ఆశ—అది ఎక్కడ దొరుకుతుంది?
బైబిలు ఇచ్చే జవాబు
దేవుడు మనకు “మంచి భవిష్యత్తు, నిరీక్షణ” a ఇవ్వడం కోసం పరితపిస్తున్నాడని బైబిలు చెప్తుంది. (యిర్మీయా 29:11) నిజానికి, “లేఖనాలు ఇచ్చే ఊరట వల్ల మనం నిరీక్షణ” పొందాలనే ఆయన బైబిల్ని ఇచ్చాడు. (రోమీయులు 15:4) బైబిల్లో ఉన్న తెలివైన సలహాలు మన రోజువారీ సమస్యల్ని గట్టెక్కవచ్చు అనే ఆశను కలిగిస్తాయి. అలాగే మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశను నింపుతాయి.
ఈ ఆర్టికల్లో
ఆశతో బ్రతకడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుంది?
మన జీవితానికి మెరుగులు దిద్దుకోవడానికి ఏ పనులు చేయాలో చెప్పడం ద్వారా బైబిలు మనలో ఆశను వెలిగిస్తుంది. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.
బైబిలు ఇచ్చే సలహాల్ని తెలుసుకోండి. కీర్తన 119:105 ఇలా చెప్తుంది: “నీ వాక్యం నా పాదానికి దీపం, నా త్రోవకు వెలుగు.” ఒక లైట్ వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, లైట్ వల్ల మన కళ్ల ముందు ఏముందో కనిపిస్తుంది. రెండోది, కాస్త దూరంలో ఏముందో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే బైబిలు సలహాలు మన ముందున్న అంటే మనకు రోజూ వచ్చే అడ్డంకుల్ని దాటడానికి సహాయం చేస్తాయి. అలా అవి మనలో ఆశను వెలిగిస్తాయి, తిరిగి బలాన్ని పుంజుకునేలా చేస్తాయి. అలాగే మన “హృదయాన్ని సంతోషపరుస్తాయి.” (కీర్తన 19:7, 8) అంతేకాదు, కాస్త దూరంలో ఉన్న అంటే, భవిష్యత్తును బైబిలిచ్చే వెలుగుతో చూడవచ్చు. భూమి విషయంలో, మనుషుల విషయంలో దేవునికున్న అద్భుతమైన సంకల్పాన్ని బైబిలు చెప్తుంది. ఆ ఆశ వల్ల మనం కలకాలం సంతోషంగా, సంతృప్తిగా జీవించవచ్చు.
వేరేవాళ్ల సహాయం తీసుకోండి. కష్టాల ఊబిలో కూరుకుపోయినప్పుడు కుటుంబానికి, స్నేహితులకు దూరంగా, ఒంటరితనానికి దగ్గరగా ఉండాలని అనిపిస్తుంది. కానీ అలా చేయడం తెలివితక్కువ పని అని బైబిలు చెప్తుంది. ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా, తప్పటడుగులు వేసేలా అవి మనల్ని నడిపిస్తాయి. (సామెతలు 18:1) అలా జరగకూడదంటే మన మనసుకు దగ్గరైనవాళ్లు మన పక్కన ఉండాలి. ఆ కష్టాల ఊబి నుండి బయటపడడానికి బహుశా వాళ్లు మనకు తెలివైన సలహాలు ఇవ్వచ్చు. (సామెతలు 11:14) అలాగే వాళ్లు మనల్ని ఓదార్చవచ్చు, మన భుజం తట్టి ధైర్యం చెప్పవచ్చు. అంతేకాదు పరిస్థితి చక్కబడే దాకా మన వెన్నంటే ఉంటూ మనకు కొండంత బలాన్ని ఇవ్వచ్చు.—సామెతలు 12:25.
