కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 27

పాట 79 వాళ్లు స్థిరంగా ఉండేలా బోధిద్దాం

మన బైబిలు విద్యార్థులు సత్యంవైపు స్థిరంగా ఉండేలా చేద్దాం

మన బైబిలు విద్యార్థులు సత్యంవైపు స్థిరంగా ఉండేలా చేద్దాం

“విశ్వాసంలో స్థిరంగా ఉండండి, . . . బలవంతులు అవ్వండి.”1 కొరిం. 16:13.

ముఖ్యాంశం

సత్యం వైపు నిలబడాలంటే బైబిలు విద్యార్థులకు విశ్వాసం, ధైర్యం అవసరం. ఆ లక్షణాల్ని పెంచుకునేలా మనం బైబిలు విద్యార్థులకు ఎలా సహాయం చేయవచ్చో చూద్దాం.

1-2. (ఎ) సత్యంవైపు నిలబడడానికి కొంతమంది బైబిలు విద్యార్థులు ఎందుకు ఇబ్బంది పడుతుండవచ్చు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

 మీరొక యెహోవాసాక్షిగా అవ్వడానికి ఏ విషయాల గురించి కంగారుపడ్డారో ఒకసారి గుర్తుచేసుకోండి. బహుశా మీ ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు మిమ్మల్ని తిడతారేమో అని భయపడి ఉండొచ్చు. లేదా యెహోవా చెప్పేవన్నీ చేయడం మీవల్ల కాదని కంగారుపడి ఉండొచ్చు. అయితే, ఒకప్పుడు మీకు అనిపించినట్టే, ఇప్పుడు మీ బైబిలు విద్యార్థులకు కూడా అనిపించవచ్చు. కాబట్టి వాళ్లు సత్యం వైపు నిలబడడానికి ఎందుకు ఇబ్బందిపడుతున్నారో మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు.

2 ఇలాంటి భయాల వల్ల కొంతమంది యెహోవా సేవ చేయడానికి ముందుకు రాలేరని యేసుకు తెలుసు. (మత్త. 13:20-22) అయినాసరే, అలాంటి వాళ్ల మీద ఆయన ఆశ వదులుకోలేదు. బదులుగా, (1) యెహోవా సేవ చేయడానికి ఏవి అడ్డుగా ఉన్నాయో గుర్తించేలా, (2) యెహోవా మీద ప్రేమ పెంచుకునేలా, (3) యెహోవా సేవకే మొదటి స్థానం ఇవ్వడానికి మార్పులు చేసుకునేలా, (4) సవాళ్లను అధిగమించేలా, యేసు వాళ్లకు సహాయం చేశాడు. యేసులాగే మనం ఏం చేయవచ్చో, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకాన్ని ఉపయోగిస్తూ మన బైబిలు విద్యార్థులు సత్యంవైపు నిలబడడానికి ఎలా సహాయం చేయవచ్చో చూద్దాం.

అడ్డుగా ఉన్నవి గుర్తించేలా వాళ్లకు సహాయం చేయండి

3. యేసు శిష్యుడు అవ్వడానికి నీకొదేమును ఏది అడ్డుకుంది?

3 నీకొదేము గురించి ఒకసారి ఆలోచించండి. అతను యూదుల్లో బాగా పలుకుబడి ఉన్న నాయకుడు. అయితే, యేసు పరిచర్య మొదలుపెట్టిన ఆరు నెలలకే ఆయన దేవుని ప్రతినిధి అని నీకొదేముకు అర్థమైంది. (యోహా. 3:1, 2) కానీ యేసు శిష్యుడు అవ్వడానికి నీకొదేమును ఏదో అడ్డుకుంది. అందుకే, నీకొదేము యేసును రహస్యంగా కలిసేవాడు. అతను బహుశా, “యూదులకు భయపడి” ఉంటాడు. (యోహా. 7:13; 12:42) లేదా యేసుకు శిష్యునిగా మారితే, తనకున్న పేరు-పలుకుబడి-డబ్బు పోతాయని అతను భయపడి ఉంటాడు. a

4. తన నుండి యెహోవా ఏం ఆశిస్తున్నాడో అర్థంచేసుకునేలా నీకొదేముకు యేసు ఎలా సహాయం చేశాడు?

