బైబిలు వచనాల వివరణ
యిర్మీయా 29:11—‘మీ కోసం వేసిన నా ప్రణాళికలన్నీ నాకు తెలుసు’
“‘నేను మీకు ఏంచేయాలని అనుకుంటున్నానో నాకు తెలుసు. నేను మీకు విపత్తును కాదు శాంతిని దయచేస్తాను. మీకు మంచి భవిష్యత్తు, నిరీక్షణ ఉండేలా చేస్తాను’ అని యెహోవా a అంటున్నాడు.”—యిర్మీయా 29:11, కొత్త లోక అనువాదం.
“‘మీ అభివృద్ధి కొరకు వేసిన నా ప్రణాళికలన్నీ నాకు తెలుసు.’ ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం ‘మీ సంక్షేమం కొరకు నాకు ఎన్నోమంచి ఆలోచనలున్నాయి. మీకు కీడు చేయాలని నేనెన్నడూ ఆలోచించను. మీకు ఆశను, మంచి భవిష్యత్తును కలుగజేయటానికి వ్యూహరచన చేస్తాను.’”—యిర్మీయా 29:11, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్.
యిర్మీయా 29:11 అర్థమేంటి?
తనను ఆరాధించేవాళ్లకు శాంతి విలసిల్లే మంచి భవిష్యత్తు ఇస్తానని యెహోవా దేవుడు మాటిచ్చాడు. ఈ మాటలు రాసింది ఒకప్పటి ప్రజల కోసమే అయినా, ఇప్పటికీ దేవుని ఆలోచనలు అలాగే ఉన్నాయి. ఆయన “నిరీక్షణను ఇచ్చే దేవుడు.” (రోమీయులు 15:13) నిజానికి ఆయన బైబిల్లో ఆ మాటలు రాయించింది, మనం మంచి భవిష్యత్తు వస్తుందనే “నిరీక్షణ కలిగివుండాలని.”—రోమీయులు 15:4.
యిర్మీయా 29:11 సందర్భం
ఈ మాటలు, యెరూషలేము నుండి బందీలుగా వెళ్లి బబులోనులో నివసిస్తున్న ఇశ్రాయేలీయులకు పంపిన ఉత్తరంలోనివి. b (యిర్మీయా 29:1) బందీలుగా వెళ్లిన వాళ్లు అక్కడ చాలాకాలం ఉంటారని, వాళ్లు ఇళ్లు కట్టుకోవాలని, తోటలు నాటుకోవాలని, పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని దేవుడు వాళ్లకు చెప్పాడు. (యిర్మీయా 29:4-9) ఆ తర్వాత ఆయన ఇలా చెప్పాడు: “బబులోనులో 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, నేను మీ మీద దృష్టి పెడతాను, మిమ్మల్ని [యెరూషలేముకు] తిరిగి తీసుకురావడం ద్వారా నా వాగ్దానాన్ని నెరవేరుస్తాను.” (యిర్మీయా 29:10) ఆ మాటలతో దేవుడు వాళ్లను మర్చిపోనని, యెరూషలేముకు తిరిగివెళ్తామనే వాళ్ల ఆశ నిజమౌతుందని హామీ ఇచ్చాడు.—యిర్మీయా 31:16, 17.
దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. దేవుడు ముందే చెప్పినట్టు, పర్షియా రాజైన కోరెషు బబులోనును జయించాడు. (యెషయా 45:1, 2; యిర్మీయా 51:30-32) ఆ తర్వాత కోరెషు యూదుల్ని తమ స్వదేశానికి తిరిగి వెళ్లనిచ్చాడు. 70 సంవత్సరాలు బందీలుగా ఉన్న తర్వాత వాళ్లు తిరిగి యెరూషలేముకు వచ్చారు.—2 దినవృత్తాంతాలు 36:20-23; ఎజ్రా 3:1.
