అధ్యయన ఆర్టికల్ 30
దేవుణ్ణి నమ్మనివాళ్లకు ఎలా ప్రకటించవచ్చు?
“ఎలాగైనా కొందరిని రక్షించాలనే ఉద్దేశంతో, అన్నిరకాల ప్రజలకు సహాయం చేయడానికి శాయశక్తులా కృషి చేశాను.” —1 కొరిం. 9:22.
పాట 82 “మీ వెలుగు ప్రకాశింపనివ్వండి”
ఈ ఆర్టికల్‌లో . . . a
1. గత కొన్ని దశాబ్దాలుగా ఎలాంటి మార్పు కనిపిస్తోంది?
కొన్ని వేల సంవత్సరాల వరకు, ప్రపంచంలో చాలామంది ఏదోక మతాన్ని నమ్ముతూ వచ్చారు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా పరిస్థితి మారుతోంది. మతం మీద ఆసక్తి కోల్పోతున్నవాళ్లు రోజురోజుకీ ఎక్కువౌతున్నారు. కొన్ని దేశాల్లోనైతే, దేవుణ్ణి నమ్మట్లేదని చెప్పేవాళ్లు చాలామందే ఉన్నారు. b—మత్త. 24:12.
2. దేవుణ్ణి నమ్మనివాళ్ల సంఖ్య పెరగడానికి కొన్ని కారణాలు చెప్పండి.
2 దేవుణ్ణి నమ్మనివాళ్ల c సంఖ్య ఎందుకు ఎక్కువౌతోంది? కొంతమంది సుఖాల మీద లేదా తమ సమస్యల మీద మనసు పెడుతుండవచ్చు. (లూకా 8:14) ఇంకొంతమంది దేవుడు లేడనే ముగింపుకొచ్చారు. మరికొంతమంది దేవుడు ఉన్నాడని నమ్మినా, మతం అనేది పాతకాలపు విషయమనీ, సైన్స్‌కి విరుద్ధమైనదనీ, అర్థంపర్థంలేనిదనీ అనుకుంటున్నారు. పరిణామం వల్ల జీవం వచ్చిందని స్నేహితులు, టీచర్లు, మీడియావాళ్లు చెప్పే మాటల్ని వాళ్లు వినుంటారు; కానీ దేవుడే జీవాన్ని సృష్టించాడు అనడానికి సరైన కారణాల్ని వాళ్లు వినుండకపోవచ్చు. కొందరైతే, మతనాయకులు డబ్బు కోసం అధికారం కోసం ప్రాకులాడడం చూసి విసిగిపోయారు. కొన్ని దేశాల్లోని ప్రజలు, ప్రభుత్వాలు పెట్టే నియమాల వల్ల దేవుణ్ణి స్వేచ్ఛగా ఆరాధించ లేకపోతున్నారు.
3. ఈ ఆర్టికల్ ఉద్దేశం ఏంటి?
3 మనం “అన్ని దేశాల ప్రజలను శిష్యుల్ని” చేయాలని యేసు కోరుకుంటున్నాడు. (మత్త. 28:19) మరి దేవుణ్ణి నమ్మనివాళ్లు సైతం ఆయన్ని ప్రేమించేలా, క్రీస్తు శిష్యులు అయ్యేలా మనం ఏవిధంగా సహాయం చేయవచ్చు? మన సందేశానికి ఒక వ్యక్తి ఎలా స్పందిస్తాడనేది అతను పెరిగిన ప్రాంతం బట్టి ఉంటుందని మనం గుర్తించాలి. ఉదాహరణకు, యూరప్‌కు చెందిన ప్రజలు స్పందించినట్లు ఆసియాకు చెందిన ప్రజలు స్పందించకపోవచ్చు. ఎందుకంటే, యూరప్ ప్రజలకు బైబిలు గురించి ఎంతోకొంత తెలుసు, దేవుడే సమస్తాన్ని సృష్టించాడని కూడా వాళ్లు వినుంటారు. కానీ ఆసియాకు చెందిన చాలామందికి బైబిలు గురించి ఏమీ తెలీదు, సృష్టికర్త ఉన్నాడనే నమ్మకం కూడా ఉండకపోవచ్చు. అయితే, మనం పరిచర్యలో కలిసే ప్రజలు ఏ దేశస్థులైనా, వాళ్ల నమ్మకాలు ఏవైనా వాళ్లకు ఏ విధంగా ప్రకటించాలో తెలియజేయడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం.
ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించండి
4. సానుకూలంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?
4 సానుకూలంగా ఉండండి. ప్రతీ సంవత్సరం, ఒకప్పుడు దేవుణ్ణి నమ్మనివాళ్లు సైతం యెహోవాసాక్షులు అవుతున్నారు. వాళ్లలో చాలామంది సత్యం తెలుసుకోక ముందు కూడా ఉన్నత నైతిక ప్రమాణాలు పాటించేవాళ్లు; కానీ మతనాయకుల వేషధారణ చూసి విసిగిపోయి ఉండేవాళ్లు. ఇంకొందరు ఎలాంటి నైతిక విలువలు పాటించేవాళ్లు కాదు, చెడు అలవాట్లకు బానిసలుగా ఉండేవాళ్లు. కానీ సత్యం తెలుసుకున్నాక వాటన్నిటినీ మానేశారు. దీన్నిబట్టి, “శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి” ఉన్నవాళ్లను మనం యెహోవా సహాయంతో కనుగొనగలమని అర్థమౌతోంది.—అపొ. 13:48; 1 తిమో. 2:3, 4.
5. తరచూ ప్రజలు మన సందేశం పట్ల ఆసక్తి చూపించడానికి కారణం ఏంటి?
5 దయగా మాట్లాడండి, నిజమైన శ్రద్ధ చూపించండి. మనం చెప్పే విషయాల వల్ల కాదుగానీ, మనం చెప్పే విధానం వల్లే తరచూ ప్రజలు మన సందేశం పట్ల ఆసక్తి చూపిస్తుంటారు. వాళ్లతో దయగా మాట్లాడుతూ నిజమైన శ్రద్ధ చూపించినప్పుడు మనం చెప్పేది వినడానికి ఇష్టపడతారు. అయితే మనం వాళ్లను వినమని బలవంతపెట్టం గానీ, మతంపట్ల వాళ్ల అభిప్రాయాన్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఉదాహరణకు కొంతమంది, పరిచయం లేనివాళ్లతో మతం గురించి మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు. ఇంకొంతమంది, మతం గురించి వాళ్ల అభిప్రాయం అడగడాన్ని అమర్యాదగా భావిస్తారు. మరికొంతమంది, తాము బైబిలు చదవడం ఎవరైనా చూస్తే, అందులోనూ యెహోవాసాక్షులతో చదవడం గమనిస్తే ఏమనుకుంటారో అని ఇబ్బందిపడతారు. ఏదేమైనా, మనం వాళ్ల భావాల్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తాం.—2 తిమో. 2:24.
6. అపొస్తలుడైన పౌలు, పరిస్థితికి తగ్గట్టు మాట్లాడాడని ఎలా చెప్పవచ్చు? ఆయన్ని మనమెలా అనుకరించవచ్చు?