4 నీకొదేము ధర్మశాస్త్రంలో పండిపోయాడు. కానీ, యెహోవా తన నుండి ఏం ఆశిస్తున్నాడో అతనికి తెలీదు. అతను ఆ విషయం అర్థంచేసుకునేలా యేసు సహాయం చేశాడు. యేసు రాత్రిపూట కూడా నీకొదేముతో మాట్లాడడానికి సమయం ఇచ్చాడు. నీకొదేము తన శిష్యుడు అవ్వాలంటే, ఏమేమి చేయాలో కూడా యేసు చెప్పాడు. అవేంటంటే, తన పాపాల విషయంలో పశ్చాత్తాపపడాలి, నీళ్లలో బాప్తిస్మం తీసుకోవాలి, దేవుని కుమారుని మీద విశ్వాసం ఉంచాలి.—యోహా. 3:5, 14-21

5. యెహోవా సేవ మొదలుపెట్టడానికి ఏవేవి అడ్డుగా ఉన్నాయో గుర్తించేలా బైబిలు విద్యార్థులకు ఎలా సహాయం చేయవచ్చు?

5 మీరు స్టడీ చేస్తున్న వ్యక్తికి బైబిలు మీద మంచిపట్టు ఉండొచ్చు. కానీ యెహోవా సేవ మొదలుపెట్టడానికి వాళ్లకు ఏవేవి అడ్డుగా ఉన్నాయో వాళ్లు గుర్తించలేకపోవచ్చు. ఉదాహరణకు, ఉద్యోగానికి ఎక్కువ టైం ఇవ్వడం, లేదా యెహోవాసాక్షి అయితే ఇంట్లోవాళ్లు ఏమంటారో అని భయపడడం లాంటివి కావచ్చు. కాబట్టి వాళ్లకు మీ సహాయం అవసరం! మీరు కూడా యేసులాగే సమయం తీసుకొని వాళ్లకు సహాయం చేయాలి. స్టడీ చేస్తున్నప్పుడే కాకుండా, వేరే సమయాల్లో కూడా సరదాగా కలుస్తూ ఉండండి. బహుశా ఒక టీకో, కాఫీకో కలవండి. అలా కలిసినప్పుడు వాళ్లు మనసువిప్పి మాట్లాడగలుగుతారు. ఆ తర్వాత, మీ విద్యార్థి ఎక్కడెక్కడ మార్పులు చేసుకోవాలో ప్రేమగా చెప్పండి. అయితే, మీ కోసమో లేదా మీరు చెప్పారనో వాళ్లు మార్పులు చేసుకోవడం కాదుగానీ యెహోవా మీద ప్రేమతోనే మార్పులు చేసుకోవాలని గుర్తుచేయండి.

6. నేర్చుకున్నవి పాటించాలన్నంత ధైర్యం ఒక బైబిలు విద్యార్థికి ఎప్పుడు వస్తుంది? (1 కొరింథీయులు 16:13)

6 మీ బైబిలు విద్యార్థికి యెహోవా సహాయం చేస్తాడనే నమ్మకం కుదిరినప్పుడు తను నేర్చుకుంటున్న వాటిని పాటించడానికి ధైర్యం వస్తుంది. (1 కొరింథీయులు 16:13 చదవండి.) ఆ ధైర్యాన్ని మీరెలా నింపవచ్చో అర్థంచేసుకోవడానికి మిమ్మల్ని మీరు ఒక స్కూల్‌ టీచర్‌గా ఊహించుకోండి. మీ చిన్నప్పుడు మీకు ఏ టీచర్‌ అంటే బాగా ఇష్టం? బహుశా మీకు ఓపిగ్గా, మీ భుజం తట్టి, మీలో ధైర్యాన్ని నింపే టీచరే కదా! అదేవిధంగా, ఒక మంచి బైబిలు టీచర్‌ దేవుడు ఏం కోరుతున్నాడో మాత్రమే చెప్పడు గానీ, జీవితంలో అవసరమైన మార్పులు చేసుకోవాలంటే, యెహోవా సహాయం చేస్తాడనే ధైర్యాన్ని కూడా నింపుతాడు. మరి, మీ బైబిలు విద్యార్థుల్లో మీరు ఆ ధైర్యాన్ని ఎలా నింపవచ్చు?

