఆశను నింపే ఏ రుజువుల్ని కూడా దానియేలు ప్రవచనం ఇస్తుంది?
12 ఈ ప్రవచనాన్ని అర్థంచేసుకోవడం వల్ల మనకెలాంటి ప్రయోజనం ఉంది? మనం చివరిరోజుల్లో జీవిస్తున్నాం అనడానికి దానియేలు ప్రవచనం ఇంకొన్ని రుజువుల్ని కూడా ఇస్తుంది. బబులోను తర్వాత మరో నాలుగు ప్రపంచ శక్తులు దేవుని ప్రజలమీద చాలా ప్రభావం చూపిస్తాయని దానియేలు 2,500 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం చెప్పాడు. అంతేకాదు ఈ ప్రపంచ శక్తులన్నిట్లో ఆంగ్లో-అమెరికా ప్రపంచ శక్తే చివరిదని కూడా చెప్పాడు. దీన్నిబట్టి త్వరలోనే దేవుని రాజ్యం మానవ ప్రభుత్వాలన్నిటినీ తుడిచిపెట్టేసి, భూమిని పరిపాలిస్తుందని అర్థమౌతుంది. అది మనకు ఎంతో ఓదార్పును, భవిష్యత్తు మీద ఆశను ఇస్తుంది.—దాని. 2:44.
13. ప్రకటన 17:9-12 లో చెప్పబడిన “ఎనిమిదో రాజు”, “పదిమంది రాజులు” ఎవర్ని సూచిస్తున్నారు? ఈ ప్రవచనం ఎలా నెరవేరింది?
13 ప్రకటన 17:9-12 చదవండి. మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన నాశనంవల్ల, చివరి రోజులకు సంబంధించిన ఇంకో బైబిలు ప్రవచనం నెరవేరింది. ఈ లోక నాయకులు భూమ్మీద శాంతిని తీసుకురావాలి అనుకున్నారు. అందుకే 1920 జనవరిలో, నానాజాతి సమితిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1945 అక్టోబరు సమయానికి, ఐక్యరాజ్య సమితి దాని స్థానంలోకి వచ్చింది. ఈ సంస్థనే బైబిలు “ఎనిమిదో రాజు” అని పిలుస్తుంది. ఇది ఒక ప్రపంచ శక్తి కాదుగానీ, శక్తికోసం లోక ప్రభుత్వాల మీద ఆధారపడుతుంది. బైబిలు ఈ లోక ప్రభుత్వాల్ని “పదిమంది రాజులు” అని పిలుస్తుంది.
14-15. (ఎ) ప్రకటన 17:3-5 లో “మహాబబులోను” గురించి మనమేం తెలుసుకోవచ్చు? (బి) అబద్ధమతానికి ఇప్పుడేం జరుగుతుంది?
14 ప్రకటన 17:3-5 చదవండి. దేవుడు చూపించిన ఒక దర్శనంలో అపొస్తలుడైన యోహాను “మహాబబులోను” అనే వేశ్యను చూశాడు. అది ప్రపంచంలో ఉన్న అబద్ధమతాలన్నిటినీ సూచిస్తుంది. ఈ దర్శనం ఎలా నెరవేరింది? ఎన్నో సంవత్సరాలుగా అబద్ధమత సంస్థలు లోక ప్రభుత్వాలతో దగ్గరగా పనిచేస్తూ వాటికి మద్దతిస్తున్నాయి. కానీ త్వరలో యెహోవా ‘తాను అనుకున్నట్టు జరగడానికి,’ తన ఆలోచనను రాజకీయ నాయకుల మనసుల్లో పెడతాడు. అప్పుడు ఆ “పదిమంది రాజుల్ని” సూచిస్తున్న రాజకీయ శక్తులు, అబద్ధమత సంస్థల మీద దాడిచేసి వాటిని నాశనం చేస్తాయి.—ప్రక. 17:1, 2, 16, 17.
15 మహాబబులోను నాశనం దగ్గర్లో ఉందని మనమెలా చెప్పవచ్చు? ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి ప్రాచీనకాలంలోని బబులోను పట్టణం గురించి తెలుసుకోవడం సహాయం చేస్తుంది. ఆ నగరం కొంతవరకు యూఫ్రటీసు అనే పెద్ద నదివల్ల సురక్షితంగా ఉండేది. నేడు మహాబబులోనుకు ఎన్నో లక్షలమంది మద్దతిస్తున్నారు. వాళ్లను ప్రకటన పుస్తకం ‘నీళ్లతో’ పోలుస్తుంది. (ప్రక. 17:15) అయితే ఆ నీళ్లు ‘ఎండిపోతాయని’ కూడా మనం అక్కడ చదువుతాం. దానర్థం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అబద్ధమతాలకు మద్దతిచ్చేవాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. (ప్రక. 16:12) ఆ ప్రవచన నెరవేర్పులో భాగంగా నేడు చాలామంది అబద్ధమతాన్ని విడిచిపెట్టి, వాళ్ల సమస్యలకు పరిష్కారాన్ని వేరేచోట్ల వెదుకుతున్నారు.
16. ఐక్యరాజ్య సమితి ఏర్పడడం, మహాబబులోను నాశనమవ్వడం గురించిన ప్రవచనాల్ని అర్థంచేసుకోవడం వల్ల మనమెలా ప్రయోజనం పొందుతాం?
