అధ్యయన ఆర్టికల్ 41
మీరు నిజమైన సంతోషాన్ని పొందవచ్చు
“యెహోవాకు భయపడుతూ ఆయన మార్గాల్లో నడిచేవాళ్లంతా సంతోషంగా ఉంటారు.” —కీర్త. 128:1, అధస్సూచి.
పాట 110 యెహోవా ఇచ్చే సంతోషం
ఈ ఆర్టికల్‌లో. . . a
1. సంతోషంగా ఉండాలంటే, మనకు “దేవుని నిర్దేశం” ఎందుకు అవసరం?
నిజమైన సంతోషం అనేది కాసేపు ఉండి తర్వాత వెళ్లిపోయేది కాదు, అది మనతో జీవితాంతం ఉంటుంది. అలాంటి సంతోషం గురించి యేసు కొండమీది ప్రసంగంలో ఇలా చెప్పాడు: “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు.” (మత్త. 5:3) తమ సృష్టికర్త అయిన యెహోవా గురించి తెలుసుకుని, ఆయన్ని ఆరాధించాలనే బలమైన కోరికతో మనుషులు సృష్టించబడ్డారని యేసుకు తెలుసు. అంతేకాదు, యెహోవా “సంతోషంగల దేవుడు.” కాబట్టి ఆయన్ని ఆరాధించేవాళ్లు కూడా సంతోషంగా ఉండగలరు.—1 తిమో. 1:11.
2-3. (ఎ) ఎవరు కూడా సంతోషంగా ఉంటారని యేసు చెప్పాడు? (బి) మనం ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం, ఎందుకు?
2 జీవితంలో అన్నీ బాగుంటేనే మనం సంతోషంగా ఉంటామా? లేదు. మనకు ఆశ్చర్యంగా అనిపించే ఈ మాటను యేసు కొండమీది ప్రసంగంలో చెప్పాడు: “దుఃఖించేవాళ్లు సంతోషంగా ఉంటారు.” అంటే, తాము చేసిన పాపాల్ని బట్టి కుమిలిపోతూ లేదా తీవ్రమైన ఇబ్బందులతో సతమతమౌతూ దుఃఖించేవాళ్లు కూడా సంతోషంగా ఉంటారు. “నీతి కోసం హింసించబడేవాళ్లు,” క్రీస్తు శిష్యులు అనే కారణంతో ‘నిందించబడేవాళ్లు’ కూడా సంతోషంగా ఉంటారని యేసు చెప్పాడు. (మత్త. 5:4, 10, 11) కానీ అలాంటి పరిస్థితుల్లో సంతోషంగా ఉండడం ఎలా సాధ్యం?
3 జీవితంలో అన్నీ బాగుంటేనే సంతోషంగా ఉంటామని యేసు చెప్పలేదు. బదులుగా, దేవుని నిర్దేశాన్ని తెలుసుకుంటూ ఆయనకు దగ్గరైనప్పుడే సంతోషంగా ఉంటామని యేసు చెప్పాడు. (యాకో. 4:8) మరి ఆ సంతోషాన్ని మనం ఎలా పొందవచ్చు? దానికోసం మనం చేయాల్సిన మూడు పనుల గురించి ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
ఆధ్యాత్మిక ఆహారం తీసుకోండి
4. నిజమైన సంతోషం పొందాలంటే, మనం చేయాల్సిన మొదటి పని ఏంటి? (కీర్తన 1:1-3)
4 మొదటి పని: నిజమైన సంతోషం పొందాలంటే మనం ఆధ్యాత్మిక ఆహారం తీసుకోవాలి. ప్రాణాలతో ఉండాలంటే మనుషులకు, జంతువులకు భౌతిక ఆహారం అవసరం. కానీ మనుషులకు మాత్రమే, ఆధ్యాత్మిక ఆహారం కూడా అవసరం. అందుకే యేసు ఇలా అన్నాడు: “మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదుగానీ యెహోవా నోటినుండి వచ్చే ప్రతీ మాట వల్ల జీవించాలి.” (మత్త. 4:4) కాబట్టి దేవుని వాక్యమైన బైబిల్ని చదవకుండా మన జీవితంలో ఒక్కరోజు కూడా గడిచిపోకుండా చూసుకోవాలి. కీర్తనకర్త ఇలా అన్నాడు: ‘యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ, పగలూ రాత్రీ దాన్ని ధ్యానించే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.’—కీర్తన 1:1-3 చదవండి.
