కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 24

దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న తర్కాల్ని తిప్పికొట్టండి!

దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న తర్కాల్ని తిప్పికొట్టండి!

“దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న తర్కాల్ని, ప్రతీ ఆటంకాన్ని తిప్పికొడుతున్నాం.”—2 కొరిం. 10:5.

పాట 124 ఎల్లప్పుడూ యథార్థంగా ఉండండి

ఈ ఆర్టికల్‌లో . . . a

 1. అభిషిక్త క్రైస్తవులను పౌలు ఏమని హెచ్చరించాడు?

 “ఈ వ్యవస్థ మిమ్మల్ని మలచనివ్వకండి” అని అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. (రోమా. 12:2) ఆయన ఆ మాటల్ని తొలి క్రైస్తవులకు చెప్పాడు. దేవునికి సమర్పించుకొని, పవిత్రశక్తితో అభిషేకించబడిన ఆ స్త్రీపురుషులను ఆయన ఎందుకలా హెచ్చరించాడు?—రోమా. 1:7.

2-3. మనల్ని యెహోవాకు దూరం చేయడానికి సాతాను ఎలా ప్రయత్నిస్తున్నాడు? బలంగా పాతుకుపోయిన ఆలోచనల్ని ఎలా తీసేసుకోవచ్చు?

2 సాతాను లోకంలోని హానికరమైన ఆలోచనలు కొంతమంది క్రైస్తవుల మీద ప్రభావం చూపిస్తున్నాయని పౌలు ఆందోళనపడ్డాడు. (ఎఫె. 4:17-19) మనపై కూడా వాటి ప్రభావం పడే అవకాశం ఉంది. మనల్ని ఎలాగైనా యెహోవాకు దూరం చేయాలని ఈ వ్యవస్థకు దేవుడైన సాతాను రకరకాల పన్నాగాలు పన్నుతున్నాడు. ఉదాహరణకు, మనకు పేరుప్రఖ్యాతులు సంపాదించాలనే కోరిక ఉంటే, సాతాను దాన్ని వాడుకుంటాడు. కొన్నిసార్లు, మన ఆలోచనల్ని తనకు అనుగుణంగా మలచుకోవడానికి మన నేపథ్యాన్ని, సంస్కృతిని, చదువును కూడా ఉపయోగించుకుంటాడు.

3 మన మనసులో ‘బలమైన కోటల్లా’ పాతుకుపోయిన ఆలోచనల్ని తీసేసుకోవడం సాధ్యమేనా? (2 కొరిం. 10:4) పౌలు ఏమని జవాబిస్తున్నాడో గమనించండి: “దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న తర్కాల్ని, ప్రతీ ఆటంకాన్ని తిప్పికొడుతున్నాం. అలాగే ప్రతీ ఆలోచనను జయించి, దాన్ని క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాం.” (2 కొరిం. 10:5) అవును, మనం యెహోవా సహాయంతో తప్పుడు తర్కాల్ని తిప్పికొట్టగలం. డాక్టరు ఇచ్చే మందులు ఎలాగైతే జబ్బు తీవ్రతను తగ్గించగలవో, అలాగే దేవుని వాక్యం సాతాను లోక ప్రభావం నుండి మనల్ని కాపాడగలదు.

‘మీ మనసు మార్చుకోండి’

 4. మనం సత్యాన్ని అంగీకరించిన కొత్తలో ఎలాంటి మార్పులు చేసుకున్నాం?

4 మీరు సత్యాన్ని అంగీకరించి, యెహోవాను ఆరాధించాలని నిర్ణయించుకున్న కొత్తలో ఎలాంటి మార్పులు చేసుకున్నారో ఆలోచించండి. చాలామందిమి చెడ్డ పనుల్ని మానేశాం. (1 కొరిం. 6:9-11) వాటిని మానేయడానికి సహాయం చేసిన యెహోవాకు ఎంత కృతజ్ఞులమో కదా!

 5. రోమీయులు 12:2 ప్రకారం మనం చేయాల్సిన రెండు పనులు ఏంటి?