యెహోవా మీద ప్రేమ పెంచుకునేలా వాళ్లకు సహాయం చేయండి

7. యెహోవా మీద ప్రేమ పెంచుకునేలా యేసు తన శిష్యులకు ఎలా సహాయం చేశాడు?

7 నేర్చుకున్నవాటిని పాటించాలంటే, తన శిష్యులకు దేవుని మీద ప్రేమ ఉండాలని యేసుకు తెలుసు. అందుకే, తమ పరలోక తండ్రి మీద ప్రేమ పెంచుకునే విషయాల్నే ఆయన తన శిష్యులకు చాలాసార్లు చెప్పాడు. ఉదాహరణకు, తన పిల్లలకు మంచివన్నీ ఇచ్చే ఒక తండ్రితో యేసు యెహోవాను పోల్చాడు. (మత్త. 7:9-11) యేసు మాటలు వింటున్న కొంతమందికి బహుశా అలాంటి ప్రేమగల తండ్రి ఉండకపోవచ్చు. కానీ, తప్పిపోయిన కుమారుని మీద తండ్రి చూపించిన ప్రేమ గురించి యేసు చెప్పినప్పుడు విన్నవాళ్లకు ఎలా అనిపించి ఉంటుందో ఊహించండి. ఈ భూమ్మీద ఉన్న తన పిల్లల మీద కూడా యెహోవాకు అలాంటి ప్రేమే ఉందని వాళ్లు అర్థంచేసుకుని ఉంటారు—లూకా 15:20-24.

8. యెహోవా మీద ప్రేమను పెంచుకునేలా బైబిలు విద్యార్థికి మీరెలా సాయం చేయవచ్చు?

8 మీ బైబిలు విద్యార్థి యెహోవా మీద ప్రేమ పెంచుకునేలా మీరు సహాయం చేయవచ్చు. ఎలాగంటే, స్టడీలో యెహోవా దేవునికి ఉన్న లక్షణాల గురించి చాలాసార్లు మాట్లాడండి. స్టడీ చేస్తున్న ప్రతీసారి మీ బైబిలు విద్యార్థి నేర్చుకుంటున్న విషయాల్లో ఎక్కడెక్కడ యెహోవా ప్రేమ కనిపిస్తుందో గుర్తించేలా సహాయం చేయండి. ఉదాహరణకు, విమోచన క్రయధనం గురించి మాట్లాడుతున్నప్పుడు, మీ విద్యార్థి మీద కూడా యెహోవాకు ప్రేమ ఉంది కాబట్టే ఆ గిఫ్ట్‌ ఇచ్చాడని అర్థమయ్యేలా చెప్పండి. (రోమా. 5:8; 1 యోహా. 4:10) యెహోవా తనను ప్రేమిస్తున్నాడని మీ బైబిలు విద్యార్థి అర్థంచేసుకున్నప్పుడు తనకు యెహోవా మీద ఉన్న ప్రేమ పెరుగుతుంది.—గల. 2:20.

9. ఏది మైఖేల్‌ జీవితాన్ని మార్చేసింది?

