15వ అధ్యాయం
ఎందుకు ప్రేమ చూపించాలి?
వివక్ష అంటే ఏమిటో తెలుసా?— ఎవరైనా మనలా లేరనో, మన భాష మాట్లాడేవాళ్లు కాదనో వాళ్లను ఇష్టపడకపోవడాన్నే వివక్ష అంటారు. కాబట్టి వివక్ష చూపించడమంటే, ఎవరి గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా వాళ్లు మనకన్నా తక్కువవాళ్లు అనుకుని వాళ్లను చిన్నచూపు చూడడమే.
ఎవరైనా ఒకవ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోకుండా అతణ్ణి ఇష్టపడకపోవడం, లేదా అతను వేరుగా ఉన్నంత మాత్రాన అతణ్ణి ఇష్టపడకపోవడం సరైనదేనా?— కాదు, వివక్ష చూపించడం తప్పు, వివక్ష చూపిస్తున్నామంటే మనకు ప్రేమ లేదని అర్థం. ఎవరైనా వేరుగా ఉన్నంత మాత్రాన వాళ్ల మీద ప్రేమ చూపించకూడదని కాదు.
ఒకసారి ఆలోచించండి. వేరే ప్రాంతంవాళ్లు లేదా వేరే భాష మాట్లాడేవాళ్లు ఎవరైనా మీకు తెలుసా?— అనారోగ్యంవల్ల లేదా ఏదైనా ప్రమాదానికి గురవడంవల్ల మామూలుగా లేనివాళ్లు మీకు తెలిసివుండవచ్చు. అలాంటివాళ్ల మీద మీరు ప్రేమ చూపిస్తారా?—
మనం గొప్ప బోధకుడైన యేసుక్రీస్తు చెప్పినట్లు వింటే, ప్రతీ ఒక్కరి మీద ప్రేమ చూపిస్తాం. ఏ ప్రాంతం వాళ్లయినా లేదా ఏ భాష మాట్లాడేవాళ్లయినా మనం వాళ్లను వేరుగా చూడకూడదు. మనం వాళ్ల మీద ప్రేమ చూపించాలి. అయితే, ప్రేమ చూపించాలని అందరూ అనుకోకపోయినా, ఎందుకు ప్రేమ చూపించాలో యేసు నేర్పించాడు. దాని గురించి తెలుసుకుందాం.
వేరేవాళ్లంటే వివక్ష చూపించే ఒక యూదుడు యేసు దగ్గరకు వచ్చి, ‘నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలి?’ అని అడిగాడు. స్వంత దేశస్థుల మీద మాత్రమే ప్రేమ చూపించాలని తనతో చెప్పించడానికి ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నట్లు యేసుకు అర్థమైంది. ఆయన యూదుడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పే బదులు, ‘దేవుని ధర్మశాస్త్రం ఏంచేయమని చెప్తుంది?’ అని అతన్ని అడిగాడు.
దానికి ఆ యూదుడు, ‘నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో
ప్రేమించాలి. నిన్ను ప్రేమించుకున్నంతగా నీ పొరుగువాళ్లను ప్రేమించాలి’ అని చెప్పాడు. అప్పుడు యేసు, ‘సరిగ్గా చెప్పావు. అలాగే చేయి, అప్పుడు నిత్యజీవం పొందుతావు’ అన్నాడు.అయితే, యూదుల్లా లేనివాళ్ల మీద ప్రేమ చూపించడం అతనికి ఇష్టంలేదు. అందుకే అతను సాకులు వెదకడానికి ప్రయత్నించాడు. అతను యేసును, ‘ఇంతకీ నా పొరుగువాళ్లు ఎవరు?’ అని అడిగాడు. “నీ స్నేహితులే నీ పొరుగువాళ్లు” లేదా, “నీలా ఉండేవాళ్లే నీ పొరుగువాళ్లు” అని యేసు చెప్తాడని అతను అనుకుని ఉంటాడు. పొరుగువాళ్లు ఎవరో చెప్పడానికి యేసు ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ కథలో ఒక యూదుడు, ఒక సమరయుడు ఉంటారు.
ఒక వ్యక్తి యెరూషలేము నుండి కిందకు అంటే యెరికో పట్టణానికి నడిచి వెళ్తున్నాడు. అతను ఒక యూదుడు. అలా వెళ్తున్నప్పుడు దారిలో దోపిడీ దొంగలు అతన్ని దోచుకున్నారు. వాళ్లు అతన్ని కొట్టి కింద పడేసి, అతని దగ్గరున్న డబ్బు, బట్టలు లాక్కున్నారు. వాళ్లు అతన్ని బాగా కొట్టడంతో అతను దారి పక్కన కొనప్రాణంతో పడివున్నాడు.
కొంతసేపటికి ఆ దారిన వెళ్తున్న ఒక యాజకుడు బాగా దెబ్బలు తగిలి పడివున్న ఇతన్ని చూశాడు. మీరైతే ఏమి చేసేవాళ్లు?— ఆ యాజకుడు చూసి కూడా
దారికి అటువైపుగా వెళ్లిపోయాడు. అతను కనీసం ఆగను కూడా ఆగలేదు. ఆ వ్యక్తికి సహాయం చేయడానికి ఆ యాజకుడు ఏమీ చేయలేదు.ఆ తర్వాత, చాలా భక్తివున్న మరొకాయన అదే దారిలో వెళ్లాడు. అతను యెరూషలేము దేవాలయంలో సేవచేసే లేవీయుడు. సహాయం చేయడానికి అతనైనా ఆగాడా?— ఆగలేదు. అతను కూడా యాజకునిలా తన దారిన వెళ్లిపోయాడు.