16 ఈ ప్రవచనాల్ని అర్థంచేసుకోవడం వల్ల మనమెలాంటి ప్రయోజనం పొందుతాం? ఐక్యరాజ్య సమితి ఏర్పడడం అలాగే అబద్ధమతానికి మద్దతిచ్చేవాళ్ల సంఖ్య తగ్గిపోవడం చూసినప్పుడు మనం చివరి రోజుల్లోనే జీవిస్తున్నామని రుజువౌతుంది. మహాబబులోనుకు మద్దతివ్వడం చాలామంది ఆపేస్తున్నా దాని నాశనం మాత్రం వేరేవిధంగా జరుగుతుంది. ఇంతకుముందు చూసినట్టు, యెహోవా “తాను అనుకున్నట్టు” జరిగేలా “పదిమంది రాజుల” అంటే ఐక్యరాజ్య సమితికి మద్దతిచ్చే రాజకీయ శక్తుల మనసులో తన ఆలోచనను పెడతాడు. ఈ రాజకీయ శక్తులు ఉన్నట్టుండి మహాబబులోనును నాశనం చేస్తాయి. అది చూసి లోకంలోనివాళ్లు ఆశ్చర్యపోతారు. d (ప్రక. 18:8-10) దీని నాశనం ప్రపంచాన్నే కుదిపేస్తుంది. దానివల్ల కష్టాలు కూడా రావచ్చు. కానీ దేవుని ప్రజలు సంతోషించడానికి అప్పుడు కనీసం రెండు కారణాలు ఉంటాయి. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా దేవుని శత్రువుగా ఉన్న అబద్ధమతం పూర్తిగా నాశనమౌతుంది. అలాగే ఈ దుష్టలోకం నుండి మన విడుదల దగ్గరపడిందని అర్థమౌతుంది.—లూకా 21:28.
భవిష్యత్తు విషయంలో ధైర్యంగా ఉండండి
17-18. (ఎ) మన విశ్వాసాన్ని బలపర్చుకుంటూ ఉండాలంటే మనమేం చేయాలి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనమేం చర్చిస్తాం?
17 “నిజమైన జ్ఞానం ఎక్కువౌతుంది” అని దానియేలు ముందే చెప్పాడు. ఆ మాటలు అలానే నెరవేరుతున్నాయి. ఎందుకంటే ఈ కాలానికి సంబంధించిన ప్రవచనాల్ని మనం అర్థం చేసుకోగల్గుతున్నాం. (దాని. 12:4, 9, 10) ఈ ప్రవచనాలు ఉన్నదున్నట్టుగా నెరవేరడం చూసినప్పుడు యెహోవాపట్ల, ఆయన వాక్యమైన బైబిలుపట్ల మన గౌరవం పెరుగుతుంది. (యెష. 46:10; 55:11) కాబట్టి దేవుని వాక్యాన్ని బాగా అధ్యయనం చేస్తూ మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి. అలాగే ఇతరులు కూడా యెహోవాతో మంచి సంబంధాన్ని కలిగివుండేలా సహాయం చేస్తూ ఉండండి. అప్పుడు తనమీద పూర్తిగా ఆధారపడే వాళ్లందర్నీ ఆయన కాపాడుతూ, వాళ్లకు “ఎప్పుడూ శాంతిని” దయచేస్తాడు.—యెష. 26:3.
18 చివరి రోజుల్లో క్రైస్తవ సంఘానికి సంబంధించిన ప్రవచనాల గురించి తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం. అలాగే ఆ ప్రవచనాలన్నీ మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామని ఎలా రుజువు చేస్తాయో చర్చిస్తాం. అంతేకాదు ఇప్పుడు పరిపాలిస్తున్న మన రాజైన యేసు తన నమ్మకమైన అనుచరుల్ని నడిపిస్తున్నాడు అనడానికి ఆధారాల్ని తెలుసుకుంటాం.
పాట 61 సాక్షుల్లారా, ముందుకు సాగండి!
a మానవజాతి చరిత్రంతటిలో మనం అత్యంత ప్రాముఖ్యమైన కాలంలో జీవిస్తున్నాం. ఎందుకంటే ఎన్నో బైబిలు ప్రవచనాలు ముందే చెప్పినట్టు, దేవుని రాజ్యం పరలోకంలో ఇప్పటికే మొదలైంది. కాబట్టి యెహోవామీద మన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి అలాగే ఇప్పుడూ భవిష్యత్తులో ప్రశాంతంగా ఉంటూ, ఆయనను నమ్మడానికి సహాయంచేసే కొన్ని ప్రవచనాల్ని ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
b ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో 32వ పాఠం 4వ పాయింట్ అలాగే దేవుని రాజ్యం 1914 లో పరిపాలించడం మొదలుపెట్టింది అనే వీడియోని jw.orgలో చూడండి.
c దానియేలు ప్రవచనం గురించి ఎక్కువ సమాచారం కోసం 2012 జూన్ 15, కావలికోటలో 14-19 పేజీలు చూడండి.
d అతి త్వరలో ఏం జరుగుతుందో ఇంకా తెలుసుకోవడానికి దేవుని రాజ్యం పరిపాలిస్తోంది! పుస్తకంలో 21వ అధ్యాయం చూడండి.