దేవుని కృపకు కృతజ్ఞత చూపించండి
“మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి.”—యోహా. 1:16.
1, 2. (ఎ) ద్రాక్షతోట యజమాని గురించి యేసు చెప్పిన ఉపమానాన్ని వివరించండి. (బి) కృప గురించి ఈ ఉపమానం ఏమి బోధిస్తుంది?
ఓరోజు ఉదయాన్నే, ఒక ద్రాక్షతోట యజమాని తన తోటలో పనిచేసేందుకు కూలివాళ్లను తెచ్చుకోవడానికి మార్కెట్‌కు వెళ్లాడు. ఆయన ఇస్తానన్న జీతం నచ్చడంతో కొంతమంది కూలివాళ్లు పని చేయడానికి ఒప్పుకున్నారు. అయితే ఆ యజమానికి ఇంకా చాలామంది పనివాళ్లు అవసరమవ్వడంతో ఆ రోజంతటిలో మళ్లీమళ్లీ మార్కెట్‌కు వెళ్లి పనివాళ్లను తెచ్చుకున్నాడు. తన తోటలో పనిచేస్తున్న వాళ్లందరికీ మంచి జీతం ఇవ్వడానికి ఆ యజమాని ఒప్పుకున్నాడు. కాబట్టి ఆరోజు సాయంత్రం అతను పనివాళ్లందర్నీ పిలిచి, వాళ్లు రోజంతా పనిచేసినవాళ్లయినా లేదా ఒక్క గంట పనిచేసినవాళ్లయినా అందరికీ ఒకే జీతం ఇచ్చాడు. దాంతో ఉదయం నుండి పనిచేసినవాళ్లు అతని మీద సణగడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ యజమాని, ‘నేను చెప్పిన జీతానికి పనిచేస్తానని మీరు ఒప్పుకోలేదా? నా దగ్గర పనిచేసిన వాళ్లందరికీ నాకిష్టం వచ్చినంత ఇచ్చే హక్కు నాకు లేదా? నేను మంచివాడినైనందుకు మీకు కడుపుమంటగా ఉందా?’ అని అన్నాడు.—మత్త. 20:1-15.
2 యేసు చెప్పిన ఈ ఉపమానం, యెహోవా లక్షణాల్లో ఒకటైన “అపారదయను” మనకు గుర్తుచేస్తుంది. అపారదయ అనే గ్రీకు పదాన్ని మన తెలుగు బైబిల్లో “కృప” అని అనువదించారు. [1] (2 కొరింథీయులు 6:1 చదవండి.) ఆ ఉపమానంలోని యజమాని, ఉదయం నుండి పనిచేసినవాళ్లకు ఎక్కువ జీతం ఇచ్చి ఉండాల్సిందని కొంతమంది అనుకోవచ్చు. అయితే ఆయన కొంతసమయం మాత్రమే పనిచేసినవాళ్లపట్ల కృప చూపించాడు. బైబిల్లో ఉన్న “కృప” అనే మాట గురించి ఓ నిపుణుడు ఇలా చెప్పాడు, “అర్హతలేని ఓ వ్యక్తికి ఉచితంగా ఏదైనా ఇవ్వడాన్నే కృప చూపించడం అంటారు.”
యెహోవా ఉదారంగా ఇచ్చిన బహుమతి
3, 4. మనుషులందరిపట్ల యెహోవా తన కృపను ఎలా చూపించాడు? ఎందుకు?
3 దేవుడు చూపించిన కృప ఓ ‘ఉచిత బహుమానం’ అని బైబిలు చెప్తోంది. (ఎఫె. 3:7, NW) మనం యెహోవాకు పరిపూర్ణ విధేయత చూపించలేం కాబట్టి మనం దయకు కాదుగానీ మరణానికే అర్హులం. రాజైన సొలొమోను ఇలా చెప్పాడు, “పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు.” (ప్రసం. 7:20) అలాగే అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు, “ఏ భేదమును లేదు; అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” అంతేకాదు “పాపమువలన వచ్చు జీతము మరణము.”—రోమా. 3:23; 6:23.
