అధ్యయన ఆర్టికల్ 41
పాట 13 క్రీస్తు మన ఆదర్శం
యేసు భూమ్మీద గడిపిన చివరి 40 రోజుల నుండి నేర్చుకునే పాఠాలు
“40 రోజులపాటు ఆయన వాళ్లకు చాలాసార్లు కనిపించి, దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు.”—అపొ. 1:3.
ముఖ్యాంశం
యేసు భూమ్మీద గడిపిన చివరి 40 రోజుల్ని పరిశీలించి, ఆయన ఆదర్శాన్ని మనం ఎలా పాటించవచ్చో చూస్తాం.
1-2. యేసు శిష్యుల్లో ఇద్దరు ఎమ్మాయుకు వెళ్తున్నప్పుడు ఏం జరిగింది?
అది క్రీస్తు శకం 33 నీసాను 16. యేసు శిష్యుల్లో ఇద్దరు యెరూషలేము నుండి దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మాయు అనే గ్రామానికి బయల్దేరారు. మిగతా శిష్యుల్లాగే వీళ్లిద్దరు కూడా బాధలో మునిగిపోయారు, భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఎందుకంటే వాళ్లు వెంబడించిన యేసును కొన్ని రోజుల క్రితమే చంపేశారు. దాంతో వాళ్లు చాలా డీలాపడిపోయారు. వాళ్లు మెస్సీయ మీద పెట్టుకున్న ఆశలన్నీ అటకెక్కాయి అనుకున్నారు. కానీ వాళ్లు ఊహించనిది ఒకటి జరగబోతుంది.
2 పరిచయంలేని ఒకాయన ఆ ఇద్దరి శిష్యులతో కలిసి నడవడం మొదలుపెట్టాడు. యేసుకు జరిగిన వాటన్నిటి గురించి వాళ్లు ఆయనకు చెప్పారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు వాళ్ల మనసులో ముద్రపడిపోయాయి. “మోషే, ప్రవక్తలందరూ రాసిన వాటితో మొదలుపెట్టి” మెస్సీయ ఎందుకు బాధలుపడి చనిపోవాల్సి వచ్చిందో ఆయన వివరించాడు. అలా మాట్లాడుతూ-మాట్లాడుతూ ఆ ముగ్గురు ఎమ్మాయుకు చేరుకున్నారు. ఆ ఇద్దరు శిష్యులు ఇప్పటివరకు తమతో మాట్లాడింది పునరుత్థానమైన యేసే అని గుర్తుపట్టేశారు. మెస్సీయ తిరిగి బ్రతికాడని తెలుసుకోవడం వాళ్లకు ఎంత సంతోషాన్ని ఇచ్చి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.—లూకా 24:13-35.
3-4. యేసు శిష్యుల్లో ఎలాంటి మార్పు వచ్చింది? ఈ ఆర్టికల్‌లో మనం ఏం నేర్చుకుంటాం? (అపొస్తలుల కార్యాలు 1:3)
3 యేసు భూమ్మీద గడిపిన చివరి 40 రోజుల్లో తన శిష్యులకు చాలాసార్లు కనిపించాడు. (అపొస్తలుల కార్యాలు 1:3 చదవండి.) బాధలో, భయంలో మునిగిపోయిన తన శిష్యులందర్నీ యేసు ఆ సమయంలో బలపర్చాడు. దానివల్ల వాళ్లందరూ సంతోషంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో మంచివార్తను ప్రకటించగలిగారు, బోధించగలిగారు. a
4 యేసు జీవితంలో ఎంతో ఆసక్తిగా గడిచిన ఈ 40 రోజుల నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. యేసు ఆ సమయంలో (1) తన శిష్యుల్ని ప్రోత్సహించాడు, (2) లేఖనాల్ని బాగా అర్థం చేసుకునేలా వాళ్లకు సహాయం చేశాడు, (3) పెద్దపెద్ద బాధ్యతల్ని తీసుకునేలా వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ మూడు విషయాల్లో యేసు ఉంచిన ఆదర్శాన్ని మనం ఎలా పాటించవచ్చో ఈ ఆర్టికల్‌లో నేర్చుకుంటాం.
