101వ అధ్యాయం
బేతనియలోని సీమోను ఇంట్లో భోజనం చేయడం
మత్తయి 26:6-13 మార్కు 14:3-9 యోహాను 11:55–12:11
-
యేసు యెరూషలేముకు దగ్గర్లో ఉన్న బేతనియకు మళ్లీ వచ్చాడు
-
మరియ యేసు మీద పరిమళ తైలం పోసింది
యేసు యెరికో నుండి బేతనియకు వెళ్తున్నాడు. బేతనియకు వెళ్లాలంటే, ఎత్తుపల్లాలు ఉన్న దారిలో దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించాలి. యెరికో, సముద్ర మట్టానికి దాదాపు 820 అడుగుల దిగువున ఉంటే, బేతనియ దాదాపు 2,000 అడుగుల ఎత్తులో ఉంది. లాజరు, అతని ఇద్దరు సహోదరీలు బేతనియ అనే చిన్న గ్రామంలో ఉంటున్నారు. అది యెరూషలేముకు దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో, ఒలీవల కొండ మీద తూర్పున ఉంది.
పస్కా పండుగ కోసం చాలామంది యూదులు అప్పటికే యెరూషలేముకు చేరుకున్నారు. శవాన్ని ముట్టుకోవడం వల్ల గానీ, మరేదైనా కారణం వల్ల గానీ అపవిత్రమైనవాళ్లు “ఆచార ప్రకారం శుద్ధి చేసుకోవడానికి” అక్కడికి ముందుగా వచ్చారు. (యోహాను 11:55; సంఖ్యాకాండం 9:6-10) వాళ్లలో కొంతమంది ఆలయంలో సమకూడి, యేసు పస్కాకు వస్తాడా రాడా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.—యోహాను 11:56.
యేసు గురించి ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది మతనాయకులు ఆయన్ని బంధించి చంపాలని చూస్తున్నారు. అందుకే, యేసు ఎక్కడున్నాడో తెలిస్తే తమ దగ్గరికి వచ్చి చెప్పమని వాళ్లు ఆదేశాలిచ్చారు. (యోహాను 11:57) ఇంతకుముందు లాజరును పునరుత్థానం చేసినప్పుడు కూడా వాళ్లు యేసును చంపాలని ప్రయత్నించారు. (యోహాను 11:49-53) కాబట్టి, ఆయన అందరి మధ్యకు వస్తాడా రాడా అని ప్రజలు సందేహించడం అర్థం చేసుకోదగినదే.
యేసు “పస్కా పండుగకు ఆరు రోజుల ముందు” అంటే శుక్రవారం బేతనియకు చేరుకున్నాడు. (యోహాను 12:1) సూర్యాస్తమయంతో మరో రోజు (అంటే నీసాను 8, విశ్రాంతి రోజు) మొదలౌతుంది. కాబట్టి ఆయన విశ్రాంతి రోజుకు ముందే ప్రయాణం ముగించాడని చెప్పవచ్చు. ఎందుకంటే, యూదుల నియమం ప్రకారం విశ్రాంతి రోజున, అంటే శుక్రవారం సూర్యాస్తమయం నుండి శనివారం సూర్యాస్తమయం వరకు ప్రయాణం చేయకూడదు. యేసు ఎప్పటిలాగే ఈసారి కూడా బేతనియలోని లాజరు ఇంటికి వెళ్లివుంటాడు.
బేతనియలోనే ఉంటున్న సీమోను అనే వ్యక్తి యేసును, ఆయనతోపాటు ఉన్నవాళ్లను, లాజరును శనివారం సాయంత్రం తన ఇంటికి భోజనానికి పిలిచాడు. అంతకుముందు సీమోనుకు ఉన్న కుష్ఠువ్యాధిని యేసు బాగుచేసి ఉంటాడు. అందుకే బైబిలు అతన్ని “కుష్ఠురోగి” అని పిలుస్తుంది. మార్త ఎప్పటిలాగే కష్టపడి అతిథులకు సపర్యలు చేస్తోంది. అయితే మరియ చేసిన ఒక పని, అక్కడ వివాదాన్ని రేపింది.
మరియ ఒక పాలరాతి బుడ్డి తెరిచింది. దాంట్లో “అసలుసిసలు జటామాంసి పరిమళ తైలం దాదాపు 300 గ్రాములు” ఉంది. (యోహాను 12:3) ఆ తైలం ఎంత ఖరీదైనదంటే, దాని విలువ (300 దేనారాలు) దాదాపు ఒక సంవత్సరంపాటు పనిచేస్తే వచ్చే జీతంతో సమానం! మరియ ఆ తైలాన్ని యేసు తల మీద, పాదాల మీద పోసి తన తలవెంట్రుకలతో ఆయన పాదాల్ని తుడిచింది. ఇల్లంతా సువాసనతో నిండిపోయింది.
అప్పుడు శిష్యులు కోపంతో, “ఈమె ఈ పరిమళ తైలాన్ని ఎందుకు వృథా చేస్తోంది?” అన్నారు. (మార్కు 14:4) ఇస్కరియోతు యూదా ఇలా అన్నాడు: “ఈ పరిమళ తైలాన్ని 300 దేనారాలకు అమ్మి ఎందుకు పేదవాళ్లకు ఇవ్వలేదు?” (యోహాను 12:5) యూదా అలా అనడానికి కారణం, పేదవాళ్ల మీద ఉన్న శ్రద్ధ కాదు. అతను తన దగ్గర ఉంచిన డబ్బుల పెట్టెలో నుండి, శిష్యుల కోసం దాచిన డబ్బును దొంగతనం చేసేవాడు.
అయితే, యేసు మరియ చేసిన పనిని సమర్థిస్తూ ఇలా అన్నాడు: “మీరెందుకు ఈమెను ఇబ్బందిపెడుతున్నారు? ఈమె నా విషయంలో మంచి పనే చేసింది. పేదవాళ్లు ఎప్పుడూ మీతోనే ఉంటారు, కానీ నేను ఎప్పుడూ మీతో ఉండను. ఈమె ఈ పరిమళ తైలాన్ని నా మీద పోసి, నా శరీరాన్ని సమాధి కోసం సిద్ధం చేసింది. నేను నిజంగా మీతో చెప్తున్నాను, ప్రపంచంలో సువార్త ప్రకటించే ప్రతీ చోట ఈమె చేసిన ఈ పని గురించి కూడా చెప్పుకుంటూ ఈమెను గుర్తుచేసుకుంటారు.”—మత్తయి 26:10-13.
యేసు బేతనియకు వచ్చి ఒక రోజు గడిచిపోయింది. ఆయన బేతనియలో ఉన్నాడన్న వార్త అందరికీ తెలిసిపోయింది. చాలామంది యూదులు యేసును చూడడానికి, అలాగే “మృతుల్లో నుండి ఆయన బ్రతికించిన లాజరును చూడడానికి” సీమోను ఇంటికి వచ్చారు. (యోహాను 12:9) పునరుత్థానమైన లాజరును చూసి చాలామంది ప్రజలు యేసు మీద విశ్వాసం ఉంచుతున్నారు. దాంతో ముఖ్య యాజకులు యేసును, లాజరును ఇద్దర్నీ చంపడానికి కుట్రపన్నారు. ఆ మతనాయకులు ఎంత దుర్మార్గులో కదా!