4 యెహోవా మనుషులను ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ‘అద్వితీయకుమారుణ్ణి’ మనకోసం బలిగా అర్పించాడు. ఆయన మనపట్ల చూపించే కృపకు అంతకన్నా గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. (యోహా. 3:16) ‘దేవుని కృపవలన యేసు ప్రతి మనిషి కొరకు మరణం అనుభవించాడు. ఆయన మరణం పొందినందున, మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాం’ అని పౌలు అన్నాడు. (హెబ్రీ. 2:9) అవును, “దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.”—రోమా. 6:23.
5, 6. (ఎ) పాపం మనపై రాజ్యమేలడం వల్ల ఏమి జరుగుతుంది? (బి) దేవుని కృపవల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతాం?
5 మనమెందుకు పాపం చేస్తున్నాం? ఎందుకు చనిపోతున్నాం? ‘మరణం ఒకని అపరాధ మూలంగా వచ్చి ఆ ఒకని ద్వారానే ఏలుతోంది’ అని బైబిలు చెప్తోంది. మనందరం ఆదాము పిల్లలం కాబట్టి పాపం చేస్తున్నాం, చనిపోతున్నాం. (రోమా. 5:12, 14, 17) అయినప్పటికీ, మనం పాపం చేయకుండా ఉండవచ్చు. అదెలా సాధ్యం? క్రీస్తు అర్పించిన బలిమీద విశ్వాసం ఉంచినప్పుడు, యెహోవా కృప నుండి మనం ప్రయోజనం పొందుతాం. బైబిలు ఇలా చెప్తోంది, “పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో, ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.”—రోమా. 5:20, 21.
6 మనం పాపులమే అయినప్పటికీ, పాపం మనపై రాజ్యమేలడానికి మనం అనుమతించాల్సిన అవసరంలేదు. కాబట్టి మనమేదైనా పాపం చేసినప్పుడు క్షమించమని యెహోవాను అడుగుతాం. పౌలు క్రైస్తవుల్ని ఇలా హెచ్చరించాడు, “మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.” (రోమా. 6:14) దేవుని కృప నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు? పౌలు ఇలా చెప్పాడు, “దేవుని కృప . . . మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి . . . ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.”—తీతు 2:11-13.
“దేవుని నానావిధమైన కృప”
7, 8. దేవుని “నానావిధమైన” కృప అంటే ఏమిటి? (ప్రారంభ చిత్రాలు చూడండి.)
7 అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు, “దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.” (1 పేతు. 4:10) దేవుని “నానావిధమైన” కృప అంటే ఏమిటి? అంటే జీవితంలో మనకెలాంటి కష్టాలు వచ్చినా, వాటిని సహించడానికి కావాల్సిన వాటిని యెహోవా మనకిస్తాడని దానర్థం. (1 పేతు. 1:6) ప్రతీ కష్టాన్ని సహించడానికి మనకు సరిగ్గా ఏమి అవసరమో దాన్ని ఆయన మనకు ఎల్లప్పుడూ ఇస్తాడు.
8 అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు, “ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి.” (యోహా. 1:16) యెహోవా తన కృపను ఎన్నో రకాలుగా చూపిస్తున్నాడు కాబట్టి మనం ఎన్నో దీవెనల్ని పొందుతాం. వాటిలో కొన్ని ఏమిటి?
9. దేవుని కృపవల్ల మనం ఏ ప్రయోజనాన్ని పొందుతున్నాం? అందుకు మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు?
