అధ్యాయం 14
ముఖ్యాంశాలు నొక్కిచెప్పడం
హెబ్రీయులు 8:1
ఏమి చేయాలి? మీ ప్రసంగాన్ని చివరి వరకు శ్రద్ధగా వినేలా ప్రేక్షకులకు సహాయం చేయండి. ప్రతీ ముఖ్యాంశం (main point) ప్రసంగ ఉద్దేశంతో, ప్రసంగ అంశంతో (theme) ఎలా ముడిపడివుందో స్పష్టం చేయండి.
ఎలా చేయాలి?
-
ఒక ఉద్దేశంతో బోధించండి. మీ ప్రసంగ ఉద్దేశం ప్రేక్షకులకు సమాచారం తెలియజేయడమా, వాళ్లను ఒప్పించడమా, లేదా ప్రోత్సహించడమా అనేది గుర్తించి, దానికి తగ్గట్టు ప్రసంగాన్ని సిద్ధం చేసుకోండి. అంతేకాదు, ప్రసంగంలోని ముఖ్యాంశాలన్నీ ఆ ఉద్దేశానికి తగ్గట్టు ఉండేలా చూసుకోండి.
-
ప్రసంగ అంశాన్ని నొక్కిచెప్పండి. ప్రసంగ అంశంలోని ముఖ్యమైన పదాలను మళ్లీమళ్లీ చెప్తూ లేదా అదే అర్థం వచ్చే వేరే పదాలను ఉపయోగిస్తూ ప్రసంగమంతా ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉండండి.
-
ముఖ్యాంశాలు తేలిగ్గా అర్థమయ్యేలా ఉండాలి. ప్రసంగ అంశానికి సంబంధం ఉన్నవాటిని, మీకు ఇచ్చిన సమయంలో చక్కగా బోధించగలిగేవాటిని మాత్రమే ముఖ్యాంశాలుగా ఎంపిక చేసుకోండి. ఎక్కువ ముఖ్యాంశాలను ఎంచుకోకండి. ప్రతీ ముఖ్యాంశాన్ని స్పష్టంగా చెప్పండి, ఒక ముఖ్యాంశం నుండి మరో ముఖ్యాంశానికి మారుతున్నప్పుడు కాసేపు ఆగండి, అలాగే వాటి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పండి.