మీ స్వచ్ఛంద సేవ యెహోవాకు స్తుతి తెచ్చుగాక!
‘ప్రజలు స్వచ్ఛందంగా యుద్ధానికి వెళ్లారు, యెహోవాను స్తుతించండి!’—న్యాయా. 5:2, NW.
1, 2. (ఎ) యెహోవా మన సేవను ఎలా చూస్తాడని ఎలీఫజు, బిల్దదు అన్నారు? (బి) వాళ్లు అన్న మాటల గురించి యెహోవా ఏమి చెప్పాడు?
చాలా ఏళ్ల క్రితం ముగ్గురు వ్యక్తులు యోబు అనే నమ్మకమైన దేవుని సేవకునితో మాట్లాడడానికి వెళ్లారు. వాళ్లలో ఒకతను తేమానీయుడైన ఎలీఫజు. అతను యోబును ఆసక్తికరమైన కొన్ని ప్రశ్నలు అడిగాడు, “నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా? కారు; బుద్ధిమంతులు తమమట్టుకు తామే ప్రయోజనకారులై యున్నారు. నీవు నీతిమంతుడవై యుండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా?” (యోబు 22:1-3) ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు “కాదు” అని ఎలీఫజు అనుకున్నాడు. యోబుతో మాట్లాడిన రెండో వ్యక్తి షూహీయుడైన బిల్దదు. దేవుడు మనుషుల్ని నీతిమంతులుగా అస్సలు ఎంచడని బిల్దదు అన్నాడు.—యోబు 25:4 చదవండి.
2 యెహోవాను ఆరాధించడానికి తాను పడుతున్న కష్టమంతా వృథా అని యోబు అనుకునేలా చేయడానికి ఎలీఫజు, బిల్దదు ప్రయత్నించారు. మనుషుల్ని దేవుడు విలువైనవాళ్లుగా ఎంచట్లేదని, వాళ్లు ఆయనకు పురుగులతో సమానమని యోబు నమ్మాలని వాళ్లు కోరుకున్నారు. (యోబు 4:19; 25:6) వినయం ఉండడం వల్లే వాళ్లిద్దరూ అలా మాట్లాడుతున్నారా? (యోబు 22:29) నిజమే యెహోవా అందరికన్నా ఉన్నతుడు, ఆయనతో పోల్చుకుంటే మనం చాలా తక్కువవాళ్లం. ఉదాహరణకు ఓ పర్వతం పైనుండి లేదా విమానం కిటికీలో నుండి కిందికి చూస్తే మనుషులు ఎంత చిన్నగా కనిపిస్తారో యెహోవాతో పోల్చుకుంటే మనం అంత తక్కువవాళ్లం. కానీ తనను సేవించడానికి, రాజ్యపని చేయడానికి మనం చేసే కృషిని యెహోవా విలువైనదిగా ఎంచుతున్నాడు. ఎలీఫజు, బిల్దదు, మూడవ వ్యక్తి అయిన జోఫరు అబద్ధాలు చెప్తున్నారని యెహోవా అన్నాడు. అంతేకాదు తాను యోబును చూసి సంతోషిస్తున్నానని చెప్తూ, అతన్ని ‘నా సేవకుడు’ అని పిలిచాడు. (యోబు 42:7, 8) కాబట్టి అపరిపూర్ణ మనుషులు యెహోవాకు ‘ప్రయోజనకరమే’ అనే పూర్తి నమ్మకంతో మనం ఉండవచ్చు.
“ఆయనకు నీవేమైన ఇచ్చుచున్నావా?”
3. యెహోవాను సేవించడానికి మనం చేసే కృషి గురించి ఎలీహు ఏమి చెప్పాడు? దాని అర్థమేమిటి?
