పాఠకుల ప్రశ్న
2 థెస్సలొనీకయులు 3:14 ప్రకారం, ఒక వ్యక్తికి గుర్తు వేసేది సంఘపెద్దలా లేక ప్రచారకులా?
అపొస్తలుడైన పౌలు థెస్సలొనీకలో ఉన్న క్రైస్తవులకు ఇలా రాశాడు: ‘ఎవరైనా మేము ఈ ఉత్తరంలో చెప్పిన మాటకు లోబడకపోతే, అతనికి గుర్తు వేయండి.’ (2 థెస్స. 3:14) ఈ నిర్దేశం పెద్దల కోసం ఇవ్వబడిందని గతంలో అనుకున్నాం. సంఘపెద్దలు ఎన్నిసార్లు సలహా ఇచ్చినా ఒకవ్యక్తి బైబిలు సూత్రాల్ని తిరస్కరిస్తుంటే, పెద్దలు సంఘంలో ఒక హెచ్చరికా ప్రసంగాన్ని ఇస్తారు. ఆ తర్వాత నుండి ప్రచారకులు మీటింగ్‌లో, ప్రీచింగ్‌లో తప్ప గుర్తువేయబడిన వ్యక్తితో అనవసరంగా సమయం గడపరు.
అయితే, ఈ విషయంలో సవరణ అవసరమైంది. ఇది పరిస్థితుల్ని బట్టి, ఒక్కో క్రైస్తవుడు తీసుకోవాల్సిన నిర్ణయం అని పౌలు ఇచ్చిన సలహాను బట్టి అర్థమౌతుంది. కాబట్టి పెద్దలు హెచ్చరికా ప్రసంగాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మార్పు ఎందుకు అవసరమైంది? పౌలు మాటల సందర్భాన్ని ఇప్పుడు చూద్దాం.
సంఘంలో కొంతమంది ‘పద్ధతిగా నడుచుకోవట్లేదని’ పౌలు గమనించాడు. వాళ్లకు బైబిలు ఆధారంగా సలహా ఇస్తున్నా, దాన్ని తిరస్కరిస్తూ వచ్చారు. ఇంతకుముందు పౌలు వాళ్లను కలిసినప్పుడు ఇలా చెప్పాడు: “ఎవరికైనా పనిచేయడం ఇష్టంలేకపోతే వాళ్లు భోజనం చేయకూడదు.” అయినా, కొంతమందికి తమను తాము పోషించుకునే సామర్థ్యం ఉన్నా పని చేయట్లేదు. అంతేకాదు, వాళ్లు ఇతరుల విషయాల్లో తలదూరుస్తున్నారు. అలాంటి వాళ్లతో మిగతా క్రైస్తవులు ఎలా ఉండాలి?—2 థెస్స. 3:6, 10-12.
‘అతనికి గుర్తు వేయండి’ అని పౌలు చెప్పాడు. గుర్తు వేయడం అని అనువదించబడిన గ్రీకు పదం ఆ వ్యక్తిని గుర్తించి, అతనితో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. అయితే, పౌలు ఈ నిర్దేశాన్ని పెద్దలకు మాత్రమే కాదుగానీ సంఘం మొత్తానికి ఇచ్చాడు. (2 థెస్స. 1:1; 3:6) కాబట్టి బైబిలు సలహాల్ని నిరాకరిస్తున్న వ్యక్తిని ఒక్కో క్రైస్తవుడు గుర్తించి, అతనితో ‘సహవాసం మానేయాలి.’
అంటే, అతన్ని సంఘం నుండి తొలగించబడిన వ్యక్తిలా చూడాలని దానర్థమా? కాదు. పౌలు ఇలా చెప్పాడు: “అతన్ని సహోదరుడిగా భావించి ఉపదేశిస్తూ ఉండండి.” కాబట్టి ఒక్కో క్రైస్తవుడు మీటింగ్‌లో, ప్రీచింగ్‌లో అతనితో సహవసించవచ్చు, కానీ సరదాగా సమయం గడిపే విషయంలో అతనితో సహవసించకూడదని వాళ్లు నిర్ణయించుకోవచ్చు. ఎందుకు? “అతను సిగ్గుపడేలా” అని పౌలు చెప్పాడు. అతనికి గుర్తు వేసినప్పుడు, తన ప్రవర్తన విషయంలో మార్పులు చేసుకునే అవకాశం ఉంది.—2 థెస్స. 3:14, 15.
ఈ సలహాను నేడు క్రైస్తవులు ఎలా పాటించవచ్చు? మొదటిగా, పౌలు చెప్తున్నట్టు “పద్ధతిగా నడుచుకోని” వ్యక్తిని గుర్తించాలి. అంటే మన అభిప్రాయాలకు లేదా మనస్సాక్షికి వేరుగా ఉండే నిర్ణయాలు తీసుకున్న వాళ్ల గురించి పౌలు మాట్లాడట్లేదు, అలాగే మనల్ని బాధ పెట్టిన వాళ్ల గురించి కూడా మాట్లాడట్లేదు. బదులుగా, బైబిలు ఇస్తున్న స్పష్టమైన సలహాల్ని కావాలనే పాటించని వాళ్ల గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు.
నేడు ఒక బ్రదర్‌కి గానీ సిస్టర్‌కి గానీ ఎదురుతిరిగే స్ఫూర్తి a ఉందని మనం గుర్తిస్తే, అతనితో స్నేహం చేస్తూ సరదాగా సమయం గడపాలా వద్దా అనేది ఎవరికి వాళ్లే వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవాలి. ఇది మన వ్యక్తిగత నిర్ణయం కాబట్టి కుటుంబ సభ్యులతో కాకుండా ఇంకెవ్వరితో దానిగురించి మాట్లాడం. అయితే మీటింగ్స్‌లో, ప్రీచింగ్‌లో మాత్రం అతనితో మనం సహవసిస్తూనే ఉంటాం. ఎప్పుడైతే అతను తన ప్రవర్తనను మార్చుకుంటాడో, అప్పుడు మనం అతనితో తిరిగి ఎప్పటిలాగే సహవసించవచ్చు.
a ఉదాహరణకు, ఒక క్రైస్తవుడు తనను తాను పోషించుకోగలిగే సామర్థ్యం ఉన్నా పని చేయడానికి ఇష్టపడకపోవచ్చు, యెహోవాసాక్షి కాని వ్యక్తితో కోర్ట్‌షిప్ చేస్తుండవచ్చు, లేదా సంఘానికి ఇచ్చే నిర్దేశానికి ఎదురు తిరుగుతుండవచ్చు, హానికరమైన పుకార్లు చెప్తుండవచ్చు. (1 కొరిం. 7:39; 2 కొరిం. 6:14; 2 థెస్స. 3:11, 12; 1 తిమో. 5:13) ఇలాంటివి మానకుండా చేసేవాళ్లు ‘పద్ధతిగా నడుచుకోవట్లేదు.’