ఇతరుల్ని ప్రోత్సహించండి
5. యేసు శిష్యులకు ప్రోత్సాహం ఎందుకు అవసరమైంది?
5 యేసు శిష్యులకు ప్రోత్సాహం అవసరమైంది. ఎందుకు? యేసు వెంట వెళ్లడానికి కొంతమంది తమ ఇళ్లను, కుటుంబాలను, వ్యాపారాన్ని వదిలేశారు. (మత్త. 19:27) ఇంకొంతమంది యేసు శిష్యులైనందుకు అన్యాయాన్ని ఎదుర్కొన్నారు. (యోహా. 9:22) యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని నమ్మారు కాబట్టే వాళ్లు ఈ త్యాగాలన్నీ చేశారు. (మత్త. 16:16) కానీ యేసు చనిపోయినప్పుడు వాళ్ల ఆశలన్నీ అడియాశలయ్యాయి, వాళ్లు కుప్పకూలిపోయారు.
6. తిరిగి బ్రతికిన తర్వాత యేసు ఏం చేశాడు?
6 ఇలాంటి విషాదకరమైన సందర్భంలో తన శిష్యులు బాధపడడం సహజమని యేసు అర్థంచేసుకున్నాడు, వాళ్ల విశ్వాసం తగ్గిపోయిందని మాత్రం అనుకోలేదు. అందుకే ఆయన తిరిగి బ్రతికిన రోజు నుండే తన స్నేహితులందర్నీ ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. ఉదాహరణకు, సమాధి దగ్గర ఏడుస్తున్న మగ్దలేనే మరియకు ఆయన కనిపించాడు. (యోహా. 20:11, 16) ఈ ఆర్టికల్ మొదట్లో చర్చించుకున్నట్లు, ఎమ్మాయుకు వెళ్తున్న ఇద్దరి శిష్యులకు కనిపించాడు. అపొస్తలుడైన పేతురుకు కూడా కనిపించాడు. (లూకా 24:34) యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? యేసు మొదటిగా మగ్దలేనే మరియకు కనిపించినప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
7. యోహాను 20:11-16 ప్రకారం, మరియ ఏం చేయడాన్ని యేసు గమనించాడు? అప్పుడు ఆయన ఏం చేశాడు? (చిత్రం కూడా చూడండి.)
7 యోహాను 20:11-16 చదవండి. నీసాను 16 తెల్లవారుజామున కొంతమంది నమ్మకమైన స్త్రీలు యేసు సమాధి దగ్గరికి వెళ్లారు. (లూకా 24:1, 10) వాళ్లలో ఒకరైన మగ్దలేనే మరియ గురించి ఆలోచిద్దాం. ఆమె సమాధి దగ్గరికి వెళ్లేసరికి సమాధి ఖాళీగా ఉంది. ఈ విషయాన్ని ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి పేతురుకు, యోహానుకు చెప్పింది. వాళ్లు కూడా ఆమెతోపాటు వచ్చి, సమాధి ఖాళీగా ఉండడం చూసి తిరిగి వాళ్ల ఇంటికి వెళ్లిపోయారు. కానీ మరియ మాత్రం అక్కడే ఏడుస్తూ ఉండిపోయింది. యేసు ఆమెను గమనిస్తున్నాడని ఆమెకు తెలీదు. ఆమె కార్చిన కన్నీరు యేసు హృదయాన్ని ఎంతో కదిలించింది. అందుకే యేసు ఆమెకు కనిపించి, ఆమెకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చే ఒక చిన్న పని చేశాడు. ఆయన ఆమెతో మాట్లాడాడు, ఒక ముఖ్యమైన పనిని ఆమెకు అప్పగించాడు. తాను తిరిగి బ్రతికాననే విషయం తన సహోదరులకు చెప్పమన్నాడు.—యోహా. 20:17, 18.