3 యోబుకు, ఆ ముగ్గురు వ్యక్తులకు మధ్య జరుగుతున్న సంభాషణ అంతా ఎలీహు అనే యువకుడు వింటున్నాడు. ఆ ముగ్గురు వ్యక్తులు మాట్లాడడం అయిపోయాక ఎలీహు యోబును యెహోవా గురించి ఇలా అడిగాడు, “నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైన ఇచ్చుచున్నావా? ఆయన నీచేత ఏమైనను తీసికొనునా?” (యోబు 35:7) యెహోవాను సేవించడానికి మనం చేసే కృషి అంతా వృథా అని చెప్పడానికి ఎలీహు ప్రయత్నిస్తున్నాడా? లేదు. యెహోవా ఆ ముగ్గురు వ్యక్తుల్ని సరిదిద్దినట్లు ఎలీహును సరిదిద్దలేదు. ఎలీహు వేరే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం తనను ఆరాధించడం వల్ల యెహోవాకు కలిగే ప్రయోజనం ఏమీ లేదని ఎలీహు చెప్తున్నాడు. యెహోవాకు ఏ కొరత లేదు. యెహోవాను మరింత మెరుగ్గా లేదా ధనవంతునిగా లేదా శక్తివంతునిగా చేసేలా మనమేమీ చేయలేం. నిజానికి మనకున్న ఏ మంచి లక్షణమైనా లేదా సామర్థ్యమైనా దేవుడు మనకు ఇచ్చిందే. మనం వాటిని ఎలా ఉపయోగిస్తున్నామో యెహోవా గమనిస్తుంటాడు.
4. మనం ఇతరులపట్ల కనికరం చూపిస్తే యెహోవా ఎలా భావిస్తాడు?
4 యెహోవాను ఆరాధించే వాళ్లపట్ల మనం విశ్వసనీయ ప్రేమ చూపిస్తే, మనం తనకు మేలు చేసినట్లు యెహోవా భావిస్తాడు. సామెతలు 19:17 లో ఇలా ఉంది, “బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.” నిజానికి మనం ఇతరుల పట్ల కనికరం చూపించిన ప్రతీ సందర్భాన్ని యెహోవా గమనిస్తాడు. యెహోవా ఈ విశ్వానికి సృష్టికర్తే అయినా, మనం ఇతరులకు మంచి చేసిన ప్రతీసారి మనం తనకు అప్పిచ్చినట్లు యెహోవా భావిస్తాడు. అలా చేసినందుకు మనకు ప్రతిఫలంగా ఆయన ఎన్నో అద్భుతమైన బహుమానాల్ని ఇస్తాడు. ఆ విషయం నిజమని దేవుని కుమారుడైన యేసు కూడా రూఢి చేశాడు.—లూకా 14:13, 14 చదవండి.
5. ఇప్పుడు ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?
5 ప్రాచీన కాలంలో, తనకు ప్రతినిధిగా ఉండడానికి యెహోవా యెషయా ప్రవక్తను ఎన్నుకున్నాడు. అలా చేయడం ద్వారా, తన సంకల్పాన్ని నెరవేర్చడంలో అపరిపూర్ణ మనుషులు భాగం వహించడం తనకు సంతోషంగా ఉంటుందనే విషయాన్ని యెహోవా వెల్లడిచేశాడు. (యెష. 6:8-10) అయితే యెషయా సంతోషంగా ఆ పనిని అంగీకరిస్తూ ఇలా అన్నాడు: ‘చిత్తగించుము నేనున్నాను నన్ను పంపించు.’ నేడు కూడా, తన పనిలో భాగం వహించే అవకాశాన్ని నమ్మకమైన మనుషులకు యెహోవా ఇస్తున్నాడు. వేలాది యెహోవా సేవకులు, యెషయాలాగే తాము కూడా సిద్ధంగా ఉన్నామని చూపిస్తున్నారు. యెహోవాను వేర్వేరు విధానాల్లో, ప్రాంతాల్లో సేవించడానికి అందులో భాగంగా ఎదురయ్యే కష్టమైన పరిస్థితుల్ని, సవాళ్లను అధిగమించడానికి ఇష్టంగా ముందుకొస్తున్నారు. కానీ కొంతమంది ఇలా అనుకోవచ్చు, ‘స్వచ్ఛందంగా సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు నేను యెహోవాకు కృతజ్ఞుణ్ణి. కానీ నేను చేసే సేవను యెహోవా విలువైనదిగా ఎంచుతున్నాడా? నేను చేసినా, చేయకపోయినా యెహోవా తన పనిని ఎలాగైనా పూర్తి చేయించుకోగలడు కదా!’ మీకెప్పుడైనా అలా అనిపించిందా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి, ప్రాచీన కాలంలోని దేవుని సేవకులైన దెబోరా, బారాకు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
దేవుడు భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపుతాడు
6. యాబీను సైన్యం ఇశ్రాయేలీయుల్ని తేలిగ్గా ఓడించగలిగేలా ఉందని ఎలా చెప్పవచ్చు?
