ప్రోత్సాహాన్నిచ్చే యెహోవాను అనుకరించండి
“దేవునికి స్తుతి కలగాలి. . . . ఆయన మన కష్టాలన్నిటిలో మనల్ని ఓదారుస్తాడు [లేదా, ప్రోత్సహిస్తాడు].”—2 కొరిం. 1:3, 4.
1. ఆదాముహవ్వలు పాపం చేసినప్పుడు యెహోవా మనుషులకు ప్రోత్సాహాన్ని ఎలా ఇచ్చాడు?
యెహోవా ప్రోత్సాహాన్నిచ్చే దేవుడు. మనుషులు పాపం చేసి, అపరి పూర్ణులు అయినప్పటినుండి ఆయన వాళ్లకు ప్రోత్సాహాన్ని ఇస్తూనే ఉన్నాడు. నిజానికి, ఆదాముహవ్వలు తిరుగుబాటు చేసిన వెంటనే యెహోవా ఒక ప్రవచనం చెప్పడం ద్వారా రాబోయే తరాలకు ధైర్యాన్ని, నిరీక్షణను ఇచ్చాడు. ఆ ప్రవచనాన్ని ఆదికాండము 3:15 లో చదవవచ్చు. అపవాదియైన సాతాను అలాగే అతని చెడ్డపనులు నాశనం అవుతాయని దేవుడు మాటిచ్చాడు.—1 యోహా. 3:8; ప్రక. 12:9.
యెహోవా గతంలోని తన సేవకుల్ని ప్రోత్సహించాడు
2. యెహోవా నోవహును ఎలా ప్రోత్సహించాడు?
2 యెహోవా ప్రోత్సహించిన వాళ్లలో నోవహు ఒకరు. నోవహు కాలంలో ప్రజలు క్రూరంగా, అనైతికంగా ప్రవర్తించేవాళ్లు. కేవలం నోవహు ఆయన కుటుంబం మాత్రమే యెహోవాను ఆరాధించేవాళ్లు. కాబట్టి నిరుత్సాహపడడానికి నోవహుకు చాలా కారణాలు ఉన్నాయి. (ఆది. 6:4, 5, 11; యూదా 6) కానీ తనను ఆరాధిస్తూ ఉండడానికి, సరైనది చేస్తూ ఉండడానికి కావాల్సిన ధైర్యాన్ని యెహోవా నోవహుకు ఇచ్చాడు. (ఆది. 6:9) అంతేకాదు అప్పుడున్న చెడ్డ ప్రజల్ని నాశనం చేస్తానని మాటిచ్చాడు. ఆయనా, ఆయన కుటుంబం ఆ నాశనాన్ని తప్పించుకోవాలంటే ఏమి చేయాలో కూడా యెహోవా చెప్పాడు. (ఆది. 6:13-18) అవును, యెహోవా నోవహును ఎంతో ప్రోత్సహించాడు.
3. యెహోవా యెహోషువను ఎలా ప్రోత్సహించాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)
3 యెహోవా యెహోషువను కూడా ప్రోత్సహించాడు. దేవుని ప్రజల్ని వాగ్దాన దేశానికి నడిపించి, ఆ దేశంలోని శక్తివంతమైన సైన్యాలతో యుద్ధం చేయాల్సిన బరువైన బాధ్యత అప్పట్లో యెహోషువపై ఉంది. కాబట్టి యెహోషువ భయపడే అవకాశం ఉందని యెహోవాకు తెలుసు. అందుకే ఆయన మోషేతో ఇలా అన్నాడు, “యెహోషువకు ఆజ్ఞయిచ్చి అతని ధైర్యపరచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నదిదాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొనచేయును.” (ద్వితీ. 3:28) ఆ తర్వాత యెహోవాయే స్వయంగా యెహోషువను ఇలా ప్రోత్సహించాడు, “నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.” (యెహో. 1:1, 9) ఆ మాటలు యెహోషువను ఎంత ప్రోత్సహించి ఉంటాయో కదా!
4, 5. (ఎ) యెహోవా గతంలోని తన సేవకుల్ని ఎలా ప్రోత్సహించాడు? (బి) తన కుమారుణ్ణి ఎలా ప్రోత్సహించాడు?
