‘ఒకసారి రక్షణ పొందితే, శాశ్వతంగా రక్షణ పొందినట్లే’ అని బైబిలు చెప్తోందా?
బైబిలు ఇచ్చే జవాబు
లేదు, ‘ఒకసారి రక్షణ పొందితే, శాశ్వతంగా రక్షణ పొందినట్లే’ అనే సిద్ధాంతాన్ని బైబిలు బోధించడం లేదు. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వ్యక్తి కొంతకాలానికి ఆ విశ్వాసాన్ని, దానివల్ల వచ్చే రక్షణను కోల్పోయే అవకాశం ఉంది. విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలంటే ‘పోరాడాలని’ అంటే గట్టిగా కృషిచేయాలని బైబిలు చెప్తుంది. (యూదా 3, 5) మొదటి శతాబ్దంలో, అప్పటికే క్రీస్తును అనుసరిస్తున్నవాళ్లకు పౌలు ఇలా చెప్పాడు, “భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి.”—ఫిలిప్పీయులు 2:12.
‘ఒకసారి రక్షణ పొందితే, శాశ్వతంగా రక్షణ పొందినట్లే’ అనే సిద్ధాంతం తప్పని రుజువు చేసే లేఖనాలు
ఒక వ్యక్తిని దేవుని రాజ్యంలోకి ప్రవేశించకుండా చేసే ఘోరమైన తప్పుల గురించి బైబిలు హెచ్చరిస్తుంది. (1 కొరింథీయులు 6:9-11; గలతీయులు 5:19-21) ఒకవేళ రక్షణ కోల్పోవడం అనే ప్రమాదమే లేకపోతే, బైబిల్లో ఉన్న అలాంటి హెచ్చరికలకు అర్థమే ఉండదు. కానీ రక్షణ పొందిన వ్యక్తి కొంతకాలానికి ఘోరమైన పాపం చేసి విశ్వాసం నుండి తొలగిపోయే ప్రమాదం ఉందని బైబిలు చెప్తుంది. ఉదాహరణకు, హెబ్రీయులు 10:26 లో ఇలా ఉంది, “మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు.”—హెబ్రీయులు 6:4-6; 2 పేతురు 2:20-22.
విశ్వాసాన్ని కోల్పోకుండా చూసుకోవడం ఎంత ప్రాముఖ్యమో యేసు ఒక ఉపమానం ద్వారా చెప్పాడు. ఆ ఉపమానంలో తనను ఒక ద్రాక్షచెట్టుతో, తన శిష్యుల్ని దానికున్న కొమ్మలతో పోల్చాడు. వాళ్లలో కొంతమంది యేసు మీద విశ్వాసాన్ని తమ ఫలాల ద్వారా లేదా పనుల ద్వారా చూపిస్తారు కానీ కొంతకాలానికి వాళ్లు ఆ విశ్వాసాన్ని కోల్పోతారు. కాబట్టి, అలాంటి వాళ్లు ‘[ఫలించని] తీగెవలె బయట పారవేయబడతారు’ అంటే రక్షణను కోల్పోతారు. (యోహాను 15:1-6) అపొస్తలుడైన పౌలు కూడా అలాంటి ఉపమానాన్నే చెప్తూ తమ విశ్వాసాన్ని కాపాడుకోని క్రైస్తవులు ‘నరికివేయబడుదురు’ అని చెప్పాడు.—రోమీయులు 11:17-22.
క్రైస్తవులు ‘మెలకువగా ఉండాలని’ యేసు ఆజ్ఞాపించాడు. (మత్తయి 24:42; 25:13) “అంధకార క్రియలను” చేయడంవల్ల లేదా యేసు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేయకపోవడం వల్ల ఎవరైతే ఆధ్యాత్మికంగా నిద్రపోతారో వాళ్లు తమ రక్షణను కోల్పోతారు.—రోమీయులు 13:11-13; ప్రకటన 3:1-3.
రక్షణ పొందినవాళ్లు సహితం అంతం వరకు నమ్మకంగా సహించాలని చాలా లేఖనాలు చెప్తున్నాయి. (మత్తయి 24:13; హెబ్రీయులు 10:36; 12:2,3; ప్రకటన 2:10) తోటి క్రైస్తవులు విశ్వాసం విషయంలో ఓర్పు చూపిస్తున్నారని తెలుసుకున్న మొదటి శతాబ్దపు క్రైస్తవులు చాలా సంతోషించారు. (1 థెస్సలొనీకయులు 1:2, 3; 3 యోహాను 3, 4) ఒకవేళ సహనం చూపించనివాళ్లు కూడా ఏదోక విధంగా రక్షణ పొందేస్తే, నమ్మకంగా సహించడం ప్రాముఖ్యమని బైబిలు చెప్పడం సరైనదిగా ఉంటుందా?
అపొస్తలుడైన పౌలుకు మరణం దగ్గరపడినప్పుడు మాత్రమే తాను రక్షణ పొందుతాననే నమ్మకం అతనికి కుదిరింది. (2 తిమోతి 4:6-8) దానికి కొంతకాలం ముందు, ఒకవేళ శరీర కోరికలకు లొంగిపోతే రక్షణను పోగొట్టుకుంటానని పౌలు గుర్తించాడు. అతను ఇలా చెప్పాడు, “ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.”—1 కొరింథీయులు 9:27; ఫిలిప్పీయులు 3:10-14.