ఉత్తేజాన్నిచ్చే ఆరోగ్యదాయకమైన వినోదం
ఉత్తేజాన్నిచ్చే ఆరోగ్యదాయకమైన వినోదం
“మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.”—1 కొరింథీయులు 10:31.
మనకు ఆహ్లాదాన్నిచ్చే కార్యకలాపాల్లో పాల్గొనాలని కోరుకోవడం సహజమే. సంతోషంగా ఉండే మన దేవుడైన యెహోవా, మనం మన జీవితాన్ని ఆనందించాలని కోరుకుంటూ, అలా ఆనందించడానికి వీలైన విస్తారమైన ఏర్పాట్లు చేశాడు. (1 తిమోతి 1:11, NW; 6:17) జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా వ్రాశాడు: “సంతోషముగా నుండుటకంటె . . . శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలిసికొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే.”—ప్రసంగి 3:12, 13.
2 ఒక వ్యక్తి తన కష్టానికి లభించిన ఫలితాన్ని చూసుకొని ఆనందించడం, ప్రత్యేకంగా కుటుంబ సభ్యుల లేదా స్నేహితుల ఆహ్లాదాన్నిచ్చే సహవాసంలో దానిని పంచుకోవడం ఆయనకు మరెంతో ఉత్తేజకరంగా ఉంటుంది. అలాంటి ఆనందాన్ని మనం ‘దేవుని బహుమానంగా’ దృష్టించడం యుక్తం. అయితే, దేవుడు ఆనందించడానికి సమృద్ధిగా అనుగ్రహించినా అది మనం హద్దులుమీరి సుఖించడాన్ని అనుమతించదు. బైబిలు త్రాగుబోతుతనాన్ని, తిండిబోతుతనాన్ని, లైంగిక దుర్నీతిని ఖండిస్తూ అలాంటివాటిని అభ్యసించేవారు “దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు” అని హెచ్చరిస్తోంది.—1 కొరింథీయులు 6:9, 10; సామెతలు 23:20, 21; 1 పేతురు 4:1-4.
3 ఈ అపాయకరమైన అంత్యదినాల్లో, క్రైస్తవులు ముందెన్నడూ లేనంతగా, ఈ భ్రష్టలోకపు అభ్యాసాలకు దూరంగావుంటూ జ్ఞానయుక్తంగా జీవించే సవాలును ఎదుర్కొంటున్నారు. (యోహాను 17:15, 16) ముందే చెప్పబడినట్లుగా, నేటి తరంలోని ప్రజలు ఎంతగా ‘దేవునికంటే సుఖానుభవమును ప్రేమిస్తున్నారంటే,’ “మహాశ్రమ” త్వరలో రాబోతుందనే రుజువును కూడా వారు “ఎరుగక” ఉన్నారు. (2 తిమోతి 3:4, 5; మత్తయి 24:21, 37-39) యేసు తన అనుచరులను ఇలా హెచ్చరించాడు: “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.” (లూకా 21:34, 35) దేవుని సేవకులుగా మనం యేసు హెచ్చరికను లక్ష్యపెట్టడానికే నిర్ణయించుకున్నాం. మనచుట్టూవున్న భక్తిహీన ప్రజలకు భిన్నంగా మనం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉంటూ, యెహోవా మహాదినం కోసం జాగ్రత్తగా ఎదురుచూడడానికి కృషిచేస్తాం.—జెఫన్యా 3:8; లూకా 21:36.
