కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

కొలొస్సయులు 3:23—“మీరేమి చేసినను … మనస్ఫూర్తిగా చేయుడి”

కొలొస్సయులు 3:23—“మీరేమి చేసినను … మనస్ఫూర్తిగా చేయుడి”

 “మీరు ఏమి చేసినా, మనుషుల కోసం చేస్తున్నట్టు కాకుండా, యెహోవా కోసం చేస్తున్నట్టు మనస్ఫూర్తిగా, మీ పూర్తి శక్తితో చేయండి.”—కొలొస్సయులు 3:23, కొత్త లోక అనువాదం.

 “మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.”—కొలొస్సయులు 3:23, 24, పరిశుద్ధ గ్రంథము.

కొలొస్సయులు 3:23 అర్థమేంటి?

 క్రైస్తవులు కష్టపడి పనిచేసేవాళ్లుగా ఉండాలి, ఎందుకంటే పని విషయంలో వాళ్లకున్న ఆలోచనకు, యెహోవా దేవునికి వాళ్లు చేసే ఆరాధనతో సంబంధం ఉంది.

 “మీరు ఏమి చేసినా.” యెహోవాను ఆరాధించాలని కోరుకునేవాళ్లు ప్రతీ విషయంలో బైబిలు చెప్పినట్టే నడుచుకుంటారు. వాళ్లు ఇంట్లో ఉన్నా, పనిస్థలంలో ఉన్నా, స్కూల్లో ఉన్నా ఎల్లప్పుడూ కష్టపడి పనిచేస్తారు, నిజాయితీగా ఉంటారు, నమ్మదగిన వాళ్లుగా ఉంటారు.—సామెతలు 11:13; రోమీయులు 12:11; హెబ్రీయులు 13:18.

 “మనస్ఫూర్తిగా, మీ పూర్తి శక్తితో చేయండి.” “మనస్ఫూర్తిగా, మీ పూర్తి శక్తితో” అని అనువదించిన గ్రీకు మాట, “దేవుని ఇష్టాన్ని పూర్తి శక్తితో చేయాలనే ఒక వ్యక్తి నిశ్చయాన్ని వర్ణిస్తుంది.” a

 కాబట్టి అలాంటి వ్యక్తి ఒక పని చేస్తున్నప్పుడు తన శారీరక, మానసిక సామర్థ్యాలన్నిటినీ ఉపయోగించి వీలైనంత బాగా దాన్ని చేయడానికి ప్రయత్నిస్తాడు.

 “మనుషుల కోసం చేస్తున్నట్టు కాకుండా, యెహోవా కోసం చేస్తున్నట్టు.” క్రైస్తవులు ఏ పని చేసినా దాన్ని శ్రద్ధగా చేస్తారు, ఎందుకంటే పని విషయంలో వాళ్ల ఆలోచనాతీరు యెహోవా దేవునితో తమ స్నేహం మీద ప్రభావం చూపిస్తుందని వాళ్లకు తెలుసు. వాళ్లు ముఖ్యంగా ఆయన్ని సంతోషపెట్టాలనే కోరుకుంటారు కానీ తమ యజమానినో ఇంకో మనిషినో కాదు. ఒక క్రైస్తవుడు సానుకూల వైఖరి చూపిస్తూ కష్టపడి పనిచేస్తూ ఉంటే, ప్రజలకు అతని మీదా అతను ఆరాధించే దేవుని మీదా మంచి అభిప్రాయం ఉంటుంది. అలా అతను, “ప్రజలు దేవుని పేరు గురించి … చెడుగా మాట్లాడుకోకుండా” తన వంతు కృషిచేస్తాడు.—1 తిమోతి 6:1; కొలొస్సయులు 3:22.

కొలొస్సయులు 3:23 సందర్భం

 బైబిల్లోని కొలొస్సయులు పుస్తకాన్ని అపొస్తలుడైన పౌలు ప్రాచీన కొలొస్సీ b నగరంలో ఉన్న క్రైస్తవులకు రాశాడు. దాదాపు క్రీ.శ. 60-61 లో, రోములో మొదటిసారి ఖైదీగా ఉన్న సమయం పూర్తి కావస్తున్నప్పుడు ఆయన దాన్ని రాశాడని తెలుస్తుంది.

 కొలొస్సయులు పుస్తకంలో, దేవుణ్ణి ఐక్యంగా ఆరాధించేలా అన్ని నేపథ్యాలకు చెందిన, అన్ని పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవులకు సహాయం చేసే సలహాలు ఉన్నాయి. (కొలొస్సయులు 3:11) దేవునిలాగే ప్రేమ, దయ, కరుణ వంటి చక్కని లక్షణాలను చూపించేలా అది వాళ్లను ప్రోత్సహిస్తుంది. (కొలొస్సయులు 3:12-14) దేవుని ఆరాధన, ఒక వ్యక్తి జీవితంలోని అన్ని విషయాలపై ఎలా ప్రభావం చూపిస్తుందో వివరిస్తుంది.—కొలొస్సయులు 3:18–4:1.

 కొలొస్సయులు పుస్తకం గురించిన ప్రాముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.

a ఎక్సజెటికల్‌ డిక్షనరీ ఆఫ్‌ ద న్యూ టెస్టమెంట్‌, 1993, 3వ సంపుటి, 502వ పేజీ నుండి.

b ఆధునిక టర్కీలో ఉంది.