6 బారాకు ఇశ్రాయేలీయుడైన యోధుడు; దెబోరా ప్రవక్త్రిని, న్యాయాధిపతి. ఇశ్రాయేలీయులు 20 ఏళ్లపాటు కనానీయుల రాజైన యాబీను పరిపాలనలో ‘కఠినమైన బాధలుపడ్డారు.’ యాబీను సైనికులు ఎంత క్రూరంగా, కఠినంగా ఉండేవాళ్లంటే ఇశ్రాయేలీయులు తమ ఇళ్లలో నుండి బయటికి రావడానికి కూడా భయపడేవాళ్లు. యాబీను సైన్యానికి 900 ఇనుప యుద్ధరథాలు ఉండేవి. a కానీ ఇశ్రాయేలీయుల దగ్గర, యాబీను సైన్యంతో పోరాడడానికి అవసరమయ్యే ఆయుధాలుగానీ, వాళ్ల నుండి రక్షించుకోవడానికి కావాల్సిన కవచాలుగానీ లేవు.—న్యాయా. 4:1-3, 12-13; 5:6-8.
7, 8. (ఎ) యెహోవా బారాకుకు మొదట ఏమని ఆజ్ఞాపించాడు? (బి) ఇశ్రాయేలీయులు యాబీను సైన్యంపై ఎలా విజయం సాధించారు? (ప్రారంభ చిత్రం చూడండి.)
7 యాబీను సైన్యంతో పోలిస్తే, ఇశ్రాయేలీయులు బలహీనంగా, తేలిగ్గా ఓడిపోయేలా ఉన్నారు. కానీ యెహోవా దెబోరా ప్రవక్త్రిని ద్వారా బారాకుకు ఇలా ఆజ్ఞాపించాడు, ‘నువ్వు వెళ్లి, తాబోరు కొండకు బయల్దేరు; నీతో పాటు 10,000 మంది నఫ్తాలి, జెబూలూను వాళ్లను తీసుకెళ్లు. నేను యాబీను సైన్యాధిపతియైన సీసెరాను, అతనితోపాటు అతని యుద్ధ రథాల్ని, అతని సైన్యాల్ని నీ దగ్గరికి కీషోను వాగుకు రప్పిస్తాను, నేను అతన్ని నీ చేతికి అప్పగిస్తాను.’—న్యాయా. 4:4-7, NW.