6 పరిచర్యలో “బైబిలు,” “దేవుడు,” “మతం” వంటి పదాల్ని ఉపయోగించినప్పుడు ఎవరైనా అభ్యంతర పడతారనిపిస్తే ఏం చేయవచ్చు? మనం అపొస్తలుడైన పౌలును అనుకరిస్తూ, ఇంటివ్యక్తిని బట్టి మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. పౌలు యూదులతో మాట్లాడుతున్నప్పుడు లేఖనాలు ఉపయోగించి తర్కించాడు. కానీ, ఆయన అరేయొపగులో గ్రీకు తత్వవేత్తలతో మాట్లాడుతున్నప్పుడు లేఖనాల్ని నేరుగా ప్రస్తావించలేదు. (అపొ. 17:2, 3, 22-31) అదేవిధంగా మనం కూడా, బైబిల్ని ఇష్టపడనివాళ్లతో మాట్లాడుతున్నప్పుడు లేఖనాల్ని నేరుగా ప్రస్తావించకపోవడం మంచిది. ఒకవేళ బైబిలు చదవడం ఎవరైనా చూస్తారని ఇంటివ్యక్తి అభ్యంతరపడొచ్చు అనిపిస్తే, లేఖనాల్ని మీ ఫోన్‌లో గానీ ట్యాబ్‌లో గానీ చూపించండి.
7. మొదటి కొరింథీయులు 9:20-23 వచనాల్లో ఉన్న పౌలు ఉదాహరణను మనమెలా అనుకరించవచ్చు?
7 వాళ్లను అర్థంచేసుకోండి, వాళ్లు చెప్పేది వినండి. మనం ప్రజల అభిప్రాయం వెనకున్న కారణాల్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాలి. (సామె. 20:5) మరోసారి పౌలు ఉదాహరణను పరిశీలించండి. ఆయన యూదుల మధ్య పెరిగాడు. అన్యులకు యెహోవా గురించి, లేఖనాల గురించి ఏమీ తెలీదు. కాబట్టి అన్యులకు ప్రకటిస్తున్నప్పుడు, ఆయన మాట్లాడే విధానాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. మనం కూడా మన క్షేత్రంలోని ప్రజలు ఎలా ఆలోచిస్తారో, ఎలా భావిస్తారో అర్థంచేసుకోవడానికి కొంత పరిశోధన చేయవచ్చు లేదా సంఘంలో అనుభవం ఉన్నవాళ్ల సహాయం తీసుకోవచ్చు.—1 కొరింథీయులు 9:20-23 చదవండి.
8. బైబిలు గురించి సంభాషణ ప్రారంభించడానికి ఒక చక్కని మార్గం ఏంటి?
8 ‘అర్హులైన’ వాళ్లను వెదకడమే మన లక్ష్యం. (మత్త. 10:11) మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రజల అభిప్రాయాల్ని అడగాలి, వాళ్లు చెప్పేది జాగ్రత్తగా వినాలి. ఇంగ్లండ్‌లో ఉండే ఒక సహోదరుడు ప్రజల్ని కలిసినప్పుడు, వివాహ జీవితం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, అన్యాయాన్ని ఎలా తట్టుకోవాలి వంటి వాటిగురించి వాళ్ల అభిప్రాయం అడుగుతాడు. వాళ్లు చెప్పేది విన్న తర్వాత “2,000 సంవత్సరాల క్రితం రాయబడిన ఈ సలహా చూడండి” అని చెప్పి, ఒక చక్కని లేఖనాన్ని తన ఫోన్‌లో చూపిస్తాడు. ఈ విధంగా, అతను “బైబిలు” అనే పదం ఉపయోగించకుండానే లేఖనాల్ని పరిచయం చేస్తాడు.
దేవుని గురించి ఎలా నేర్పించవచ్చు?
9. దేవుని గురించి మాట్లాడడానికి ఇష్టపడని ప్రజలతో ఏ విషయాలు మాట్లాడవచ్చు?
