కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమావేశాలు—యెహోవా ప్రజలకు సంతోషాన్నిచ్చే సందర్భాలు

సమావేశాలు—యెహోవా ప్రజలకు సంతోషాన్నిచ్చే సందర్భాలు

‘పురుషులను, స్త్రీలను, పిల్లలను, నీ పరదేశులను అందరినీ పోగుచేయవలెను.’—ద్వితీ. 31:12.

1, 2. దేవుని ప్రజల సమావేశాలకు సంబంధించిన ఏ అంశాల గురించి మనం ఆలోచించాలి?

 అంతర్జాతీయ సమావేశాలు, జిల్లా సమావేశాలు యెహోవాసాక్షుల ఆధునిక చరిత్రలో ఎల్లప్పుడూ ఒక ప్రాముఖ్యమైన భాగంగా ఉన్నాయని మనలో చాలామందికి తెలుసు. గడిచిన దశాబ్దాల్లో సంతోషకరమైన అలాంటి ఎన్నో సమావేశాలకు మనలో చాలామందిమి హాజరయ్యాం.

2 వేల సంవత్సరాల క్రితం, దేవుని ప్రజలు పరిశుద్ధమైన సమావేశాల్ని జరుపుకున్నారు. లేఖనాల్లో ప్రస్తావించబడిన అలాంటి కొన్ని సమావేశాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. అలా పరిశీలిస్తుండగా పూర్వం జరిగిన సమావేశాలకు, మనకాలంలోని సమావేశాలకు మధ్య ఉన్న పోలికల్ని గమనిద్దాం. అంతేకాక, వాటికి హాజరుకావడం వల్ల వచ్చే ప్రయోజనాలపై దృష్టి పెడదాం.—కీర్త. 44:1; రోమా. 15:4.

ప్రాచీన కాలంలో, ఆధునిక కాలంలో జరిగిన చారిత్రక సమావేశాలు

3. (ఎ) బైబిల్లో నమోదైన మొట్టమొదటి సమావేశపు విశిష్టత ఏమిటి? (బి) ఇశ్రాయేలీయుల్ని సమావేశపర్చడానికి యెహోవా ఏ ఏర్పాటు చేశాడు?

3 దేవుని ప్రజలు పెద్ద సంఖ్యలో సీయోను పర్వతం దగ్గర సమకూడిన సందర్భమే బైబిల్లో నమోదైన మొట్టమొదటి పెద్ద సమావేశం. స్వచ్ఛారాధనకు సంబంధించి అది నిజంగా చరిత్రలో నిలిచిపోయిన ఘట్టం. ప్రజల్ని ఎంతో ఆశ్చర్యంలో ముంచెత్తిన ఆ సందర్భాన్ని అక్కడున్నవాళ్లు తమ జీవితాంతం గుర్తుంచుకొని ఉంటారు. యెహోవా ఆ సమయంలోనే తన శక్తిని ప్రదర్శించాడు, వాళ్ల కోసం తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. (నిర్గ. 19:2-9, 16-19; నిర్గమకాండము 20:18; ద్వితీయోపదేశకాండము 4:9, 10 చదవండి.) యెహోవా ఇశ్రాయేలీయులతో ఆ తర్వాత జరిపిన వ్యవహారాలన్నిటికీ అదే కీలకమైన సందర్భం. తన ప్రజల్ని సమావేశపర్చేందుకు యెహోవా కొంతకాలానికి ఒక ఏర్పాటు చేశాడు. రెండు వెండి బూరలను చేయమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించి, “ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునెదుట” సమావేశమయ్యేలా ‘సమాజాన్ని పిలవడానికి’ వాటిని ఉపయోగించాలని చెప్పాడు. (సంఖ్యా. 10:1-4) అలాంటి సందర్భాల్లో వాళ్లెంత సంతోషించి ఉంటారో కదా!

4, 5. మోషే, యెహోషువ నిర్వహించిన సమావేశాలు ఎందుకు ప్రత్యేకమైనవి?