8 యుద్ధం చేయడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ప్రకటన అందరికీ చేరింది. తాబోరు కొండ దగ్గర 10,000 మంది సమకూడారు. బారాకు, అతని మనుషులు శత్రుసైన్యంతో యుద్ధం చేయడానికి తానాకు అనే ప్రదేశానికి వెళ్లారు. (న్యాయాధిపతులు 4:14-16 చదవండి.) యెహోవా ఇశ్రాయేలీయులకు సహాయం చేశాడా? చేశాడు. అకస్మాత్తుగా తుఫాను రావడంతో యుద్ధం జరిగే ప్రాంతమంతా బురదమయం అయిపోయింది. దాంతో బారాకు, సీసెరా సైన్యాన్ని దాదాపు 24 కి.మీ. వరకు అంటే హరోషెతు వరకు తరిమాడు. ఆ దారి మధ్యలోనే సీసెరా యుద్ధ రథం బురదలో కూరుకుపోయింది. దాంతో సీసెరా రథం దిగి జయనన్నీముకు పారిపోయాడు. బహుశా అది కాదేషు దగ్గర్లో ఉన్న ప్రాంతం అయ్యుండవచ్చు. అయితే సీసెరా అక్కడికి వెళ్లి యాయేలు అనే స్త్రీ గుడారంలో దాక్కున్నాడు. అతను బాగా అలసిపోయి ఉండడంతో గాఢనిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు యాయేలు ధైర్యంగా అతన్ని చంపేసింది. (న్యాయా. 4:17-22) ఆ విధంగా శత్రువులపై విజయం సాధించేలా యెహోవా ఇశ్రాయేలీయులకు సహాయం చేశాడు. b
స్వచ్ఛందంగా ముందుకు వచ్చే విషయంలో రెండు వేర్వేరు అభిప్రాయాలు
9. సీసెరాతో చేసిన యుద్ధం గురించి న్యాయాధిపతులు 5:20, 21 వచనాలు ఏమి చెప్తున్నాయి?
9 న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో వర్ణించబడిన సంఘటనలకు సంబంధించిన మరిన్ని విషయాలు 5వ అధ్యాయంలో ఉన్నాయి. న్యాయాధిపతులు 5:20, 21 వచనాల్లో ఇలా ఉంది, “నక్షత్రములు ఆకాశమునుండి యుద్ధముచేసెను నక్షత్రములు తమ మార్గములలోనుండి సీసెరాతో యుద్ధముచేసెను. కీషోను వాగువెంబడి . . . వారు కొట్టుకొనిపోయిరి.” దానర్థం యుద్ధం చేయడంలో దూతలు ఇశ్రాయేలీయులకు సహాయం చేశారనా? లేదా ఉల్కలు పడ్డాయనా? దానిగురించి బైబిలు ఏమీ చెప్పట్లేదు. కానీ యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో, సరైన సమయంలో భారీ వర్షం కురిపించి 900 యుద్ధ రథాలు బురదలో కూరుకుపోయేలా చేయడం ద్వారా యెహోవా తన ప్రజల్ని రక్షించాడు. ఆ విజయానికి ఘనత 10,000 మనుషుల్లో ఎవ్వరికీ చెందదు. ఇశ్రాయేలీయులు విజయం సాధించినందుకు ఘనతంతా యెహోవాకు చెందుతుందని తెలిపే మాటలు న్యాయాధిపతులు 4:14, 15 వచనాల్లో మూడుసార్లు కనిపిస్తాయి.
10, 11. “మేరోజు” ఏమైవుంటుంది? అది ఎందుకు శపించబడింది?
10 ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని పరిశీలిద్దాం. ఇశ్రాయేలీయులు విజయం సాధించాక యెహోవాను స్తుతిస్తూ దెబోరా, బారాకు పాటలు పాడారు. వాళ్లిలా పాడారు, “మేరోజును శపించుడి దాని నివాసులమీద మహా శాపము నిలుపుడి యెహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు.”—న్యాయా. 5:23.
11 మేరోజు ఏమై ఉంటుంది? మనకు ఖచ్చితంగా తెలీదు. బహుశా మేరోజును శపించినందువల్ల అది నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకు పోయుంటుంది. బారాకుతో కలిసి యుద్ధం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకురాని ప్రజలు ఉన్న పట్టణం పేరు మేరోజు అయ్యుంటుంది. కనానీయులపై యుద్ధం చేయడానికి 10,000 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారంటే, బహుశా మేరోజు పట్టణంలోని ప్రజలు కూడా ఆ ప్రకటన వినివుంటారు. లేకపోతే, బారాకు నుండి తప్పించుకొని సీసెరా మేరోజు పట్టణం గుండా పారిపోయి ఉండవచ్చు. అతన్ని పట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ పట్టణంలోని ప్రజలు ఏమీ చేసి ఉండకపోవచ్చు. ప్రసిద్ధి చెందిన ఓ యోధుడు తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని వీధుల వెంబడి పరుగెత్తుకొని వెళ్లడాన్ని ఆ ప్రజలు చూస్తున్నట్లు ఒకసారి ఊహించుకోండి. యెహోవా సంకల్పానికి మద్దతివ్వడానికి వాళ్లు ఏదో ఒకటి చేసుండాల్సింది. అలా చేసుంటే యెహోవా వాళ్లకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు. కానీ యెహోవా కోసం ఏదోకటి చేసే అవకాశం ఉన్నప్పటికీ వాళ్లు చేతులు కట్టుకుని కూర్చున్నారు. ధైర్యంగా చర్య తీసుకున్న యాయేలుకు, మేరోజు పట్టణ ప్రజలకు ఎంత తేడా ఉందో కదా!—న్యాయా. 5:24-27.