5 మనం ఎప్పటికీ మార్పులు చేసుకుంటూనే ఉండాలి. మనం బాప్తిస్మం తీసుకోక ముందు చేసిన గంభీరమైన పాపాల్ని ఇప్పుడు మానేసి ఉండవచ్చు. అయితే వాటిని మళ్లీ చేయాలనే ప్రలోభానికి గురిచేసే ప్రతీదానికి దూరంగా ఉండేందుకు కృషి చేస్తూనే ఉండాలి. ఏవిధంగా? పౌలు ఇలా జవాబిస్తున్నాడు: “ఈ వ్యవస్థ మిమ్మల్ని మలచనివ్వకండి. బదులుగా మీ మనసు మార్చుకొని మీ వ్యక్తిత్వంలో మార్పు తెచ్చుకోండి.” (రోమా. 12:2) అంటే మనం రెండు పనులు చేయాలి. మొదటిది, ఈ లోకం మనల్ని ‘మలచకుండా’ చూసుకోవాలి. రెండవది, మన ఆలోచనా విధానం మార్చుకొని ‘వ్యక్తిత్వంలో మార్పు’ తెచ్చుకోవాలి.

 6. మత్తయి 12:43-45⁠లోని యేసు మాటలు మనకు ఏ పాఠాన్ని నేర్పిస్తున్నాయి?

6 పౌలు కేవలం పైపైన కనిపించే మార్పు గురించి మాట్లాడడం లేదు. (“ నిజమైన మార్పా లేక మారువేషమా?” అనే బాక్సు చూడండి.) మనం ఆలోచనల్ని, భావాల్ని, కోరికల్ని అంటే మన మనసును మార్చుకోవాలి. కాబట్టి మనందరం ఈ ప్రాముఖ్యమైన ప్రశ్న గురించి ఆలోచించాలి: ‘నేను క్రీస్తును అనుకరిస్తున్నట్లు నటిస్తున్నానా లేక నిజంగా నా వ్యక్తిత్వంలో మార్పులు చేసుకుంటున్నానా?’ మత్తయి 12:43-45 వచనాల్లో యేసు మనకు ఒక ప్రాముఖ్యమైన పాఠం నేర్పిస్తున్నాడు. (చదవండి.) అదేంటంటే, మన మనసు నుండి తప్పుడు ఆలోచనల్ని కేవలం తీసేసుకోవడమే కాదు, వాటి స్థానంలో దేవుడు ఇష్టపడే ఆలోచనల్ని నింపాలి.

‘కొత్త ఆలోచనా విధానాన్ని అలవర్చుకోండి’

 7. మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలంటే ఏం చేయాలి?

7 మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం సాధ్యమేనా? దేవుని వాక్యం ఇలా చెప్తుంది: “మీరు కొత్త ఆలోచనా విధానాన్ని అలవర్చుకుంటూ ఉండాలి. నిజమైన నీతికి, విశ్వసనీయతకు అనుగుణంగా దేవుని ఇష్టప్రకారం సృష్టించబడిన కొత్త వ్యక్తిత్వాన్ని మీరు అలవర్చుకోవాలి.” (ఎఫె. 4:23, 24) మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం తేలిక కాకపోయినా అది సాధ్యమే. అందుకోసం మనం తప్పుడు కోరికల్ని అణచుకొని, చెడ్డ పనుల్ని మానేస్తే సరిపోదు. బదులుగా మన “ఆలోచనా విధానాన్ని” అంటే మన కోరికలు, అలవాట్లు, ఉద్దేశాలు మార్చుకోవాలి. దానికోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉండాలి.

8-9. మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకోవడం అవసరమని ఒక సహోదరుని అనుభవం ఎలా చూపించింది?

