క్రిస్మస్ గురించి బైబిలు ఏమి చెప్తుంది?
బైబిలు ఇచ్చే జవాబు
యేసు పుట్టిన తేదీ గురించి గానీ, మనం ఆయన పుట్టిన రోజును జరుపుకోవాలని గానీ బైబిలు ఎక్కడా చెప్పట్లేదు. మెక్ క్లిన్టాక్, స్ట్రాంగ్ల సైక్లోపీడియాలో ఇలా ఉంది: ‘క్రిస్మస్ను ఆచరించమని దేవుడు చెప్పలేదు, కొత్త నిబంధనలో కూడా ఆ ఆచరణ గురించి ఏమీ లేదు.’
క్రిస్మస్ పుట్టుపూర్వోత్తరాలను పరిశీలిస్తే, అది అన్యమతాచారాల నుండి వచ్చిందని తెలుస్తోంది. దేవున్ని ఆయనకు ఇష్టంలేని పద్ధతిలో ఆరాధిస్తే ఆయన ఇష్టపడడని బైబిలు చెప్తుంది.—నిర్గమకాండము 32:5-7.
క్రిస్మస్ ఆచారాలకు సంబంధించిన చరిత్ర
యేసు పుట్టిన రోజును జరుపుకోవడం: “తొలి క్రైస్తవులు యేసు పుట్టినరోజును పండుగలా జరుపుకోలేదు, ఎందుకంటే పుట్టినరోజును పండుగలా జరుపుకోవడాన్ని వాళ్లు అన్యమత ఆచారంగా భావించేవాళ్లు.”—ది వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా.
డిసెంబర్ 25: యేసు ఆ రోజున పుట్టాడనడానికి ఏ ఆధారమూ లేదు. అన్యమతాలవాళ్లు, చలికాలంలో పగలు అతి తక్కువగా ఉండే రోజును పండుగగా జరుపుకునే వాళ్లు. కాబట్టి ఆ తేదీ లేదా దానికి దగ్గరున్న రోజు వచ్చేలా చర్చి నాయకులు డిసెంబరు 25ను యేసు పుట్టినరోజుగా ఎన్నుకున్నారు.
బహుమతులు ఇచ్చుకోవడం, విందులు, పార్టీలు చేసుకోవడం: ది ఎన్సైక్లోపీడియా అమెరికానా ఇలా చెప్తుంది: “రోమన్లు డిసెంబరు మధ్యలో సాటర్నేలియా అనే పండుగ చేసుకునేవాళ్లు. ఆ పండుగను ఆచరించే పద్ధతిలోనే క్రిస్మస్ను కూడా ఆచరించడం మొదలుపెట్టారు. ఉదాహరణకు ఈ పండుగ నుంచే పెద్దపెద్ద విందులు చేసుకోవడం, బహుమతులు ఇచ్చుకోవడం, కొవ్వొత్తులు వెలిగించడం వంటివి వచ్చాయి.” సాటర్నేలియా పండుగ రోజున “అన్ని రకాల పనులకు, వ్యాపారాలకు సెలవు ప్రకటించేవాళ్లు” అని ది ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెప్తుంది.
క్రిస్మస్ లైట్లు: ది ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ ప్రకారం, పగలు అతి తక్కువగా ఉండి వేడుక జరుపుకునే రోజున, దుష్ట శక్తులతో పోరాడడానికి యూరోపియన్లు తమ ఇళ్లను “లైట్లతో, సంవత్సరమంతా పచ్చగా ఉండే ఓ రకమైన చెట్లతో” అలంకరించుకునేవాళ్లు.
మిసల్టో, హోల్లీ: ఇవి క్రిస్మస్ అలంకరణల్లో ఎక్కువగా ఉపయోగించే మొక్కలు. “ఈ మిసిల్టో మొక్కలకు అద్భుత శక్తులు ఉంటాయని కొంతమంది మతగురువులు చెప్పేవాళ్లు. హోల్లీ చెట్లను వెచ్చదనానిచ్చే సూర్యుడు తప్పకుండా వస్తాడనడానికి గుర్తుగా ఆరాధించేవాళ్లు.”—ది ఎన్సైక్లోపీడియా అమెరికానా.
క్రిస్మస్ చెట్టు: “యూరప్ దేశాల్లోని అన్యమతాల వాళ్లు చెట్లను ఎక్కువగా ఆరాధించేవాళ్లు. క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా వాళ్లు ఆ పద్ధతిని కొనసాగించారు.” “చలికాలం మధ్యలో వచ్చే సెలవుల్లో యూల్ చెట్టును (క్రిస్మస్ చెట్టు) గుమ్మం దగ్గర గానీ, ఇంట్లో గానీ పెట్టుకోవడం” ద్వారా చెట్లను ఆరాధించే ఆచారాన్ని కొనసాగించారు.—ఎన్సైక్లోపీడియా బ్రిటానికా.