12. న్యాయాధిపతులు 5:9, 10 వచనాల్లో ఎలాంటి రెండు అభిప్రాయాల గురించి ఉంది? దాన్నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
12 న్యాయాధిపతులు 5:9, 10 వచనాల్ని గమనిస్తే, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 10,000 మందికి అలాగే యుద్ధం చేయడానికి ముందుకు రానివాళ్లకు మధ్య ఉన్న తేడా కనిపిస్తుంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ఇశ్రాయేలీయుల అధిపతుల్ని దెబోరా, బారాకు మెచ్చుకున్నారు. వాళ్లకూ, ‘తెల్లగాడిదలు ఎక్కినవాళ్లకూ’ చాలా తేడా ఉంది. గాడిదలపై కూర్చున్నవాళ్లు, తాము స్వచ్ఛందంగా పనిచేయడమేంటి అని అనుకున్నారు. వాళ్లు ‘తివాసులమీద కూర్చుని’ జీవితాన్ని హాయిగా అనుభవిస్తున్నారు, కానీ స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వాళ్లు ‘త్రోవలో నడిచివెళ్తున్నారని’ బైబిలు వర్ణిస్తోంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వాళ్లు తాబోరు రాళ్ల కొండలపై, తడిగా ఉండే కీషోను లోయల్లో యుద్ధం చేయడానికి వెళ్లారు. అందుకే హాయిగా జీవించాలనుకునేవాళ్లకు ‘ఆలోచించుకోండి’ అనే సలహా ఇవ్వబడింది. యెహోవా పని కోసం స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడం వల్ల వాళ్లు ఎలాంటి అవకాశాలు చేజార్చుకున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేడు మనం కూడా యెహోవా సేవ విషయంలో ఎలాంటి అభిప్రాయం కలిగివున్నామో ఆలోచించుకోవాలి.
13. రూబేను, దాను, ఆషేరు కుటుంబాలవాళ్లకూ జెబూలూను, నఫ్తాలి కుటుంబాలవాళ్లకూ ఉన్న తేడా ఏమిటి?
13 యెహోవా విశ్వ సర్వాధిపతిగా వ్యవహరించడాన్ని కళ్లారా చూసే అవకాశం స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 10,000 మందికి దొరికింది. ‘యెహోవా నీతి క్రియల’ గురించి మాట్లాడేటప్పుడు వాళ్లు చూసిన విషయాల్ని ఇతరులకు చెప్పగలరు. (న్యాయా. 5:11) కానీ రూబేను, దాను, ఆషేరు కుటుంబాలవాళ్లు తమ సంపదలకే అంటే తమ మందలకు, ఓడలకు, రేవులకే ఎక్కువ విలువిచ్చారుగానీ యెహోవా పనికి విలువివ్వలేదు. (న్యాయా. 5:15-17) కానీ అందరూ వాళ్లలా లేరు. జెబూలూను, నఫ్తాలి కుటుంబాలవాళ్లు, దెబోరా, బారాకులకు మద్దతివ్వడం కోసం తమ ప్రాణాల్ని కూడా లెక్కచేయలేదు. (న్యాయా. 5:18) స్వచ్ఛంద సేవ విషయంలో ఇలా వేర్వేరు అభిప్రాయాలు కలిగిన వీళ్ల నుండి మనం ఓ ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు.