5-6. (ఎ) బైబిలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (బి) బైబిలు చదవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి?
5 యెహోవా మనమీద ప్రేమతో, మనం సంతోషంగా జీవించడానికి కావల్సిన సమాచారాన్ని బైబిల్లో రాయించాడు. మన జీవితానికి ఉన్న అర్థం ఏంటో బైబిలు చెప్తుంది. దేవునికి దగ్గరవ్వాలంటే, ఆయన మన పాపాల్ని క్షమించాలంటే ఏం చేయాలో కూడా బైబిలు చెప్తుంది. భవిష్యత్తు గురించి దేవుడు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానాలు కూడా బైబిల్లో ఉన్నాయి. (యిర్మీ. 29:11) బైబిలు నుండి నేర్చుకునే ఈ సత్యాలు మనలో సంతోషాన్ని నింపుతాయి.
6 మన జీవితంలో ఉపయోగపడే చక్కని సలహాలు కూడా బైబిల్లో ఉన్నాయి. వాటిని పాటిస్తే, మనం సంతోషంగా ఉంటాం. జీవితంలో ఉన్న కష్టాల్ని బట్టి మీకు నిరుత్సాహంగా అనిపించినప్పుడు యెహోవా వాక్యాన్ని చదవడానికి, ధ్యానించడానికి ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకోండి. యేసు ఇలా అన్నాడు: ‘దేవుని వాక్యాన్ని విని, పాటించేవాళ్లు సంతోషంగా ఉంటారు!’—లూకా 11:28.
7. బైబిల్ని చక్కగా ఆనందిస్తూ చదవాలంటే ఏం చేయాలి?
7 బైబిల్ని హడావిడిగా చదవకండి, సమయం తీసుకుని చక్కగా ఆనందిస్తూ చదవండి. ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి. మీ ఇంట్లో మీకు ఇష్టమైన భోజనాన్ని వండిపెట్టారు. కానీ మీరు హడావిడిలో ఉండి, ఏదో ఆలోచిస్తూ దాన్ని ఆస్వాదించకుండా గబగబా తినేశారు. ప్లేట్ ఖాళీ అయ్యాక, ఇంత త్వరగా ఐపోయిందేంటి, కాస్త నెమ్మదిగా ప్రతీ ముద్దను ఆస్వాదిస్తూ తిని ఉండాల్సింది అని మీకు అనిపిస్తుంది. బైబిలు చదివే విషయంలో కూడా అలా జరగవచ్చు. కొన్నిసార్లు మనం బైబిల్లో ఉన్న వాటిని ఆనందించకుండా, గబగబా చదివేసుకుంటూ పోతాం. అలా కాకుండా దేవుని వాక్యాన్ని చక్కగా ఆనందిస్తూ చదవడానికి సమయం తీసుకోండి. మీరు చదువుతున్నదంతా మీ కళ్లముందే జరుగుతున్నట్టు, అందులో ఉన్నవాళ్ల మాటల్ని వింటున్నట్టు ఊహించుకోండి, చదివిన దాని గురించి ఆలోచించండి. అప్పుడు మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
8. “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” ఏవిధంగా మనకు తగినవేళ ఆధ్యాత్మిక ఆహారం ఇస్తున్నాడు? (అధస్సూచి కూడా చూడండి.)