4 ఇశ్రాయేలీయులు అరణ్యంలో గడిపిన 40 సంవత్సరాల ముగింపులో మోషే వాళ్లందరినీ సమావేశపర్చాడు. ఆ కొత్త జనాంగపు చరిత్రలో అదో ప్రాముఖ్యమైన సమయం. అప్పటికే వాళ్లంతా వాగ్దాన దేశపు ముంగిట్లో ఉన్నారు. యెహోవా అప్పటివరకు తమకోసం చేసిన వాటి గురించి, భవిష్యత్తులో ఇంకా చేయబోయే వాటి గురించి తోటి ఇశ్రాయేలీయులందరికీ గుర్తుచేయడానికి మోషేకు అది సరైన తరుణం.—ద్వితీ. 29:1-15; 30:15-20; 31:30.

5 దేవుని ఉపదేశాలు వినేలా ప్రజలందరూ క్రమంగా కూడుకునే ఏర్పాటు గురించి మోషే బహుశా ఆ సమావేశంలోనే ప్రస్తావించి ఉంటాడు. ప్రతీ ఏడవ సంవత్సరం ముగింపులో పర్ణశాలల పండుగ జరుపుకునే సమయంలో పురుషులు, స్త్రీలు, పిల్లలు, పరదేశులు ‘దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు’ యెహోవా నియమించిన చోట సమావేశమవ్వాలని వాళ్లకు ఆజ్ఞాపించబడింది. (ద్వితీయోపదేశకాండము 31:1, 10-12 చదవండి.) యెహోవా వాక్యాన్ని, ఆయన సంకల్పాలను తెలుసుకోవడానికి వాళ్లు క్రమంగా హాజరవ్వాలని యెహోవా ప్రజల చరిత్ర తొలినాళ్లలోనే స్పష్టమైంది. వాగ్దాన దేశాన్ని పూర్తిగా జయించిన తర్వాత కూడా ఇశ్రాయేలీయుల చుట్టూ అన్యజనాంగాలు ఉండేవాళ్లు, అందుకే ఇశ్రాయేలీయులు యెహోవాకు విశ్వసనీయంగా ఉండాలనే తమ స్థిర నిశ్చయాన్ని బలపర్చుకునేలా యెహోషువ వాళ్లందరినీ సమావేశపర్చాడు. వాళ్లందరూ దేవుణ్ణి సేవిస్తామని అప్పుడు ప్రమాణం చేశారు.—యెహో. 23:1, 2; 24:1, 15, 21-24.

6, 7. ఆధునిక కాలంలో యెహోవా ప్రజలు జరుపుకున్న సమావేశాలు ప్రాముఖ్యమైన మైలురాళ్లని ఎలా చెప్పవచ్చు?

6 ఆధునిక కాలంలో కూడా కొన్ని చారిత్రక సమావేశాలు జరిగాయి. దేవుని సేవకు సంబంధించి, లేఖనాల అవగాహనకు సంబంధించి పెద్ద పెద్ద మార్పులను ఆ సమావేశాల్లో ప్రకటించారు. (సామె. 4:18) మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1919లో అమెరికాలోని ఒహాయోలో ఉన్న సీడార్‌ పాయింట్‌ వద్ద బైబిలు విద్యార్థులు మొట్టమొదటిసారిగా ఓ పెద్ద సమావేశాన్ని జరుపుకున్నారు. ఆ సమావేశానికి దాదాపు 7,000 మంది హాజరయ్యారు. పైగా, ఆ సమావేశమే ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి నాంది పలికింది. 1922లో అదే ప్రదేశంలో జరిగిన తొమ్మిది రోజుల సమావేశంలో ప్రపంచవ్యాప్త ప్రకటనా పని ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ సహోదరుడు జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ ప్రేక్షకుల్ని ఇలా ప్రోత్సహించాడు: ‘ప్రభువుకు నమ్మకమైన సత్య సాక్షులుగా ఉండండి. బబులోనుకు సంబంధించినవన్నీ నాశనమయ్యేంతవరకు పోరాటంలో ముందుకు సాగండి. సందేశాన్ని సుదూర ప్రాంతాలకు చేరవేయండి. యెహోవాయే దేవుడని, యేసుక్రీస్తు రాజులకు రాజూ, ప్రభువులకు ప్రభువూ అని లోకం తెలుసుకోవాలి. ఇదే అత్యంత ముఖ్యమైన రోజు. ఇదిగో, రాజు ఏలుతున్నాడు! మీరు ఆయన బహిరంగ ప్రతినిధులు. కాబట్టి రాజునూ, ఆయన రాజ్యాన్నీ ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి.’ ఆ సమావేశానికి హాజరైనవాళ్లతోపాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజలు ఆయనిచ్చిన ప్రోత్సాహాన్ని సంతోషంగా స్వీకరించారు.