‘యెహోవాను స్తుతించండి!’
14. యెహోవాకున్న పరిపాలనా హక్కును సమర్థిస్తున్నామని నేడు మనమెలా చూపించవచ్చు?
14 యెహోవాకున్న పరిపాలనా హక్కును సమర్థించడానికి నేడు మనం నిజంగా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. బదులుగా మంచివార్తను ధైర్యంగా, ఉత్సాహంగా ప్రకటించడం ద్వారా మన మద్దతును తెలుపుతాం. మునుపెన్నటికన్నా యెహోవా సేవలో స్వచ్ఛంద సేవకుల అవసరం ఇప్పుడు ఎక్కువగా ఉంది. లక్షలమంది సహోదరులు, సహోదరీలు, యువతీయువకులు స్వచ్ఛందంగా వేర్వేరు రంగాల్లో పూర్తికాల సేవ చేస్తున్నారు. ఉదాహరణకు చాలామంది పయినీర్లుగా సేవ చేస్తున్నారు, బెతెల్‌లో పనిచేస్తున్నారు, రాజ్యమందిర నిర్మాణ పనుల్లో సహాయం చేస్తున్నారు, సమావేశాల్లో స్వచ్ఛంద సేవకులుగా పనిచేస్తున్నారు. కొంతమంది పెద్దలు హాస్పిటల్ అనుసంధాన కమిటీల్లో, సమావేశాల్ని ఏర్పాటు చేసే పనుల్లో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. యెహోవా సేవలో ఏ రంగంలో అవసరముంటే అక్కడ పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చే మన స్ఫూర్తిని చూసి యెహోవా ఖచ్చితంగా సంతోషిస్తాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు. అంతేకాదు మన కృషిని ఆయనెప్పటికీ మర్చిపోడు.—హెబ్రీ. 6:10.
15. యెహోవా పని విషయంలో మన ఉత్సాహం తగ్గకుండా ఎలా జాగ్రత్తపడవచ్చు?
15 స్వచ్ఛంద సేవ గురించి మనకు ఎలాంటి అభిప్రాయం ఉందో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను ఎక్కువశాతం పనిని వేరేవాళ్లకే వదిలేస్తున్నానా? యెహోవా సేవ చేయడం కన్నా వస్తుసంపదల్ని సంపాదించడం మీదే ఎక్కువ శ్రద్ధపెడుతున్నానా? లేదా బారాకు, దెబోరా, యాయేలు, 10,000 మంది స్వచ్ఛంద సేవకుల విశ్వాసాన్నీ ధైర్యాన్నీ అనుకరిస్తూ నా దగ్గరున్నవన్నీ యెహోవా సేవ కోసం ఉపయోగిస్తున్నానా? ఎక్కువ డబ్బు సంపాదించడానికి, మరింత సుఖంగా జీవించడానికి నేను వేరే నగరానికి లేదా దేశానికి వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నానా? ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే, నేను వెళ్లిపోవడం వల్ల నా కుటుంబంపై, సంఘంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయం గురించి యెహోవాకు ప్రార్థించానా?’ c
16. యెహోవాకు అన్నీ ఉన్నప్పటికీ, మనం ఆయనకు ఇవ్వగలిగింది ఏమిటి?
16 తనకున్న పరిపాలనా హక్కును సమర్థించే అవకాశం ఇవ్వడం ద్వారా యెహోవా మనకు ఎనలేని గౌరవాన్ని ఇచ్చాడు. ఆదాము కాలం మొదలుకొని, సాతాను మనల్ని తనవైపు లాక్కోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ మనం యెహోవా పరిపాలనా హక్కుకు మద్దతిస్తే, మనం యెహోవా పక్షాన ఉంటామని సాతానుకు బిగ్గరగా, స్పష్టంగా చెప్పిన వాళ్లమౌతాం. మనకు విశ్వాసం, నమ్మకం ఉంటే స్వచ్ఛందంగా యెహోవాకు సేవ చేయాలనే కోరిక మనలో కలుగుతుంది, అది యెహోవాను ఎంతో సంతోషపెడుతుంది. (సామె. 23:15, 16) నమ్మకంగా మనమిచ్చే మద్దతును, వినయాన్ని చూపించి మన దేవుడు సాతాను వేసే నిందలకు చెంపదెబ్బలాంటి జవాబును ఇవ్వగలడు. (సామె. 27:11) మనం యెహోవాకు ఏదైనా ఇవ్వగలమంటే అది మన విధేయతే, దాన్ని ఆయన్నెంతో విలువైనదిగా చూస్తాడు. మనం విధేయత చూపించినప్పుడు ఆయన చాలా సంతోషిస్తాడు.
