కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 43

పాట 90 ఒకరినొకరు ప్రోత్సహించుకోండి

నిరాశపర్చే సందేహాలు వస్తే ఏం చేయాలి?

నిరాశపర్చే సందేహాలు వస్తే ఏం చేయాలి?

‘అన్నిటినీ పరీక్షించండి.’1 థెస్స. 5:21.

ముఖ్యాంశం

యెహోవా సేవను దెబ్బతీసే సందేహాలు వస్తే ఏం చేయాలో చూస్తాం.

1-2. (ఎ) యెహోవా సేవకులకు ఎలాంటి సందేహాలు రావచ్చు? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం?

 వయసుతో సంబంధం లేకుండా మనందరికీ అప్పుడప్పుడు సందేహాలు a వస్తుంటాయి. కొన్ని ఉదాహరణల్ని పరిశీలించండి. చిన్న వయసులో ఉన్న ఒక అబ్బాయి యెహోవా తనను నిజంగా పట్టించుకుంటున్నాడా అనే సందేహంతో బాప్తిస్మం తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తుండవచ్చు. కాస్త పెద్ద వయసున్న ఒక బ్రదర్‌, యౌవనంలో డబ్బు సంపాదన మీద కాకుండా దేవుని రాజ్యానికే మొదటిస్థానం ఇచ్చాడు. అయితే ఇప్పుడు తన కుటుంబాన్ని చూసుకోవడం కష్టమైపోయేసరికి యౌవనంలో తీసుకున్న నిర్ణయం సరైనదేనా కాదా అని ఆలోచిస్తుండవచ్చు. ఒక పెద్ద వయసు సిస్టర్‌ తన శక్తి తగ్గిపోవడం వల్ల ఒకప్పుడు చేసినంత సేవ ఇప్పుడు చేయలేకపోతున్నాను అని నిరుత్సాహపడుతుండవచ్చు. మీకు కూడా ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా వచ్చాయా: ‘యెహోవా నన్ను నిజంగా పట్టించుకుంటున్నాడా? యెహోవా కోసం నేను చేసిన త్యాగాలకు విలువ ఉందా? నేను యెహోవాకు ఇంకా ఉపయోగపడతానా?’

2 ఒకవేళ మనం ఇలాంటి సందేహాల్ని తీర్చుకోకపోతే, యెహోవా సేవలో మనం వెనకబడవచ్చు, చివరికి పూర్తిగా ఆపేయవచ్చు. (1) యెహోవా మనల్ని పట్టించుకుంటున్నాడా, (2) గతంలో మనం తీసుకున్న నిర్ణయాలు సరైనవా, (3) యెహోవాకు మనం ఇంకా ఉపయోగపడతామా లాంటి సందేహాల్ని తీర్చుకోవడానికి బైబిలు మనకు ఎలా సహాయం చేస్తుందో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

సందేహాల్ని ఎలా తీసేసుకోవాలి?

3. సందేహాల్ని తీసేసుకోవడానికి మనం చేయగలిగే ఒక పని ఏంటి?

3 మన సందేహాల్ని తీసేసుకోవడానికి మనం చేయగలిగే ఒక పని ఏంటంటే, మనకు వచ్చిన ప్రశ్నలకు దేవుని వాక్యంలో జవాబులు వెదకాలి. అలా చేస్తే మనం బలాన్ని పొందుతాం, యెహోవాకు ఇంకా దగ్గరౌతాం, “విశ్వాసంలో స్థిరంగా” ఉంటాం.—1 కొరిం. 16:13.

4. మనం “అన్నిటినీ” ఎలా పరీక్షించవచ్చు? (1 థెస్సలొనీకయులు 5:21)

4 1 థెస్సలొనీకయులు 5:21 చదవండి. ‘అన్నిటినీ పరీక్షించమని’ బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. దాన్నెలా చేయవచ్చు? మనం అనుకుంటున్నది నిజమా కాదా అని నిర్ణయించుకోవడానికి బైబిలు ఏం చెప్తుందో చూడాలి. ఉదాహరణకు దేవుడు తనను పట్టించుకుంటున్నాడా లేదా అనే సందేహం వచ్చిన అబ్బాయి గురించి ఆలోచించండి. తనకు ఆ సందేహం వచ్చిందంటే ఇక అదే నిజమని అతను గుడ్డిగా నమ్మేయాలా? లేదు. యెహోవా తన గురించి నిజంగా ఏం అనుకుంటున్నాడో తెలుసుకుని ‘అన్నిటినీ పరీక్షించాలి.’

5. మన సందేహాలకు యెహోవా ఇచ్చే జవాబులు ఎలా తెలుసుకోవాలి?