8 తగిన సమయంలో మనకు ఆధ్యాత్మిక ఆహారం పెట్టడానికి యేసు ‘నమ్మకమైన, బుద్ధిగల దాసున్ని’ నియమించాడు. అందుకే మన దగ్గర ఆధ్యాత్మిక ఆహారం సమృద్ధిగా ఉంది. b (మత్త. 24:45) ఆ దాసుడు తయారుచేసే ఆధ్యాత్మిక ఆహారమంతా బైబిలు ఆధారంగా ఉంటుంది. (1 థెస్స. 2:13) బైబిల్లో ఉన్న యెహోవా ఆలోచనల్ని అర్థం చేసుకోవడానికి ఆ ఆధ్యాత్మిక ఆహారం మనకు సహాయం చేస్తుంది. అందుకే మనం కావలికోట, తేజరిల్లు! పత్రికల్ని, jw.org ఆర్టికల్స్‌ని చదువుతాం. ప్రతీ మీటింగ్‌కి సిద్ధపడతాం. మన భాషలో ప్రతీనెల వచ్చే JW బ్రాడ్‌కాస్టింగ్ కార్యక్రమాన్ని చూస్తాం. ఆధ్యాత్మిక ఆహారాన్ని పుష్టిగా తీసుకుంటే, నిజమైన సంతోషం పొందడానికి సహాయపడే రెండో పని చేయడం తేలికవుతుంది.
యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించండి
9. నిజమైన సంతోషం పొందాలంటే, మనం చేయాల్సిన రెండో పని ఏంటి?
9 రెండో పని: నిజమైన సంతోషం పొందాలంటే యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించాలి. కీర్తనకర్త ఇలా రాశాడు: “యెహోవాకు భయపడుతూ ఆయన మార్గాల్లో నడిచేవాళ్లంతా సంతోషంగా ఉంటారు.” (కీర్త. 128:1, అధస్సూచి) యెహోవాకు భయపడడం అంటే, ఆయన మీద గౌరవంతో ఆయన్ని బాధపెట్టే ఏ పనీ చేయకపోవడం. (సామె. 16:6) మనం యెహోవాకు భయపడతాం, కాబట్టి మంచి చెడుల విషయంలో ఆయన ప్రమాణాల్ని పాటించడానికి కృషి చేస్తూ ఉంటాం. (2 కొరిం. 7:1) యెహోవా ప్రేమించేవాటిని ప్రేమిస్తూ, ఆయన అసహ్యించుకునే వాటిని అసహ్యించుకుంటూ ఉంటే మనం సంతోషంగా ఉంటాం.—కీర్త. 37:27; 97:10; రోమా. 12:9.
10. రోమీయులు 12:2 ప్రకారం, మనం యెహోవా ప్రమాణాల్ని తెలుసుకోవడంతో పాటు ఇంకా ఏం చేయాలి?
10 రోమీయులు 12:2 చదవండి. మంచి చెడుల విషయంలో ప్రమాణాల్ని నిర్ణయించే హక్కు యెహోవాకు ఉందని తెలుసుకుంటే సరిపోదు, వాటిని పాటించాలని కోరుకోవాలి. ఉదాహరణకు హైవేలో వెళ్తునప్పుడు ఎంత స్పీడ్‌లో వెళ్లాలో నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి ఉందని తెలిసినా, ఒక వ్యక్తి దాన్ని పాటించాలని అనుకోకపోవచ్చు. దానివల్ల అతను వెళ్లాల్సిన స్పీడ్ కన్నా, ఇంకా ఎక్కువ స్పీడ్‌గా వెళ్తాడు. యెహోవా ప్రమాణాల్ని పాటించడం మంచిదని నమ్ముతున్నామని మన పనుల్లో చూపించాలి. (సామె. 12:28) దావీదు కూడా అలాగే చేయాలని కోరుకున్నాడు. అందుకే ఆయన యెహోవా గురించి ఇలా అన్నాడు: “నువ్వు నాకు జీవ మార్గాన్ని తెలియజేస్తున్నావు. నీ సన్నిధిలో గొప్ప ఆనందం ఉంది; నీ కుడిచేతి దగ్గర ఎప్పటికీ సంతోషం ఉంటుంది.”—కీర్త. 16:11.