చివరకు, ఒక సమరయుడు ఆ దారిన వచ్చాడు. దారి మలుపు దగ్గర ఆయన రావడం మీకు కనిపిస్తోందా?— బాగా దెబ్బలు తగిలి పడివున్న యూదుణ్ణి ఆయన చూశాడు. సాధారణంగా యూదులకు, సమరయులకు అస్సలు పడదు. (యోహాను 4:9) కాబట్టి, సమరయుడు యూదునికి సహాయం చేయకుండా వదిలేసి వెళ్లిపోయాడా? ‘నాకే గనుక దెబ్బలు తగిలితే ఈ యూదుడు వచ్చి సహాయం చేయడు, మరి నేనెందుకు అతనికి సహాయం చేయాలి?’ అని తనలో తాను అనుకున్నాడా?
ఆ సమరయుడు దారి పక్కన పడివున్న వ్యక్తిని చూసి అతని మీద జాలిపడ్డాడు. చనిపోయేలా ఉన్న ఆ వ్యక్తిని అలా వదిలేసి వెళ్లడం సరికాదని ఆయన అనుకున్నాడు. ఆయన గాడిద మీద నుండి దిగి, యూదుని దగ్గరకు వెళ్లి అతని గాయాల మీద నూనె, ద్రాక్షారసం పోసి శుభ్రం చేశాడు. అలా చేస్తే గాయాలు నయమవుతాయి. ఆ తర్వాత గాయాలకు కట్లుకట్టాడు.
సమరయుడు ఆ యూదుణ్ణి జాగ్రత్తగా పైకి లేపి, తన గాడిద మీదకు ఎక్కించాడు. తర్వాత అతనిని ఒక పూటకూళ్లవాని ఇంటికి అంటే ఒక చిన్న హోటలుకు తీసుకువచ్చాడు. అక్కడ ఆ యూదుని కోసం ఒక గది తీసుకుని, అతనికి కావాల్సిన ఏర్పాట్లు చేశాడు.
కథ చెప్పడం పూర్తయిన తర్వాత, యేసు తను మాట్లాడుతున్న వ్యక్తితో, ‘ఈ ముగ్గురిలో ఎవరు మంచి పొరుగువాడని నీకు అనిపిస్తుంది?’ అని అడిగాడు. మీరేమంటారు? యాజకుడా, లేవీయుడా, సమరయుడా?—
అప్పుడు అతను, ‘గాయపడిన వ్యక్తి దగ్గరకు వచ్చి, అతని గురించి శ్రద్ధ తీసుకున్నవాడే మంచి పొరుగువాడు’ అని చెప్పాడు. అప్పుడు యేసు, ‘సరిగ్గా చెప్పావు. వెళ్లి నువ్వు కూడా అలాగే చెయ్యి’ అన్నాడు.—లూకా 10:25-37.
కథ చాలా బాగుంది కదా! మన పొరుగువాళ్లు ఎవరో అది
స్పష్టంగా చూపిస్తోంది. పొరుగువాళ్లు అంటే కేవలం మన దగ్గరి స్నేహితులు, మన ప్రాంతంవాళ్లు లేదా మన భాష మాట్లాడేవాళ్లు మాత్రమే కాదు. ప్రజలందరి మీద అంటే అన్ని ప్రాంతాలవాళ్ల మీద, అన్ని భాషలవాళ్ల మీద ప్రేమ చూపించాలని యేసు బోధించాడు.యెహోవా దేవుడు కూడా అలాగే చేస్తాడు. ఆయన ఎవ్వరి మీద వివక్ష చూపించడు. ‘పరలోకంలోవున్న మీ తండ్రి చెడ్డవాళ్ల మీద, మంచివాళ్ల మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు’ అని యేసు చెప్పాడు. కాబట్టి మనం కూడా దేవునిలానే అందరిమీద ప్రేమ చూపించాలి.—మత్తయి 5:44-48.
ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా దెబ్బ తగిలితే మీరు ఏంచేస్తారు?— ఆ దెబ్బ తగిలిన వాళ్లు వేరే ప్రాంతంవాళ్లు, వేరే భాష మాట్లాడేవాళ్లు అయితే అప్పుడు కూడా సహాయం చేస్తారా? వాళ్లు ఎవ్వరైనా వాళ్లు మీకు పొరుగువాళ్లే, కాబట్టి మీరు వాళ్లకు సహాయం చేయాలి. మీరు వాళ్లకు సహాయం చేయలేనంత చిన్నవాళ్లయితే, ఎవరైనా పెద్దవాళ్లను పిలువవచ్చు. లేదా పోలీసునో, స్కూలు టీచరునో సహాయం చేయమని అడగవచ్చు. అలాచేస్తే మీరు సమరయునిలా, ఇతరులమీద ప్రేమ చూపిస్తున్నారన్నమాట.
గొప్ప బోధకుడు మనం ప్రేమ చూపించాలని కోరుకుంటున్నాడు. మనం అందరికీ అంటే ఏ ప్రాంతంవాళ్లకైనా, ఏ భాష మాట్లాడేవాళ్లకైనా సహాయం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఆయన ప్రేమగల సమరయుని కథ చెప్పాడు.
ఏ ప్రాంతంవాళ్ల మీదైనా, ఏ భాష మాట్లాడేవాళ్ల మీదైనా ఎందుకు ప్రేమ చూపించాలో వివరించే, సామెతలు 19:22; అపొస్తలుల కార్యములు 10:34, 35; 17:26 వచనాలు చదవండి.