4 యెహోవా తన ప్రజల్ని ఒక గుంపుగా కూడా ప్రోత్సహించాడు. ఉదాహరణకు, యూదులు బబులోను చెరలో ఉన్నప్పుడు వాళ్లకు ప్రోత్సాహం అవసరమైంది. అందుకే ప్రోత్సాహాన్నిచ్చే ఈ ప్రవచనాన్ని యెహోవా చెప్పాడు, “నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.” (యెష. 41:9, 10) ఆ తర్వాత, యెహోవా తొలి శతాబ్దంలోని క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు, నేడు మనల్ని కూడా అలాగే ప్రోత్సహిస్తాడు.—2 కొరింథీయులు 1:3, 4 చదవండి.
5 యెహోవా తన కుమారుణ్ణి కూడా ప్రోత్సహించాడు. బాప్తిస్మం తీసుకున్న యేసు, పరలోకం నుండి ఒక స్వరం ఇలా చెప్పడం విన్నాడు, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను.” (మత్త. 3:17) ఆ మాటలు, భూపరిచర్య అంతటిలో యేసును ఎంత బలపర్చి ఉంటాయో ఊహించగలరా?
యేసు ఇతరుల్ని ప్రోత్సహించాడు
6. యేసు చెప్పిన తలాంతుల ఉదాహరణ మనకు ఎలాంటి ప్రోత్సాహాన్నిస్తుంది?
6 తన తండ్రిని అనుకరిస్తూ యేసు కూడా ఇతరుల్ని ప్రోత్సహించాడు. ఒక సందర్భంలో తలాంతుల ఉదాహరణ చెప్పడం ద్వారా నమ్మకంగా ఉండమని శిష్యుల్ని ప్రోత్సహించాడు. ఆ ఉదాహరణలో యజమాని తనకు నమ్మకంగా ఉన్న ప్రతీ దాసునితో “‘శభాష్, నమ్మకమైన మంచి దాసుడా! నువ్వు కొన్నిటిలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను చాలావాటి మీద నియమిస్తాను. నీ యజమానితో కలిసి సంతోషించు’ అన్నాడు.” (మత్త. 25:21, 23) యేసు చెప్పిన ఈ మాటలు, యెహోవాను నమ్మకంగా సేవించేలా శిష్యుల్ని ప్రోత్సహించాయి.
7. యేసు తన అపొస్తలులను, ముఖ్యంగా పేతురును ఎలా ప్రోత్సహించాడు?
7 అపొస్తలులు తమలో ఎవరు గొప్ప అనే విషయం గురించి తరచూ వాదించుకునేవాళ్లు. అయినప్పటికీ ఎల్లప్పుడూ యేసు వాళ్లతో ఓపిగ్గా వ్యవహరించాడు. అంతేకాదు వినయంగా ఉండమని, ఇతరులకు సేవచేయడానికి ముందుండమని ప్రోత్సహించాడు. (లూకా 22:24-26) ఉదాహరణకు పేతురు ఎన్నోసార్లు పొరపాట్లు చేసి యేసును బాధపెట్టాడు. (మత్త. 16:21-23; 26:31-35, 75) కానీ ఆయన పేతురును విడిచిపెట్టలేదు గానీ ప్రోత్సహించాడు. తోటి సహోదరుల్ని బలపర్చే నియామకం కూడా ఇచ్చాడు.—యోహా. 21:16.
ప్రాచీన కాలంలోని దేవుని సేవకులు ఇతరుల్ని ప్రోత్సహించారు
8. యూదా ప్రజల్ని, సైన్యాధిపతుల్ని హిజ్కియా ఎలా ప్రోత్సహించాడు?
8 ఇతరుల్ని ప్రోత్సహించాలనే విషయాన్ని యెహోవా సేవకులు యేసు కాలం కన్నా ముందే గుర్తించారు. ఉదాహరణకు, హిజ్కియా గురించి ఆలోచించండి. యెరూషలేముపై అష్షూరీయులు దాడి చేయబోతున్నారని తెలిసినప్పుడు, హిజ్కియా తమ దేశ సైన్యాధిపతులను, ప్రజలను సమకూర్చి ప్రోత్సహించాడు. వాళ్లందరూ ఆయన ‘మాటలు విని బలం పొందారు.’—2 దినవృత్తాంతములు 32:6-8 చదవండి.
9. ప్రోత్సహించే విషయంలో యోబు నుండి ఏమి నేర్చుకోవచ్చు?
9 ప్రోత్సహించే విషయంలో యోబు నుండి కూడా ఎంతో నేర్చుకోవచ్చు. యోబు ప్రోత్సాహం అవసరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, తన ముగ్గురు కపట స్నేహితులకు ప్రోత్సాహం గురించి ఒక పాఠం నేర్పించాడు. ఓదార్చడానికి వచ్చిన వాళ్ల స్థానంలో తాను ఉంటే ఏమి చేసేవాడినో చెప్తూ యోబు ఇలా అన్నాడు, “నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును.” (యోబు 16:1-5) అయితే చివరికి ఎలీహు ద్వారా, యెహోవా ద్వారా యోబుకు ప్రోత్సాహం దొరికింది.—యోబు 33:24, 25; 36:1, 11; 42:7, 10.