దేవునికి చెప్పుకోండి. బైబిలు ఇలా చెప్తుంది: “నీ భారం యెహోవా మీద వేయి, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతుల్ని ఆయన ఎన్నడూ పడిపోనివ్వడు.” b (కీర్తన 55:22) అందుకే “నిరీక్షణను ఇచ్చే దేవుడు” అని యెహోవాను పిలవడం సరైనదే. (రోమీయులు 15:13) కాబట్టి ఆయన మీ మీద శ్రద్ధ చూపిస్తాడనే భరోసాతో మీ “చింతలన్నీ” ఆయన మీద వేయండి. (1 పేతురు 5:7, అధస్సూచి.) నిజానికి బైబిలు ఇలా చెప్తుంది: “ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, గట్టి పునాది మీద మిమ్మల్ని నిలబెడతాడు.”—1 పేతురు 5:10.
కష్టాన్ని ఆశకు ఆజ్యంలా చూడండి. బైబిలు ఇలా హామీ ఇస్తుంది: “నా [దేవుడు] మాటలు వినేవాళ్లు, విపత్తు వస్తుందనే భయం లేకుండా సురక్షితంగా నివసిస్తారు.” (సామెతలు 1:33) ఆస్ట్రేలియాలో తుఫాను వచ్చినప్పుడు మార్గరెట్ అనే ఆమెకు చాలా ఆస్తి నష్టం జరిగింది. దానికి ఆమె కుప్పకూలే బదులు, తరిగిపోయే ఆస్తిపాస్తులకంటే విలువైనవి వేరేవి ఉన్నాయని గుర్తించింది. అంటే తన కుటుంబం, స్నేహితులు, యెహోవాతో తన స్నేహం, బైబిలు ఇచ్చే నిరీక్షణ తరిగిపోనివి అని, వాటి మీద దృష్టి పెట్టాలని ఆమె ఇంకా గట్టిగా నిర్ణయించుకుంది.—కీర్తన 37:34; యాకోబు 4:8.
బైబిలు మనుషులందరిలో ఏ ఆశను చిగురిస్తుంది?
మనుషులందరి కోసం బంగారు భవిష్యత్తు వేచి ఉందని బైబిలు మాటిస్తోంది. అది ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే మనచుట్టూ మనుషులు అనుభవిస్తున్న సమస్యల్ని చూస్తే మనం “చివరి రోజుల్లో” జీవిస్తున్నామని అర్థమౌతుంది. (2 తిమోతి 3:1-5) కాబట్టి త్వరలోనే దేవుడు పూర్తి అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఈ భూమ్మీదున్న అన్యాయాన్ని, కష్టాల్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. ఆయన దాన్ని ఒక ప్రభుత్వం ద్వారా చేయబోతున్నాడు, అదే దేవుని రాజ్యం! (దానియేలు 2:44; ప్రకటన 11:15) ప్రార్థన ఎలా చేయాలో యేసు నేర్పిస్తున్నప్పుడు ఈ పరలోక రాజ్యం గురించే ఆయన ఇలా చెప్పాడు: “నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం . . . భూమ్మీద కూడా నెరవేరాలి.”—మత్తయి 6:9, 10.
మనుషుల కోసం దేవుడు ఏం చేస్తాడో బైబిల్లో స్పష్టంగా ఉంది. దేవుని రాజ్యం తీసేసే కొన్ని సమస్యలు:
ఆకలి అరుపులు ఇక ఉండవు. “భూమి దాని పంటను ఇస్తుంది.”—కీర్తన 67:6.
జబ్బులు ఇక మటుమాయం. “అందులో నివసించే వాళ్లెవ్వరూ, ‘నాకు ఒంట్లో బాలేదు’ అని అనరు.”—యెషయా 33:24.
చావు కేకలు ఇక ఉండవు. దేవుడు “[మనుషుల] కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు. అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి.”—ప్రకటన 21:3, 4.
a దేన్నైనా కోరుకున్నప్పుడు, అది దొరుకుతుందని నమ్మినప్పుడు దానికోసం మనం నిరీక్షిస్తాం లేదా ఆశతో ఉంటాం. ఏదైనా ఒక వస్తువు లేదా కనిపించని దానికోసం ఎదురుచూడడం కూడా ఆశ లేదా నిరీక్షణే.
b దేవుని పేరు యెహోవా అని బైబిలు చెప్తుంది.—కీర్తన 83:18.