9 ప్రజలు దేవుని గురించి మాట్లాడడానికి ఇష్టపడకపోతే, వాళ్లకు నచ్చే విషయం గురించి చర్చించవచ్చు. ఉదాహరణకు చాలామంది ప్రకృతిని చూసి ఆశ్చర్యపోతుంటారు. కాబట్టి మనం ఇలా అనవచ్చు, “శాస్త్రజ్ఞులు సృష్టిలో ఉన్నవాటిని చూసి ఎన్నో కొత్త వస్తువుల్ని కనిపెట్టారని మీకు తెలిసే ఉంటుంది. ఉదాహరణకు, మైక్రోఫోన్ తయారు చేసినవాళ్లు పురుగుల చెవుల్ని, కెమెరా తయారు చేసినవాళ్లు పురుగుల కళ్లను అధ్యయనం చేశారు. మరి వాటి చెవుల్ని, కళ్లను ఎవరు చేశారని మీరనుకుంటున్నారు?” వాళ్లు చెప్పేది జాగ్రత్తగా విన్న తర్వాత, “ఒక ప్రాచీన కవి రాసిన ఈ విషయం నాకు చాలా ఆసక్తిగా అనిపించింది, ‘చెవిని తయారుచేసిన దేవుడు వినలేడా? కంటిని తయారుచేసిన దేవుడు చూడలేడా? . . . ప్రజలకు జ్ఞానాన్ని బోధించేది ఆయనే!’ కొంతమంది శాస్త్రజ్ఞులు ఈ మాటల్ని ఒప్పుకుంటూ సృష్టికర్త ఉన్నాడని నమ్ముతున్నారు” అని అనవచ్చు. (కీర్త. 94:9, 10, NW) ఆ తర్వాత, jw.org® వెబ్‌సైట్ నుండి “జీవారంభం గురించి అభిప్రాయాలు” అనే విభాగంలో ఉన్న ఏదైనా ఆర్టికల్‌ని చూపించవచ్చు. (బైబిలు బోధలు > విజ్ఞాన శాస్త్రం, బైబిలు చూడండి.) లేదా జీవారంభం—అడగాల్సిన ఐదు ప్రశ్నలు (ఇంగ్లీష్) అలాగే జీవం సృష్టించబడిందా? (ఇంగ్లీష్) అనే బ్రోషుర్లలో ఒకదాన్ని ఇవ్వవచ్చు.
10. దేవుని గురించి మాట్లాడడానికి ఇష్టపడని ప్రజలతో సంభాషణ మొదలుపెట్టడానికి మరో విధానం ఏంటి?
10 చాలామంది మంచిరోజులు రావాలని కోరుకుంటారు. అయితే ఎంతోమంది భూమి నాశనమౌతుందని లేదా జీవించడానికి వీల్లేనంతగా పాడౌతుందని భయపడుతుంటారు. దేవుని గురించి మాట్లాడడానికి ఇష్టపడని ప్రజలు ప్రపంచ పరిస్థితుల గురించి మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తారని నార్వేలో సేవచేసే ప్రాంతీయ పర్యవేక్షకుడు చెప్తున్నాడు. ఆయన ప్రజల్ని పలకరించి ఇలా అడుగుతాడు: “మంచి రోజులు ఎవరు తీసుకొస్తారని మీరనుకుంటున్నారు? రాజకీయ నాయకులా, శాస్త్రజ్ఞులా, ఇంకెవరైనానా?” ఆయన వాళ్లు చెప్పేది జాగ్రత్తగా విని, రాబోయే మంచిరోజుల గురించి చెప్పే ఒక లేఖనాన్ని చదువుతాడు లేదా దాన్ని వివరిస్తాడు. కొంతమంది భూమి ఎప్పటికీ నాశనం అవ్వదని, మంచివాళ్లు దానిలో శాశ్వతకాలం జీవిస్తారని బైబిల్లో ఉన్న వాగ్దానం పట్ల ఆసక్తి చూపిస్తారు.—కీర్త. 37:29; ప్రసం. 1:4.
11. మనం ప్రజలతో మాట్లాడడానికి రకరకాల విధానాల్ని ఎందుకు ఉపయోగించాలి? రోమీయులు 1:14-16 లో ఉన్న పౌలు ఉదాహరణను మనమెలా అనుకరించవచ్చు?