5 మనం దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఒక విధంగా యెహోవా మాటను “వింటాం.” అయితే మనకు వచ్చిన సందేహం గురించి యెహోవా ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాలంటే బైబిల్ని ఊరికే చదివితే సరిపోదు, ఇంకా ఎక్కువే చేయాలి. దేని గురించైతే మనకు సందేహం వచ్చిందో దానికి సంబంధించిన లేఖనాల్ని వెదికి, అధ్యయనం చేయాలి. అంతేకాదు మన సంస్థ ఇచ్చిన ప్రచురణల్లో పరిశోధన చేయాలి. (సామె. 2:3-6) మనం పరిశోధన చేసేటప్పుడు మనల్ని నడిపించమని, ఆయన ఆలోచనలు అర్థం చేసుకునేలా సహాయం చేయమని ప్రార్థించాలి. తర్వాత మన పరిస్థితికి సరిపోయే బైబిలు సూత్రాల్ని, ఉపయోగపడే సలహాల్ని వెదకాలి. అంతేకాదు మనలాంటి సందేహాలు వచ్చినవాళ్ల గురించి బైబిల్లో చదివినప్పుడు ఎంతో ప్రయోజనం పొందుతాం.

6. మనకు వచ్చే సందేహాల్ని తీసేసుకోవడానికి మీటింగ్స్‌ ఎలా సహాయం చేస్తాయి?

6 యెహోవా మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో మీటింగ్స్‌లో కూడా “వింటాం.” మనం క్రమంగా మీటింగ్స్‌కి వెళ్తే సరిగ్గా మన సందేహానికి సరిపోయే విషయాన్ని ఒక ప్రసంగంలోనో, బ్రదర్స్‌-సిస్టర్స్‌ చెప్పే కామెంట్స్‌లోనో వినవచ్చు. (సామె. 27:17) అయితే మనకు వచ్చే కొన్ని సందేహాల్ని ఎలా తీసేసుకోవచ్చో ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.

యెహోవా మిమ్మల్ని పట్టించుకుంటున్నాడా అనే సందేహం వస్తే

7. కొంతమందికి ఏ సందేహం రావచ్చు?

7 ‘యెహోవా నన్ను నిజంగా పట్టించుకుంటున్నాడా?’ అనే సందేహం మీకు రావచ్చు. ‘నేను ఒక మామూలు మనిషిని, అలాంటిది నేను ఈ విశ్వాన్ని సృష్టించిన దేవునికి స్నేహితుడు అవడం సాధ్యమేనా?’ అని మీకు అనిపించవచ్చు. రాజైన దావీదుకు బహుశా అలానే అనిపించి ఉంటుంది. యెహోవా మనుషుల్ని పట్టించుకుంటాడు అన్న ఆలోచనే ఆయనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన ఇలా అన్నాడు: “యెహోవా, నువ్వు మనిషిని గమనించడానికి అతను ఏపాటివాడు? మనుషుల్ని పట్టించుకోవడానికి వాళ్లు ఎంతటివాళ్లు?” (కీర్త. 144:3) మరి, యెహోవా మిమ్మల్ని నిజంగా పట్టించుకుంటాడా అనే సందేహాన్ని ఎలా తీసేసుకోవచ్చు?

8. మొదటి సమూయేలు 16:6, 7, 10-12 ప్రకారం, యెహోవా మనుషుల్లో ఏం గమనిస్తాడు?

8 నలుగురిలో అంత ప్రాముఖ్యంకాని వాళ్లను కూడా యెహోవా గమనిస్తాడని బైబిలు చెప్తుంది. ఉదాహరణకు ఇశ్రాయేలీయుల కోసం రాజును అభిషేకించడానికి, యెహోవా సమూయేలును యెష్షయి ఇంటికి పంపించినప్పుడు ఏం జరిగిందో గుర్తుచేసుకోండి. యెష్షయి తన ఎనిమిదిమంది కుమారుల్లో ఏడుగురిని పిలిచాడు కానీ, అందరికన్నా చిన్నవాడైన దావీదును పిలవలేదు. b అయితే యెహోవా ఎంచుకున్నది దావీదునే. (1 సమూయేలు 16:6, 7, 10-12 చదవండి.) ఎందుకంటే దావీదు నిజంగా ఎలాంటివాడో యెహోవాకు తెలుసు. దావీదుకు తన మీద చాలా ప్రేమ ఉందని యెహోవా గమనించాడు.