11-12. (ఎ) మనకు ఆందోళనగా లేదా నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? (బి) వినోదాన్ని ఎంచుకునే విషయంలో, ఫిలిప్పీయులు 4:8 లో ఉన్న మాటలు మనకు ఎలా సహాయం చేస్తాయి?
11 మనకు ఆందోళనగా లేదా నిరుత్సాహంగా ఉన్నప్పుడు, సమస్యల్ని మర్చిపోవడానికి ఏదోకటి చేయాలనిపిస్తుంది. అందులో తప్పేమీ లేదు. అయితే యెహోవా అసహ్యించుకునే వాటిని చేయకుండా జాగ్రత్తపడాలి.—ఎఫె. 5:10-12, 15-17.
12 అపొస్తలుడైన పౌలు, ‘ఏవి నీతిగలవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ప్రేమించదగినవో, ఏవి మంచివో’ వాటి గురించి ఆలోచిస్తూ ఉండమని క్రైస్తవులకు చెప్పాడు. (ఫిలిప్పీయులు 4:8 చదవండి.) పౌలు ఇక్కడ సూటిగా వినోదం గురించి మాట్లాడకపోయినా, ఆయన చెప్పిన మాటలు సరైన వినోదాన్ని ఎంచుకునేలా మనకు సహాయం చేస్తాయి. ఇలా చేసి చూడండి: ఈ వచనంలో “ఏవి” అని వచ్చిన ప్రతీచోట “ఏ పాటలు,” “ఏ సినిమాలు,” “ఏ పుస్తకాలు,” లేదా “ఏ వీడియో గేములు” అని పెట్టుకుని చదవండి. అలా చేస్తే దేవునికి ఎలాంటి వినోదం ఇష్టమో, ఎలాంటి వినోదం ఇష్టం లేదో మీరు అర్థం చేసుకోగలుగుతారు. అవును, యెహోవా ఉన్నత ప్రమాణాల ప్రకారం జీవించాలన్నదే మనందరి కోరిక. (కీర్త. 119:1-3) అలా జీవించినప్పుడు మనం మంచి మనస్సాక్షితో ఉంటాం. అప్పుడు నిజమైన సంతోషాన్ని పొందడానికి సహాయం చేసే మూడో పని చేయగలుగుతాం.—అపొ. 23:1.
యెహోవా ఆరాధనకు మొదటి స్థానం ఇవ్వండి
13. నిజమైన సంతోషాన్ని పొందాలంటే మనం చేయాల్సిన మూడో పని ఏంటి? (యోహాను 4:23, 24)
13 మూడో పని: మీ జీవితంలో యెహోవా ఆరాధనకే మొదటి స్థానం ఇవ్వండి. యెహోవాయే మనల్ని సృష్టించాడు, మన ఆరాధన పొందే అర్హత ఆయనకు పూర్తిగా ఉంది. (ప్రక. 4:11; 14:6, 7) కాబట్టి ఆయనకు నచ్చిన విధంగా ఆరాధించడానికి, అంటే “పవిత్రశక్తితో, సత్యంతో” ఆరాధించడానికి మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలి. (యోహాను 4:23, 24 చదవండి.) మనం దేవుని వాక్యంలో ఉన్న సత్యాలకు తగ్గట్టు ఆరాధించాలని కోరుకుంటాం, అందుకే పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం ఆయన్ని ఆరాధిస్తాం. మన పని మీద ఆంక్షలు లేదా నిషేధాలు ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నా సరే, మనం దేవుని ఆరాధనకు మొదటి స్థానం ఇవ్వాలి. కేవలం యెహోవాసాక్షులు అనే ఒకేఒక్క కారణంతో, ప్రస్తుతం 100 కన్నా ఎక్కువమంది సహోదర సహోదరీలు జైల్లో ఉన్నారు. c అయినాసరే ప్రార్థించడానికి, బైబిలు అధ్యయనం చేయడానికి, దేవుని గురించి-ఆయన రాజ్యం గురించి ప్రకటించడానికి చేయగలిగినదంతా చేస్తున్నారు కాబట్టి వాళ్లు సంతోషంగా ఉంటున్నారు. మనం నిందల్ని, హింసల్ని ఎదుర్కొన్నప్పుడు యెహోవా మనతో ఉన్నాడు, ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు అనే నమ్మకంతో సంతోషంగా ఉండవచ్చు.—యాకో. 1:12; 1 పేతు. 4:14.