9 యెహోవా మన పాపాల్ని క్షమిస్తాడు. ఆయన మన పాపాల్ని క్షమించడం ద్వారా తన కృపను చూపిస్తున్నాడు. అయితే మనం పశ్చాత్తాపం చూపించి, తప్పుడు కోరికలకు లొంగిపోకుండా ఉండేందుకు పోరాడుతూ ఉంటేనే ఆయన క్షమిస్తాడు. (1 యోహాను 1:8, 9 చదవండి.) పాపాల్ని యెహోవా దేన్నిబట్టి క్షమిస్తున్నాడో వివరిస్తూ పౌలు అభిషిక్త క్రైస్తవులతో ఇలా చెప్పాడు, “ఆయన [దేవుడు] మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను. ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.” (కొలొ. 1:13, 14) యెహోవా మనమీద అంత కనికరం చూపిస్తున్నాడు కాబట్టి ఆయన్ను స్తుతించడం ద్వారా మనం కృతజ్ఞత చూపించవచ్చు. యెహోవా మన పాపాల్ని క్షమిస్తున్నాడు కాబట్టి మనం ఎన్నో ఇతర దీవెనల్ని కూడా పొందగలుగుతాం.
10. దేవుని కృపవల్ల మనమేమి ఆనందించగలుగుతున్నాం?
10 యెహోవాతో చక్కని స్నేహాన్ని ఆనందించగలం. మనం అపరిపూర్ణులం కాబట్టి పుట్టుకతోనే దేవునికి శత్రువులయ్యాం. అయినప్పటికీ పౌలు ఇలా అన్నాడు, ‘శత్రువులమై ఉండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాం.’ (రోమా. 5:10) యేసు బలి ఆధారంగా మనం దేవునితో మంచి సంబంధాన్ని కలిగివుండగలం. అంటే ఆయనతో సమాధానంగా ఉంటూ ఆయనకు స్నేహితులుగా ఉండగలం. దేవుని కృపవల్లే అలా ఉండగలుగుతున్నామని పౌలు అభిషిక్త సహోదరులకు చెప్తూ ఇలా వివరించాడు, ‘విశ్వాసమూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము మరియు ఆయనద్వారా మనం విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగలవారమై, అందులో నిలిచి ఉన్నాం.’ (రోమా. 5:1, 2) దేవునితో చక్కని స్నేహాన్ని కలిగి ఉండగలగడం ఎంత గొప్ప దీవెనో కదా!
11. ‘వేరేగొర్రెలు’ దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండడానికి అభిషిక్తులు ఏవిధంగా సహాయం చేస్తారు?
11 దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండగలం. చివరిరోజుల్లో ‘బుద్ధిమంతులు’ అంటే అభిషిక్తులు ‘నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు అనేకులకు’ సహాయం చేస్తారని ప్రవక్త అయిన దానియేలు రాశాడు. (దానియేలు 12:3 చదవండి.) అభిషిక్తులు దాన్నెలా చేస్తారు? వాళ్లు సువార్తను ప్రకటిస్తారు, లక్షలాది ‘వేరేగొర్రెలకు’ యెహోవా నియమాలను బోధిస్తారు. (యోహా. 10:16) ఆ విధంగా, దేవుని కృపను బట్టి వేరేగొర్రెలు ఆయన ఎదుట నీతిమంతులుగా ఉండడానికి సహాయం చేస్తారు. దానిగురించి పౌలు ఇలా చెప్పాడు, “నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.”—రోమా. 3:23, 24.
12. ప్రార్థనకు, దేవుని కృపకు ఉన్న సంబంధమేమిటి?
12 ప్రార్థన ద్వారా మనం యెహోవాకు దగ్గరవ్వగలం. దేవుడు ఎంతో కృపతో తనకు ప్రార్థించే అవకాశాన్ని మనకిచ్చాడు. నిజానికి పౌలు దేవుని సింహాసనాన్ని “కృపాసనము” అని వర్ణిస్తూ, దాని దగ్గరకు “ధైర్యముతో” రమ్మని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. (హెబ్రీ. 4:16) యేసు పేరున మనం యెహోవాకు ఎప్పుడైనా ప్రార్థన చేయవచ్చు. అది నిజంగా ఓ గొప్ప అవకాశం. “ఆయనయందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయననుబట్టి మనకు కలిగియున్నవి” అని పౌలు అన్నాడు.—ఎఫె. 3:12.
