కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

అది స్నేహమా లేక ప్రేమా?—2వ భాగం: నేను ఎలా ప్రవర్తిస్తున్నాను?

అది స్నేహమా లేక ప్రేమా?—2వ భాగం: నేను ఎలా ప్రవర్తిస్తున్నాను?

 మీ ఫ్రెండ్‌ ఎప్పుడు మీతో మాట్లాడాలనుకున్నా మాట్లాడడానికి మీరు రెడీగా ఉంటారు. అంతేకాదు, మీరు ఆ ఫ్రెండ్‌తో చాలా ఎక్కువసేపు మాట్లాడుతున్నారు. సమస్య ఏమిటంటే, మీరు మాట్లాడుతున్నది వ్యతిరేక లింగ వ్యక్తితో. మేము జస్ట్‌ ఫ్రెండ్స్‌ అంతే, అని మీరు అనుకుంటుండవచ్చు, అవతలి వ్యక్తి కూడా అలాగే అనుకుంటున్నారని మీరు అనుకోవచ్చు. మీరు ఈ విషయంలో ఏమైనా ఆలోచించాల్సి ఉందా?

 ఏమి జరగవచ్చు?

 అబ్బాయిలు అమ్మాయిలతో, అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహం చేయడంలో తప్పేంలేదు. అయితే మిగతా అందరికన్నా ఒక వ్యక్తితో చాలా ఎక్కువ చనువుగా ఉంటుంటే? అలాంటి సందర్భంలో, మీరు అవతలి వ్యక్తి నుండి ఆశిస్తున్నది కేవలం స్నేహం మాత్రమే కాదు అని అనుకుంటారు.

 అలా అనుకోవాలని మీరు కోరుకోకపోవచ్చు. కానీ అలా ఎందుకు అనుకుంటారో తెలిపే కొన్ని కారణాల్ని కింద పరిశీలించండి.

  •   మీరు ఆ వ్యక్తిపై ఎక్కువ శ్రద్ధ చూపించడం వల్ల.

     “అవతలి వ్యక్తి భావాల్ని మనం అదుపు చేయలేమన్నది నిజమే. ఒకవైపు, మనం జస్ట్‌ ఫ్రెండ్స్‌ అంతే, అని అంటూనే ఆ వ్యక్తికి ఫోన్‌ చేసి గంటల తరబడి మాట్లాడుతూ ఉంటే మండుతున్న మంటల్లో పెట్రోల్‌ పోసినట్లే.—సీయెరా.

  •   ఒకరి విషయంలో ఎక్కువగా స్పందించడం వల్ల.

     “ముందు నేను మెసేజ్‌ చేయలేదు కానీ ఒక అమ్మాయి మెసేజ్‌ల మీద మెసేజ్‌లు పంపించినప్పుడు నేను వాటన్నిటికీ జవాబు ఇస్తూ వచ్చాను. ఆ తర్వాత నేను తనను కేవలం ఒక ఫ్రెండ్‌లా మాత్రమే చూశానని ఒప్పించడం నాకు చాలా కష్టమైంది.—రిచర్డ్‌.

  •   మీపై ఎక్కువ శ్రద్ధ చూపించేలా ప్రవర్తించడం.

     “కొందరికి సరసాలాడడం (flirting) ఒక ఆటలాంటిది. వాళ్లకు చిరకాల బంధం ఏర్పర్చుకోవాలనే ఉద్దేశం లేకపోయినా, ఇతరుల ఫీలింగ్స్‌తో ఆడుకుంటారు. అలాంటివి నేను చాలా చూశాను, అలా జరిగినప్పుడు ఎవరో ఒకరు బాధపడుతూనే ఉంటారు.—టమారా.

 ఒక్కమాటలో: తరచూ మాట్లాడుకోవడం, వాళ్లను ఎక్కువగా పట్టించుకోవడం లాంటివి మీరు వాళ్లను ప్రేమిస్తున్నారనే ఆలోచనల్ని కలిగిస్తాయి.

 ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి

  •   చివరికి అవతలి వ్యక్తి బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది.

     బైబిలు ఇలా చెప్తుంది: “కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును.” (సామెతలు 13:12) ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నారనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే, మీరు ఆ వ్యక్తి నుండి ఏమి ఆశిస్తారు?

     “ ‘గాలానికే చిక్కించి ఉంచడం’ అనే ఒక ఇంగ్లీషు సామెత ఉంది. దానర్థం ఏమిటంటే, చేపను పట్టుకున్న తర్వాత దాన్ని మళ్లీ నీళ్లలో విడిచిపెట్టరు, బుట్టలో కూడా వేసుకోరు. స్నేహం విషయంలో కూడా అలా జరిగే అవకాశం ఉంది. మీకు ప్రేమించే ఉద్దేశం లేకపోయినా అవతలి వ్యక్తితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే చివరికి అవతలి వ్యక్తి ఎంతో బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది.”—జెస్సిక.

  •   మీ గౌరవం పోగొట్టుకుంటారు.