ఒక సహోదరుని అనుభవం
14. తజికిస్తాన్‌లో ఒక యువ సహోదరునికి ఏం జరిగింది?
14 మన జీవితంలో అన్నీ బాగున్నా, బాలేకపోయినా, ఈ మూడు పనులు చేస్తే నిజమైన సంతోషాన్ని పొందవచ్చని ఎంతోమంది సహోదర సహోదరీల అనుభవాలు చూపిస్తున్నాయి. ఉదాహరణకు తజికిస్తాన్‌లోని 19 ఏళ్ల జోవిడోన్ బబజానావ్ అనుభవం పరిశీలించండి. ఆయన మిలిటరీలో చేరడానికి ఒప్పుకోలేదు. దాంతో 2019, అక్టోబరు 4న ఆయన్ని ఇంట్లో నుండి బలవంతంగా తీసుకెళ్లి, చాలా నెలలపాటు జైల్లో ఉంచి ఒక నేరస్తునిలా చూశారు. ఆయనకు జరిగిన ఈ అన్యాయం గురించి చాలా దేశాల్లోని పత్రికల్లో, టీవీల్లో వచ్చింది. మిలిటరీ డ్రెస్ వేసుకుని మిలిటరీ ప్రతిజ్ఞ చేయమని ఒత్తిడి చేస్తూ ఆయన్ని కొట్టారని కూడా తెలిసింది. తర్వాత కోర్టు ఆయన్ని దోషిగా తీర్పు తీర్చి, లేబర్ క్యాంపుకు పంపించింది. చివరికి ఆ దేశ అధ్యక్షుడు ఆయన్ని క్షమించి విడుదల చేశాడు. ఆ సమయమంతటిలో జోవిడోన్ యెహోవాను విడిచిపెట్టలేదు, తన సంతోషాన్ని కోల్పోలేదు. దేవుని నిర్దేశం తనకు అవసరమని గుర్తించాడు కాబట్టే, ఆయన అలా ఉండగలిగాడు.
15. జైల్లో ఉన్నప్పుడు జోవిడోన్ ఆధ్యాత్మిక ఆహారాన్ని ఎలా తీసుకున్నాడు?
15 జైల్లో ఉన్నప్పుడు జోవిడోన్ దగ్గర బైబిలు, ప్రచురణలు లేకపోయినా ఆయన ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నాడు. ఎలా? స్థానిక సహోదర సహోదరీలు ఆయనకు ఆహారాన్ని పంపిస్తూ, ఆ ఆహారాన్ని ప్యాక్ చేసిన కవర్ మీద దినవచనాన్ని రాసేవాళ్లు. అలా ఆయన ప్రతీరోజు బైబిలు చదివి, దాన్ని ధ్యానించగలిగాడు. జైలు నుండి బయటికి వచ్చిన జోవిడోన్, తీవ్రమైన కష్టాల్ని ఇంకా ఎదుర్కోని వాళ్లకు ఈ సలహా ఇచ్చాడు: “మీరు మీ స్వేచ్ఛను పూర్తిగా ఉపయోగించుకోండి. బైబిల్ని, ప్రచురణల్ని చదువుతూ యెహోవా గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం.”
16. జోవిడోన్ వేటి మీద మనసుపెట్టాడు?