4 అపవాది ఈ భ్రష్ట లోకపు అభ్యాసాలను ఎంతో కోరదగినవిగా, అందుబాటులో ఉండేలా చేశాడు కాబట్టి, వాటికి దూరంగా ఉండడం అంత సులభం కాదు. ప్రత్యేకంగా, మనం వినోద కాలక్షేపం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఇది కష్టంగా ఉంటుంది. లోకమందించే వాటిలో అధికశాతం “శరీరాశలను” తీర్చుకొనేందుకే రూపొందించబడ్డాయి. (1 పేతురు 2:11) హానికరమైన వినోదం బహిరంగంగా అందుబాటులో ఉంది, అయితే అది పుస్తకాలు, టీవీ, ఇంటర్నెట్, వీడియోల ద్వారా ఏకాంత ప్రదేశాలైన గృహాల్లోకి కూడా చొరబడగలదు. అందుకే దేవుని వాక్యం జ్ఞానయుక్తంగా క్రైస్తవులకు ఇలా ఉపదేశిస్తోంది: “దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.” (ఎఫెసీయులు 5:15-16) ఈ ఉపదేశాన్ని మనం అత్యంత జాగ్రత్తగా పాటించినప్పుడు మాత్రమే, మనల్ని ఉరిలోపడేసి, ఊపిరాడనివ్వకుండా చేయడమే కాక, చివరికి యెహోవాతో మన సంబంధాన్ని పాడుచేయగల, మనల్ని నాశనంచేయగల హానికరమైన వినోదం నుండి తప్పించుకోవచ్చు.—యాకోబు 1:14, 15.
5 క్రైస్తవులకు చాలా తక్కువగా ఖాళీ సమయం దొరుకుతుంది కాబట్టి, వాళ్ళు అప్పుడప్పుడు ఉల్లాస కార్యకలాపాల్లో పాల్గొనాలని అనుకోవడం అర్థం చేసుకోదగినదే. నిజానికి ‘నవ్వుటకు,’ ‘నాట్యమాడుటకు సమయము కలదని’ ప్రసంగి 3:4 చెబుతోంది. కాబట్టి వినోదంవల్ల సమయం వృథా అవుతుందని బైబిలు పరిగణించడం లేదు. అయితే వినోదం మనల్ని ఉత్తేజపరచాలే తప్ప మన ఆధ్యాత్మికతను ప్రమాదంలో పడేసేదిగా లేక మన ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేదిగా ఉండకూడదు. ఇవ్వడంలోనే మరింత సంతోషముందని పరిణతిచెందిన క్రైస్తవులకు అనుభవపూర్వకంగా తెలుసు. వారు తమ జీవితాల్లో యెహోవా చిత్తం చేయడానికే ప్రాధాన్యతనిస్తూ, సుళువైన యేసు కాడిని అంగీకరించడం ద్వారా ‘తమ ప్రాణాలకు నిజమైన విశ్రాంతిని’ పొందుతారు.—మత్తయి 11:29, 30; అపొస్తలుల కార్యములు 20:35.
సరైన వినోదాన్ని ఎంచుకోవడం
6 క్రైస్తవులకు ఫలానా వినోదం అంగీకృతమైందని మనమెలా రూఢీపరచుకోవచ్చు? తల్లిదండ్రులు పిల్లలకు మార్గనిర్దేశాన్నిస్తే, అవసరమైనప్పుడు పెద్దలు సహాయం చేస్తారు. నిజానికి, ఫలానా పుస్తకం, సినిమా, ఆట, నాట్యం లేదా పాట అంగీకృతం కాదని ఇతరులు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. “వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు” అని పౌలు చెప్పాడు. (హెబ్రీయులు 5:14; 1 కొరింథీయులు 14:20) బైబిలు మార్గదర్శక నిర్దేశాలను ఇస్తోంది. దేవుని వాక్యంచేత సాధకము చేయబడిన మీ మనస్సాక్షి చెప్పే మాటవింటే, అది మీకు సహాయం చేస్తుంది.—1 తిమోతి 1:19.