     బైబిలు ఇలా చెప్తుంది: “మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.” (ఫిలిప్పీయులు 2:4) తన గురించి మాత్రమే ఆలోచించుకునే వ్యక్తి గురించి మీరేమనుకుంటారు? అలాంటి వ్యక్తిని ఇతరులు గౌరవిస్తారా? గౌరవించరా?

     “అమ్మాయిలతో సరసాలాడే అబ్బాయిలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలాంటివాళ్లు పెళ్లయ్యాక తమ జతకు నమ్మకంగా ఉండరని చెప్పడానికి ఒక గుర్తు అది. అలా చేస్తూ వాళ్లు తమ అహాన్ని చూపించుకుంటారు, వాళ్లు కేవలం స్వార్థపరులు.”—జూలియ.

 ఒక్కమాటలో: పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేకపోయినా ప్రేమిస్తున్నట్లు ప్రవర్తించడం ఎదుటివ్యక్తిని బాధపెడుతుంది. అది మీకు కూడా మంచిది కాదు.

 మీరు ఏమి చేయవచ్చు?

  •   “యౌవనులను అన్నదమ్ములుగా,” అలాగే “యౌవన స్త్రీలను స్వచ్ఛమైన మనసుతో అక్కాచెల్లెళ్లుగా” చూడాలని బైబిలు చెప్తోంది. (1 తిమోతి 5:1, 2) మీరు ఈ సలహాను పాటిస్తే వ్యతిరేక లింగ వ్యక్తులతో మీకున్న స్నేహం పాడవ్వకుండా ఉంటుంది.

     “ఒకవేళ నాకు పెళ్లయివుంటే, నేను వేరేవాళ్ల భర్తతో సరసాలాడేదాన్ని కాదు. ఇప్పుడే, అంటే పెళ్లికాకముందే, అబ్బాయిలతో వ్యవహరించేటప్పుడు నా హద్దుల్లో నేను ఉండడం నాకే మంచిది.—లేయా.

  •   “విస్తారమైన మాటలలో దోషముండక మానదు” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 10:19) ఆ సలహా కేవలం మాట్లాడుకోవడానికే కాదు, మనం పంపే మెసేజ్‌లకు కూడా వర్తిస్తుంది. అంతేకాదు ఎన్ని మెసేజ్‌లు పంపిస్తున్నాం, ఎలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నాం అనేదానికి కూడా వర్తిస్తుంది.

     “మీకు ప్రేమించే ఉద్దేశం లేనప్పుడు ఒకమ్మాయికి రోజూ మెసేజ్‌లు పంపించాల్సిన అవసరం లేదు.”—బ్రయన్‌.

  •   “పరలోకం నుండి వచ్చే తెలివి అన్నిటికన్నా ముందు స్వచ్ఛమైనది” అని బైబిలు చెప్తోంది. (యాకోబు 3:17) మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేకుండా ఒకర్ని కౌగలించుకోవచ్చు. అయితే ఒక్కోసారి అది ‘నువ్వంటే నాకు ఇష్టం’ అనే సంకేతాన్ని కూడా ఇస్తుంది.

     “నేను సరదాగానే మాట్లాడతాను, కానీ అతి చనువు ఇవ్వను.”—మరియ.

 ఒక్కమాటలో: ఒకవేళ మీరు అబ్బాయి అయితే అమ్మాయిలతో ఎలా ప్రవర్తిస్తున్నారో జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఒకవేళ మీరు అమ్మాయి అయితే అబ్బాయిలతో ఎలా ప్రవర్తిస్తున్నారో జాగ్రత్తగా పరిశీలించుకోండి. “మంచి స్నేహితులు దొరకడం చాలా కష్టం, లేనిపోని ఆలోచనలు పుట్టించి మీ స్నేహాన్ని పాడుచేసుకోవద్దు” అని జెన్నిఫర్‌ అనే అమ్మాయి చెప్తోంది.

 సలహాలు

  •   ఇతరులు చెప్పే మాటల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. “నువ్వూ, ఆ వ్యక్తి ప్రేమించుకుంటున్నారా?” అని ఎవరైనా అడిగారంటే, మీ స్నేహం శ్రుతి మించుతోందని దానర్థం కావచ్చు.

  •   మీ స్నేహితులందరితో ఒకేలా ఉండండి. అది అమ్మాయి అయినా కావచ్చు, లేదా అబ్బాయి అయినా కావచ్చు. ఎవరో ఒకర్ని కాస్త ప్రత్యేకంగా చూస్తూ వాళ్లమీద మిగతావాళ్లకన్నా ఎక్కువ శ్రద్ధ చూపించకండి.

  •   మీరు పంపించే మెసేజ్‌ల విషయంలో అంటే, ఎన్ని మెసేజ్‌లు పంపుతున్నారు, ఎలాంటి మెసేజ్‌లు పంపుతున్నారు, ఏ సమయంలో వాటిని పంపుతున్నారు అనే విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. “అర్ధరాత్రివేళ ఒక అబ్బాయికి మెసేజ్‌ పంపాల్సిన అవసరమేమీ లేదు” అని అలిసా అనే అమ్మాయి అంటోంది.