8 గతంలో క్రూర స్వభావం కలిగిన ఒక సహోదరుని అనుభవం పరిశీలించండి. ఆయన తాగుబోతుతనాన్ని, గొడవల్ని మానేసి చివరికి బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయనలో వచ్చిన మార్పు వల్ల ఆ ఊళ్లో యెహోవాకు ఘనత వచ్చింది. బాప్తిస్మం తీసుకుని ఎంతోకాలం గడవకముందే ఒకరోజు సాయంత్రం ఆయనకు అనుకోని పరీక్ష ఎదురైంది. ఆయన ఇంటికి బాగా తాగిన ఒక వ్యక్తి వచ్చి, తనతో గొడవపడమని రెచ్చగొట్టాడు. మొదట మన సహోదరుడు కోపాన్ని అణచుకున్నాడు. కానీ ఆ వ్యక్తి యెహోవాను దూషించగానే ఆయన కోపం కట్టలు తెంచుకుంది, దాంతో వెళ్లి అతన్ని బాగా కొట్టాడు. ఆ సహోదరుడు ఎందుకలా ప్రవర్తించాడు? ఎందుకంటే, ఆయన బైబిలు చెప్తున్న విషయాలు నేర్చుకున్నాక గొడవలకు దిగే స్వభావాన్ని అణచుకున్నాడే గానీ తన ఆలోచనా విధానాన్ని మార్చుకోలేకపోయాడు.

9 కానీ ఆయన తన కృషిని ఆపలేదు. (సామె. 24:16) సంఘపెద్దల సహాయంతో మార్పులు చేసుకుంటూ వచ్చాడు. కొంతకాలానికి ఆయన ఒక సంఘపెద్ద అయ్యాడు. ఒక రోజు సాయంత్రం రాజ్యమందిరం బయట, ఆయనకు కొన్ని సంవత్సరాల క్రితం ఎదురైనలాంటి పరీక్షే మళ్లీ ఎదురైంది. బాగా తాగిన వ్యక్తి ఒక సంఘపెద్దను కొట్టబోయాడు. ఈసారి కూడా ఆయన కోపం కట్టలు తెంచుకుందా? లేదు. ఆయన ఆ తాగుబోతుతో ప్రశాంతంగా, మర్యాదగా మాట్లాడి శాంతింపజేశాడు, ఇంటికి వెళ్లడానికి అతనికి సహాయం చేశాడు. ఆయన ఎందుకు ఇలా ప్రవర్తించాడు? ఎందుకంటే ఆయన తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. ఆయన నిజంగా శాంతపరునిగా, వినయస్థునిగా మారాడు. ఆ మార్పు యెహోవాకు స్తుతి తీసుకొచ్చింది.

10. మన వ్యక్తిత్వంలో మార్పులు చేసుకోవాలంటే మనం ఏం చేయాలి?

10 ఇలాంటి మార్పులు రాత్రికి రాత్రే లేదా వాటంతటవే రావు; చాలా సంవత్సరాలపాటు “శతవిధాలా కృషి” చేయాల్సి రావచ్చు. (2 పేతు. 1:5) దానర్థం మనం ఎంతోకాలంగా యెహోవాను సేవిస్తున్నప్పటికీ, మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలంటే తీవ్రంగా కృషి చేయాలి. అందుకు సహాయపడే కొన్ని పనుల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

మన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చుకోవచ్చు?

11. మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడానికి ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది?

11 మనం చేయాల్సిన మొదటి ప్రాముఖ్యమైన పని, ప్రార్థన. “దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము” అని కీర్తనకర్తలాగే మనమూ ప్రార్థించాలి. (కీర్త. 51:10) మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించి, సహాయం చేయమని యెహోవాను అడగాలి. యెహోవా సహాయం చేస్తాడని మనం ఎందుకు నమ్మవచ్చు? యెహెజ్కేలు కాలంలోని మొండి ఇశ్రాయేలీయుల గురించి యెహోవా చేసిన వాగ్దానం మనలో ప్రోత్సాహాన్ని నింపుతుంది. ఆయన ఇలా వాగ్దానం చేశాడు: ‘నేను వాళ్లకు ఒకే హృదయాన్ని, కొత్త మనోవైఖరిని ఇస్తాను; . . . వాళ్లకు మాంసం గుండె [అంటే, దేవుని నిర్దేశానికి స్పందించే హృదయం] ఇస్తాను.’ (యెహె. 11:19, NW అధస్సూచి.) అవును, ఆలోచనా విధానాన్ని మార్చుకునేలా యెహోవా ఇశ్రాయేలీయులకు సహాయం చేయాలనుకున్నాడు. మనకు కూడా సహాయం చేయాలనుకుంటున్నాడు.