8. యేసులా మనం కూడా ఏం చేయవచ్చు?
8 యేసులా మనం కూడా ఏం చేయవచ్చు? యెహోవా సేవను కొనసాగిస్తూ ఉండేలా మనం కూడా యేసులా మన బ్రదర్స్-సిస్టర్స్‌ని ప్రోత్సహించవచ్చు. వాళ్లు ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొంటున్నారో, వాళ్లకు ఎలా అనిపిస్తుందో తెలుసుకుని వాళ్లని ఓదార్చవచ్చు. ఉదాహరణకు, జోస్లిన్ అనే సిస్టర్ గురించి చూడండి. ఆమె చెల్లి ఒక యాక్సిడెంట్‌లో చనిపోయింది. ఆమె ఇలా అంటుంది: “చాలా నెలలపాటు ఆ బాధలోనే ఉండిపోయాను.” తన పరిస్థితిని తెలుసుకున్న ఒక జంట ఆమెను వాళ్ల ఇంటికి పిలిచారు. వాళ్లు ఆమె తన మనసులో ఉన్నదంతా చెప్పనిచ్చారు, ఓపిగ్గా విన్నారు. అంతేకాదు యెహోవాకు ఆమె ఎంత విలువైనదో కూడా చెప్పారు. ఆమె ఇంకా ఇలా అంటుంది: “నిజానికి అప్పుడు నా పరిస్థితి అస్సలు బాలేదు. అలలు ఎగిసిపడుతూ అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో మునిగిపోతున్నట్టు నాకు అనిపించింది. ఆ పరిస్థితి నుండి నన్ను బయటపడేయడానికి యెహోవా ఈ జంటను ఉపయోగించుకున్నాడు. యెహోవా సేవ చేయాలనే కోరిక నాలో మళ్లీ చిగురించేలా వాళ్లు సహాయం చేశారు.” మనం కూడా ఇతరులు తమ మనసులో ఉన్నదంతా చెప్పుకోనివ్వాలి, శ్రద్ధగా వినాలి, వాళ్ల ఫీలింగ్స్‌ని అర్థం చేసుకుంటూ మాట్లాడాలి. అలా చేస్తే యెహోవా సేవలో కొనసాగేలా వాళ్లను బలపర్చిన వాళ్లమౌతాం.—రోమా. 12:15.
లేఖనాల్ని అర్థం చేసుకునేలా సహాయం చేయండి
9. యేసు శిష్యులు ఏ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు? వాళ్లకు యేసు ఎలా సహాయం చేశాడు?
9 యేసు శిష్యులు దేవుని వాక్యాన్ని నమ్మారు. దాన్ని వాళ్ల జీవితంలో పాటించడానికి చేయగలిగినదంతా చేశారు. (యోహా. 17:6) అయినప్పటికీ యేసు ఒక నేరస్తునిలా హింసాకొయ్య మీద ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో వాళ్లకు అస్సలు అర్థంకాలేదు. దానికి కారణం వాళ్లకు విశ్వాసం, ప్రేమ తగ్గిపోయాయని కాదుగానీ, లేఖనాల్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని యేసు గ్రహించాడు. (లూకా 9:44, 45; యోహా. 20:9) కాబట్టి లేఖనాల్ని అర్థం చేసుకునేలా యేసు సహాయం చేశాడు. ఉదాహరణకు, ఎమ్మాయుకు వెళ్తున్న ఇద్దరు శిష్యులతో ఆయన ఎలా మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం.