7 “చెట్టు దాని పండువలన తెలియబడును” అని యేసు చెప్పాడు. (మత్తయి 12:33) ఏదైనా వినోద కాలక్షేపం దౌర్జన్యం, లైంగిక దుర్నీతి లేదా అభిచారం వంటివాటివైపు ఆకర్షించబడే కుళ్లిన ఫలాలను ఫలిస్తుంటే దాన్ని విసర్జించాలి. అది ఒక వ్యక్తి ప్రాణాన్ని లేదా ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంటే, అది ఆర్థిక కష్టాన్ని లేదా నిరుత్సాహాన్ని కలిగిస్తుంటే లేదా అది ఇతరుల్ని అభ్యంతరపరుస్తుంటే కూడా అది అంగీకృతమైనది కాదు. మనం మన సహోదరుని మనస్సాక్షిని నొప్పిస్తే మనం పాపం చేస్తున్నామని అపొస్తలుడైన పౌలు మనల్ని హెచ్చరించాడు. పౌలు ఇలా వ్రాశాడు: “ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. కాబట్టి భోజనపదార్థమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను.”—1 కొరింథీయులు 8:12, 13.
8 ఎలక్ట్రానిక్ ఆటలు, వీడియోలు మార్కెట్లలోకి విరివిగా వస్తున్నాయి. కొన్ని నిరపాయకరమైన ఉల్లాసాన్ని, సేదదీర్పును ఇవ్వవచ్చు, అయితే అలాంటి వినోదంలో ఎక్కువగా బైబిలు ఖండించేవే ఉంటాయి. ఆటగాళ్లు నరకడం, చంపడం ఉన్న లేదా ఘోరమైన దుర్నీతినిండిన ఆటలు ఖచ్చితంగా ఉల్లాసకరమైనవి కావు. “బలత్కారాసక్తులు” లేదా దౌర్జన్యాన్ని ప్రేమించేవారు యెహోవాకు అసహ్యులు. (కీర్తన 11:5; సామెతలు 3:31; కొలొస్సయులు 3:5, 6) ఫలానా ఆట మీలో దురాశను లేదా పోట్లాడే స్వభావాన్ని ప్రేరేపిస్తూ, మిమ్మల్ని మానసికంగా పీడిస్తుంటే లేదా మీ విలువైన సమయాన్ని పాడుచేస్తుంటే, అది కలిగించగల ఆధ్యాత్మిక హానిని గుర్తించి, వెంటనే మార్పులు చేసుకోండి.—మత్తయి 18:8, 9.
వినోద అవసరాలను ఆరోగ్యదాయక విధాల్లో తీర్చుకోవడం
9 కొన్నిసార్లు క్రైస్తవులు ఇలా అడగవచ్చు: “అంగీకృతమైన వినోదమంటే ఏమిటి? లోకమందించే వినోదంలో అధికశాతం బైబిలు ప్రమాణాలకు విరుద్ధంగానే ఉంటుంది.” సంతృప్తికరమైన వినోదాన్ని కనుగొనవచ్చు, అయితే దానికి ప్రయత్నం అవసరం. దానికి ప్రత్యేకంగా తల్లిదండ్రుల ముందుచూపు, ప్రణాళిక అవసరం. చాలామంది అటు కుటుంబంలో ఇటు సంఘంలో ప్రతిఫలదాయకమైన సేదదీర్పును కనుగొంటారు. రోజంతటిలో జరిగిన సంఘటనలను లేదా బైబిలు అంశాన్ని చర్చిస్తూ తీరికగా భోజనం చేయడం ఆహ్లాదకరంగానూ, క్షేమాభివృద్ధికరంగానూ ఉంటుంది. పిక్నిక్‌లు, సముచితమైన ఆటలు, ఇతర ప్రదేశాలకు వెళ్లిరావడం లేదా సరదాగా వాహ్యాళికి వెళ్ళడం వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటి ఆరోగ్యదాయకమైన వినోదం ఉల్లాసకరమైనదే కాక, ఉత్తేజకరంగా కూడా ఉండగలదు.
