కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు లవీఫ్‌ దగ్గరున్న అడవిని శుభ్రం చేయడానికి సహాయం చేశారు

యెహోవాసాక్షులు లవీఫ్‌ దగ్గరున్న అడవిని శుభ్రం చేయడానికి సహాయం చేశారు

2017 మే 6న దాదాపు 130 మంది యెహోవాసాక్షులు, యుక్రెయిన్‌లోని లవీఫ్‌ దగ్గరున్న బ్రయూకొవిచీ గ్రామాన్ని శుభ్రం చేయడానికి సహాయం చేశారు. స్వచ్ఛందంగా సహాయం చేసిన వాళ్ల వయసు 22-80 ఏళ్ల మధ్య ఉంటుంది. వాళ్లు ఆ అడవికి దగ్గర్లోవున్న యెహోవాసాక్షుల యుక్రెయిన్‌ బ్రాంచి కార్యాలయంలో ఉంటూ అక్కడే పనిచేస్తారు. వాళ్లు కేవలం మూడు గంటల్లో 50 హెక్టారుల (120 ఎకరాల) ప్రాంతాన్ని శుభ్రం చేసి దాదాపు 600 కిలోల చెత్త పోగుచేశారు.

లవీఫ్‌ ఫారెస్ట్‌ బ్రీడింగ్‌ అండ్‌ డ్రిల్లింగ్‌ సెంటర్‌కి చెందిన ప్రముఖ ఇంజనీరు మైకాయ్‌లో స్ప్లావీన్‌స్కియ్‌ చెప్పినదాని ప్రకారం “ప్రతీ సంవత్సరం జరిగే ఈ శుభ్రపర్చే పనికి మొట్టమొదట మద్దతు తెలిపింది యెహోవాసాక్షులే, 2014 నుండి ప్రతీ సంవత్సరం వాళ్లు అలా సహాయం చేస్తున్నారు.”

అడవిని ఎందుకు శుభ్రం చేయాలి?

స్ప్లావీన్‌స్కియ్‌ ఇలా చెప్తున్నాడు: “అడవిలో చెత్త పేరుకుపోవడానికి రెండు కారణాలు. ఒకటి, కొంతమంది ప్రజలు చెత్తను అక్కడ వదిలివెళ్లడం. రెండవది, నిర్మాణ పని వల్ల వచ్చే చెత్తను, ఇతర రకాల చెత్తను ట్రక్కుల్లో తీసుకొచ్చి అడవిలో కుమ్మరించడం.”

చెత్త అడవికి ఎంతో నష్టం కలిగిస్తుంది. స్ప్లావీన్‌స్కియ్‌ ఇలా అంటున్నాడు: “చెత్త కుళ్లిపోయి మట్టిలో కలిసిపోవడానికి చాలాకాలం పడుతుంది, అది భూగర్భ జలాల్ని కలుషితం చేసి పర్యావరణ సమస్యలకు దారితీస్తుంది.” వదిలేసిన గాజు పదార్థాలు సూర్యకిరణాల పరిమాణాన్ని, తీవ్రతను పెంచి అడవిలో మంటలు రేగడానికి కారణమౌతాయి. పగిలిన గాజు ముక్కలు, వాడి పారేసిన సిరంజీలు ప్రమాదకరం, ముఖ్యంగా చిన్నపిల్లలకు. “చెత్తను తీసేయడం వల్ల ఈ సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు” అని ఆయన అంటున్నాడు.

3,300 హెక్టారుల (8,100 ఎకరాల) వైశాల్యం గల అడవిని శుభ్రం చేయడం చిన్న విషయం కాదు. ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: “మా దగ్గర ఉన్నది కేవలం ఐదుగురు ఫారెస్టు గార్డులే, కాబట్టి అంత పెద్ద ప్రాంతాన్ని శుభ్రం చేయడం మావల్ల కాదు. అందుకే, సంవత్సరానికి ఒకసారి మేము ప్రజల్ని సహాయం చేయమని అడుగుతుంటాం.”