7 ఒహాయోలోని కొలంబస్‌ వద్ద 1931లో జరిగిన సమావేశంలో యెహోవాసాక్షులు అనే పేరును బైబిలు విద్యార్థులు ఎంతో సంతోషంగా స్వీకరించారు. 1935, వాషింగ్టన్‌ డీ.సీలో జరిగిన సమావేశంలో ఒక కొత్త విషయం బయలుపర్చబడింది. ‘సింహాసనము ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలువబడి’ ఉన్నట్లు ప్రకటన గ్రంథం ప్రస్తావిస్తున్న “గొప్ప సమూహము” ఎవరో సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ఆ సమావేశంలో బయలుపర్చాడు. (ప్రక. 7:9-17) రెండవ ప్రపంచయుద్ధం ముమ్మరంగా సాగుతున్న 1942లో, సహోదరుడు నేథన్‌ హెచ్‌. నార్‌ ఒక సమావేశంలో “శాంతి—అది నిలుస్తుందా?” అనే ఉత్తేజకరమైన ప్రసంగం ఇచ్చాడు. ప్రకటన 17వ అధ్యాయంలో ప్రస్తావించబడిన “ఎర్రని క్రూరమృగము” దేన్ని సూచిస్తుందో ఆయన ఆ ప్రసంగంలో వెల్లడించాడు. అంతేకాక, యుద్ధం ముగిశాక కూడా ఎంతో ప్రకటనా పని చేయాల్సి ఉంటుందని ఆయన సూచించాడు.

1950లో న్యూయార్క్‌ నగరంలో జరిగిన అంతర్జాతీయ సమావేశం

8, 9. కొన్ని సమావేశాలు ఎంతో కదిలించాయని ఎందుకు చెప్పవచ్చు?

8 ఒహాయోలోని క్లీవ్‌లాండ్‌ వద్ద 1946లో “ఆనందభరిత దేశాలు” అనే సమావేశంలో సహోదరుడు నార్‌, “పునర్నిర్మాణానికి, విస్తరణకు సంబంధించిన సమస్యలు” అనే ముఖ్యాంశంతో ఇచ్చిన ప్రసంగం ప్రత్యేకంగా గమనార్హమైనది. ఆ ప్రసంగం ప్రజల్లో ఎంత ఉత్సాహాన్ని కలిగించిందో తెలియజేస్తూ ఆ సమావేశానికి హాజరైన ఒక సహోదరుడు ఇలా రాశాడు: “ఆ రోజు సాయంత్రం ఆయన ప్రసంగం ఇస్తున్నప్పుడు వేదిక మీద ఆయన వెనకాలే ఉన్నాను. త్వరలోనే చేపట్టబోయే పనుల గురించి, బ్రూక్లిన్‌ బెతెల్‌ గృహానికీ ముద్రణాలయానికీ సంబంధించిన విస్తరణా ప్రణాళికల గురించి సహోదరుడు నార్‌ చెబుతున్నంతసేపూ వేలమంది ప్రేక్షకుల చప్పట్లతో హాలంతా మారుమ్రోగిపోయింది. ఒక్కొక్కరి ముఖం అంత స్పష్టంగా కనిపించకపోయినా వాళ్ల ముఖాల్లో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపించింది.” 1950లో న్యూయార్క్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో, క్రైస్తవ గ్రీకు లేఖనాల నూతనలోక అనువాదము (ఆంగ్లం) విడుదలైనప్పుడు హాజరైనవాళ్ల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఈ ఆధునిక భాషా బైబిలు మొట్టమొదటిసారిగా దేవుని పేరును అది ఉండాల్సిన స్థానంలో తిరిగి చేర్చింది.—యిర్మీ. 16:21.