9 ఇండోనేషియాలో ఉన్న మైఖేల్‌ అనుభవాన్ని గమనించండి. వాళ్ల అమ్మానాన్న అతనికి చిన్నప్పుడే సత్యం నేర్పించారు. కానీ అతను బాప్తిస్మం తీసుకోలేదు. అతనికి 18 ఏళ్లు వచ్చేసరికి డ్రైవర్‌గా పనిచేయడానికి వేరే దేశానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. కానీ కుటుంబాన్ని ఇండోనేషియాలోనే వదిలేసి, వేరే దేశానికి వెళ్లిపోయాడు. ఈలోపు అతని భార్య, కూతురు బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టి, చక్కగా ప్రగతి సాధించారు. తర్వాత, మైఖేల్‌ వాళ్లమ్మ చనిపోయినప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ల నాన్నను చూసుకోవడానికి ఇండోనేషియాకు తిరిగి వచ్చాడు. వచ్చాక, బైబిలు స్టడీకి ఒప్పుకున్నాడు. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని 27వ పాఠంలో “ఎక్కువ తెలుసుకోండి” అనే భాగాన్ని చూస్తున్నప్పుడు మైఖేల్‌కు దుఃఖం తన్నుకొచ్చింది. కళ్లముందే కొడుకు అంత బాధ పడుతుంటే యెహోవాకు ఎలా అనిపించి ఉంటుందో ఆలోచించినప్పుడు మైఖేల్‌ కన్నీళ్లు ఆగలేదు! విమోచన క్రయధనం మీద అతను తన కృతజ్ఞతను పెంచుకొని, జీవితంలో ఎన్నో మార్పులు చేసుకొని, బాప్తిస్మం తీసుకున్నాడు.

యెహోవాకు మొదటిస్థానం ఇచ్చేలా మార్పులు చేసుకోవడానికి సహాయం చేయండి

10. యెహోవాకు మొదటిస్థానం ఇచ్చేలా యేసు తన శిష్యులకు ఎలా సహాయం చేశాడు? (లూకా 5:5-11) (చిత్రం కూడా చూడండి.)

10 యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని శిష్యులు వెంటనే గుర్తించినా, తమ జీవితంలో పరిచర్యకు మొదటి స్థానం ఇవ్వాలనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రం వాళ్లకు సహాయం అవసరమైంది. యేసు పేతురును, అంద్రెయను అన్నీ వదిలేసి, పూర్తికాలం తనను అనుసరించమని పిలిచే సమయానికి వాళ్లు ఆయనకు శిష్యులుగానే ఉన్నారు. (మత్త. 4:18, 19) అయితే వాళ్లు యాకోబు, యోహానులతో కలిసి చేపల వ్యాపారం చేసేవాళ్లు. ఆ వ్యాపారం బాగా సాగేది. (మార్కు 1:16-20) యేసు పిలిచిన తర్వాత పేతురు, అంద్రెయ “తమ వలలు వదిలేసి” అంటే చేపల వ్యాపారాన్ని ఆపేసి, పూర్తికాలం యేసుని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం తీసుకునే ముందు, వాళ్లు ఖచ్చితంగా తమ కుటుంబ అవసరాల్ని తీర్చేలా ఏదోక ఏర్పాటు చేసే ఉంటారు. అయితే, తమ జీవితంలో అంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి పేతురును, అంద్రెయను ఏది కదిలించింది? ఆరు నూరైనా నూరు ఆరైనా యెహోవా తమ అవసరాల్ని తీరుస్తాడని చూపించే ఒక అద్భుతాన్ని యేసు చేశాడు. అది చూశాక, యెహోవాకు మొదటిస్థానం ఇస్తే తమ అవసరాలన్నీ ఆయన తీరుస్తాడనే నమ్మకం శిష్యులకు కలిగి ఉంటుంది. అందుకే వాళ్లు ఆ నిర్ణయం తీసుకోగలిగారు.—లూకా 5:5-11 చదవండి.

తన శిష్యులు పరిచర్యకు మొదటి స్థానం ఇచ్చేలా యేసు సహాయం చేసిన దాన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (10వ పేరా చూడండి) c


11. మన విద్యార్థి విశ్వాసాన్ని పెంచడానికి మనం ఏం చేయవచ్చు?

11 మనం యేసులా అద్భుతాలు చేయలేకపోవచ్చు. కానీ మన జీవితంలో యెహోవాకు మొదటిస్థానం ఇవ్వడం వల్ల ఆయన ఎలా సహాయం చేశాడో చెప్పొచ్చు. ఉదాహరణకు, మీరు మొదటిసారి మీటింగ్స్‌కి వెళ్లాలనుకున్నప్పుడు యెహోవా ఎలా సహాయం చేశాడో గుర్తుందా? బహుశా మీరు మీ బాస్‌ దగ్గరికి వెళ్లి, ఇక నుండి ఓవర్‌ టైమ్‌ చేయనని చెప్పుంటారు. అలా యెహోవా ఆరాధనకే మొదటిస్థానం ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన ఎలా సహాయం చేశాడో, మీ విశ్వాసం ఎలా పెరిగిందో మీ విద్యార్థికి చెప్పండి.