10, 11. (ఎ) యెఫ్తా కూతురుకు ప్రోత్సాహం ఎందుకు అవసరమైంది? (బి) నేడు మనం ఎవర్ని ప్రోత్సహించాలి?
10 యెఫ్తా కూతురుకు కూడా ప్రోత్సాహం అవసరమైంది. ఆమె తండ్రీ, న్యాయాధిపతీ అయిన యెఫ్తా అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్తున్నాడు. ఒకవేళ ఆ యుద్ధం గెలవడానికి యెహోవా సహాయం చేస్తే, తనను కలవడానికి ఇంట్లో నుండి వచ్చే మొదటి వ్యక్తిని గుడారములో యెహోవా సేవచేయడానికి అంకితం చేస్తానని యెఫ్తా మాటిచ్చాడు. ఇశ్రాయేలీయులు ఆ యుద్ధం గెలిచారు, యెఫ్తాను కలవడానికి ఆయన ఇంట్లో నుండి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరో కాదు, తన ఒక్కగానొక్క కూతురే. అది చూసి యెఫ్తా గుండె పగిలిపోయింది. కానీ మాటిచ్చినట్టే తన కూతుర్ని జీవితాంతం గుడారములో సేవచేయడానికి పంపించాడు.—న్యాయా. 11:30-35.
11 తన మాట నిలబెట్టుకోవడం యెఫ్తాకు కష్టమైవుంటుంది. ఆయన కూతురుకు మరింత కష్టమైవుంటుంది. కానీ తండ్రి చెప్పింది చేయడానికి ఆమె ఇష్టంగా ముందుకొచ్చింది. (న్యాయా. 11:36, 37) అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడానికి, పిల్లల్ని కనకుండా ఉండడానికి ఆమె సిద్ధపడింది. దానివల్ల వాళ్ల వంశం అక్కడితో ఆగిపోతుంది. ఆమెకు ఎంతో ఓదార్పు, ప్రోత్సాహం అవసరమయ్యాయి. అందుకే, ‘ఇశ్రాయేలులోని యువతులు గిలాదుకు చెందిన యెఫ్తా కూతుర్ని మెచ్చుకోవడానికి ప్రతీ సంవత్సరం నాలుగు రోజులు వెళ్లేవాళ్లు’ అని బైబిలు చెప్తుంది. (న్యాయా. 11:39, 40, NW) నేడు కూడా యెఫ్తా కూతురులాగే కొంతమంది క్రైస్తవులు యెహోవా సేవను ఎక్కువ చేయడానికి వీలుగా పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు. వాళ్లను మనం మెచ్చుకుంటున్నామా? ప్రోత్సహిస్తున్నామా?—1 కొరిం. 7:32-35.
అపొస్తలులు తోటి సహోదరుల్ని ప్రోత్సహించారు
12, 13. పేతురు తన తోటి సహోదరుల్ని ఎలా ‘బలపర్చాడు’?
12 చనిపోవడానికి ముందు రోజు రాత్రి యేసు అపొస్తలుడైన పేతురుతో ఇలా చెప్పాడు, “సీమోనూ, సీమోనూ, ఇదిగో! మీ అందర్నీ గోధుమల్లా తూర్పారబట్టి జల్లించడానికి, తనకు మీరు కావాలని సాతాను అడిగాడు. అయితే నీ విశ్వాసం బలహీనపడకుండా ఉండాలని నేను పట్టుదలగా నీ కోసం ప్రార్థించాను; నువ్వు పశ్చాత్తాపపడి తిరిగొచ్చిన తర్వాత నీ సోదరుల్ని బలపర్చు.”—లూకా 22:31, 32.