10 ముగ్గురు పిల్లలకు తండ్రిగావున్న ఒక పెద్ద, ఆయన భార్య ఇలా నివేదిస్తున్నారు: “సెలవుల్లో మేమెక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకునే విషయంలో మా పిల్లలు చిన్నప్పటి నుండే తమ అభిప్రాయాలు చెప్పేవారు. కొన్నిసార్లు, పిల్లల్లో ప్రతీ ఒక్కరూ తమ మంచి స్నేహితుల్లో ఒకరిని ఆహ్వానించేందుకు అనుమతించాం, ఇది సెలవుల్ని మరింత ఆనందదాయకం చేసింది. మా పిల్లల జీవితాల్లో కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలను మేము గుర్తించాం. మేము సంఘంలోని కుటుంబాలను లేదా స్నేహితులను తరచూ మా ఇంటికి ఆహ్వానించేవాళ్ళం. ఎక్కడికైనా బయటకు వెళ్ళి వంటచేసుకుని తిని, ఆటలు ఆడేవాళ్లం. పర్వత ప్రాంతాలకు కారులోనో లేదా నడుచుకుంటూనో వెళ్లేవాళ్లం, యెహోవా సృష్టిని గురించి నేర్చుకునేందుకు అలాంటి సందర్భాల్ని ఉపయోగించుకునేవాళ్ళం.”
లూకా 14:12-14) క్రొత్తగా సహవసిస్తున్నవారిని కూడా మీరు చేర్చుకోవచ్చు, అయితే అది ఇతరులపై దుష్ప్రభావం చూపించేలా ఉండకుండా జాగ్రత్తపడాలి. (2 తిమోతి 2:20, 21) వృద్ధులకు బయటకు వెళ్లడం కష్టంగా ఉంటే, వాళ్లింట్లోనే వాళ్ళతో కలిసి తినేలా భోజనం తీసుకొచ్చే ఏర్పాటు చేయవచ్చు.—హెబ్రీయులు 13:1, 2.
11 అప్పుడప్పుడు వినోద కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తుంటే ఇతరులను మీతోపాటు లేదా మీ కుటుంబంతోపాటు చేర్చుకునేందుకు మీ హృదయాల్లో చోటుకల్పించగలరా? బహుశా ఓ విధవరాలికి, అవివాహిత వ్యక్తికి లేదా ఒంటరి తల్లి లేక తండ్రి ఉన్న కుటుంబానికి ప్రోత్సాహం అవసరం కావచ్చు. (12 అతిథులు భోజనం ఆరగిస్తూ, ఇతరులు క్రైస్తవులుగా ఎలా మారారో వింటూ, దేవునిపట్ల నమ్మకంగా ఉండేందుకు వారికేమి సహాయం చేసిందో తెలుసుకుంటూ ఆనందంగా గడిపిన అలాంటి సందర్భాలు చాలామందికి మధురస్మృతులుగా ఉన్నాయి. పిల్లలతోసహా హాజరైనవారందరూ పాలుపంచుకునే బైబిలు అంశాలను చర్చించవచ్చు. అలాంటి చర్చలు ఎవరూ అసౌకర్యానికి లేదా ఇబ్బందికి గురవకుండా అందరూ ప్రోత్సహించబడేలా ప్రయోజనకరంగా ఉండగలవు.
13 ఆతిథ్యం ఇవ్వడంలో, స్వీకరించడంలో యేసు సరైన మాదిరి ఉంచాడు. ఆయన అలాంటి సందర్భాలన్నింటినీ ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్నిచ్చేందుకే ఉపయోగించాడు. (లూకా 5:27-39; 10:42; 19:1-10; 24:28-32) ఆయన తొలి శిష్యులు ఆయన మాదిరిని అనుకరించారు. (అపొస్తలుల కార్యములు 2:46, 47) అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణ పొందవలెనని ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను.” (రోమీయులు 1:11, 12) అదేవిధంగా, మనం కూడుకునే సందర్భాలు పరస్పర ప్రోత్సాహానికి తగిన వాతావరణాన్ని సృష్టించేవిగా ఉండాలి.—రోమీయులు 12:13; 15:1, 2.