12. (ఎ) మీ బైబిలు స్టడీకి వేర్వేరు బ్రదర్స్‌సిస్టర్స్‌ని ఎందుకు తీసుకెళ్లాలి? (బి) మీ విద్యార్థికి సహాయం చేయడానికి మీరు ఇంకా ఏం చేయవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.

12 యెహోవాకు మొదటిస్థానం ఇవ్వడానికి సంఘంలో ఉన్న బ్రదర్స్‌-సిస్టర్స్‌, ఎలాంటి మార్పులు చేసుకున్నారో కూడా తెలుసుకుంటే మీ విద్యార్థికి చాలా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి వేర్వేరు కుటుంబ పరిస్థితుల్లో పెరిగిన, వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చిన బ్రదర్స్‌సిస్టర్స్‌ని స్టడీకి తీసుకెళ్లండి. వాళ్లు సత్యంలోకి ఎలా వచ్చారో, యెహోవాకు మొదటిస్థానం ఇవ్వడానికి ఏమేం చేశారో విద్యార్థికి చెప్పమని అడగండి. అంతేకాదు, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం నుండి స్టడీ చేస్తున్నప్పుడు, “ఎక్కువ తెలుసుకోండి” భాగంలో లేదా “ఇవి కూడా చూడండి” భాగంలో ఉన్న వీడియోల్ని సమయం తీసుకొని మీ విద్యార్థితో కలిసి చూడండి. ఉదాహరణకు 37వ పాఠాన్ని చర్చిస్తున్నప్పుడు యెహోవా మన అవసరాలను చూసుకుంటాడు అనే వీడియో చూసి, చర్చించండి. ఆ తర్వాత తమ జీవితంలో యెహోవాకు మొదటిస్థానం ఇవ్వడానికి మీ విద్యార్థి ఏమేం చేయవచ్చో చెప్పండి.

సవాళ్లను దాటేలా వాళ్లకు సహాయం చేయండి

13. వ్యతిరేకతను ఎదుర్కొనేలా యేసు తన శిష్యులకు ఎలా సహాయం చేశాడు?

13 తన శిష్యులకు బయటివాళ్ల నుండే కాదు సొంత వాళ్లనుండి కూడా వ్యతిరేకత వస్తుందని యేసు చాలాసార్లు చెప్పాడు. (మత్త. 5:11; 10:22, 36) తన పరిచర్య ముగింపులో, వ్యతిరేకులు తన శిష్యుల్ని చంపడానికి కూడా వెనకాడరని ఆయన హెచ్చరించాడు. (మత్త. 24:9; యోహా. 15:20; 16:2) అందుకే, పరిచర్యలో ఆచితూచి అడుగులు వేయమని ఆయన చెప్పాడు. వ్యతిరేకించేవాళ్లకు ఎదురెళ్లకుండా, కాస్త తెలివిగా పరిచర్యను ముందుకు తీసుకెళ్లమని సలహా ఇచ్చాడు.

14. వ్యతిరేకత వచ్చినప్పుడు మన విద్యార్థి షాక్‌ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? (2 తిమోతి 3:12)

14 బహుశా తోటి ఉద్యోగుల నుండి, ఫ్రెండ్స్‌ నుండి, బంధువుల నుండి వ్యతిరేకత రావచ్చని మీ విద్యార్థికి చెప్పండి. వాళ్లు ఏమేమి అనే అవకాశం ఉందో వివరించండి. (2 తిమోతి 3:12 చదవండి.) మీ విద్యార్థి, నేర్చుకున్నవి పాటించడం వల్ల తనతో పనిచేసేవాళ్లు ఎగతాళి చేయవచ్చు, దగ్గరి బంధువులే సూటిపోటి మాటలు అనొచ్చు. కాబట్టి వీటి గురించి మన విద్యార్థికి ఎంత త్వరగా చెప్తే, అంత మంచిది! అలా చేస్తే, వ్యతిరేకత వచ్చినప్పుడు షాక్‌ అవ్వకుండా ఏం చెప్పాలో, ఏం చేయాలో విద్యార్థికి తెలుస్తుంది.

