జీవిత కథ
“నాకు ఇప్పుడు పరిచర్య అంటే చాలా ఇష్టం!”
న్యూజిలాండ్ దక్షిణ దీవిలో ఉన్న బల్‌క్లుత అనే పట్టణంలో నేను పుట్టి పెరిగాను. చిన్నప్పుడు నేను యెహోవాను ప్రేమించాను, ఆయనకు సాక్షిగా ఉండడాన్ని ఇష్టపడ్డాను. మీటింగ్స్ నాకు అస్సలు బోర్ కొట్టేవి కావు, సహోదర సహోదరీల మధ్య ఉండడం నాకు సురక్షితంగా, సంతోషంగా అనిపించేది. నాకు కొంచెం సిగ్గు ఎక్కువే అయినా ప్రతీవారం పరిచర్య చేయడాన్ని ఇష్టపడేదాన్ని. మా స్కూల్లో వాళ్లకు, ఇతరులకు ప్రకటించడానికి నేను భయపడేదాన్ని కాదు. యెహోవాసాక్షిగా ఉండడం నాకెంతో గర్వంగా అనిపించేది, 11 ఏళ్ల వయసులో నేను దేవునికి సమర్పించుకున్నాను.
నా సంతోషాన్ని కోల్పోయాను
విచారకరంగా, దాదాపు 13 ఏళ్లు ఉన్నప్పుడు యెహోవాతో నాకున్న స్నేహం మెల్లమెల్లగా తగ్గిపోయింది. స్కూల్లో నా తోటి పిల్లలు చాలా స్వేచ్ఛగా ఉన్నారని, నాకు ఆ స్వేచ్ఛ లేదని అనిపించింది. అమ్మానాన్నలు పెట్టే రూల్స్, క్రైస్తవ ప్రమాణాలు నాకు భారంగా అనిపించాయి. యెహోవాను ఆరాధించడం చాలా కష్టమైన పనిలా అనిపించింది. యెహోవా నిజంగా ఉన్నాడా అనే సందేహం అయితే నాకు రాలేదు కానీ, ఆధ్యాత్మికంగా నేను బలహీనపడ్డాను.
నేను ప్రకటించడం పూర్తిగా మానేయలేదు, అయితే అప్పుడప్పుడు మాత్రమే ప్రీచింగ్‌కి వెళ్లేదాన్ని. పైగా సిద్ధపడి వెళ్లేదాన్ని కాదు, దానివల్ల పరిచర్యలో ఎవరితోనైనా మాట్లాడడానికి ఇబ్బందిపడేదాన్ని. దాంతో నాకు రిటన్ విజిట్స్, బైబిలు స్టడీలు దొరికేవి కాదు. అలా పరిచర్యలో ఆనందాన్ని కోల్పోయాను, నెమ్మదిగా దాని మీద ఇష్టం తగ్గిపోయింది. ‘అసలు ఎవరైనా ప్రతీ వారం, ప్రతీ నెల పరిచర్య ఎలా చేస్తారు?’ అని అనుకున్నాను.
17 ఏళ్లు వచ్చాక, స్వేచ్ఛగా ఉండాలనే కోరిక నాలో ఇంకా పెరిగిపోయింది. కాబట్టి నా బట్టలు సర్దుకుని, ఇల్లు వదిలి ఆస్ట్రేలియా వెళ్లిపోయాను. నేను ఇంట్లోంచి వెళ్లిపోయినందుకు అమ్మానాన్నలు చాలా బాధపడ్డారు. వాళ్లు నా గురించి దిగులుపడ్డారు, కానీ నేను యెహోవా సేవలో కొనసాగుతానని వాళ్లు అనుకున్నారు.
ఆస్ట్రేలియాకు వెళ్లాక యెహోవా సేవలో నేను ఇంకా వెనకపడ్డాను. అప్పుడప్పుడు మీటింగ్స్‌కి వెళ్లడం మానేసేదాన్ని. నాలాగే ఒక వారం మీటింగ్‌కి వచ్చి, ఇంకో వారం నైట్ క్లబ్‌కి వెళ్లి తాగుతూ డాన్స్ చేసే యౌవనులతో నేను స్నేహం చేశాను. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ రోజుల గురించి ఆలోచిస్తే, నేను రెండు పడవల మీద కాలు పెట్టానని నాకు అర్థమైంది. నిజానికి అటు సత్యంలో, ఇటు లోకంలో దేనిలోనూ సంతోషంగా ఉండలేకపోయాను.