13. దేవుని కృపవల్ల సరైన సమయంలో సహాయం ఎలా పొందుతాం?
13 సరైన సమయంలో సహాయాన్ని పొందగలం. అవసరంలో ఉన్న ప్రతీసారి యెహోవాకు ప్రార్థించమని పౌలు మనల్ని ప్రోత్సహించాడు. అప్పుడు ‘మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం’ పొందుతాం. (హెబ్రీ. 4:16ఎ) కాబట్టి మనకు జీవితంలో కష్టాలు ఎదురైన ప్రతీసారి సహాయం కోసం యెహోవాకు ప్రార్థించవచ్చు. మనకు జవాబివ్వాల్సిన అవసరం తనకు లేకపోయినప్పటికీ ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడు. అయితే ఆయన చాలావరకు మన తోటి సహోదరసహోదరీల్ని ఉపయోగించుకుని మనకు సహాయాన్ని అందిస్తాడు. అవును, యెహోవా మన ప్రార్థనలకు జవాబిస్తాడు కాబట్టి ‘ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలం.’—హెబ్రీ. 13:6.
14. దేవుని కృపవల్ల మనమెలా ఓదార్పు పొందుతాం?
14 మనం ఓదార్పును పొందగలం. బాధతో కృంగిపోయిన ప్రతీసారి యెహోవా మనల్ని ఓదారుస్తాడు, అది మనకు ఓ గొప్ప దీవెన. (కీర్త. 51:17) థెస్సలోనికలోని క్రైస్తవులు హింసను ఎదుర్కొంటున్నప్పుడు పౌలు ఇలా రాశాడు, “మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును, మీ హృదయములను ఆదరించి . . . స్థిరపరచును గాక.” (2 థెస్స. 2:16, 17) యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని, మనపట్ల ఆయనకు శ్రద్ధ ఉందని తెలుసుకోవడం నిజంగా ఎంతో ఓదార్పునిస్తుంది.
15. దేవుని కృపవల్ల మనకెలాంటి నిరీక్షణ ఉంది?
15 నిత్యజీవ నిరీక్షణ పొందాం. మనం పాపులం కాబట్టి యెహోవా సహాయం లేకపోతే మనకు నిరీక్షణే లేదు. (కీర్తన 49:7, 8 చదవండి.) కానీ యెహోవా మనకు అద్భుతమైన నిరీక్షణ ఇచ్చాడు. ఏంటది? యేసు ఇలా అన్నాడు, “కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము.” (యోహా. 6:40) కాబట్టి యెహోవా కృపవల్ల మనకు నిత్యం జీవించే అవకాశం ఉంది. అందుకే ‘సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప’ అని పౌలు అన్నాడు.—తీతు 2:11.
దేవుని కృపను సాకుగా తీసుకుని పాపం చేయకండి
16. తొలి క్రైస్తవుల్లో కొంతమంది దేవుని కృపను సాకుగా తీసుకుని ఏమి చేశారు?
16 దేవుని కృపవల్ల మనమెన్నో దీవెనలు పొందుతున్నాం. అయితే మనం దాన్ని దుర్వినియోగం చేయకూడదు, అంటే దేవుని కృపను సాకుగా ఉపయోగించుకుని పాపం చేయకూడదు. తొలి క్రైస్తవుల్లో కొంతమంది, ‘దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరిచారు.’ (యూదా 4) నమ్మకం చూపించని ఈ క్రైస్తవులు, తాము ఎన్నిసార్లు పాపం చేసినా యెహోవా క్షమిస్తూనే ఉంటాడని అనుకున్నారు. వాళ్లు పాపం చేయడమే కాకుండా తోటి సహోదరులతో కూడా దాన్ని చేయించడానికి ప్రయత్నించారు. నేడు కూడా అలా ఎవరైనా చేస్తుంటే ‘కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాళ్లౌతారు.’—హెబ్రీ. 10:29.