15. మీ విద్యార్థికి కుటుంబం నుండి వ్యతిరేకత వస్తే ఏం చేసేలా సహాయం చేయాలి?

15 మీ విద్యార్థిని ఇంట్లోవాళ్లు వ్యతిరేకిస్తే, వాళ్ల కోపం వెనుకున్న కారణాన్ని చూడమని చెప్పండి. బహుశా మీ విద్యార్థి మోసపోయాడనో లేదా యెహోవాసాక్షులు మంచోళ్లు కాదనో వాళ్లు అనుకుంటుండవచ్చు. ఆఖరికి, యేసుకు కూడా తన ఇంట్లోవాళ్ల నుండి వ్యతిరేకత వచ్చిందని గుర్తుచేయండి. (మార్కు 3:21; యోహా. 7:5) కాబట్టి బయట వాళ్లతోనే కాదు, ఇంట్లోవాళ్లతో కూడా కాస్త ఓపిగ్గా, తెలివిగా మసులుకోమని మీ విద్యార్థికి నేర్పించండి.

16. విద్యార్థి తన నమ్మకాల గురించి కాస్త తెలివిగా మాట్లాడేలా మీరు ఎలా సహాయం చేయవచ్చు?

16 ఒకవేళ బంధువులు, ఇంట్లోవాళ్లు ఆసక్తి చూపిస్తే, అన్ని విషయాలు ఒకేసారి చెప్పి, వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేయకపోవడం మంచిదని మీ విద్యార్థికి చెప్పండి. ఒకేసారి మొత్తం చెప్పేస్తే, బంధువులు విసుక్కోవచ్చు, మళ్లీ వినడానికి ఇష్టపడకపోవచ్చు. కాబట్టి వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు తన నమ్మకాల గురించి రెండు, మూడు ముక్కల్లో వివరించవచ్చు. అలా చేస్తే, భవిష్యత్తులో వాళ్లు ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి ఇష్టపడవచ్చు. (కొలొ. 4:6) బహుశా, jw.org వెబ్‌సైట్‌ చూడమని వాళ్లకు చెప్పొచ్చు. అప్పుడు వాళ్లకు కుదిరిన సమయంలో యెహోవాసాక్షుల గురించి ఎక్కువ తెలుసుకోగలుగుతారు.

17. యెహోవాసాక్షుల గురించి ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు, మీ విద్యార్థి జవాబు చెప్పేలా ఎలా సహాయం చేయవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

17 మీ బైబిలు విద్యార్థి నేర్చుకుంటున్న వాటిని బట్టి బంధువులు, తోటి ఉద్యోగులు కొన్ని ప్రశ్నలు అడగొచ్చు. కాబట్టి jw.orgలో “తరచూ అడిగే ప్రశ్నలు” అనే భాగాన్ని ఉపయోగించి, మీ బైబిలు విద్యార్థి చక్కగా ఒకట్రెండు మాటల్లో జవాబు ఇచ్చేలా సహాయం చేయండి. (2 తిమో. 2:24, 25) అంతేకాదు, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో ప్రతీ పాఠం చివర్లో ఉన్న “కొంతమంది ఇలా అంటారు” అనే భాగాన్ని అస్సలు మర్చిపోకండి. నేర్చుకున్నదాన్ని బట్టి, ఏ విషయాలను నమ్ముతున్నారో సొంత మాటల్లో వివరించమని మీ విద్యార్థిని అడగండి. వాళ్లు వివరిస్తున్నప్పుడు ఇంకా చక్కగా చెప్పడానికి ఏమైనా సలహాలు ఇవ్వాల్సి వస్తే, మొహమాటపడకండి. అలా మీరు వాళ్లతో మాట్లాడుతూ ఉంటే భయం, బెదురు లేకుండా వాళ్లు తమ నమ్మకాల గురించి ధైర్యంగా వివరించగలుగుతారు.