గుర్తుపెట్టుకోవాల్సిన, జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు
14 అధిక సంఖ్యలో వ్యక్తులు కూడుకున్నప్పుడు తరచూ పర్యవేక్షణ కష్టమవుతుంది కాబట్టి, అలా కూడుకోవడం సముచితం కాదు. ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అవాంతరం కలిగించని సమయంలో కొన్ని కుటుంబాలు కలిసి విహారయాత్రకు వెళ్లేందుకో లేదా ఎక్కువ పోటీతత్వంలేని ఆటలు ఆడేందుకో నిర్ణయించుకోవచ్చు. పార్టీల్లో కొందరు పెద్దలు, పరిచర్య సేవకులు లేదా పరిణతిగల ఇతరులు ఉండడం చక్కని ప్రభావం చూపించడమే కాక, ఆ సందర్భం మరింత ఉల్లాసకరంగా ఉండగలదు.
15 పార్టీలు ఏర్పాటు చేసేవారు సరైన పర్యవేక్షణా అవసరతను అలక్ష్యం చేయకూడదు. ఆతిథ్యమివ్వడాన్ని మీరు ఆనందించినా, మీ నిర్లక్ష్యం కారణంగా మీ ఇంట్లో జరిగిన దానినిబట్టి అతిథుల్లో ఒకరు అభ్యంతరపడ్డారని తెలిస్తే మీరు బాధపడరా? ద్వితీయోపదేశకాండము 22:8లో చర్చించబడిన సూత్రాన్ని పరిశీలించండి. ఒక ఇశ్రాయేలీయుడు, తరచూ ఆతిథ్యమివ్వడానికి ఉపయోగించబడే సమతలమైన పైకప్పువున్న క్రొత్త ఇంటిని నిర్మిస్తున్నప్పుడు ఆ పైకప్పు చుట్టూ పిట్టగోడ నిర్మించాలి. ఎందుకు? ‘దానిమీదనుండి యెవడైనను పడుటవలన నీ యింటిమీదికి హత్యదోషము రాకుండడానికి.’ అదేవిధంగా, పార్టీల్లో మీ అతిథుల సంరక్షణ కోసం, నిర్హేతుకమైన హద్దులేవీ పెట్టకుండా మీరు చేసేదేదైనా అది వారి భౌతిక, ఆధ్యాత్మిక సంక్షేమంపట్ల శ్రద్ధతో చేసేదై ఉండాలి.
ఎఫెసీయులు 5:18, 19) వివిధ కారణాలనుబట్టి కొందరు అతిథులు మద్యానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. అనేక ప్రాంతాల్లో త్రాగేందుకు చట్టబద్ధంగా కనీస వయస్సు ఉంటుంది, కాబట్టి ఈ నియమాలు మరీ కఠినంగా ఉన్నట్లు అనిపించినా క్రైస్తవులు కైసరు నియమాలకు విధేయులవుతారు.—రోమీయులు 13:5.
16 పార్టీల్లో మద్యం అందించే ఏర్పాటువుంటే, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. క్రైస్తవ ఆతిథేయులు చాలామంది తమ అతిథులకు ఏమి ఇవ్వబడుతుంది లేదా ఎంత తీసుకుంటున్నారో వ్యక్తిగతంగా పర్యవేక్షించే అవకాశమున్నప్పుడు మాత్రమే మద్యం అందించేందుకు నిర్ణయించుకుంటారు. ఇతరులకు అభ్యంతరకరమైన రీతిలో లేదా అతిగా సేవించేలా ఎవరినైనా శోధించే రీతిలో దేనినీ అనుమతించకూడదు. (17 ఎలాంటి సంగీతమైనా, నాట్యమైనా లేక ఇతర వినోదమైనా క్రైస్తవ సూత్రాలకు అనుగుణంగా ఉండేలా ఆతిథేయి చూడాలి. సంగీత అభిరుచులు భిన్నంగా ఉంటాయి, వివిధరకాల సంగీతం విస్తారంగా అందుబాటులో ఉంది. అయితే, నేటి సంగీతంలో ఎక్కువశాతం తిరుగుబాటు ధోరణిని, లైంగిక దుర్నీతిని, హింసను ప్రోత్సహిస్తున్నాయి. సరైన ఎంపిక అవసరం. సరైన సంగీతం నిద్దరొచ్చేలా చేసేదిగా ఉండనక్కర్లేదు, అలాగని పెద్ద శబ్దంతో, బాదుతున్న చప్పుడుతో మొరటుగా లేక అసభ్యకరంగా ఉండకూడదు. శబ్దాన్ని తగుమాత్రంగా ఉంచవలసిన అవసరాన్ని పూర్తిగా అర్థంచేసుకోని వారికి సంగీతాన్ని ఎంపికచేసే బాధ్యతను అప్పగించకుండా జాగ్రత్తపడండి. శృంగారార్థాలతో తుంట్లను, వక్షోజాలను అతిగా ఊపే అమర్యాదకర ప్రవర్తనగల నాట్యం క్రైస్తవులకు ఏ మాత్రం తగదు.—1 తిమోతి 2:8-10.