9 ఎంతోకాలం నిషేధాల కింద ఉండి, హింసలు అనుభవించిన తర్వాత నమ్మకమైన యెహోవా సేవకులు జరుపుకున్న సమావేశాలు వాళ్లను ఎంతో కదిలించాయి. యెహోవాసాక్షుల్ని సమూలంగా నాశనం చేస్తానని అడాల్ఫ్‌ హిట్లర్‌ శపథం చేశాడు. కానీ ఆ తర్వాత 1955లో, ఒకప్పుడు హిట్లర్‌ తరచూ ఉపయోగించుకున్న న్యూరెమ్‌బర్గ్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో యెహోవాసాక్షులు ఒక పెద్ద సమావేశాన్ని జరుపుకున్నారు. దానికి 1,07,000 మంది హాజరయ్యారు. వాళ్లలో చాలామంది సంతోషం పట్టలేక ఆనందబాష్పాలు రాల్చారు. 1989లో “దైవిక భక్తి” అనే అంశంతో పోలండ్‌లో జరిగిన మూడు సమావేశాలకు 1,66,518 మంది హాజరయ్యారు. వాళ్లలో చాలామంది అప్పట్లో సోవియట్‌ యూనియన్‌, జెకస్లోవేకియా అనే పేర్లతో ఉన్న దేశాల నుండి, తూర్పు ఐరోపాలోని మరితర దేశాల నుండి వచ్చినవాళ్లే. వాళ్లలో కొంతమంది అప్పటివరకు 15 లేక 20 మంది హాజరైన కూటాల్ని మాత్రమే చూశారు, అంత పెద్ద సమావేశాల్ని చూడడం వాళ్లకు అదే మొదటిసారి. 1993లో యుక్రెయిన్‌లోని కీవ్‌ నగరంలో జరిగిన “దైవిక బోధ” అనే అంతర్జాతీయ సమావేశంలో 7,402 మంది బాప్తిస్మం తీసుకున్నప్పుడు అక్కడున్న వాళ్లు ఎంత సంతోషించి ఉంటారో కదా! ఇప్పటివరకు యెహోవాసాక్షుల చరిత్రలో అంత ఎక్కువమంది బాప్తిస్మం తీసుకున్న సందర్భం అదే.—యెష. 60:22; హగ్గ. 2:7.

10. ఏ సమావేశాలు మీకు ప్రత్యేకంగా గుర్తుండిపోయాయి? ఎందుకు?

10 బహుశా మిమ్మల్ని కూడా ఎంతో కదిలించిన జిల్లా సమావేశాలు లేదా అంతర్జాతీయ సమావేశాలు మీకు గుర్తుండే ఉంటాయి. మీరు మొట్టమొదటిసారిగా హాజరైన సమావేశం లేదా మీరు బాప్తిస్మం తీసుకున్న సమావేశం మీకు గుర్తుందా? ఆ ఆధ్యాత్మిక సందర్భాలు మీకు ఎంతో ప్రత్యేకమైనవి. ఆ జ్ఞాపకాలను పదిలంగా దాచుకోండి.—కీర్త. 42:4.

సంతోషించేందుకు క్రమంగా కలుసుకునే సందర్భాలు

11. ప్రాచీన ఇశ్రాయేలులో పండుగలకు సంబంధించి దేవుడు ఏ ఏర్పాటు చేశాడు?