9. యెహోవా మిమ్మల్ని పట్టించుకుంటున్నాడని మీరెందుకు గట్టి నమ్మకంతో ఉండవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

9 యెహోవా మిమ్మల్ని ఇప్పటికే గమనిస్తున్నాడు అనడానికి గల రుజువుల గురించి ఆలోచించండి. మీ పరిస్థితులకు తగ్గట్టు ఆయన మీకు సలహాలు ఇస్తున్నాడు. (కీర్త. 32:8) మీ గురించి ఏమీ తెలియకపోతే అలాంటి సలహాలు ఇవ్వగలడా? (కీర్త. 139:1) ఆ సలహాల్ని పాటించి, అవి ఎంత ఉపయోగపడ్డాయో అర్థం చేసుకున్నప్పుడు యెహోవా మిమ్మల్ని పట్టించుకుంటున్నాడనే నమ్మకం మీలో పెరుగుతుంది. (1 దిన. 28:9; అపొ. 17:26, 27) యెహోవా మీరు చేసే ప్రతీ చిన్న ప్రయత్నాన్ని చూస్తున్నాడు. మీ మంచి లక్షణాల్ని బట్టి ఆయన మీకు దగ్గరవ్వాలనుకున్నాడు. (యిర్మీ. 17:10) మీరు తన ఫ్రెండ్‌ అవ్వాలని యెహోవా తన చేయిని చాపాడు. మీరు దాన్ని అందుకోవాలని ఆయన కోరుతున్నాడు.—1 యోహా. 4:19.

“నువ్వు [యెహోవాను] వెదికితే ఆయన్ని కనుగొంటావు.” —1 దిన. 28:9 (9వ పేరా చూడండి) c


గతంలో తీసుకున్న నిర్ణయాలు సరైనవేనా అనే సందేహం వస్తే

10. ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాల గురించి ఆలోచించినప్పుడు మనకు ఏ సందేహాలు రావచ్చు?

10 జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలు సరైనవా కావా అని కొంతమందికి అనిపించవచ్చు. బహుశా యెహోవా సేవ ఎక్కువ చేయడానికి కొంతమంది కాసుల వర్షం కురిపించే ఉద్యోగాల్ని, మంచి బిజినెస్‌ని వదులుకుని ఉంటారు. అది జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. తెలిసిన వాళ్లేమో వేరేలా నిర్ణయం తీసుకుని బాగా డబ్బు సంపాదించి, సుఖంగా బ్రతుకుతున్నట్టు కనిపించవచ్చు. దానివల్ల ఇలాంటి సందేహాలు రావచ్చు: ‘యెహోవా కోసం నేను చేసిన త్యాగాలకు అసలు విలువ ఉందా? చేతిలో కాస్త డబ్బు ఉండేలా అప్పట్లో వేరే నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదా?’

11. కీర్తన 73 రాసిన వ్యక్తి ఎందుకు కృంగిపోయాడు?

11 ఇలాంటి సందేహాలు మీ మదిలో కూడా మెదులుతుంటే, 73వ కీర్తన రాసిన వ్యక్తికి ఎలా అనిపించిందో ఆలోచించండి. ఆయన చుట్టూ ఉన్నవాళ్లు ఆరోగ్యంగా, ధనవంతులుగా, చీకూచింత లేకుండా జీవిస్తున్నట్టు కనిపించారు. (కీర్త. 73:3-5, 12) వాళ్లను చూసినప్పుడు యెహోవా సేవలో తను చేసినదానికి అసలు అర్థముందా అని ఆయనకు అనిపించింది. ఆ ఆలోచన వల్ల ఆయన బాగా దిగులుపడి, కృంగిపోయాడు. (కీర్త. 73:13, 14) మరి చివరికి ఏం చేశాడు?

12. కీర్తన 73:16-18 ప్రకారం, నిరుత్సాహపర్చే ఆలోచనల్ని తీసేసుకోవడానికి కీర్తనకర్త ఏం చేశాడు?

12 కీర్తన 73:16-18 చదవండి. ఎంతో ప్రశాంతంగా ఉన్న యెహోవా మందిరానికి కీర్తనకర్త వెళ్లాడు. అక్కడ ఆయన చక్కగా ఆలోచించగలిగాడు. కొంతమంది జీవితాలు చూడడానికి బాగానే ఉన్నా, భవిష్యత్తు విషయంలో వాళ్లకు ఎలాంటి ఆశా లేదని అర్థం చేసుకున్నాడు. దానివల్ల యెహోవాకు మొదటిస్థానం ఇవ్వడం అన్నిటికన్నా మంచి నిర్ణయం అని గ్రహించి, మనశ్శాంతిని పొందాడు. యెహోవా సేవలో కొనసాగాలని కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాడు.—కీర్త. 73:23-28.

13. గతంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో మీకు సందేహాలు వస్తే ఏం చేయవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

13 దేవుని వాక్యం ద్వారా మీరు కూడా అలాంటి మనశ్శాంతినే పొందవచ్చు. ఎలా? యెహోవా దీవెనలతో సహా, మీ జీవితంలో ఉన్న మంచి విషయాల గురించి ఆలోచించండి. అవి ఎంత విలువైనవో కదా! యెహోవాను సేవించని వాళ్లేమో, ఈ లోకం అందించే వాటికి మించి ఇంకేమీ పొందలేరు. వాళ్లకు భవిష్యత్తు విషయంలో ఎలాంటి ఆశా లేదు. కాబట్టి ఒక మంచి ఉద్యోగం-పెద్ద ఇల్లు, ఇవే వాళ్ల ప్రపంచం. కానీ మన పరిస్థితి అలాకాదు. మీ ఊహకు మించి యెహోవా మిమ్మల్ని దీవిస్తానని మాటిస్తున్నాడు. (కీర్త. 145:16) దీనిగురించి కూడా ఆలోచించండి: ఒకవేళ యెహోవా సేవ కాకుండా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకొని ఉంటే, మీ జీవితం మీరు అనుకున్నట్టే ఉండేదని గ్యారెంటీగా చెప్పగలరా? ఒకటి మాత్రం ఖచ్చితం, ఎవరైతే దేవుని మీద ప్రేమతో, సాటిమనిషి మీద ప్రేమతో నిర్ణయాలు తీసుకుంటారో వాళ్లకు మంచిదేదీ తక్కువ కాదు.

యెహోవా మాటిచ్చిన దీవెనల కోసం వేయికళ్లతో ఎదురుచూడండి (13వ పేరా చూడండి) d


యెహోవాకు మీరు ఉపయోగపడగలరా అనే సందేహం వస్తే

14. కొంతమంది ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? వాళ్లకు ఏ సందేహం రావచ్చు?

14 కొంతమంది వయసుపైబడడం వల్ల, అనారోగ్య సమస్యల వల్ల, అంగవైకల్యం వల్ల యెహోవా సేవలో చేయగలిగినదంతా చేయలేకపోతుండవచ్చు. దానివల్ల యెహోవా వాళ్లను తక్కువ చేసి చూస్తాడేమో అని వాళ్లకు అనిపించవచ్చు. అందుకే ‘యెహోవాకు నేను ఇంకా ఉపయోగపడతానా?’ అనే సందేహం రావచ్చు.

15. ఏ విషయాన్ని 71వ కీర్తన రాసిన వ్యక్తి గట్టిగా నమ్మాడు?

15 ఇలాంటి సందేహమే 71వ కీర్తన రాసిన వ్యక్తికి కూడా వచ్చింది. అందుకే ఆయన ఇలా ప్రార్థించాడు: “నా బలం క్షీణించినప్పుడు నన్ను వదిలేయకు.” (కీర్త. 71:9, 18) అయినాసరే యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగితే ఆయన తనను నడిపిస్తాడని, సహాయం చేస్తాడని కీర్తనకర్త గట్టిగా నమ్మాడు. తమ పరిస్థితి ఎలా ఉన్నాసరే, చేయగలిగినదంతా చేస్తూ తనను ఆరాధించే వాళ్లను చూసి యెహోవా సంతోషిస్తాడని కీర్తనకర్త తెలుసుకున్నాడు.—కీర్త. 37:23-25.

16. వయసుపైబడినవాళ్లు ఏవిధంగా యెహోవాకు ఉపయోగపడగలరు? (కీర్తన 92:12-15)

16 వయసుపైబడిన వాళ్లారా, మీ పరిస్థితిని యెహోవా చూసినట్టే చూడండి. మీ శరీరం బలహీనంగా ఉన్నా, ఆధ్యాత్మికంగా బలంగా ఉండేలా ఆయన సహాయం చేస్తాడు. (కీర్తన 92:12-15 చదవండి.) మీరు ఇప్పుడు చేయలేని వాటిమీద కాకుండా, చేయగలిగే వాటిమీద మనసుపెట్టండి. ఉదాహరణకు విశ్వాసం విషయంలో మీ ఆదర్శం, మీరు చూపించే శ్రద్ధ అందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. గడిచిన సంవత్సరాల్లో యెహోవా మిమ్మల్ని ఎలా చూసుకున్నాడో మీరు ఇతరులకు చెప్పవచ్చు. భవిష్యత్తు గురించి మీకు ఉన్న నమ్మకాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. మీరు మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనలకున్న శక్తిని తక్కువ అంచనా వేయకండి. (1 పేతు. 3:12) మన పరిస్థితులు ఎలా ఉన్నా మనలో ప్రతీఒక్కరం యెహోవాకు, ఇతరులకు ఏదోకటి ఇవ్వచ్చు.