10. తనే మెస్సీయ అనే నమ్మకం బలపర్చుకునేలా శిష్యులకు యేసు ఎలా సహాయం చేశాడు? (లూకా 24:18-27)
10 లూకా 24:18-27 చదవండి. యేసు ఆ ఇద్దరు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు తను ఎవరో ముందే చెప్పలేదన్న విషయాన్ని గమనించండి. బదులుగా ఆయన వాళ్లను ప్రశ్నలు అడిగాడు. ఎందుకు? బహుశా వాళ్లు తమ మనసులో ఉన్నదంతా బయటికి చెప్పాలని ఆయన కోరుకున్నాడు. వాళ్లు అదే చేశారు. రోమన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయుల్ని యేసు విడిపిస్తాడని వాళ్లు అనుకున్నట్టు ఆయనతో చెప్పారు. వాళ్ల మనసులో ఉన్నదంతా చెప్పిన తర్వాత, ఇప్పటివరకు జరిగిన వాటి గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయో అర్థం చేసుకునేలా యేసు ఆ ఇద్దరికి సహాయం చేశాడు. b అదే రోజు సాయంత్రం మిగతా శిష్యులతో కూడా ఇవే విషయాల్ని ఆయన చెప్పాడు. (లూకా 24:33-48) దీన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
11-12. (ఎ) యేసు బైబిలు సత్యాల్ని బోధించిన విధానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.) (బి) నార్టేయ్‌కి స్టడీ ఇచ్చిన బ్రదర్ తనకు ఎలా సహాయం చేశాడు?
11 యేసులా మనం కూడా ఏం చేయవచ్చు? మొదటిగా, మీ బైబిలు విద్యార్థుల మనసులో ఏముందో తెలుసుకోవడానికి నేర్పుగా ప్రశ్నలు అడగండి. (సామె. 20:5) వాళ్ల ఫీలింగ్స్ ఏంటో అర్థమయ్యాక, వాళ్ల పరిస్థితికి సరిపోయే లేఖనాల్ని ఎలా వెదకాలో వాళ్లకు చూపించండి. అయితే వాళ్లు ఏం చేయాలో మీరే చెప్పేయకండి. బదులుగా లేఖనాల్ని సొంతగా అర్థం చేసుకునేలా, ఆ లేఖన సూత్రాల్ని ఎలా పాటించాలో ఆలోచించుకునేలా సహాయం చేయండి. ఘానాలో ఉంటున్న నార్టేయ్ అనుభవాన్ని చూడండి.
12 నార్టేయ్‌కి 16 ఏళ్లు ఉన్నప్పుడే బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకే కుటుంబం నుండి వ్యతిరేకత వచ్చింది. మరి స్టడీని కొనసాగించడానికి అతనికి ఏం సహాయం చేసింది? అతనికి స్టడీ ఇస్తున్న బ్రదర్ మత్తయి 10వ అధ్యాయాన్ని చూపించి నిజక్రైస్తవులకు హింసలు వస్తాయని వివరించాడు. “అందుకే హింస వచ్చినప్పుడు నేను సత్యాన్ని కనుగొన్నాను అనే నమ్మకం నాకు కుదిరింది” అని నార్టేయ్ అంటున్నాడు. ఆ బ్రదర్ మత్తయి 10:16 లేఖనాన్ని కూడా చూపించి, తన నమ్మకాల్ని ఇంట్లోవాళ్లకు జాగ్రత్తగా, గౌరవంగా ఎలా వివరించాలో అర్థం చేసుకునేలా సహాయం చేశాడు. బాప్తిస్మం తర్వాత నార్టేయ్ పయినీరింగ్ చేయాలనుకున్నాడు. కానీ వాళ్ల నాన్నేమో తనని పై చదువులు చదివించాలని అనుకున్నాడు. అప్పుడు స్టడీ ఇస్తున్న బ్రదర్ తను ఏం చేయాలో చెప్పే బదులు, ప్రశ్నలు ఉపయోగించి అతని మనసులో ఉన్నది రాబట్టాడు. అంతేకాకుండా లేఖన సూత్రాల్ని ఉపయోగిస్తూ ఆలోచించేలా సహాయం చేశాడు. చివరికి నార్టేయ్ ఏం నిర్ణయించుకున్నాడు? అతను పయినీరింగ్ మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ల నాన్న తనని ఇంట్లో నుండి గెంటేశాడు. జరిగిన దాన్నంతటిని బట్టి నార్టేయ్ ఇలా అంటున్నాడు: “నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను. ఈ విషయంలో నాకు ఎలాంటి డౌట్ లేదు.” మనం కూడా సమయం తీసుకుని, లేఖనాల్ని అర్థం చేసుకునేలా ఇతరులకు సహాయం చేసినప్పుడు వాళ్లు సత్యంలో స్థిరంగా ఉంటారు.—ఎఫె. 3:16-19.