12-13. (ఎ) కీర్తన 119:59 ప్రకారం మనం దేని గురించి ధ్యానించాలి? (బి) మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?

12 మనం చేయాల్సిన రెండో ప్రాముఖ్యమైన పని, ధ్యానించడం. ప్రతీరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం ఎలాంటి ఆలోచనల్ని, భావాల్ని మార్చుకోవాలో ధ్యానించడానికి లేదా లోతుగా ఆలోచించడానికి కొంచెం సమయం తీసుకోవాలి. (కీర్తన 119:59 చదవండి; హెబ్రీ. 4:12; యాకో. 1:25) మన ఆలోచనల మీద, భావాల మీద లోక ప్రభావం పడిందేమో పరిశీలించుకోవాలి. నిజాయితీగా మన బలహీనతల్ని గుర్తించాలి, వాటిని తీసేసుకోవడానికి గట్టిగా కృషిచేయాలి.

13 ఉదాహరణకు ఇలా ప్రశ్నించుకోండి: ‘నా హృదయంలో ఈర్ష్య లేదా అసూయకు సంబంధించిన జాడలు ఏమైనా ఉన్నాయా?’ (1 పేతు. 2:1) ‘నా నేపథ్యాన్ని, చదువును, ఆర్థిక స్తోమతను చూసుకుని గర్వపడుతున్నానా?’ (సామె. 16:5) ‘నాలాంటి స్తోమత లేదని, వేరే జాతికి చెందిన వాళ్లని ఇతరులను చిన్నచూపు చూస్తున్నానా?’ (యాకో. 2:2-4) ‘ఈ సాతాను లోకంలో ఉన్నవాటిని ఇష్టపడుతున్నానా?’ (1 యోహా. 2:15-17) ‘అనైతికత, హింస ఉన్న వినోదం అంటే నాకు ఇష్టమా?’ (కీర్త. 97:10; 101:3; ఆమో. 5:15) ఈ ప్రశ్నలు, మీరు ఏయే విషయాల్లో మార్పులు చేసుకోవాలో గుర్తించడానికి సహాయం చేస్తాయి. ‘బలమైన కోటల్లాంటి’ తప్పుడు ఆలోచనల్ని తీసేసుకున్నప్పుడు మన పరలోక తండ్రిని సంతోషపెడతాం.—కీర్త. 19:14.

14. మనం మంచి స్నేహితుల్ని ఎందుకు ఎంపిక చేసుకోవాలి?

14 మనం చేయాల్సిన మూడో ముఖ్యమైన పని, మంచి స్నేహితుల్ని ఎంపిక చేసుకోవడం. మనం గుర్తించినా, గుర్తించకపోయినా స్నేహితుల ప్రభావం మన మీద చాలా ఉంటుంది. (సామె. 13:20) మన తోటి ఉద్యోగస్థులు లేదా విద్యార్థులు మనం దేవుని ఆలోచనను వృద్ధి చేసుకునేలా సహాయం చేయరు. కానీ మన మీటింగ్స్‌లో మనకు మంచి స్నేహితులు దొరుకుతారు. మనం “ప్రేమ చూపించడానికి, మంచిపనులు చేయడానికి” కావాల్సిన ప్రోత్సాహాన్ని, పురికొల్పును అక్కడ పొందుతాం.—హెబ్రీ. 10:24, 25.

‘మీ విశ్వాసం స్థిరంగా ఉండాలి’

15-16. సాతాను మన ఆలోచనా విధానాన్ని మార్చడానికి ఎలా ప్రయత్నిస్తాడు?

15 సాతాను మన ఆలోచనా విధానాన్ని పాడుచేయడమే పనిగా పెట్టుకున్నాడని గుర్తుంచుకోండి. బైబిలు సత్యం మన ఆలోచనల్ని దేవుని ఇష్టానికి తగ్గట్టు మారుస్తుందని సాతానుకు తెలుసు. అందుకే, రకరకాల బోధల్ని ఉపయోగించి మన ఆలోచనల్ని పాడుచేయడానికి, సందేహాలు పుట్టించడానికి ప్రయత్నిస్తాడు.

