బైబిలు వచనాల వివరణ
సామెతలు 17:17—“నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును”
“నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, కష్టకాలంలో అతను సహోదరుడిలా ఉంటాడు.”—సామెతలు 17:17, కొత్త లోక అనువాదం.
“నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.”—సామెతలు 17:17, పరిశుద్ధ గ్రంథము.
సామెతలు 17:17 అర్థమేంటి?
నిజమైన స్నేహితులు ఆధారపడేలా, నమ్మేలా ఉంటారు. తోబుట్టువుల్లా వాళ్లు వెన్నంటే ఉంటూ శ్రద్ధ చూపిస్తారు, ముఖ్యంగా కష్టకాలాల్లో అలా ఉంటారు.
“నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు.” ఈ వాక్యానికి “స్నేహితులు ఎప్పుడూ ప్రేమ చూపించుకుంటారు” అనే అర్థం కూడా ఉంది. ఇక్కడ “ప్రేమ” కోసం ఉపయోగించిన హీబ్రూ పదంలో, ఒక వ్యక్తిపై ఉండే భావన లేదా ఫీలింగ్ కంటే ఎక్కువే ఉంది. ఇది పనుల ద్వారా చూపించే నిస్వార్థమైన ప్రేమ. (1 కొరింథీయులు 13:4-7) అలాంటి ప్రేమ చూపించుకునే స్నేహితులు, వాళ్ల మధ్య చిన్నచిన్న సమస్యలు వచ్చినప్పుడు లేదా జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా కలిసే ఉంటారు. ఒకరినొకరు వెంటనే క్షమించుకుంటారు. (సామెతలు 10:12) అలాగే ఒకరికి మంచి జరిగితే, ఇంకొకరు అసూయపడరు. బదులుగా కలిసి సంతోషిస్తారు.—రోమీయులు 12:15.
“నిజమైన స్నేహితుడు … కష్టకాలంలో … సహోదరుడిలా ఉంటాడు.” తోబుట్టువుల మధ్య బలమైన బంధం ఉంటుందనే వాస్తవం ఈ సామెతకు ఆధారం. కాబట్టి కష్టాల్లో ఉన్న స్నేహితుని కోసం మనం చేయగలిగింది చేసినప్పుడు, మనం ఒక నిజమైన సహోదరుడు లేదా సహోదరిలా ఉంటాం. అలాంటి స్నేహితుల మధ్య ఉండే బంధం పరీక్షలు వచ్చినప్పుడు బలహీనం అవ్వదు. బదులుగా వాళ్ల మధ్య ప్రేమ, గౌరవం పెరగడం వల్ల ఆ బంధం ఇంకా బలపడుతుంది.
సామెతలు 17:17 సందర్భం
సామెతలు పుస్తకం, చదివే వ్యక్తిని ఆలోచింపజేసే తెలివైన ఆలోచనల్ని, సలహాల్ని సంక్షిప్త రూపంలో ఆకట్టుకునేలా చెప్తుంది. బైబిల్లోని ఈ పుస్తకంలో చాలా భాగాన్ని సొలొమోను రాజు రాశాడు. ఆయన రచనా శైలి హీబ్రూ కవితా శైలికి అద్దం పడుతుంది. అందులో ప్రాస ఉపయోగించే బదులు ఒకేలాంటి రెండు ఆలోచనలు తీసుకొని ఒకదానితో ఒకటి నొక్కిచెప్తారు, లేదా రెండు భిన్నమైన ఆలోచనలు తీసుకొని రెండిటికి మధ్య తేడా చూపిస్తారు. సామెతలు 17:17 శైలి ఎలా ఉందంటే, వచనంలోని రెండో భాగం అనేది మొదటి భాగంలో చెప్పిన ఆలోచనకు అదనపు సమాచారాన్ని జోడిస్తుంది. అయితే సామెతలు 18:24, వేర్వేరు ఆలోచనలు తీసుకొని వాటిమధ్య తేడా చూపిస్తుంది. అది ఇలా చెప్తుంది: “ఒకరినొకరు నాశనం చేసుకోవాలని చూసే సహవాసులు ఉన్నారు, సహోదరుడి కన్నా ఎక్కువగా ప్రేమించే స్నేహితుడు కూడా ఉన్నాడు.”
సామెతలు 17:17 రాస్తున్నప్పుడు సొలొమోను మనసులో తన తండ్రి దావీదుకు, సౌలు రాజు కుమారుడైన యోనాతానుకు మధ్య ఉన్న దగ్గరి స్నేహం ఉండివుంటుంది. (1 సమూయేలు 13:16; 18:1; 19:1-3; 20:30-34, 41, 42; 23:16-18) దావీదు, యోనాతాను నిజంగా సహోదరులు కాకపోయినా, అంతకన్నా బలమైన బంధం వాళ్ల మధ్య ఉంది. తనకన్నా వయసులో చిన్నవాడైన స్నేహితున్ని కాపాడడానికి యోనాతాను తన ప్రాణాన్ని కూడా ప్రమాదంలో పడేసుకున్నాడు. a
సామెతలు పుస్తకం గురించిన ప్రాముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.
a “యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను” అనే ఆర్టికల్ చూడండి.