అనుకోకుండా నేర్చుకున్న ఒక విలువైన పాఠం
దాదాపు రెండేళ్ల తర్వాత, నేను ఒక సహోదరిని కలిశాను. ఆమె తెలీకుండానే, నా గురించి నేను ఆలోచించుకునేలా సహాయం చేసింది. నేను పెళ్లికాని ఐదుగురు సహోదరీలతో కలిసి ఉండేదాన్ని. మేము ప్రాంతీయ పర్యవేక్షకుడిని, ఆయన భార్యను ఒక వారంపాటు మా ఇంట్లో ఉండడానికి ఆహ్వానించాం. సహోదరుడు సంఘ పనుల మీద బయటికి వెళ్లినప్పుడు ఆయన భార్య టమార మాతో కలిసి సమయం గడిపేది, సరదాగా ఉండేది, నాకు అది నచ్చింది. ఆమె చాలా వినయంగా ఉండేది, ఆమెతో ఏదైనా మాట్లాడొచ్చు అనిపించింది. అంత ఆధ్యాత్మికంగా ఉండేవాళ్లు, ఇంత సరదాగా ఉండడం నాకు నచ్చింది.
టమార చాలా ఉత్సాహంగా ఉండేది. సత్యం పట్ల, పరిచర్య పట్ల ఆమెకున్న ప్రేమను చూస్తే మనకు కూడా అలా ఉండాలనిపిస్తుంది. యెహోవా సేవలో చేయగలిగినదంతా చేస్తూ ఆమె సంతోషంగా ఉంది, నేనేమో ఆయన్ని అంతంతమాత్రంగా సేవిస్తూ ఆనందాన్ని కోల్పోయాను. తను చూపించే సానుకూల వైఖరి, తను అనుభవించే నిజమైన సంతోషం నా మీద ఎంతో ప్రభావం చూపించాయి. ఆమె ఆదర్శం ఈ ముఖ్యమైన సత్యం గురించి ఆలోచించేలా నన్ను కదిలించింది: మనందరం తనను “సంతోషంతో,” “ఆనందంతో కేకలు వేస్తూ” సేవించాలని యెహోవా కోరుకుంటున్నాడు.—కీర్త. 100:2.
పరిచర్యను మళ్లీ ప్రేమించడం ఎలా మొదలుపెట్టానంటే . . .
టమారలానే నేను కూడా సంతోషంగా ఉండాలనుకున్నాను. కానీ ఆ సంతోషాన్ని పొందాలంటే నేను పెద్దపెద్ద మార్పులు చేసుకోవాలి. అందుకు నాకు కాస్త సమయం పట్టింది. కానీ నేను చిన్నచిన్నగా మార్పులు చేసుకోవడం మొదలుపెట్టాను. పరిచర్యకు సిద్ధపడి వెళ్లాను, అప్పుడప్పుడు సహాయ పయినీరు సేవ కూడా చేశాను. దానివల్ల పరిచర్యలో నాకున్న భయాన్ని పోగొట్టుకుని, ధైర్యంగా మాట్లాడగలిగాను. పరిచర్యలో బైబిల్ని ఉపయోగించే కొద్దీ నా సంతోషం రెట్టింపు అయింది. కొంతకాలానికే, నేను
ప్రతీనెల సహాయ పయినీరుగా సేవ చేయడం మొదలుపెట్టాను.యెహోవా సేవలో కష్టపడి పనిచేస్తూ దాన్ని ఆనందిస్తున్న అన్ని వయసుల వాళ్లతో స్నేహం చేయడం మొదలుపెట్టాను. నా జీవితంలో దేనికి మొదటి స్థానం ఇస్తున్నానో ఆలోచించుకునేలా, రోజూ బైబిలు చదివేలా వాళ్ల మంచి ఆదర్శం నాకు సహాయం చేసింది. పరిచర్యలో నా ఆనందం ఇంకా ఎక్కువైంది, చివరికి క్రమ పయినీరుని అయ్యాను. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సహోదర సహోదరీల మధ్య నాకు సురక్షితంగా, సంతోషంగా ఉన్నట్టు అనిపించింది.