16 సాతాను ఏదెను తోటలో, “ఇది నిజమా? . . . దేవుడు చెప్పెనా?” అని హవ్వను అడిగిన ప్రశ్ననే ఇప్పటికీ అడుగుతున్నాడు. (ఆది. 3:1) నేడు, మన నమ్మకాలపై సందేహం కలిగించే ఇలాంటి ప్రశ్నల్ని మనం తరచూ వింటుంటాం: ‘అబ్బాయిలు-అబ్బాయిల్ని, అమ్మాయిలు-అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడానికి దేవుడు నిజంగా అనుమతించట్లేదా? మీరు క్రిస్మస్‌, పుట్టిన రోజులు జరుపుకోవడం దేవునికి నిజంగా ఇష్టంలేదా? మీరు రక్తం ఎక్కించుకోకూడదని మీ దేవుడు నిజంగా చెప్తున్నాడా? బహిష్కరించబడిన మీ ప్రియమైనవాళ్లతో సహవసించకూడదని ప్రేమగల దేవుడు నిజంగా చెప్తున్నాడా?’

17. ఎవరైనా మన నమ్మకాల్ని ప్రశ్నిస్తే ఏం చేయాలి? అలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందని కొలొస్సయులు 2:6, 7 వచనాలు చెప్తున్నాయి?

17 మన నమ్మకాల మీద మనకు విశ్వాసం ఉండాలి. మన నమ్మకాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోకపోతే, మనం వాటిని సందేహించే ప్రమాదం ఉంది. ఆ సందేహాలు మన ఆలోచనా విధానాన్ని పాడుచేసి, మనల్ని విశ్వాసం కోల్పోయేలా చేస్తాయి. మరి మనం ఏం చేయాలి? మన వ్యక్తిత్వాన్ని మార్చుకుని “మంచిదైన, ఆమోదయోగ్యమైన, సంపూర్ణమైన దేవుని ఇష్టమేమిటో” పరీక్షించి తెలుసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. (రోమా. 12:2) బైబిల్ని, బైబిలు ఆధారిత ప్రచురణల్ని క్రమంగా అధ్యయనం చేసినప్పుడు అందులోని సత్యాలు ఎంత ఖచ్చితమైనవో పరీక్షించి తెలుసుకుంటాం. అప్పుడు యెహోవా ప్రమాణాలు సరైనవని మనకు నమ్మకం కుదురుతుంది. దానివల్ల, లోతుగా వేళ్లూనుకున్న చెట్టులా మనం ‘విశ్వాసంలో స్థిరంగా ఉంటాం.’—కొలొస్సయులు 2:6, 7 చదవండి.

18. సాతాను లోక ప్రభావం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏం చేయాలి?

18 మీ విశ్వాసాన్ని మీరే కాపాడుకోవాలి. కాబట్టి, మీరు కొత్త ఆలోచనా విధానాన్ని అలవర్చుకుంటూ ఉండండి. ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండండి, పవిత్రశక్తి ఇవ్వమని యెహోవాను వేడుకోండి. లోతుగా ధ్యానించండి, మీ ఆలోచనల్ని-ఉద్దేశాల్ని పరీక్షించుకుంటూ ఉండండి. మంచి స్నేహితుల్ని ఎంచుకోండి, మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి సహాయం చేసేవాళ్లతో స్నేహం చేయండి. ఇవన్నీ చేయడం ద్వారా, సాతాను లోక ప్రభావం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. అంతేకాదు “దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న తర్కాల్ని, ప్రతీ ఆటంకాన్ని” తిప్పికొడతారు.—2 కొరిం. 10:5.

పాట 50 నా సమర్పణ ప్రార్థన

a మన నేపథ్యం, సంస్కృతి, చదువు మన ఆలోచనా విధానంపై ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు తప్పుడు ఆలోచనా విధానం మన వ్యక్తిత్వంలో లోతుగా పాతుకుపోయిందని మనకు అనిపించవచ్చు. దాన్ని ఎలా మార్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.