11 మనం ప్రజలతో మాట్లాడడానికి రకరకాల విధానాల్ని ఉపయోగించాలి. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు. ఒకరికి ఆసక్తిగా అనిపించిన విషయం మరొకరికి ఆసక్తిగా అనిపించకపోవచ్చు. కొంతమంది దేవుని గురించి లేదా బైబిలు గురించి చర్చించడానికి ఇబ్బందిపడరు. కానీ కొంతమంది ఇబ్బందిపడతారు కాబట్టి అలాంటివాళ్లతో ముందు వేరే విషయాలు మాట్లాడాలి. ఏదేమైనా, మనం అన్నిరకాల ప్రజలతో మాట్లాడడానికి ప్రయత్నించాలి. (రోమీయులు 1:14-16 చదవండి.) అయితే యెహోవాయే సరైన హృదయ స్థితి ఉన్నవాళ్లలో సత్యాన్ని వృద్ధి చేస్తాడని మనం గుర్తుంచుకోవాలి.—1 కొరిం. 3:6, 7.
దేవుణ్ణి నమ్మనివాళ్లకు సత్యాన్ని ఎలా ప్రకటించవచ్చు?
12. సృష్టికర్త గురించి ఆలోచించని కొన్ని ఆసియా దేశాల్లోని ప్రజలకు ప్రకటించడానికి ఏం చేయవచ్చు?
12 ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రచారకులకు, నిజ దేవుణ్ణి నమ్మని ప్రజలు అలాగే ప్రభుత్వ నియమాల వల్ల స్వేచ్ఛగా ఆరాధించలేకపోతున్న ప్రజలు ఎదురౌతున్నారు. సాధారణంగా ఆసియా దేశాల్లోని చాలామంది, సృష్టికర్త ఉన్నాడా లేడా అని ఆలోచించరు. కాబట్టి వాళ్లలో కొంతమంది, బైబిలు స్టడీ గురించి వినగానే కుతూహలంతో దానికి ఒప్పుకుంటారు. కానీ కొందరు మాత్రం బైబిలు విషయాలు కొత్తగా అనిపించి వాటిగురించి తెలుసుకోవడానికి వెనకాడతారు. మరి వాళ్లకు ప్రకటించడానికి ఏం చేయవచ్చు? అనుభవమున్న కొంతమంది ప్రచారకులు చెప్తున్నట్లు, ముందుగా వాళ్లతో స్నేహపూర్వకంగా మాట్లాడాలి; వ్యక్తిగత శ్రద్ధ చూపించాలి; తర్వాత అవకాశం దొరికినప్పుడు, బైబిలు సూత్రాలు పాటించడం వల్ల స్వయంగా పొందిన ప్రయోజనాల్ని చెప్పాలి. అలా చేయడంవల్ల ఆ ప్రచారకులు ఇప్పటికే మంచి ఫలితాలు పొందారు.
13. ప్రజలు బైబిల్లో ఉన్న ఏ విషయాలకు ఆకర్షితులౌతారు? (ముఖచిత్రం చూడండి.)
13 చాలామంది బైబిల్లో ఉన్న జ్ఞానయుక్తమైన సూత్రాలకు మొదట ఆకర్షితులౌతారు. (ప్రసం. 7:12) న్యూయార్క్‌లో ఉంటున్న చైనీస్ ప్రజల్ని కలిసే ఒక సహోదరి ఇలా అంటోంది: “నేను ప్రజల మీద శ్రద్ధ చూపించడానికి, వాళ్లు చెప్పేది వినడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ వాళ్లు ఈ మధ్యే వలస వచ్చారని తెలిస్తే, ‘ఈ ప్రాంతం మీకు అలవాటైందా? ఏదైనా ఉద్యోగం దొరికిందా? ఇక్కడి ప్రజలు మీతో బాగానే ఉంటున్నారా?’ అని అడుగుతాను.” అలా మాట్లాడడం వల్ల కొన్నిసార్లు బైబిలు విషయాలు చెప్పే అవకాశం దొరుకుతుంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలిస్తే, ఆమె ఇలా కూడా అడుగుతుంది, “ఇతరులతో మంచి సంబంధాల్ని కలిగివుండాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారు? బైబిల్లో ఉన్న ఒక సామెత మీకు చూపించవచ్చా? ఇక్కడ ఇలా ఉంది: ‘కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము.’ ఇతరులతో మంచి సంబంధాలు కలిగివుండడానికి ఈ సలహా ఉపయోగపడుతుందని మీకనిపిస్తుందా?” (సామె. 17:14) ఈ విధంగా సంభాషిస్తే, ఎక్కువ నేర్చుకోవడానికి ఇష్టపడే ప్రజల్ని గుర్తించగలుగుతాం.