17. భవిష్యత్తులో జరగబోయే దానిగురించి న్యాయాధిపతులు 5:31 ఏమి చెప్తుంది?
17 త్వరలోనే ఈ భూమంతా, యెహోవా పరిపాలనను కోరుకునే ప్రజలతో నిండి ఉంటుంది. ఆ రోజు రావాలని మనమెంత ఎదురుచూస్తున్నామో కదా! ‘ఓ యెహోవా, నీ శత్రువులందరూ నాశనమవ్వాలి, కానీ నిన్ను ప్రేమించేవాళ్లు సూర్యునిలా ప్రకాశించాలి’ అని పాడిన దెబోరా, బారాకులాగే మనం కూడా భావిస్తాం. (న్యాయా. 5:31, NW) సాతాను దుష్టలోకాన్ని యెహోవా నాశనం చేసిన తర్వాత ఈ మాటలు నిజమౌతాయి. హార్‌మెగిద్దోను యుద్ధం మొదలైనప్పుడు, తన శత్రువును నాశనం చేయడానికి యెహోవాకు స్వచ్ఛంద సేవకుల అవసరం ఉండదు. బదులుగా మనం ‘నిలబడి, యెహోవా దయచేసే రక్షణ చూస్తాం.’ (2 దిన. 20:17) ఈలోపు మనం ధైర్యాన్ని, ఉత్సాహాన్ని చూపిస్తూ యెహోవా పరిపాలనా హక్కుకు మద్దతిచ్చే అద్భుతమైన అవకాశాలు ఎన్నో ఉన్నాయి.
18. స్వచ్ఛందంగా మనం చేసే సేవవల్ల ఇతరులు ఎలా ప్రయోజనం పొందుతారు?
18 దెబోరా, అలాగే బారాకు యెహోవాను స్తుతిస్తూ విజయగీతాన్ని పాడారుగానీ మనుషుల్ని స్తుతిస్తూ కాదు. ‘ప్రజలు స్వచ్ఛందంగా యుద్ధానికి వెళ్లారు, యెహోవాను స్తుతించండి!’ అని వాళ్లు పాడారు. (న్యాయా. 5:1-2, NW) అదేవిధంగా ఏ రంగంలో అవసరమైతే ఆ రంగంలో యెహోవా సేవ చేసినప్పుడు, మనల్ని చూసి ఇతరులు కూడా ‘యెహోవాను స్తుతించాలనే’ ప్రోత్సాహం పొందుతారు.
a ఇనుప యుద్ధ రథచక్రాలకు కత్తుల్లాంటి పరికరాలు ఉండేవి. అవి పదునుగా, పొడవుగా, కొన్నిసార్లు మెలితిరిగి ఉండేవి. అవి రథచక్రాలకు అతుకబడి బయటికి పొడుచుకొచ్చినట్లుగా ఉండేవి. అంత భయంకరమైన యుద్ధ రథానికి ఎదురు వెళ్లడానికి ఎవరు మాత్రం ధైర్యం చేయగలరు?
b అప్పుడు జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి ఎక్కువ తెలుసుకోవడానికి 2015, ఆగస్టు 1 కావలికోట (ఇంగ్లీషు) సంచికలోని 12-15 పేజీలు చూడండి.
c 2015, అక్టోబరు 1 కావలికోట సంచికలో “డబ్బు గురించి ఆందోళన” అనే ఆర్టికల్ చూడండి.