13 తొలి క్రైస్తవ సంఘాన్ని నడిపించిన సహోదరుల్లో పేతురు కూడా ఉన్నాడు. (గల. 2:9) పెంతెకొస్తు రోజున అలాగే ఆ తర్వాత పేతురు ధైర్యంగా చేసిన కొన్ని పనులు తోటి సహోదరుల్ని ప్రోత్సహించాయి. ఎన్నో ఏళ్లపాటు యెహోవా సేవచేసిన ఆయన తన సహోదరులకు ఇలా రాశాడు, “నేను . . . మీకు ఈ కొన్ని మాటలు రాశాను. మీకు ప్రోత్సాహాన్ని, దేవుని నిజమైన అపారదయ ఇదే అన్న అభయాన్ని ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. ఆ అపారదయలో స్థిరంగా ఉండండి.” (1 పేతు. 5:12) పేతురు రాసిన ఉత్తరాలు ఆ కాలంలోని క్రైస్తవుల్ని ఎంతో ప్రోత్సహించాయి. యెహోవా మాటిచ్చినవన్నీ పూర్తిగా నెరవేరే కాలం కోసం ఎదురుచూస్తున్న మనకు కూడా ఆ మాటలు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి.—2 పేతు. 3:13.
14, 15. అపొస్తలుడైన యోహాను రాసిన బైబిలు పుస్తకాలు మనల్ని ఎలా ప్రోత్సహిస్తాయి?
14 తొలి క్రైస్తవ సంఘాన్ని నడిపించిన వాళ్లలో అపొస్తలుడైన యోహాను కూడా ఉన్నాడు. యేసు పరిచర్యకు సంబంధించిన ఆసక్తికరమైన వృత్తాంతాన్ని యోహాను రాశాడు. ఆ బైబిలు పుస్తకం కొన్ని వందల సంవత్సరాలపాటు క్రైస్తవుల్ని ప్రోత్సహించింది, ఇప్పటికీ ప్రోత్సహిస్తూనే ఉంది. ఉదాహరణకు, “మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది” అని యేసు చెప్పిన మాటల్ని కేవలం యోహాను సువార్తలోనే చదువుతాం.—యోహాను 13:34, 35 చదవండి.
15 యోహాను రాసిన మూడు ఉత్తరాల్లోనూ విలువైన సత్యాలు ఉన్నాయి. ఉదాహరణకు, చేసిన పొరపాట్లను బట్టి నిరుత్సాహంలో ఉన్నప్పుడు, యేసు విమోచన క్రయధనం “మన పాపాలన్నిటినీ కడిగివేస్తుంది” అనే మాటలు ఉపశమనాన్ని ఇస్తాయి. (1 యోహా. 1:7) అపరాధ భావాలతో ఎంతోకాలంగా కుమిలిపోతున్నప్పుడు, “దేవుడు మన హృదయాల కన్నా గొప్పవాడని” తెలుసుకోవడం ఎంతో ఓదార్పునిస్తుంది. (1 యోహా. 3:20) “దేవుడు ప్రేమ” అని రాసిన ఏకైక బైబిలు రచయిత యోహానే. (1 యోహా. 4:8, 16) “సత్యానికి తగ్గట్టు జీవిస్తున్న” క్రైస్తవుల్ని యోహాను తన రెండవ, మూడవ పత్రికల్లో మెచ్చుకున్నాడు.—2 యోహా. 4; 3 యోహా. 3, 4.
16, 17. అపొస్తలుడైన పౌలు తొలి క్రైస్తవుల్ని ఎలా ప్రోత్సహించాడు?
16 తోటి సహోదరులను ప్రోత్సహించే విషయంలో అపొస్తలుడైన పౌలు చక్కని ఆదర్శం ఉంచాడు. మొదటి శతాబ్దంలో, అపొస్తలుల్లో చాలామంది యెరూషలేములోనే ఉండేవాళ్లు, అప్పట్లో పరిపాలక సభ అక్కడే ఉండేది. (అపొ. 8:14; 15:2) దేవున్ని నమ్మేవాళ్లకు యూదయలోని క్రైస్తవులు క్రీస్తు గురించి ప్రకటించారు. కానీ గ్రీకులకు, రోమన్లకు, వివిధ దేవుళ్లను ఆరాధించే ఇతరులకు ప్రకటించేలా పవిత్రశక్తి పౌలును నడిపించింది.—గల. 2:7-9; 1 తిమో. 2:7.