‘మనుషుల్లో వరాల్లా’ తయారయ్యేలా బ్రదర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వండి
13. తను పరలోకానికి వెళ్లిన తర్వాత కూడా తన తండ్రి పని కొనసాగేలా యేసు ఎలా చూసుకున్నాడు? (ఎఫెసీయులు 4:8)
13 యేసు భూమ్మీద ఉన్నప్పుడు తన తండ్రి ఇచ్చిన పనిని చాలా బాగా చేశాడు. (యోహా. 17:4) అయితే ఆ పనిని తను ఒక్కడే చేయగలడని, దాన్ని వేరేవాళ్లకు ఇస్తే వాళ్లు సరిగ్గా చేయలేరని యేసు అనుకోలేదు. ఆయన భూమ్మీద మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు, వేరేవాళ్లకు ఆ పనిలో ట్రైనింగ్ ఇచ్చాడు. ఆయన శిష్యుల్లో కొంతమందికి కేవలం 20-30 ఏళ్ల వయసు మాత్రమే ఉండి ఉంటుంది. అయినాసరే ఆయన పరలోకానికి వెళ్లేముందు, యెహోవా అమూల్యమైన గొర్రెల్ని చూసుకునే బాధ్యతను, ప్రకటనా-బోధనా పనిని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను వాళ్లకు అప్పగించాడు. (ఎఫెసీయులు 4:8 చదవండి.) కష్టపడి పనిచేసే తన నమ్మకమైన శిష్యుల్ని ‘మనుషుల్లో వరాల్లా’ తయారుచేయడానికి యేసు ఆ చివరి 40 రోజుల్లో ఏం చేశాడు?
14. యేసు భూమ్మీద గడిపిన చివరి 40 రోజుల్లో తన శిష్యులు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎలా సహాయం చేశాడు? (చిత్రం కూడా చూడండి.)
14 యేసు తన శిష్యులకు ప్రేమగానే సూటైన సలహా ఇచ్చాడు. ఉదాహరణకు, కొంతమందికి సందేహించే అలవాటుందని గమనించి వాళ్లను సరిదిద్దాడు. (లూకా 24:25-27; యోహా. 20:27) వాళ్లు డబ్బు సంపాదించడం మీద, వ్యాపారం మీద కాకుండా, సంఘంలోని గొర్రెల్ని కాసే పనిమీద ఎక్కువ మనసుపెట్టాలని ప్రోత్సహించాడు. (యోహా. 21:15) అంతేకాదు ‘యెహోవా సేవలో వేరేవాళ్లకు ఏ బాధ్యతలు వస్తాయా?’ అని అతిగా చింతించవద్దని చెప్పాడు. (యోహా. 21:20-22) ఇంకా, రాజ్యం గురించి వాళ్లకున్న తప్పుడు అభిప్రాయాల్ని సరిదిద్దాడు. మంచివార్తను ప్రకటించడం మీద ఎక్కువ మనసుపెట్టేలా సహాయం చేశాడు. (అపొ. 1:6-8) పెద్దలు యేసు నుండి ఏం నేర్చుకోవచ్చు?
15-16. (ఎ) సంఘపెద్దలు యేసులా ఎలా ఉండవచ్చో వివరించండి. (బి) సలహా తీసుకోవడం ప్యాట్రిక్‌కి ఎలా సహాయం చేసింది?