16 జోవిడోన్ యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించాడు. తప్పుడు ఆలోచనల్లో మునిగిపోయి, తప్పుడు పనులు చేసే బదులు యెహోవా మీద, ఆయన విలువైనవిగా చూసే వాటిమీద మనసుపెట్టాడు. తన కళ్ల ముందున్న అందమైన దేవుని సృష్టి గురించి ధ్యానించాడు. ఆయన ఉదయాన్నే పక్షుల కిలకిల రాగాల్ని వింటూ నిద్ర లేచేవాడు. రాత్రి సమయంలో చంద్రుణ్ణి, నక్షత్రాల్ని చూస్తుండేవాడు. ఆయన ఇలా అన్నాడు: “యెహోవా ఇచ్చిన ఆ బహుమానాలు నాకు సంతోషాన్ని ఇచ్చాయి, నన్ను ప్రోత్సహించాయి.” ఆధ్యాత్మికంగా, భౌతికంగా యెహోవా మనకు ఇచ్చిన వాటన్నిటి మీద కృతజ్ఞతతో ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం. ఆ సంతోషం సహించడానికి కావల్సిన బలాన్ని ఇస్తుంది.
17. జోవిడోన్ లాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లకు, 1 పేతురు 1:6, 7 లో ఉన్న మాటలు ఏ భరోసాను ఇస్తున్నాయి?
17 జోవిడోన్ యెహోవా ఆరాధనకు మొదటి స్థానం ఇచ్చాడు. సత్యదేవున్ని అంటిపెట్టుకుని ఉండడం ఎంత ప్రాముఖ్యమో ఆయనకు తెలుసు. యేసు ఇలా అన్నాడు: “నీ దేవుడైన యెహోవానే నువ్వు ఆరాధించాలి. ఆయనకు మాత్రమే పవిత్రసేవ చేయాలి.” (లూకా 4:8) జోవిడోన్ తన విశ్వాసాన్ని విడిచిపెట్టాలని మిలిటరీ అధికారులు, సైనికులు కోరుకున్నారు. కానీ ఆయన పగలూ రాత్రి పట్టుదలగా ప్రార్థిస్తూ, తన విశ్వాసం విషయంలో రాజీ పడకుండా ఉండేలా సహాయం చేయమని యెహోవాను వేడుకున్నాడు. అన్యాయాన్ని ఎదుర్కొన్నా, జోవిడోన్ యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. జోవిడోన్ ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఎక్కువ సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే జైలుకు వెళ్లాక, హింసించబడ్డాక ఆయన విశ్వాసం పరీక్షించబడింది. అది ఇప్పుడు ఇంకా బలపడింది.—1 పేతురు 1:6, 7 చదవండి.
18. మన సంతోషాన్ని ఎలా కాపాడుకోవచ్చు?
18 నిజమైన సంతోషాన్ని పొందాలంటే మనం ఏం చేయాలో యెహోవాకు తెలుసు. ఈ ఆర్టికల్‌లో చూసిన మూడు పనుల్ని చేస్తే, ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా మన సంతోషాన్ని కాపాడుకోవచ్చు. అప్పుడు మీరు కూడా ‘యెహోవా తమకు దేవుడిగా ఉన్న ప్రజలు సంతోషంగా ఉంటారు!’ అని అంటారు.—కీర్త. 144:15.
పాట 89 వినండి, లోబడండి, దీవెనలు పొందండి
a చాలామంది నిజమైన సంతోషాన్ని పొందడానికి సుఖాలు, సంపదలు, గొప్ప పేరు, అధికారం వెంట పరుగులు తీస్తున్నారు. కానీ సంతోషాన్ని పొందడానికి అది సరైన పద్ధతి కాదు కాబట్టి, వాళ్లు దాన్ని పొందలేకపోతున్నారు. అయితే దాన్ని ఎలా పొందవచ్చో యేసు భూమ్మీద ఉన్నప్పుడు చెప్పాడు. నిజమైన సంతోషం పొందడానికి మనం చేయాల్సిన మూడు పనుల గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
b 2014, ఆగస్టు 15 కావలికోట పత్రికలో “‘తగినవేళ ఆహారం’ మీరు పొందుతున్నారా?” ఆర్టికల్ చూడండి.
c వివరాల కోసం, jw.orgలో “Imprisoned for Their Faith” అని టైప్ చేసి వెదకండి.
d చిత్రాల వివరణ: పునర్నటన: పోలీసులు ఒక సహోదరున్ని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు ఇతర సహోదర సహోదరీలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.