మీ బైబిలు విద్యార్థి నేర్చుకున్నవి వేరేవాళ్లకు చెప్పడానికి ముందు, మీరు వాళ్లతో ప్రాక్టీస్‌ చేయండి (17వ పేరా చూడండి) d


18. విద్యార్థి పరిచర్య మొదలుపెట్టేలా మీరెలా సహాయం చేయవచ్చు? (మత్తయి 10:27)

18 ప్రజలందరికీ మంచివార్త ప్రకటించాలని యేసు తన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు. (మత్తయి 10:27 చదవండి.) కాబట్టి బైబిలు విద్యార్థులు కూడా ప్రకటన పనిని చేయాలి. విద్యార్థులు ఎంత త్వరగా తమ నమ్మకాల గురించి వేరేవాళ్లకు చెప్తే, అంత త్వరగా యెహోవా మీద ఆధారపడగలుగుతారు. మరి, పరిచర్య చేసేలా విద్యార్థికి మీరెలా సహాయం చేయవచ్చు? ఒకవేళ మీ ప్రాంతంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఉంటుందని తెలిస్తే, మీ విద్యార్థి పబ్లిషర్‌ అవ్వడానికి ఏమేమి చేయవచ్చో ఆలోచించమని చెప్పండి. ప్రత్యేక ప్రచార కార్యక్రమం నెలలో పరిచర్య చేయడం కాస్త తేలిగ్గా ఉంటుందని కూడా చెప్పండి. అంతేకాదు, వారం మధ్యలో జరిగే మీటింగ్‌లో నియామకాలు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోమని చెప్పండి. అలా నెమ్మదిగా ప్రదర్శనలు చేస్తూ ఉంటే, తన నమ్మకాల గురించి ఇంకా బాగా వివరించడం నేర్చుకుంటారు.

మీ విద్యార్థిని నమ్మండి

19. యేసు తన శిష్యుల మీద ఎలా నమ్మకం చూపించాడు? మనం కూడా ఏం చేయాలి?

19 యేసు పరలోకానికి వెళ్లే ముందు, తన శిష్యులు తనతోపాటు మళ్లీ కలిసి ఉంటారు అన్నాడు. శిష్యులందరూ పరలోకానికి వెళ్తారని యేసు మాటల అర్థం. కానీ ఆ విషయం అక్కడున్న శిష్యులకు అర్థం కాలేదు. (యోహా. 14:1-5, 8) శిష్యులు కొన్ని విషయాలు అర్థంచేసుకోవాలంటే సమయం పడుతుందని ఆయనకు తెలుసు. ఉదాహరణకు, వాళ్లకున్న పరలోక నిరీక్షణ గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి వాళ్లకు సమయం పడుతుంది. (యోహా. 16:12) అయితే యేసు వాళ్లకున్న సందేహాల్ని, అనుమానాల్ని చూడలేదు. కానీ, వాళ్లు యెహోవాను సంతోషపెడతారని ఆయన నమ్మాడు. మనం కూడా మన విద్యార్థి యెహోవాను సంతోషపెట్టగలడని నమ్ముతున్నట్టు చూపించాలి.

విద్యార్థులు ఎంత త్వరగా తమ నమ్మకాల గురించి వేరేవాళ్లకు చెప్తే, అంత త్వరగా యెహోవా మీద ఆధారపడగలుగుతారు.

20. శారా, గ్రేస్‌ అనే బైబిలు విద్యార్థి మీద ఎలా నమ్మకం చూపించింది?