17. మనం ఇతరులతో ఎందుకు పోల్చుకోకూడదు?

17 యెహోవా సేవలో ఎక్కువ చేయలేకపోతున్నాను అనే బాధ మిమ్మల్ని తొలిచేస్తుందా? ఒకటి గుర్తుంచుకోండి: మీరు చేసే చిన్న పనిని కూడా యెహోవా చాలా విలువైనదిగా చూస్తాడు. మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకుంటుండవచ్చు. కానీ అలా అస్సలు చేయకండి, ఎందుకంటే యెహోవా మిమ్మల్ని ఎవ్వరితోనూ పోల్చడు. (గల. 6:4) మరియ యేసు పాదాల మీద ఎంతో ఖరీదైన పరిమళ తైలాన్ని పోసింది. (యోహా. 12:3-5) దానికి పూర్తి భిన్నంగా పేద విధవరాలు చాలా తక్కువ విలువ ఉన్న రెండు నాణేల్ని ఆలయంలో విరాళంగా వేసింది. (లూకా 21:1-4) యేసు వాళ్లిద్దర్నీ పోల్చలేదు, బదులుగా వాళ్లిద్దరూ గొప్ప విశ్వాసం చూపించారని గుర్తించాడు. యేసు తన తండ్రి మనసుకు అద్దం పట్టాడు. కాబట్టి మీరు ఏం చేసినా విశ్వాసంతో, ప్రేమతో చేస్తున్నారని యెహోవాకు తెలుసు. మీరు చేస్తున్నది మీకు రవ్వంత చిన్నదిగా అనిపించినా యెహోవాకు మాత్రం కొండంత పెద్దదిగా, విలువైనదిగా అనిపిస్తుంది.

18. సందేహాల్ని తీసేసుకోవడానికి ఏది సహాయం చేస్తుంది? (“ సందేహాల్ని తీసేసుకోవడానికి యెహోవా వాక్యం సహాయం చేస్తుంది” అనే బాక్సు కూడా చూడండి.)

18 మనలో ప్రతీఒక్కరికి అప్పుడప్పుడు సందేహాలు వస్తుంటాయి. అయితే బైబిలు సహాయంతో వాటిని తీసేసుకోవడం సాధ్యమే! కాబట్టి వాటిని తీసేసుకోవడానికి చేయగలిగినదంతా చేయండి. దిగులును పక్కన పెట్టేసి ధైర్యంగా ముందుకు వెళ్లండి. మీరంటే యెహోవాకు పట్టింపు ఉందనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీరు చేసిన త్యాగాల విలువ ఆయనకు తెలుసు, మీకు ఎన్నో దీవెనలు ఇవ్వాలని ఆయన ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. తన నమ్మకమైన సేవకులందర్నీ యెహోవా ప్రేమిస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు అనే భరోసాతో ఉండండి.

పాట 111 మన సంతోషానికి కారణాలు

a పదాల వివరణ: విశ్వాసం తగ్గిపోవడం వల్ల యెహోవా మీద, ఆయన మాటిచ్చినవాటి మీద కొంతమందికి సందేహాలు రావచ్చని బైబిలు చెప్తుంది. అయితే ఈ ఆర్టికల్‌లో అలాంటి సందేహాల గురించి మాట్లాడుకోవడం లేదు. బదులుగా యెహోవాకు మనం విలువైనవాళ్లమా కాదా, గతంలో తీసుకున్న నిర్ణయాలు సరైనవా కావా లాంటి సందేహాల గురించి మాట్లాడుకుంటాం.

b దావీదును రాజుగా ఎంచుకున్నప్పుడు ఆయన వయసు సరిగ్గా ఎంతో బైబిలు చెప్పట్లేదు. ఆయన బహుశా టీనేజ్‌లో ఉండుంటాడు.—2011 సెప్టెంబరు 1, కావలికోట (ఇంగ్లీష్‌) పత్రికలోని 29వ పేజీ, 2వ పేరా చూడండి.

c చిత్రాల వివరణ: ఒక యౌవన సహోదరి సలహాల కోసం లేఖనాల్ని చూస్తూ యెహోవా కోసం వెదుకుతుంది.

d చిత్రం వివరణ: ఒక బ్రదర్‌ తన కుటుంబాన్ని పోషించడానికి చిన్నచిన్న పనులు చేస్తూ రాబోయే పరదైసు గురించి ఆలోచిస్తున్నాడు