యువత అడిగే ప్రశ్నలు
ఆటల గురించి నేనేమి తెలుసుకోవాలి?
ఆటల వల్ల మనకు మంచి జరగవచ్చు లేదా చెడు జరగవచ్చు. మనం ఎలాంటి ఆటలు ఆడతాం, ఎలా ఆడతాం, ఎంతసేపు ఆడతాం అనే వాటిమీద అది ఆధారపడి ఉంటుంది.
ఆటల వల్ల ప్రయోజనాలేంటి?
ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. శారీరక వ్యాయామం ‘ప్రయోజనకరం’ అని బైబిలు చెప్తుంది. (1 తిమోతి 4:8) రైయన్ అనే యువకుడు ఇలా అంటున్నాడు, “ఆటల వల్ల శరీరం ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. ఇంట్లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకోవడం కంటే అది చాలా మంచిది.”
ఆటలు ఆడడం వల్ల ఒక జట్టుగా పనిచేయడం, క్రమశిక్షణ నేర్చుకుంటాం. ఆటకు సంబంధించిన ఒక ఉపమానాన్ని ఉపయోగిస్తూ బైబిలు ఓ మంచి విషయం చెప్తుంది. అదేంటంటే, ‘పరుగు పందెంలో అందరూ పరుగెత్తినా ఒక్కరే బహుమానం పొందుతారు. పందెంలో పోరాడే ప్రతీఒక్కరు అన్ని విషయాల్లో మితంగా [నిగ్రహంగా] ఉంటారు.’ (1 కొరింథీయులు 9:24, 25) దీనిబట్టి మనకు ఏం అర్థమౌతుంది? ఒక ఆటను నియమాల ప్రకారం ఆడాలంటే నిగ్రహం, సహకారం అవసరం. అబిగేల్ అనే యువతి ఆ విషయాన్ని ఒప్పుకుంటూ ఇలా చెప్తుంది, “ఆటలు ఆడడం వల్ల, తోటివాళ్లతో ఎలా మాట్లాడాలో, వాళ్లతో ఎలా సహకరించాలో నేను నేర్చుకున్నాను.”
ఆటలు ఆడడం వల్ల స్నేహితులు దొరుకుతారు. ఆటలు ఆడేవాళ్లు ఒకరికొకరు దగ్గరౌతారు. జోర్డన్ అనే యువకుడు ఇలా అంటున్నాడు, “నిజానికి ప్రతీ ఆటలోనూ ఎంతోకొంత పోటీతత్వం ఉంటుంది. కానీ వాటిని సరదాగా ఆడితే, చాలామంది స్నేహితులు దొరుకుతారు.”
నష్టాలేంటి?
ఎలాంటి ఆటలు ఆడుతున్నాం? బైబిలు ఇలా చెప్తుంది, “యెహోవా న్యాయవంతులను పరీక్షిస్తాడు; దౌర్జన్యం అంటే ఇష్టమున్నవాళ్లనూ, దుర్మార్గులనూ ఆయన ద్వేషిస్తాడు.”—కీర్తన 11:5, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.
కొన్ని ఆటల్లో హింస ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, లారన్ అనే యువతి ఇలా చెప్తుంది, “బాక్సింగ్‌లో అవతలి వ్యక్తిని కొట్టడమే లక్ష్యం. క్రైస్తవులుగా మనం కొట్లాటలకు దూరంగా ఉంటాం. మరి అలాంటప్పుడు, ఒక వ్యక్తి దెబ్బలు తింటుంటే, మనం దాన్ని చూసి ఎందుకు ఆనందించాలి?”
ఆలోచించండి: హింసాత్మక ఆటల్ని ఆడినంతమాత్రాన లేదా చూసినంతమాత్రాన, హింసాత్మక పనులు చేయం కదా అని అనుకుంటున్నారా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. యెహోవా హింసకు పాల్పడేవాళ్లను మాత్రమే కాదు, హింసను ‘ఇష్టపడేవాళ్లను’ కూడా అసహ్యించుకుంటాడని కీర్తన 11:5 చెప్తుంది.