15 యేసులా పెద్దలు కూడా ఏం చేయవచ్చు? వయసులో చిన్నవాళ్లతో సహా బ్రదర్స్ అందరికీ బాధ్యతలు చేపట్టేలా సంఘపెద్దలు ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ల పక్కనే ఉండి నేర్పించాలి, సహాయం చేయాలి. c ట్రైనింగ్ తీసుకుంటున్న బ్రదర్స్ ఏ తప్పూ లేకుండా, అన్నీ సరిగ్గా చేయాలని సంఘపెద్దలు అనుకోకూడదు. మీరు ప్రేమతో సలహా ఇచ్చినప్పుడు యౌవన సహోదరులు మంచి అనుభవాన్ని సంపాదించుకుంటారు. వినయంగా, నమ్మకంగా ఉండడాన్ని, ఇతరులకు సేవచేయడానికి ఇష్టంగా ముందుకురావడాన్ని నేర్చుకుంటారు.—1 తిమో. 3:1; 2 తిమో. 2:2; 1 పేతు. 5:5.
16 సలహా తీసుకోవడం ప్యాట్రిక్ అనే యౌవన సహోదరునికి ఎలా సహాయం చేసిందో గమనించండి. ఆయన అందరితో, చివరికి సిస్టర్స్‌తో కూడా దురుసుగా మాట్లాడేవాడు, ప్రవర్తించేవాడు. ఒక సంఘపెద్ద ప్యాట్రిక్‌లో ఉన్న ఈ బలహీనతను గమనించి ప్రేమగా, సూటిగా సలహా ఇచ్చాడు. ప్యాట్రిక్ ఇలా అంటున్నాడు: “ఆయన నాకు సలహా ఇవ్వడం మంచిదైంది. కొన్నిసార్లు యెహోవా సేవలో నేను కోరుకున్న బాధ్యతలు వేరే బ్రదర్స్‌కి రావడం చూసి బాధపడేవాణ్ణి. కానీ ఆ సంఘపెద్ద ఇచ్చిన సలహా వల్ల సంఘంలో బాధ్యతల మీద కాకుండా బ్రదర్స్-సిస్టర్స్‌కి వినయంగా సేవచేయడం మీద మనసుపెట్టాలని అర్థం చేసుకున్నాను.” దానివల్ల ప్యాట్రిక్ 23 ఏళ్లకే సంఘపెద్ద అయ్యాడు.—సామె. 27:9.
17. యేసుకు తన శిష్యుల మీద నమ్మకం ఉందని ఎలా చూపించాడు?
17 యేసు తన శిష్యులకు ప్రకటించే బాధ్యతనే కాదు బోధించే బాధ్యతను కూడా అప్పగించాడు. (మత్త. 28:20) అయితే శిష్యులు తాము ఈ పని చేయలేమని అనుకుని ఉంటారు. కానీ యేసు మాత్రం వాళ్లమీద పూర్తి నమ్మకం ఉంచాడు. వాళ్లకు కూడా అదే చెప్పాడు. అందుకే “తండ్రి నన్ను పంపించినట్టే నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను” అని అన్నాడు.—యోహా. 20:21.
18. యేసులా పెద్దలు కూడా ఏం చేయవచ్చు?
18 యేసులా పెద్దలు కూడా ఏం చేయవచ్చు? అనుభవంగల పెద్దలు ఇతరులకు బాధ్యతలు అప్పజెప్తారు. (ఫిలి. 2:19-22) ఉదాహరణకు రాజ్యమందిరాన్ని శుభ్రం చేసి, రిపేరు చేసే పనుల్ని యౌవనులకు ఇవ్వచ్చు. పెద్దలు బ్రదర్స్‌కి ఏదైనా పని ఇచ్చిన తర్వాత, దాన్ని ఎలా చేయాలో ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్లు ఆ పనిని బాగా చేయగలరని నమ్ముతున్నామని చెప్పాలి. ఈమధ్యే సంఘపెద్ద అయిన మాథ్యూ, పెద్దలు ఇచ్చిన ట్రైనింగ్‌ని చాలా విలువైనదిగా చూస్తున్నాడు. అనుభవంగల పెద్దలు వేర్వేరు పనుల్లో ఆయనకు ట్రైనింగ్ ఇచ్చారు, ఆయన ఆ పనిని చక్కగా చేస్తాడని నమ్మారు. ఆయన ఇలా అంటున్నాడు: “పెద్దలు నేను చేసిన పొరపాట్లను నా ట్రైనింగ్‌లో భాగంగా చూశారు. పనుల్ని ఇంకా బాగా చేయడానికి సహాయం చేశారు. దానివల్ల నేనెంతో నేర్చుకున్నాను.” d
19. మనం ఏం చేయాలని గట్టిగా నిర్ణయించుకోవాలి?