14. తూర్పు ఆసియాలో ఉండే ఒక సహోదరుడు దేవుణ్ణి నమ్మని ప్రజలతో ఎలా మాట్లాడుతుంటాడు?
14 దేవుణ్ణి నమ్మట్లేదని చెప్పేవాళ్లతో మనమెలా మాట్లాడవచ్చు? తూర్పు ఆసియాలో అలాంటి ప్రజలుండే క్షేత్రంలో ఎంతోకాలం నుండి సేవచేస్తున్న సహోదరుడు ఇలా వివరిస్తున్నాడు, “‘నేను దేవుణ్ణి నమ్మను’ అని ఇక్కడ ఎవరైనా చెప్తే, వాళ్లు స్థానిక దేవుళ్లను ఆరాధించట్లేదని అర్థం. కాబట్టి వాళ్లతో, విగ్రహాలను మనుషులే చేశారని, అవి నిజమైన దేవుళ్లు కాదని చెప్తాను. తర్వాత యిర్మీయా 16:20లో ఉన్న ఈ మాటల్ని చదువుతాను: ‘నరులు తమకు దేవతలను కల్పించుకొందురా? అయినను అవి దైవములు కావు.’ లేఖనం చదివాక, ‘నిజమైన దేవుడు ఎవరో, మనుషులు తయారుచేసిన దేవుడు ఎవరో మనమెలా తెలుసుకోవచ్చు?’ అని అడుగుతాను. వాళ్లు చెప్పేది జాగ్రత్తగా విన్నాక, యెషయా 41:23 చదువుతాను. అక్కడిలా ఉంది: ‘ఇకమీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము.’ ఆ తర్వాత, భవిష్యత్తులో జరగబోయేదాన్ని యెహోవా ముందే చెప్పిన ఒక ఉదాహరణ చూపిస్తాను.”
15. తూర్పు ఆసియాలో ఉండే మరో సహోదరుని నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
15 తూర్పు ఆసియాలో ఉండే మరో సహోదరుడు రిటన్ విజిట్‌లు చేసేటప్పుడు ఈ విధానాన్ని ఉపయోగిస్తాడు: “బైబిల్లో ఉన్న జ్ఞానం గురించి, నెరవేరిన ప్రవచనాల గురించి, విశ్వం గురించి కొన్ని ఉదాహరణల్ని చూపిస్తాను. జీవంగల తెలివైన సృష్టికర్త ఉన్నాడని అవన్నీ ఎలా నిరూపిస్తున్నాయో వివరిస్తాను. ఒకవేళ ప్రజలు దేవుడు ఉన్నాడని ఆలోచించడం మొదలుపెడితే, యెహోవా గురించి బైబిలు ఏం చెప్తుందో చూపిస్తాను.”
16. హెబ్రీయులు 11:6 ప్రకారం బైబిలు విద్యార్థులకు దేవుని మీద, బైబిలు మీద ఎందుకు విశ్వాసం ఉండాలి? దాన్ని పెంపొందించుకోవడానికి వాళ్లకు మనమెలా సహాయం చేయవచ్చు?
