మన భవిష్యత్తు ఎలా ఉంటుంది?
మన భవిష్యత్తు ఎలా ఉంటుంది?
ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం ఎందుకంత ప్రాముఖ్యం? ఒక వ్యక్తి రేపటి గురించి తనకున్న అభిప్రాయాన్నిబట్టి నేడు ప్రవర్తిస్తాడు. ఉదాహరణకు, భవిష్యత్తుపై ఏ మాత్రం ఆశాభావం లేనివారు “రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము” అనే మనోవైఖరిని అలవర్చుకోవచ్చు. (1 కొరింథీయులు 15:32) అలాంటి మనోవైఖరివల్ల ప్రజలు తిండిబోతులుగా, త్రాగుబోతులుగా తయారవుతారే కానీ వారికి నిజమైన మనశ్శాంతి లభించదు.
భవిష్యత్తును పూర్తిగా మానవుల చేతుల్లో వదిలేస్తే భావినిరీక్షణ నిస్సందేహంగా అంధకారమయంగా ఉంటుంది. భూమ్మీదున్న గాలి, నీరు, నేల ఇంతకు ముందెప్పుడూ లేనంతగా కలుషితం చేయబడుతున్నాయి. అణుయుద్ధాల, ఉగ్రవాద దాడుల ముప్పు అంతకంతకూ ఎక్కువవుతోంది. వ్యాధులు, దారిద్ర్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమందిని పట్టిపీడిస్తున్నాయి. కానీ మంచి భవిష్యత్తు కోసం ఎదురుచూడడానికి సరైన కారణాలే ఉన్నాయి.
భవిష్యత్తు గురించి మానవులు ఖచ్చితంగా చెప్పలేరు, అయితే యెహోవా దేవుడు తన గురించి ఇలా చెబుతున్నాడు: “ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.” (యెషయా 46:10) భవిష్యత్తు గురించి యెహోవా ఏమి చెబుతున్నాడు?
బైబిలు ఇస్తున్న జవాబు ఏమిటి?
యెహోవా భూమిని, దానిమీది జీవరాశులను సర్వనాశనం కానివ్వడు. నిజానికి దేవుడు ‘భూమిని నశింపజేయువారిని నశింపజేస్తాడు’ అని బైబిలు వాగ్దానం చేస్తోంది. (ప్రకటన 11:18) యెహోవా తన రాజ్యం లేదా పరలోక ప్రభుత్వం ద్వారా భూమ్మీదున్న దుష్టత్వాన్ని పూర్తిగా రూపుమాపి, భూమిని తాను మొదట ఉద్దేశించినట్లుగా మారుస్తాడు. (ఆదికాండము 1:26-31; 2:8, 9; మత్తయి 6:9, 10) త్వరలోనే భూమ్మీదున్న ప్రతీ వ్యక్తిని ప్రభావితం చేసే సంఘటనలను వివరిస్తూ, మన భవిష్యత్తు ఎలా ఉంటుందో బైబిలు ఈ క్రింది వచనాల్లో వివరిస్తోంది.
కీర్తన 46:8, 9. “యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి . . . ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.”
యెషయా 35:5, 6. “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును.”
యెషయా 65:21, 22. “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు.”
దానియేలు 2:44. “పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”
యోహాను 5:28, 29. “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన [యేసు] శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.”
ప్రకటన 21:3, 4. “దేవుడు తానే . . . వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”
బైబిలు ఇస్తున్న జవాబులు నిజమైన మనశ్శాంతిని ఎలా ఇస్తాయి?
పైన వర్ణించబడినలాంటి పరిస్థితులు నిజంగా నెలకొంటాయని నమ్మడం మొదట్లో కష్టంగా అనిపించవచ్చు. కానీ ఈ వాగ్దానాలను చేసింది దేవుడేగాని, మనుష్యులు కాదు. యెహోవా దేవుడు ‘అబద్ధమాడనేరడు.’—తీతు 1:2-4.
మీరు దేవుని వాగ్దానాలను నమ్మడాన్ని, ఆయన నియమాలకు అనుసారంగా జీవించడాన్ని నేర్చుకునప్పుడు, పరిస్థితులు ఎంత కష్టభరితంగా ఉన్నా మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. యుద్ధం, పేదరికం, అనారోగ్యం, వృద్ధాప్యంవల్ల వచ్చే సమస్యలుగానీ లేదా మృత్యు ఛాయలుగానీ మీ మనశ్శాంతిని పాడుచేయలేవు. ఎందుకు? ఎందుకంటే, ఈ బాధలవల్ల మీరు అనుభవిస్తున్న దుఃఖాన్ని అంతటినీ దేవుని రాజ్యం రూపుమాపుతుందనే గట్టి నమ్మకం మీకు ఉంటుంది.
భవిష్యత్తు విషయంలో అలాంటి బలమైన నిరీక్షణను మీరు ఎలా కలిగివుండవచ్చు? మీరు మీ ‘మనస్సు మార్చుకుని’ ‘ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో’ పరీక్షించేవారిగా ఉండాలి. (రోమీయులు 12:2) అయితే, బైబిలు వాగ్దానాలు పూర్తిగా నమ్మదగినవని తెలుసుకోవడానికి మీకు ఇంకా అదనపు రుజువులు అవసరం కావచ్చు. అలాంటి పరిశోధన ఎంతో ప్రయోజనకరమైనది. అలా చేయడం జీవితంలో మీకు ఎంతో మనశ్శాంతినిస్తుంది. (w 08 2/1)
[8, 9వ పేజీలోని చిత్రాలు]
భవిష్యత్తు గురించి దేవుని వాక్యం ఏమి చెబుతోంది?