దేవుడు యిర్మీయా 29:11 లో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు కాబట్టి, ఈ రోజుల్లో కూడా ఆయన వాగ్దానాల మీద ఆశ పెట్టుకున్నవాళ్లు అవి జరుగుతాయని నమ్మకంతో ఉండవచ్చు. వాటిలో ఒకటి ఏంటంటే, యేసుక్రీస్తు పరిపాలించే దేవుని రాజ్యంలో భూమంతా శాంతితో నిండిపోతుంది.—కీర్తన 37:10, 11, 29; యెషయా 55:11; మత్తయి 6:10.
యిర్మీయా 29:11 గురించి అపోహలు
అపోహ: ప్రతీ వ్యక్తి గురించి దేవునికి ఒక “ప్రణాళిక” ఉంటుంది.
వాస్తవం: ప్రజలు ఏ మార్గంలో నడవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను దేవుడు వాళ్లకు ఇచ్చాడు. యిర్మీయా 29:11 లో ఉన్న మాటలు దేవుడు బబులోనులో ఉన్న ఇశ్రాయేలీయుల గుంపు గురించి చెప్పినవి. ఆ గుంపు విషయంలో ఆయనకు ఒక ఆలోచన ఉంది, ఆయన వాళ్లకు శాంతితో నిండిన భవిష్యత్తు ఇవ్వాలని అనుకున్నాడు. (యిర్మీయా 29:4) అయితే ఆ వాగ్దానం నుండి ప్రయోజనం పొందాలో లేదో నిర్ణయించుకునే అవకాశాన్ని వాళ్లలో ప్రతీ ఒక్కరికి ఇచ్చాడు. (ద్వితీయోపదేశకాండం 30:19, 20; యిర్మీయా 29:32) దేవుణ్ణి వెదకాలని నిర్ణయించుకున్న వాళ్లు నిజాయితీగల హృదయంతో ఆయనకు ప్రార్థించారు.—యిర్మీయా 29:12, 13.
అపోహ: దేవుడు వస్తుసంపదలు ఇచ్చి తన సేవకులను వర్ధిల్లేలా చేస్తాడు.
వాస్తవం: కొన్ని బైబిళ్లలో యిర్మీయా 29:11 లో “అభివృద్ధి” అనే మాట కనిపిస్తుంది. హీబ్రూలో దానికోసం ఉపయోగించిన పదానికి “శాంతి, ఆరోగ్యం, సంక్షేమం” అని అర్థం. సందర్భాన్ని బట్టి చూస్తే, బందీలుగా ఉన్న ఇశ్రాయేలీయులకు దేవుడు వాగ్దానం చేసింది సంపదల్ని కాదుగానీ శాంతిని, సంక్షేమాన్ని అని తెలుస్తోంది. అంటే వాళ్లు ఒక జనంగా ఉంటారు, ఏదోక రోజు యెరూషలేముకు తిరిగొస్తారు.—యిర్మీయా 29:4-10.
యిర్మీయా 29వ అధ్యాయం చదవండి. చదువుతున్నప్పుడు అధస్సూచీల్లో ఉన్న వివరణల్ని, క్రాస్ రెఫరెన్సులను కూడా చూడండి.
a యెహోవా అనేది దేవుడే స్వయంగా ఎంచుకున్న పేరు.—కీర్తన 83:18.
b యిర్మీయా 29:11 గురించి ది ఎక్స్పోజిటర్స్ బైబిల్ కామెంటరీ ఇలా చెప్తుంది: “బందీలుగా వెళ్లిన వాళ్లపట్ల యావేకు [యెహోవాకు] ఉన్న సాటిలేని కనికరాన్ని చూపిస్తూ వాళ్లు సానుకూలంగా, ఆశతో ఉండడానికి చివరికి ఒక కారణాన్ని ఇచ్చే ఇంతకన్నా అద్భుతమైన వాగ్దానాన్ని లేఖనాల్లో కనుక్కోవడం కష్టం.”—7వ సంపుటి, 360వ పేజీ.