11
యేసు గురించి రాసిన వ్యక్తులు
ఈ చిత్రంలో ఉన్నవాళ్లను చూశారా?— ఇక్కడ మత్తయి, మార్కు, లూకా, యోహాను, పేతురు, యాకోబు, యూదా, పౌలు ఉన్నారు. వీళ్లంతా యేసు కాలంలో జీవించారు, యేసు గురించి రాశారు. ఇప్పుడు వాళ్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
వీళ్ల గురించి మీరేమి తెలుసుకున్నారు?
వీళ్లలో ముగ్గురు యేసుతో కలిసి ప్రకటనాపని చేశారు. వీళ్లకు అపొస్తలులు అనే పేరు ఉంది. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?— మత్తయి, యోహాను, పేతురు. మత్తయికి, యోహానుకు యేసు బాగా తెలుసు, వాళ్లిద్దరూ యేసు జీవితం గురించి చెరొక పుస్తకం రాశారు. అయితే
యోహాను ప్రకటన పుస్తకాన్నీ, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను అనే మూడు పత్రికల్నీ కూడా రాశాడు. పేతురు రెండు పత్రికల్ని రాశాడు. వాటిని మొదటి పేతురు, రెండవ పేతురు అంటాం. యేసు గురించి యెహోవా దేవుడు పరలోకం నుండి పలికిన ఈ మాటల్ని పేతురు తన రెండవ పత్రికలో రాశాడు: ‘ఇతను నా కుమారుడు. నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను, ఇతన్ని చూసి గర్వపడుతున్నాను.’చిత్రంలో కనిపిస్తున్న మిగతా వాళ్లు కూడా తమతమ పుస్తకాల్లో యేసు గురించి రాశారు. వాళ్లలో ఒకరు మార్కు. యేసును బంధించినప్పుడు మార్కు అక్కడే ఉండి, జరిగినదంతా చూసివుంటాడు. యేసు గురించి రాసిన ఇంకో వ్యక్తి లూకా. ఈయన ఓ డాక్టరు. బహుశా యేసు చనిపోయిన తర్వాత ఈయన క్రైస్తవుడు అయ్యుంటాడు.
చిత్రంలో కనిపిస్తున్న మరో ఇద్దరు యేసు తమ్ముళ్లు, వాళ్లు కూడా బైబిల్లో పుస్తకాలు రాశారు. వాళ్ల పేర్లు తెలుసా?— యాకోబు, యూదా. మొదట్లో వాళ్లు యేసును నమ్మలేదు. యేసుకు కొంచెం పిచ్చి ఉందని కూడా వాళ్లు అనుకున్నారు. కానీ ఆ తర్వాత యేసును నమ్మి క్రైస్తవులయ్యారు.
ఇక చిత్రంలో మిగిలిన వ్యక్తి పౌలు. క్రైస్తవుడు కాకముందు ఈయన పేరు సౌలు. ఒకప్పుడు ఈయనకు క్రైస్తవులంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు, వాళ్లను చాలా హింసించాడు. అలాంటి వ్యక్తి క్రైస్తవుడు ఎలా అయ్యాడో తెలుసా?— ఓ రోజు, పౌలు రోడ్డు మీద వెళ్తుండగా, ఉన్నట్టుండి పరలోకం నుండి ఎవరో తనతో మాట్లాడుతున్నట్టు ఆయనకు వినిపించింది. అలా మాట్లాడింది ఎవరో కాదు, యేసే! ఆయన పౌలును ఇలా అడిగాడు: ‘నా మీద విశ్వాసం ఉంచినవాళ్లను ఎందుకు హింసిస్తున్నావు?’ ఆ తర్వాత పౌలు మారి, క్రైస్తవుడు అయ్యాడు. బైబిల్లో రోమీయులు నుండి హెబ్రీయులు వరకు ఉన్న 14 పత్రికల్ని పౌలు రాశాడు.
మనం ప్రతీరోజు బైబిలు చదువుతాం, కదా?— బైబిలు చదివి మనం యేసు గురించి చాలా విషయాలు నేర్చుకుంటాం. మరి యేసు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఉందా?—
మీ బైబిల్లో చదవండి
-
2 పేతురు 1:16-18