బైబిలు వచనాల వివరణ
1 పేతురు 5:6, 7—‘దేవుని బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి, మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి’
“కాబట్టి, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలమైన చేతి కింద మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఉండండి. అంతేకాదు, ఆయనకు మీ మీద శ్రద్ధ ఉంది కాబట్టి మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి.”—1 పేతురు 5:6, 7, కొత్త లోక అనువాదం.
“దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.”—1 పేతురు 5:6, 7, పరిశుద్ధ గ్రంథము.
1 పేతురు 5:6, 7 అర్థమేంటి?
ఈ మాటలతో అపొస్తలుడైన పేతురు, క్రైస్తవులు తమ సమస్యలు-ఆందోళనల గురించి నమ్మకంతో దేవునికి ప్రార్థన చేయవచ్చని భరోసా ఇస్తున్నాడు. దేవుడు వినయంగా ఉండేవాళ్లను ఇష్టపడతాడు, వాళ్లను మెండుగా దీవిస్తాడు.
“[దేవుని] బలమైన చేతి కింద మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఉండండి.” బైబిల్లో దేవుని చెయ్యి తరచూ ఆయన రక్షించే, కాపాడే శక్తిని సూచిస్తుంది. (నిర్గమకాండం 3:19; ద్వితీయోపదేశకాండం 26:8; కీర్తన 18:16, 17) క్రైస్తవులు దేవుని మీద ఆధారపడడం ద్వారా ఆయన చేతి కింద తమను తాము తగ్గించుకొని ఉంటారు. తమ పరిమితులను గుర్తించి, తమంతట తాము కష్టాలను దాటలేమని అర్థంచేసుకుంటారు. (సామెతలు 3:5, 6; ఫిలిప్పీయులు 4:13) సరైన సమయంలో, అత్యుత్తమ పద్ధతిలో తమకు సహాయం చేసే శక్తి దేవునికి ఉందని నమ్మకంతో ఉంటారు.—యెషయా 41:10.
“దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా.” ఓర్పుతో కష్టాలను సహించేవాళ్లు, దేవుడు చివరికి తమను హెచ్చిస్తాడని అంటే తమకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మకంతో ఉండవచ్చు. తన సేవకులు ఎప్పటికీ పరీక్షించబడేలా లేదా భరించలేనంతగా పరీక్షించబడేలా దేవుడు అనుమతించడు. (1 కొరింథీయులు 10:13) అంతేకాదు, వాళ్లు మంచిపనులు చేస్తూ ఉంటే దేవుడు “తగిన సమయంలో” వాళ్లకు తప్పక ప్రతిఫలం ఇస్తాడు.—గలతీయులు 6:9.
“ఆయనకు మీ మీద శ్రద్ధ ఉంది కాబట్టి మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి.” క్రైస్తవులు వినయంతో ప్రార్థించి తమ ఆందోళనలు అన్నిటినీ దేవుని మీద వేయవచ్చు. ఒక రెఫరెన్సు పుస్తకం ఇలా చెప్తుంది: “వేయడం అనే క్రియాపదం దేన్నైనా దూరంగా విసిరేయడానికి చేసే ప్రయత్నాన్ని సూచిస్తుంది. అది, కావాలని చేసే ఒక పని.” క్రైస్తవులు ఒక్కసారి తమ ఆందోళనల్ని దేవుని మీద వేశాక ఎక్కువ కంగారు లేకుండా ఉంటారు, బైబిలు చెప్పే “దేవుని శాంతి” అనుభవిస్తారు. (ఫిలిప్పీయులు 4:6, 7) అంతేకాదు దేవుడు తమకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడని వాళ్లు నమ్మకంతో ఉండవచ్చు. ఎందుకంటే దేవునికి తమ మీద శ్రద్ధ ఉందని, తమను ఆదుకోవడానికి తన అపారశక్తిని ఉపయోగించగలడని వాళ్లకు తెలుసు.—కీర్తన 37:5; 55:22.
1 పేతురు 5:6, 7 సందర్భం
5వ అధ్యాయం, అపొస్తలుడైన పేతురు క్రైస్తవులకు రాసిన మొదటి ఉత్తరంలో చివరి అధ్యాయం. (1 పేతురు 1:1) ఈ రోజుల్లో లాగే అప్పుడున్న క్రీస్తు అనుచరులకు కూడా విశ్వాసాన్ని పరీక్షించే రకరకాల కష్టాలు వచ్చాయి, అవి వాళ్లను ఆందోళనకు గురిచేసి ఉండొచ్చు. (1 పేతురు 1:6, 7) పేతురుకు వాళ్ల కష్టాల గురించి తెలుసు కాబట్టి దాదాపు క్రీ.శ. 62-64 మధ్య వాళ్లను ప్రోత్సహిస్తూ ప్రేమతో ఒక ఉత్తరం రాశాడు.—1 పేతురు 5:12.
విశ్వాసం వల్ల కష్టాలు పడుతున్నవాళ్లను ప్రోత్సహించే మాటలతో పేతురు తన ఉత్తరాన్ని ముగించాడు. వాళ్లు వినయంగా ఉంటూ దేవుని మీద ఆధారపడితే, విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడని వాళ్లు నమ్మకంతో ఉండవచ్చు. (1 పేతురు 5:5-10) పేతురు మాటలు ఈ రోజుల్లో హింసలు పడుతున్న క్రైస్తవులకు కూడా అలాంటి ప్రోత్సాహాన్నే ఇస్తాయి.
1 పేతురు పుస్తకం గురించిన ప్రాముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.