18 క్రైస్తవ తల్లిదండ్రులు, తమ పిల్లలు ఆహ్వానించబడిన పార్టీల్లో ఏయే కార్యక్రమాలు పథకం వేస్తున్నారో కనుక్కోవడమే కాక, చాలా సందర్భాల్లో వారితోపాటు వెళ్లడం కూడా జ్ఞానయుక్తం. విషాదకరంగా, కొందరు తల్లిదండ్రులు పర్యవేక్షణలేని పార్టీలకు వెళ్ళడానికి తమ పిల్లలను అనుమతించారు. అలాంటివాటికి హాజరైనవారిలో చాలామంది లైంగిక దుర్నీతికి లేదా ఇతర అమర్యాదకర ప్రవర్తనకు పాల్పడడానికి బలవంతం చేయబడ్డారు. (ఎఫెసీయులు 6:1-4) ఇరవై సంవత్సరాల వయసు, బాధ్యతాయుతంగా ప్రవర్తించగలమని చూపించే యౌవనులకు కూడా తమ ‘యౌవనేచ్ఛల నుండి పారిపోయేలా’ సహాయపడడం అవసరం.—2 తిమోతి 2:22.
19 అప్పుడప్పుడు ఆరోగ్యదాయకమైన, సేదదీర్పునిచ్చే వినోదాన్ని ఏర్పాటు చేసుకోవడం జీవితాన్ని మరింత ఆనందదాయకం చేస్తుంది. మనమీ ఆనందం అనుభవించడాన్ని యెహోవా ఖండించడం లేదు, అయితే అలాంటి కార్యకలాపాలు పరలోకంలో ఆధ్యాత్మిక సంపదను సమకూర్చుకునేందుకు మనకు సహాయపడవని మనకు వాస్తవంగా తెలుసు. (మత్తయి 6:19-21) ‘అన్యజనులు అమితంగా విచారించే’ విషయాలైన తినేవి, త్రాగేవి, ధరించుకునేవి జీవితంలో ప్రాముఖ్యమైనవి కాదుగానీ, “[దేవుని] రాజ్యమును నీతిని మొదట వెద[కడం]” ప్రాముఖ్యమని అర్థంచేసుకునేందుకు యేసు తన శిష్యులకు సహాయం చేశాడు.—మత్తయి 6:31-34.
20 అవును మనం “భోజనముచేసినను పానముచేసినను [ఏమి] చేసినను” మనం మితంగా అనుభవించేందుకు మంచి విషయాలను అనుగ్రహించిన మహాదాతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ “సమస్తమును దేవుని మహిమకొరకు” చేయగలము. (1 కొరింథీయులు 10:31) ఎంతో దగ్గరలోవున్న ఆయన పరదైసులో యెహోవా నీతి ప్రమాణాలను అనుసరించేవారందరి ఆరోగ్యదాయకమైన సాంగత్యంతోపాటు ఆయన ఔదార్యాన్ని పూర్తిస్థాయిలో అనుభవించే సందర్భాలకు అంతేవుండదు.—కీర్తన 145:16; యెషయా 25:6; 2 కొరింథీయులు 7:1.
మీకు జ్ఞాపకమున్నాయా?