19 చివరి 40 రోజుల్లో యేసు ఇతరుల్ని ప్రోత్సహించాడు, వాళ్లకు నేర్పించాడు, ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. మనం కూడా ఆయన ఆదర్శాన్ని పాటించాలని గట్టిగా నిర్ణయించుకుందాం. (1 పేతు. 2:21) ఈ విషయంలో యేసు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయనిలా మాటిచ్చాడు: “ఈ వ్యవస్థ ముగింపు వరకు నేను ఎప్పుడూ మీతో ఉంటాను.”—మత్త. 28:20.
పాట 15 యెహోవా మొదటి కుమారుణ్ణి కీర్తించండి!
a సువార్త పుస్తకాలు, బైబిల్లోని ఇతర పుస్తకాలు పునరుత్థానమైన యేసు ఎవరెవరికి కనిపించాడో చెప్తున్నాయి. వాళ్లలో కొంతమంది ఎవరంటే: మగ్దలేనే మరియ (యోహా. 20:11-18); కొంతమంది స్త్రీలు (మత్త. 28:8-10; లూకా 24:8-11); ఇద్దరు శిష్యులు (లూకా 24:13-15); పేతురు (లూకా 24:34); తోమా కాకుండా మిగతా అపొస్తలులు (యోహా. 20:19-24); తోమాతో సహా అపొస్తలులు (యోహా. 20:26); ఏడుగురు శిష్యులు (యోహా. 21:1, 2); 500 కన్నా ఎక్కువమంది శిష్యులు (మత్త. 28:16; 1 కొరిం. 15:6); యేసు తమ్ముడైన యాకోబు (1 కొరిం. 15:7); అపొస్తలులందరూ (అపొ. 1:4); బేతనియ దగ్గర అపొస్తలులు. (లూకా 24:50-52) యేసు వేరే సందర్భాల్లో కూడా కనిపించి ఉంటాడు, కానీ దానిగురించి బైబిల్లో లేదు.—యోహా. 21:25.
b మెస్సీయకు సంబంధించిన ప్రవచనాల లిస్టు కోసం jw.org వెబ్‌సైట్‌లో “యేసే మెస్సీయ అని మెస్సీయ గురించిన ప్రవచనాలు నిరూపిస్తున్నాయా?” అనే ఆర్టికల్ చూడండి.
c కొన్నిసార్లు 25 నుండి 30 ఏళ్ల వయసున్న పెద్దలు కూడా ప్రాంతీయ పర్యవేక్షకులుగా నియమించబడతారు. అయితే దానికోసం ముందు వాళ్లు పెద్దలుగా మంచి అనుభవాన్ని సంపాదించాలి.
d బాధ్యతలు చేపట్టేలా యౌవన సహోదరులకు సహాయం చేయడానికి అవసరమైన ఇంకొన్ని సలహాల కోసం ఈ సమాచారం చూడండి: 2018, ఆగస్టు కావలికోట పత్రికలోని 11-12 పేజీల్లో, 15-17 పేరాలు అలాగే 2015, ఏప్రిల్ 15 పత్రికలో 3-13 పేజీలు.
e చిత్రం వివరణ: లేఖనాల గురించి ఆలోచించేలా ఒక బ్రదర్ తన బైబిలు విద్యార్థికి సహాయం చేశాడు. అప్పుడు ఆ విద్యార్థి క్రిస్మస్‌కి సంబంధించిన వస్తువుల్ని పారేయాలని నిర్ణయించుకున్నాడు.