16 దేవుడు ఉన్నాడని ఒకప్పుడు నమ్మని ప్రజలతో స్టడీ చేస్తున్నప్పుడు, వాళ్లకు దేవుని మీద ఏర్పడిన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉండాలి. (హెబ్రీయులు 11:6 చదవండి.) అంతేకాదు వాళ్లకు బైబిలు మీద విశ్వాసాన్ని పెంచడానికి కృషి చేయాలి. అందుకోసం కొన్ని విషయాల్ని పదేపదే చెప్పాల్సి రావచ్చు. బైబిలు దేవుని వాక్యమని నిరూపించే ఆధారాల్ని స్టడీ చేస్తున్న ప్రతీసారి చర్చించాల్సి రావచ్చు. ఉదాహరణకు బైబిల్లో ఉన్న ప్రవచనాలు ఎలా నెరవేరాయో, బైబిల్లోని విషయాలు సైన్స్‌పరంగా, చారిత్రకంగా ఎంత ఖచ్చితమైనవో, రోజువారీ జీవితంలో బైబిలు సలహాలు ఎలా ఉపయోగపడతాయో చర్చించవచ్చు.
17. మనం ప్రజలపట్ల ప్రేమ చూపిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది?
17 ప్రజలు దేవుణ్ణి నమ్మేవాళ్లయినా, నమ్మనివాళ్లయినా మనం ప్రేమ చూపించడం ద్వారా వాళ్లు క్రీస్తు శిష్యులు అయ్యేలా సహాయం చేస్తాం. (1 కొరిం. 13:1) దేవుడు వాళ్లను ప్రేమిస్తున్నాడని, వాళ్లు కూడా ఆయన్ని ప్రేమించాలని కోరుకుంటున్నాడని చెప్పడం మన లక్ష్యమై ఉండాలి. ఒకప్పుడు మతం పట్ల ఆసక్తి చూపించని వేలమంది ప్రతీ సంవత్సరం బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్లు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నారు. కాబట్టి సానుకూలంగా ఉండండి, అన్నిరకాల ప్రజలపట్ల ప్రేమ, వ్యక్తిగత శ్రద్ధ చూపించండి. వాళ్లు చెప్పేది వినండి, వాళ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. క్రీస్తు శిష్యులుగా ఎలా ఉండాలో మీ ఆదర్శం ద్వారా నేర్పించండి.
పాట 76 మీకు సంతోషంగా ఉంటుందా?
a ప్రపంచవ్యాప్తంగా దేవుణ్ణి నమ్మని ప్రజలు గతంలోకన్నా ఇప్పుడే ఎక్కువమంది ఉన్నారు. పరిచర్యలో మనం అలాంటివాళ్లను కలుస్తుండవచ్చు. వాళ్లకు బైబిలు గురించి ఎలా బోధించవచ్చో; బైబిలు పట్ల, యెహోవా పట్ల నమ్మకాన్ని ఎలా కలిగించవచ్చో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం.
b సర్వేల ప్రకారం అలాంటి దేశాలు కొన్ని ఏవంటే: అజర్‌బైజాన్, అల్బేనియా, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్, ఐర్లాండ్, కెనడా, చైనా, ఛెక్ రిపబ్లిక్, జపాన్, జర్మనీ, డెన్మార్క్, దక్షిణ కొరియా, నార్వే, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డం, వియత్నాం, స్విట్జర్లాండ్, స్వీడన్, స్పెయిన్, హాంకాంగ్.
c పదాల వివరణ: ఈ ఆర్టికల్‌లో దేవుణ్ణి నమ్మనివాళ్లు అనే మాట, దేవునిపై నమ్మకం ఉన్నా ఏ మత సిద్ధాంతాల్నీ పాటించని ప్రజల్ని కూడా సూచిస్తుంది.
d చిత్రాల వివరణ: ఒక సహోదరుడు తనతోపాటు హాస్పిటల్‌లో పనిచేస్తున్న వ్యక్తికి సాక్ష్యమిస్తున్నాడు. తర్వాత ఆ వ్యక్తి మన వెబ్‌సైట్ చూస్తున్నాడు.