పోగుచేయడం, వేరుచేయడం, డిస్పోస్‌ చేయడం

స్వచ్ఛందంగా సహాయం చేసిన యెహోవాసాక్షులు గ్లౌజులు, ప్లాస్టిక్‌ బ్యాగులు, పోగుచేసే పనిముట్లను తీసుకుని బాటిళ్లను, టైర్లను, అలాగే గాజు, లోహం, కాగితం, ప్లాస్టిక్‌ వస్తువుల్ని, ఇంకా సిరంజీలను పోగుచేస్తారు. దానివల్ల, “యెహోవాసాక్షులు సహాయం చేసిన చోటు చాలా శుభ్రంగా ఉంటుంది” అని ఆ ప్రాంత అటవీ పరిరక్షకుడైన ఈహోర్‌ ఫెడాక్‌ అంటున్నాడు.

స్వచ్ఛందంగా సహాయం చేసినవాళ్లు చెత్తను గాజు, కాగితం, ప్లాస్టిక్‌ వంటి రకాలుగా వేరుచేస్తారు. చట్టప్రకారం అలా చేయాల్సిన అవసరం లేకపోయినా వాళ్లు అలా చేస్తారు, దానివల్ల దాన్ని రీసైకిల్‌ చేయడం వీలౌతుంది. తర్వాత చెత్తను డిస్పోస్‌ చేసే స్థానిక కంపెనీ దాన్ని ప్రోసెస్‌ చేస్తుంది. 2016 నుండి, యెహోవాసాక్షులు తాము పోగుచేసిన చెత్తను డిస్పోస్‌ చేయడానికి అయ్యే ఖర్చును వాళ్లే పెట్టుకున్నారు. ఫెడాక్‌ ఇలా అంటున్నాడు: “మాకు సహాయం చేసినందుకు యెహోవాసాక్షులకు కృతజ్ఞతలు. వాళ్లు మా పనికి ఎంతో మద్దతిస్తుంటారు.”

“శుభ్రం చేయడం చిన్నతనం అనుకోను”

ప్రతీ సంవత్సరం జరిగే ఈ అడవిని శుభ్రపర్చే పనిలో పాల్గొనడానికి యెహోవాసాక్షులు సంతోషిస్తారు. సమాజ శ్రేయస్సు కోసం, అడవిని ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచడం కోసం పనిచేయడం వాళ్లకు ఇష్టం. దీని గురించి వాళ్లు సాధారణంగా ఎలా భావిస్తారో చెప్తూ ఫోల్కర్‌ ఇలా అంటున్నాడు: “శుభ్రం చేయడం నేను చిన్నతనం అనుకోను. ఇతరుల కోసం ఏదో ఒకటి చేయడమనేది గౌరవమైన పని, అది నాకు సంతృప్తినిస్తుంది.”

ఆంజెలిక ఇలా అంటుంది: “చెత్త ఎవరు వేశారన్నది నాకు ముఖ్యం కాదు, దాన్ని తీసేయడానికి నేనేం చేయవచ్చు అనేదే నాకు ముఖ్యం.” 78 ఏళ్ల లోయస్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది, ఆమె ఇలా అంటుంది: “మీరు నడవడానికి వెళ్లినప్పుడు చెత్తను చూసి చిరాకుపడే బదులు దాన్ని తీసేయడం మంచిది.”

వైయెస్లవ్‌ ఇలా అంటున్నాడు: “మేము చక్కని బట్టలు వేసుకొని, టై కట్టుకొని, మా నమ్మకాల గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉండడం ప్రజలు చూస్తుంటారు. అయితే మేము అడవిని శుభ్రం చేయడానికి లేదా ప్రజలకు ఉపయోగపడే ఇంకేదైనా పని చేయడానికి మా చొక్కా చేతులు మడవడానికి కూడా సిద్ధమే.”