11 ఇశ్రాయేలీయులు ప్రతీ సంవత్సరం వేర్వేరు కాలాల్లో జరుపుకోవాల్సిన మూడు పండుగల కోసం యెరూషలేములో సమావేశమవ్వాలని యెహోవా కోరాడు. అవి: పులియని రొట్టెల పండుగ, వారముల పండుగ (దీనికి ఆ తర్వాత పెంతెకొస్తు అనే పేరు వచ్చింది), పర్ణశాలల పండుగ. వాటికి సంబంధించి దేవుడు ఇలా ఆజ్ఞాపించాడు: “సంవత్సరమునకు మూడుమారులు పురుషులందరు ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను.” (నిర్గ. 23:14-17) ఆ పండుగలు తమను దేవునికి మరింత దగ్గర చేస్తాయని గుర్తించిన చాలామంది కుటుంబ శిరస్సులు భార్యాపిల్లలతో కలిసి వాటికి హాజరయ్యేవాళ్లు.—1 సమూ. 1:1-7; లూకా 2:41, 42.

12, 13. ఇశ్రాయేలీయులు వార్షిక పండుగలకు హాజరవ్వడానికి ఏమి చేయాల్సి వచ్చేది?

12 ఇశ్రాయేలు కుటుంబాలు యెరూషలేముకు చేసే ప్రయాణం ఎంత ప్రయాసంతో కూడుకున్నదో ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకు, యోసేపు మరియలు నజరేతు నుండి యెరూషలేముకు వెళ్లాలంటే సుమారు 100 కి.మీ. ప్రయాణించాలి. చిన్నపిల్లలను వెంటబెట్టుకుని నడుచుకుంటూ అంత దూరం వెళ్లడానికి ఎంత సమయం పడుతుందో మీకు తెలుసా? యేసు బాలుడిగా ఉన్నప్పుడు చేసిన యెరూషలేము ప్రయాణం గురించిన వృత్తాంతాన్ని బట్టి చూస్తే, అప్పట్లో బంధుమిత్రులతో కలిసి గుంపుగా వెళ్లేవాళ్లని తెలుస్తోంది. అలా ప్రయాణించడం, మధ్య మధ్యలో ఆగి వంట చేసుకోవడం, రాత్రి వెళ్లబుచ్చేందుకు ఆ కొత్త ప్రదేశాల్లో ఏర్పాట్లు చేసుకోవడం వాళ్లకు గొప్ప అనుభూతినిచ్చి ఉంటుంది. ప్రయాణంలో పరిస్థితులు యేసులాంటి 12 ఏళ్ల పిల్లలకు కొంత స్వేచ్ఛను ఇచ్చేంత సురక్షితంగానే ఉండేవి. వాళ్లందరికీ, ముఖ్యంగా పిల్లలకు అలాంటి ప్రయాణాలు తీపిగుర్తులుగా మిగిలివుంటాయి.—లూకా 2:44-46.

13 స్వదేశాన్ని విడిచి వివిధ దేశాల్లో స్థిరపడిన ఇశ్రాయేలీయులు పండుగలకు హాజరవ్వడానికి యెరూషలేముకు వచ్చేవాళ్లు. యెహోవా ఏర్పాట్ల విషయంలో మెప్పుదల ఉన్న యూదులు, యూదామత ప్రవిష్టులు సా.శ. 33లో పెంతెకొస్తు పండుగ రోజున ఇటలీ, లిబియా, క్రేతు, ఆసియా మైనరు, మెసొపొతమియ వంటి దేశాల నుండి యెరూషలేముకు వచ్చారు.—అపొ. 2:5-11; 20:16.

14. ఇశ్రాయేలీయులు వార్షిక పండుగలకు హాజరవ్వడం వల్ల ఎలా ప్రయోజనం పొందారు?

14 యెహోవా ఏర్పాట్ల విషయంలో కృతజ్ఞత ఉన్న వేలాదిమందితో కలిసి యెహోవాను ఆరాధించాలనే ఉద్దేశంతోనే నమ్మకమైన ఇశ్రాయేలీయులు అలాంటి ప్రయాణాలు చేసేవాళ్లు. ఆ పండుగలకు హాజరైనవాళ్లు ఎలా భావించేవాళ్లు? పర్ణశాలల పండుగను ఉద్దేశించి యెహోవా తన ప్రజలకు ఇచ్చిన నిర్దేశాల్లో దానికి జవాబు దొరుకుతుంది: “ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులును పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతిపనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు ఏడుదినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను.”—ద్వితీ. 16:14, 15; మత్తయి 5:3 చదవండి.