ఎప్పుడూ నాతో పాటే ఉండే పయినీరు దొరికాడు
ఒక సంవత్సరం తర్వాత నేను అలెక్స్‌ను కలిశాను. ఆయన మంచివాడు, దయ గలవాడు; యెహోవా అన్నా, పరిచర్య అన్నా ఆయనకు చాలా ఇష్టం. ఆయన సంఘ పరిచారకుడు, ఆరేళ్లుగా పయినీరు సేవ చేస్తున్నాడు. అంతేకాదు కొంతకాలం పాటు మలావీలో అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవచేశాడు. అక్కడ కొందరు మిషనరీలతో కలిసి పనిచేశాడు. వాళ్లు ఆయనకు మంచి ఆదర్శం ఉంచారు, యెహోవా సేవకు మొదటి స్థానం ఇస్తూ ఉండమని ఆయన్ని ప్రోత్సహించారు.
2003 లో నేను, అలెక్స్ పెళ్లి చేసుకున్నాం. అప్పటినుండి ఇద్దరం కలిసి పూర్తికాల సేవలో కొనసాగుతున్నాం. మేము ఎన్నో అద్భుతమైన పాఠాలు నేర్చుకున్నాం, యెహోవా మమ్మల్ని లెక్కలేనన్ని విధాలుగా ఆశీర్వదించాడు.
యెహోవా మమ్మల్ని ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాడు
2009 లో, ఇండోనేషియా ద్వీప సముదాయంలోని టీమర్-లెస్ట్ అనే చిన్న దేశంలో మిషనరీలుగా సేవ చేయమని మాకు ఆహ్వానం వచ్చింది. మాకు ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆనందం, భయం కలిగాయి. ఐదు నెలల తర్వాత మేము ఆ దేశ రాజధాని అయిన డిలికి చేరుకున్నాం.
అక్కడికి వెళ్లాక మేము చాలా మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. కొత్త సంస్కృతికి, భాషకు, ఆహారానికి, పరిస్థితులకు అలవాటు పడాల్సివచ్చింది. తరచూ మేము పరిచర్యలో చాలా పేదవాళ్లను, చదువుకోని వాళ్లను, a
అణచివేయబడిన వాళ్లను కలుసుకునేవాళ్లం. అంతేకాదు యుద్ధం వల్ల, హింస వల్ల శారీరకంగా, మానసికంగా దెబ్బతిన్న చాలామందిని మేము కలిశాం.టీమర్-లెస్ట్‌లో పరిచర్య చాలా అద్భుతంగా ఉంటుంది! ఉదాహరణకు, ఒకసారి నేను 13 ఏళ్ల మరియను b కలిశాను. అప్పుడు ఆ అమ్మాయి చాలా బాధగా ఉంది. కొన్నేళ్ల క్రితమే వాళ్ల అమ్మ చనిపోయింది, వాళ్ల నాన్న కూడా పట్టించుకునేవాడు కాదు. తన తోటి పిల్లల్లాగే మరియకు కూడా జీవితంలో ఏం చేయాలో తెలిసేది కాదు. ఒక సందర్భంలో ఏడ్చుకుంటూ తన బాధంతా నాకు చెప్పింది. కానీ నేను అప్పటికి ఇంకా ఆ భాష నేర్చుకోలేదు కాబట్టి, ఆమె ఏం చెప్తుందో సరిగ్గా అర్థంకాలేదు. ఆమెను ప్రోత్సహించేలా సహాయం చేయమని నేను యెహోవాకు ప్రార్థించాను. తర్వాత ఓదార్పునిచ్చే కొన్ని లేఖనాల్ని ఆమెకు చదివి వినిపించాను. తర్వాతి సంవత్సరాల్లో సత్యం ఆమె ఆలోచనా తీరును, కనిపించే తీరును, జీవితాన్ని పూర్తిగా మార్చేయడం నేను చూశాను. ఆమె బాప్తిస్మం తీసుకుంది, బైబిలు స్టడీలు కూడా చేస్తోంది. ఇప్పుడు తనను ఎంతో ప్రేమించే యెహోవా ప్రజల పెద్ద కుటుంబం ఆమెకు ఉంది.