17. పేతురు ఏ సలహా ఇచ్చాడు?
17 నేడు కొంతమంది క్రైస్తవులు, తాము పాపం చేసినా యెహోవా క్షమించేస్తాడని అనుకుంటున్నారు. అలా అనుకునేలా సాతాను వాళ్లను తప్పుదారి పట్టిస్తున్నాడు. నిజమే, పశ్చాత్తాపం చూపించే పాపులను క్షమించడానికి యెహోవా సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం తప్పుడు కోరికలకు లొంగిపోకుండా పోరాడాలని ఆయన కోరుకుంటున్నాడు. యెహోవా పేతురుతో ఇలా రాయించాడు, “ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి.”—2 పేతు. 3:17, 18.
దేవుని కృప బాధ్యతల్ని తెస్తుంది
18. దేవుడు మనపై కృప చూపిస్తున్నాడు కాబట్టి మనకు ఏ బాధ్యత ఉంది?
18 యెహోవా చూపిస్తున్న కృపకు మనమెంతో కృతజ్ఞులం. కాబట్టి మన ‘కృపావరాలను’ యెహోవాను ఘనపర్చడానికి, ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాలి. ఆ బాధ్యత మనపై ఉంది. మరి ఆ కృపావరాలను ఏవిధంగా ఉపయోగించవచ్చు? ఆ విషయం గురించి పౌలు ఇలా చెప్తున్నాడు, “మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక . . . పరిచర్యయైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగియుందము . . . కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను.” (రోమా. 12:6-8) దేవుడు మనపై కృప చూపిస్తున్నాడు కాబట్టి మనం పరిచర్యలో కష్టపడి పనిచేయాలి, ఇతరులకు బైబిల్లోని విషయాలు బోధించాలి, తోటి సహోదరసహోదరీల్ని ప్రోత్సహించాలి, మనల్ని బాధపెట్టేవాళ్లను క్షమించాలి. అలా చేయాల్సిన బాధ్యత మనపై ఉంది.
19. తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?
19 దేవుని కృప అనే దీవెన మనం పొందాం కాబట్టి ‘దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమివ్వడానికి’ చేయగలిగినదంతా చేయాలనే కోరిక మనలో కలగాలి. (అపొ. 20:24) ఆ విషయం గురించి తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.
^ [1] (2వ పేరా) ఈ ఆర్టికల్‌లో, అలాగే దీని తర్వాతి ఆర్టికల్‌లో ఉపయోగించిన “కృప” అనే పదం దేవుని అపారదయను సూచిస్తుంది. కారిస్ అనే గ్రీకు పదం ముఖ్యంగా ప్రీతికరమైన, మనోహరమైన దాన్ని సూచిస్తుంది. దయతో ఇచ్చే బహుమతిని లేదా దయతో ఇవ్వడాన్ని సూచించడానికి దీన్ని తరచూ ఉపయోగించారు. దేవుని అపారదయను సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగించినప్పుడు, తిరిగి ఇస్తారని ఆశించకుండా దేవుడు ఉదారంగా ఇచ్చే ఒక ఉచిత బహుమతిని వర్ణిస్తుంది. కాబట్టి ఈ పదం దేవుడు సమృద్ధిగా ఇవ్వడాన్ని, మనుషుల పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమను, దయను సూచిస్తుంది. ఈ గ్రీకు పదాన్ని “అనుగ్రహం,” “దయతో ఇచ్చిన బహుమతి” లాంటి మాటలతో కూడా అనువదించారు. ఒక వ్యక్తి కష్టపడకున్నా, అతనికి అర్హత లేకున్నా, కేవలం ఇచ్చే వ్యక్తి తన ఔదార్యంతో పురికొల్పబడి దీన్ని ఇస్తాడు.