ఆధునిక కాలంలోని సమావేశాలను బట్టి మనం ఎందుకు కృతజ్ఞత చూపించాలి?

15, 16. సమావేశాలకు హాజరవడానికి మీరు ఎలాంటి త్యాగాలు చేశారు? ఆ త్యాగాలకు తగిన ఫలితం ఉంటుందని ఎందుకు చెప్పవచ్చు?

15 నేటి యెహోవా ప్రజలు ప్రాచీన కాలాల్లోని సమావేశాల నుండి ఎంతో నేర్చుకోవచ్చు. సమావేశాలకు సంబంధించి గడిచిన శతాబ్దాల్లో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ, వాటికి సంబంధించిన ప్రాముఖ్యమైన అంశాల్లో మాత్రం ఏ మార్పూ రాలేదు. బైబిలు కాలాల్లో, దేవుని ప్రజలు పండుగల కోసం వెళ్లాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా అంతే. అయితే, మనం మన త్యాగాలకు తగిన ప్రయోజనాలను పొందుతాం. అప్పుడూ ఇప్పుడూ సమావేశాలు ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సందర్భాలుగానే ఉన్నాయి. సమావేశాలు దేవునితో దగ్గరి సంబంధాన్ని కాపాడుకోవడానికి అవసరమైన సమాచారాన్ని, అవగాహనను అందిస్తాయి. సమావేశాలు మనం నేర్చుకున్నవాటిని పాటించాలనే ప్రేరణను ఇస్తాయి, సమస్యల్ని తప్పించుకోవడానికి సహాయం చేస్తాయి, మనల్ని కృంగదీసే వాటిపై కాక ఉత్తేజపర్చే వాటిపై దృష్టి నిలిపేందుకు కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇస్తాయి.—కీర్త. 122:1-4.

దక్షిణ కొరియా

16 సమావేశాలకు హాజరైనప్పుడెల్లా దేవుని ప్రజలు ఎంతో సంతోషాన్ని పొందుతారు. 1946లో జరిగిన ఒక పెద్ద సమావేశానికి సంబంధించిన నివేదిక ఇలా పేర్కొంది: “వేలమంది సాక్షులకు సౌకర్యవంతమైన వసతి కల్పించడం అద్భుతంగా అనిపించింది. దానికన్నా సంతోషకరమైన విషయమేమిటంటే, యెహోవాను స్తుతించేందుకు రాజ్య గీతాలను అక్కడి సమూహాలు వినసొంపుగా ఆలపిస్తుండగా వాళ్లతో వాద్య బృందం కూడా కలిసేసరికి స్టేడియమంతా మారుమ్రోగిపోయింది.” సమావేశానికి వచ్చిన చాలామంది సహోదరసహోదరీలు తోటి సాక్షులకు సంతోషంగా సేవచేయాలనే ఉద్దేశంతో వివిధ విభాగాల్లో పనిచేయడానికి ముందుకు వచ్చారని కూడా ఆ నివేదిక పేర్కొంది. జిల్లా సమావేశాల్లో లేదా అంతర్జాతీయ సమావేశాల్లో మీరు కూడా అలాంటి అనుభూతినే పొందారా?—కీర్త. 110:3; యెష. 42:10-12.

17. ఇటీవలి కాలంలో సమావేశాల వ్యవస్థీకరణలో ఎలాంటి మార్పులు వచ్చాయి?