20 మన విద్యార్థి ఏదోకరోజు సరైంది చేస్తాడనే నమ్మకంతో మనం ఉండొచ్చు. మలావీలో ఉంటున్న శారాకి b వచ్చిన అనుభవం గమనించండి. ఆమె గ్రేస్‌ అనే ఒక కాథలిక్‌ అమ్మాయితో ఎల్లప్పుడు సంతోషంగా జీవించండి! పుస్తకం నుండి స్టడీ మొదలుపెట్టింది. స్టడీలో 14వ పాఠం జరుగుతున్నప్పుడు, “విగ్రహాలు ఉపయోగించడం గురించి ఏమంటావ్‌?” అని శారా గ్రేస్‌ని అడిగింది. అప్పుడు గ్రేస్‌ ముఖం చిట్లించుకొని, “అందులో ఏముంది, ఎవరి ఇష్టం వాళ్లది” అంది. ఈ దెబ్బతో ఇక బైబిలు స్టడీ ఆగిపోతుందేమో అని శారా అనుకుంది. కానీ ఏదోకరోజు గ్రేస్‌ ఆ విషయాన్ని అర్థంచేసుకుంటుందనే నమ్మకంతో శారా ఓపిగ్గా స్టడీ కొనసాగించింది. కొన్ని నెలల తర్వాత, 34వ పాఠం జరుగుతున్నప్పుడు శారా ఇలా అడిగింది: “ఇప్పటివరకు బైబిలు గురించి, యెహోవా గురించి నువ్వు నేర్చుకున్న దాన్నిబట్టి నీకు ఏమనిపిస్తుంది?” గ్రేస్‌ ఏం చెప్పిందో గుర్తు చేసుకుంటూ శారా ఇలా అంది: “ఆమె చాలా మంచిమంచి విషయాలు చెప్పింది. అందులో ఒకటేంటంటే, దేవుడు అసహ్యించుకునే దేన్నీ యెహోవాసాక్షులు చెయ్యరు అని అంది.” ఆ తర్వాత కొంతకాలానికే గ్రేస్‌ విగ్రహాల్ని తీసేసింది, బాప్తిస్మం తీసుకుంది.

21. సత్యం వైపు నిలబడాలనే మన విద్యార్థి నిర్ణయానికి మనం ఎలా ఆజ్యం పోయవచ్చు?

21 బైబిలు విద్యార్థి “పెరిగేలా” లేదా ఎదిగేలా చేసేది యెహోవాయే అయినా, వాళ్లకు సహాయం చేయాల్సిన బాధ్యత మనకుంది. (1 కొరిం. 3:7) యెహోవా మీద వాళ్లకున్న ప్రేమను పెంచుకునేలా మనం సహాయం చేయాలి. ఆ ప్రేమను బట్టే, తమ జీవితంలో ఎవరు ముఖ్యమో ఆలోచించుకొని, మార్పులు చేసుకునేలా కూడా మనం ప్రోత్సహించాలి. సవాళ్లు వచ్చినప్పుడు యెహోవావైపు ఎలా చూడాలో నేర్పించాలి. మనకు బైబిలు విద్యార్థి మీద నమ్మకం ఉందని చూపించినప్పుడు, యెహోవాకు నచ్చినట్టు బ్రతకాలనే, సత్యంవైపు నిలబడాలనే వాళ్ల నిర్ణయానికి ఆజ్యం పోసినవాళ్లమౌతాం!

పాట 55 శత్రువులకు భయపడకండి!

a యేసును కలిసిన రెండున్నర సంవత్సరాల తర్వాత కూడా నీకొదేము యూదుల మహాసభలో సభ్యునిగానే ఉన్నాడు. (యోహా. 7:45-52) నీకొదేము యేసు చనిపోయాకే శిష్యుడు అయ్యాడని కొంతమంది చరిత్రకారులు నమ్ముతున్నట్టు ఒక రెఫరెన్స్‌ చెప్తుంది.—యోహా. 19:38-40.

b కొన్ని పేర్లు మార్చాం.

c చిత్రాల వివరణ: యేసును అనుసరించడానికి పేతురు అలాగే చేపలు పట్టుకునే మిగతావాళ్లు తమ వ్యాపారాన్ని వదిలేస్తున్నారు.

d చిత్రం వివరణ : ఒక సిస్టర్‌ బైబిలు స్టడీలో తన విద్యార్థిని ప్రీచింగ్‌ కోసం సిద్ధం చేస్తుంది.