ఎలా ఆడుతున్నాం? బైబిలు ఇలా చెప్తుంది: “కక్షచేత గానీ వట్టి డంబంచేత గానీ ఏమీ చేయకండి. దానికి బదులు, మీలో ప్రతి ఒక్కరూ వినయంతో తనకంటే ఇతరులు ఎక్కువవారని ఎంచండి.”—ఫిలిప్పీయులు 2:3, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.
నిజానికి, రెండు జట్లు ఒకదానితో ఒకటి తలపడినప్పుడు ఎంతోకొంత పోటీతత్వం ఉంటుంది. కానీ, ‘ఏది ఏమైనా గెలిచి తీరాల్సిందే’ అనే స్వభావం, ఆటలో ఉన్న ఆనందాన్ని పాడుచేస్తుంది. బ్రైయన్ అనే యువకుడు ఇలా అంటున్నాడు, “మనలో పోటీతత్వం ఇట్టే మొలకెత్తగలదు. ఆటలు ఎంత ఎక్కువగా ఆడితే, అంత ఎక్కువగా వినయాన్ని అలవర్చుకోవాలి.”
ఆలోచించండి: క్రిస్ అనే యువకుడు ఇలా చెప్తున్నాడు, “మేము ప్రతీవారం ఫుట్‌బాల్ ఆడతాం, ఆటలో దెబ్బలు తగలడం మాకు మామూలే.” ఇప్పుడు మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘ఆటల్లో ఎక్కువగా ఏ కారణాల వల్ల, దెబ్బలు తగలవచ్చు? అలా జరగకూడదంటే నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?’
ఎంతసేపు ఆడుతున్నాం? బైబిలు ఇలా చెప్తుంది: ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో మీరు పరిశీలించి తెలుసుకోండి.’—ఫిలిప్పీయులు 1:9-11, NW.
ఏది ముందు చేయాలో, ఏది తర్వాత చేయాలో లిస్టు రాసుకోండి; దేవునికి సంబంధించిన విషయాలను ముందు పెట్టండి. కొన్ని ఆటలు గంటలు తరబడి ఉంటాయి. వాటిని ఆడినా, లేక చూస్తూ కూర్చున్నా ఎన్నో గంటలు గడిచిపోతాయి. డార్యా ఇలా చెప్తుంది, “నేను వేరే పనులు చేయాల్సిన సమయంలో టీవీ ముందు కూర్చుని ఆటలు చూసేదాన్ని. ఆ విషయంలో నాకూ మా అమ్మకూ ఎప్పుడూ గొడవయ్యేది.”
ఆలోచించండి: దేన్ని ముందు చేయాలో, దేన్ని తర్వాత చేయాలో మీ అమ్మానాన్నలు చెప్తున్నప్పుడు మీరు వింటారా? ట్రీన అనే యువతి ఇలా చెప్తుంది: “నేను, నా తోబుట్టువులు ముఖ్యమైన పనుల్ని పక్కనపెట్టి, టీవీలో ఆటలు చూస్తున్నప్పుడు, మా అమ్మ ఇలా అనేది, ‘మీరు ఆ ఆటల్ని చూసినా, చూడకపోయినా క్రీడాకారులకు డబ్బులు ఇస్తారు. మరి మీకు ఎవరు ఇస్తారు?’ ఆమె ఉద్దేశం ఏమిటంటే, క్రీడాకారులకు ఒక ఉద్యోగమంటూ ఉంది. కానీ హోంవర్క్‌ని, ముఖ్యమైన పనుల్ని పక్కనపెడితే, భవిష్యత్తులో మా కాళ్లమీద మేము నిలబడలేము. కాబట్టి ఆటల్ని ఆడడానికి లేదా చూడడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వవద్దని మా అమ్మ చెప్పేది.”