17 సమావేశాలను వ్యవస్థీకరించే పద్ధతిలో కొన్ని మార్పులు వచ్చాయి. ఉదాహరణకు, ఒకప్పుడు ఎనిమిది రోజులపాటు జరిగిన సమావేశాలు దేవుని ప్రజల్లో కొంతమందికి గుర్తే. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలా మూడు పూటలా సమావేశ కార్యక్రమం కొనసాగేది. క్షేత్ర సేవకు వెళ్లడం కూడా సమావేశ కార్యక్రమంలో భాగమే. సమావేశ కార్యక్రమంలోని కొన్ని భాగాలు ఉదయం తొమ్మిది గంటలకు మొదలయ్యేవి. తరచూ రాత్రి తొమ్మిది గంటల వరకూ ఉండేవి. హాజరైన వాళ్ల కోసం మూడు పూటలా భోజనం తయారుచేయడానికి స్వచ్ఛంద సేవకులు ఎన్నో గంటలపాటు కష్టపడి పని చేసేవాళ్లు. అయితే ఇప్పుడు మాత్రం సమావేశాలు అప్పటన్ని రోజులు జరగడం లేదు. అంతేకాక, కుటుంబాలు ఎవరి ఆహారం వాళ్లే తెచ్చుకునేలా మార్పు జరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ మరింత ఏకాగ్రతతో సంతృప్తిగా ఆధ్యాత్మిక ఆహారాన్ని ఆస్వాదించగలుగుతున్నారు.

మొజాంబిక్‌

18, 19. మీరు సమావేశాల్లో ఏ అంశాల కోసం ఎదురుచూస్తారు? ఎందుకు?

18 సమావేశానికి సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాత్రం అలాగే ఉన్నాయి, వాటికోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. “తగినవేళ” ఆధ్యాత్మిక “అన్నము” కేవలం సమావేశాల్లో ఇచ్చే ప్రసంగాల ద్వారానే కాక, అక్కడ విడుదలయ్యే కొత్త ప్రచురణల ద్వారా కూడా దొరుకుతోంది, దానివల్ల బైబిలు ప్రవచనాలపై, బోధలపై మనకున్న అవగాహన పెరుగుతోంది. (మత్త. 24:45) లేఖన సత్యాలను అర్థంచేసుకోవడానికి ఆ కొత్త ప్రచురణలు ఆసక్తిగల ప్రజలకు సహాయం చేస్తాయి. బైబిలు ఆధారిత నాటకాలు మన ఆలోచనల్ని పరిశీలించుకోవడానికి, లోకంలోని భక్తిహీన ఆలోచనాతీరు వల్ల ఎదురయ్యే ఒత్తిళ్లకు లోనుకాకుండా ఉండడానికి మనలో ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తాయి. అలాగే బాప్తిస్మ ప్రసంగం, జీవితంలో మనం దేనికి మొదటిస్థానం ఇస్తున్నామో పరిశీలించుకోవడానికి, ఇతరులు తమ సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకుంటుండగా చూసి సంతోషించడానికి ఒక చక్కని అవకాశాన్ని ఇస్తుంది.

19 ఎంతోకాలంగా సత్యారాధనలో భాగంగా ఉన్న సమావేశాలు కష్టకాలాల్లో యెహోవాను తగిన విధంగా సేవచేయడానికి సంతోషంగల యెహోవా సేవకులకు సహాయం చేస్తాయి. అలాంటి సమావేశాలు దేవుని సేవను మరింత మెరుగ్గా చేయాలనే ప్రేరణను ఇస్తాయి, కొత్త స్నేహితుల్ని సంపాదించుకోవడానికి అవకాశాల్ని కల్పిస్తాయి, ప్రపంచవ్యాప్త సహోదరసహోదరీల మధ్య ఉన్న ఐక్యతను రుచి చూసేందుకు సహాయం చేస్తాయి. అంతేకాక, ముఖ్యంగా అలాంటి సమావేశాల ద్వారా యెహోవా తన ప్రజలపై మంచి శ్రద్ధ చూపిస్తూ వాళ్లను ఆశీర్వదిస్తున్నాడు. ఖచ్చితంగా, ప్రతీ సమావేశంలో పూర్తి కార్యక్రమానికి హాజరయ్యేలా మన పనులను చక్కబెట్టుకోవాలని మనలో ప్రతీ ఒక్కరం కోరుకుంటాం.—సామె. 10:22.