టీమర్-లెస్ట్‌లో జరుగుతున్న పనిని యెహోవా ఆశీర్వదించాడు. చాలామంది ప్రచారకులు బాప్తిస్మం తీసుకుంది గడిచిన పది సంవత్సరాల్లోనే. అయినా చాలామంది పయినీర్లుగా, సంఘ పరిచారకులుగా, పెద్దలుగా సేవచేస్తున్నారు. ఇంకొంతమంది రిమోట్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసులో సేవచేస్తూ, స్థానిక భాషల్లోకి బైబిలు ప్రచురణల్ని అనువదిస్తున్నారు. టీమర్-లెస్ట్‌లోని ప్రచారకులు మీటింగ్స్‌లో పాటలు పాడుతున్నప్పుడు, వాళ్ల ముఖాల్లో చిరునవ్వు చూసినప్పుడు, వాళ్ల ఆధ్యాత్మిక ప్రగతిని గమనించినప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది.
ఇంతకన్నా సంతోషకరమైన జీవితం ఇంకొకటి లేదు
ఆస్ట్రేలియాలో జీవితానికి, ఇక్కడ టీమర్-లెస్ట్‌లో జీవితానికి చాలా తేడా ఉంది. కానీ ఇంతకన్నా సంతోషకరమైన జీవితాన్ని నేను ఊహించుకోలేను. కొన్నిసార్లు ప్రజలతో కిక్కిరిసిపోయి, మార్కెట్‌లోని ఎండు చేపలతో, కూరగాయలతో నిండిపోయిన వ్యానుల్లో మేము ప్రయాణించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వేడిగా ఉండే, ఉక్కపోసే చిన్న ఇళ్లలో స్టడీలు చేయాల్సి ఉంటుంది. ఆ ఇళ్లలో నేలమీద బండలు ఉండవు, మట్టితో అలికి ఉంటుంది, ఇంట్లో కోళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి సవాళ్లు ఉన్నా, ‘ఈ జీవితం చాలా బాగుంది!’ అని ఎన్నోసార్లు అనుకున్నాను.
గతాన్ని తలచుకుంటే, యెహోవా మార్గాల్ని నేర్పించినందుకు మా అమ్మానాన్నలకు థాంక్స్ చెప్పాలి. వాళ్లు నాకు ఎంతో సహాయం చేశారు, చివరికి యెహోవాతో నా సంబంధం బలహీనంగా ఉన్న రోజుల్లో కూడా వాళ్లు సహాయం చేశారు. సామెతలు 22:6 లో ఉన్న మాటలు నా విషయంలో నిజమయ్యాయి. నన్ను, అలెక్స్‌ను చూసి మా అమ్మానాన్నలు గర్వపడుతున్నారు; మేము యెహోవాను సేవిస్తున్నందుకు సంతోషిస్తున్నారు. 2016 నుండి మేమిద్దరం ఆస్ట్రలేషియా బ్రాంచి క్షేత్రంలో ప్రాంతీయ సేవ చేస్తున్నాం.
ఒకప్పుడు నేను పరిచర్యను ఆనందించలేదంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. నాకు ఇప్పుడు పరిచర్య అంటే చాలా ఇష్టం! జీవితంలో ఏం జరిగినా, యెహోవాను నిండు హృదయంతో సేవించడంలోనే నిజమైన ఆనందం ఉందని నేను గుర్తించాను. అవును, అలెక్స్‌తో కలిసి యెహోవా సేవలో గడిపిన ఈ 18 ఏళ్లు, నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజులు. కీర్తనకర్త అయిన దావీదు యెహోవాతో అన్న ఈ మాటలు ఎంత నిజమో నాకు ఇప్పుడు అర్థమైంది: “నిన్ను ఆశ్రయించేవాళ్లందరూ ఉల్లసిస్తారు; వాళ్లు ఎప్పుడూ సంతోషంతో కేకలు వేస్తారు. . . . నీ పేరును ప్రేమించేవాళ్లు నిన్ను బట్టి ఉల్లసిస్తారు.”—కీర్త. 5:11.