• క్రైస్తవులు నేడు ఆరోగ్యదాయకమైన వినోదాన్ని కనుగొనడం ఎందుకు కష్టం?
• క్రైస్తవ కుటుంబాలకు సంతృప్తికరమైనవిగా నిరూపించబడిన వినోదాల్లో కొన్ని ఏమిటి?
• ఆరోగ్యదాయకమైన వినోదాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు, మనమే విషయాలను గుర్తుపెట్టుకోవాలి, ఏ విషయాలపట్ల జాగ్రత్తగా ఉండాలి?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. ఆహ్లాదకరమైన కార్యకలాపాలను ‘దేవుని బహుమానంగా’ ఎందుకు దృష్టించవచ్చు, అయితే బైబిలు ఎలాంటి సూటియైన హెచ్చరికనిస్తోంది?
3. ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండి, యెహోవా దినం కోసం జాగ్రత్తగా ఎదురుచూసేందుకు మనకేది సహాయం చేస్తుంది?
4. (ఎ) ఆమోదయోగ్యమైన వినోదాన్ని కనుగొనడం ఎందుకు కష్టం? (బి) ఎఫెసీయులు 5:15-16లో కనబడే ఏ ఉపదేశాన్ని అన్వయించుకోవాలని మనం కోరుకుంటాం?
5. మరి శ్రేష్ఠమైన విశ్రాంతిని మనం దేనినుండి పొందుతాం?
6, 7. ఏది అంగీకృతమైన లేదా అనంగీకృతమైన వినోదమో నిర్ణయించుకునేందుకు మీకు ఏది సహాయం చేయగలదు?
8. ఎలక్ట్రానిక్ ఆటలు ఆడడం, వీడియోలు చూడడంలో ఎలాంటి ప్రమాదముంది?
9, 10. తమ వినోద అవసరాలు తీర్చుకునేందుకు వివేచనాపరులు ఏమి చేయవచ్చు?
11, 12. (ఎ) అప్పుడప్పుడు వినోద కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తుంటే ఇతరులను కూడా చేర్చుకోవడానికి మీరేమి చేయవచ్చు? (బి) ఎలాంటి సందర్భాలు చాలామందికి మధురస్మృతులుగా ఉన్నట్లు నిరూపించబడ్డాయి?
13. ఆతిథ్యం ఇవ్వడంలో, స్వీకరించడంలో యేసు, పౌలు ఎలా ఆదర్శవంతంగా ఉన్నారు?
14. అధిక సంఖ్యలో కూడుకునే పార్టీలు ఎందుకు సముచితమైనవి కావు?
15. ఆతిథ్యమిచ్చే సందర్భంలో సరైన పర్యవేక్షణ ఎందుకవసరం?
16. పార్టీల్లో మద్యం అందించబడే ఏర్పాటువుంటే ఎలాంటి వివేచన ఉపయోగించాలి?
17. (ఎ) పార్టీల్లో సంగీతాన్ని ఏర్పాటుచేస్తే, ఆతిథేయి మంచి వివేచన ప్రదర్శించడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) ఆ సందర్భంలో నాట్యం ఉంటే, నమ్రతను ఎలా ప్రతిబింబించాలి?
18. తమ పిల్లలు వెళ్ళే పార్టీలను పర్యవేక్షించడం ద్వారా తల్లిదండ్రులు వారినెలా సంరక్షించగలరు?
19. దేనిని ‘మొదట వెదకాలి’ అనేదానిపై దృష్టి కేంద్రీకరించేందుకు మనకు ఏ వాస్తవం సహాయం చేయగలదు?
20. యెహోవా నమ్మకమైన సేవకులు ఆ మహాదాత నుండి ఏ మేలుల్ని ఎదురుచూడవచ్చు?
[18వ పేజీలోని చిత్రం]
మంచి ఫలాల్నిచ్చే వినోదాన్ని ఎంపికచేసుకోండి
[19వ పేజీలోని చిత్రాలు]
ఎలాంటి వినోదాన్ని క్రైస్తవులు తిరస్కరిస్తారు?