17 ప్రస్తుతం టర్కీ అని పిలవబడే ప్రాంతానికి, గ్రీసుకు, ఇటలీకి ఆయన ప్రయాణించాడు. అక్కడ అన్యులకు మంచివార్త ప్రకటించి, క్రైస్తవ సంఘాల్ని స్థాపించాడు. అయితే ఆ ప్రాంతాల్లో కొత్తగా క్రైస్తవులైన వాళ్లకు వ్యతిరేకత ఎదురైంది. సొంత ప్రజలే వాళ్లను హింసించారు కాబట్టి వాళ్లకు ప్రోత్సాహం చాలా అవసరమైంది. (1 థెస్స. 2:14) సుమారు క్రీ.శ. 50లో పౌలు కొత్తగా ఏర్పాటైన థెస్సలోనిక సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఒక ఉత్తరం రాశాడు. అందులో ఇలా ఉంది, “మా ప్రార్థనల్లో మీ అందర్నీ గుర్తుచేసుకున్నప్పుడల్లా మేము దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. విశ్వాసం వల్ల మీరు చేస్తున్న పనిని, ప్రేమతో మీరు చేస్తున్న కృషిని, . . . మీరు చూపిస్తున్న ఓర్పును తండ్రైన దేవుని ముందు మేము ఎప్పుడూ గుర్తుచేసుకుంటాం.” (1 థెస్స. 1:2, 3) అంతేకాదు వాళ్లు ఒకరినొకరు బలపర్చుకోవాలని చెప్తూ పౌలు ఇలా అన్నాడు, “ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండండి.”—1 థెస్స. 5:11.
పరిపాలక సభ క్రైస్తవుల్ని ప్రోత్సహించింది
18. మొదటి శతాబ్దంలోని పరిపాలక సభ ఫిలిప్పును ఎలా ప్రోత్సహించింది?
18 యెహోవా, మొదటి శతాబ్దంలోని సంఘాలకు నాయకత్వం వహించినవాళ్లతో సహా క్రైస్తవులందరినీ ప్రోత్సహించడానికి పరిపాలక సభను ఉపయోగించుకున్నాడు. ఫిలిప్పు క్రీస్తు గురించి సమరయులకు ప్రకటించినప్పుడు, పరిపాలక సభ ఆయనకు మద్దతిచ్చింది. ఏ విధంగా? కొత్తగా క్రైస్తవులైనవాళ్లు పవిత్రశక్తి పొందేలా ప్రార్థించడానికి పేతురు, యోహానులను పరిపాలక సభ పంపించింది. (అపొ. 8:5, 14-17) ఆ మద్దతును బట్టి ఫిలిప్పు అలాగే కొత్తగా క్రైస్తవులైన సహోదరసహోదరీలు ఎంతో ప్రోత్సాహాన్ని పొందారు.
19. పరిపాలక సభ నుండి వచ్చిన ఉత్తరాన్ని చదివినప్పుడు మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఎలా భావించారు?
19 కొంతకాలానికి, పరిపాలక సభ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేంటంటే, క్రైస్తవులుగా మారిన అన్యులు మోషే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి చేయించుకోవాలా వద్దా? (అపొ. 15:1, 2) పరిపాలక సభ పవిత్రశక్తి కోసం ప్రార్థించి, లేఖనాలను లోతుగా పరిశీలించాక క్రైస్తవులుగా మారిన అన్యులు సున్నతి చేయించుకోవాల్సిన అవసరంలేదని నిర్ణయించింది. అంతేకాదు ఆ నిర్ణయాన్ని ఒక ఉత్తరంలో రాసి సహోదరుల ద్వారా సంఘాలకు పంపించింది. క్రైస్తవులు ఆ ఉత్తరాన్ని చదివినప్పుడు, “అందులో ఉన్న ప్రోత్సహించే మాటల్ని బట్టి ఎంతో సంతోషించారు.”—అపొ. 15:27-32.
20. (ఎ) నేడున్న పరిపాలక సభ మనందర్నీ ఎలా ప్రోత్సహిస్తుంది? (బి) తర్వాతి ఆర్టికల్లో ఏ ప్రశ్నను పరిశీలిస్తాం?
20 నేడు యెహోవాసాక్షుల పరిపాలక సభ బెతెల్ కుటుంబ సభ్యులకు, ఇతర ప్రత్యేక పూర్తికాల సేవకులకు అలాగే మనందరికీ ప్రోత్సాహాన్నిస్తుంది. మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లాగే మనం కూడా ఆ ప్రోత్సాహాన్నిబట్టి ఎంతో సంతోషిస్తాం. అంతేకాదు, సత్యాన్ని వదిలి వెళ్లినవాళ్లను తిరిగి రమ్మని ప్రోత్సహించడానికి యెహోవా దగ్గరకు తిరిగి రండి అనే బ్రోషుర్ను 2015లో పరిపాలక సభ తయారుచేసింది. అయితే, కేవలం సంఘాన్ని నడిపించే సహోదరులే ఇతరుల్ని ప్రోత్సహించాలా లేదా మనందరం కూడా ప్రోత్సహించవచ్చా? ఈ ప్రశ్నకు జవాబును తర్వాతి ఆర్టికల్లో తెలుసుకుంటాం.