కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

యెషయా 53వ అధ్యాయంలో మెస్సీయాను గూర్చి ఒక ప్రసిద్ధ ప్రవచనం ఉంది. ఆ అధ్యాయంలోని పదవ వచనం ఇలా చెప్తుంది: “అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను; ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను.” దీని భావమేమిటి?

యెషయా 53:10 గురించి ప్రశ్న ఎందుకు తలెత్తుందనే విషయాన్ని గ్రహించడం సులభమే. నిజ క్రైస్తవులు ప్రేమా వాత్సల్యములు గల మన దేవునికి ఎవరినైనా నలుగగొట్టడం లేదా ఎవరికైనా వ్యాధి కలుగజేయడం ఇష్టమౌతుందని అనుకోరు. అమాయకులను హింసించడంలో దేవుడు ఆనందాన్ని పొందడని నమ్మటానికి బైబిలు మనకు ఆధారాన్నిస్తుంది. (ద్వితీయోపదేశకాండము 32:4; యిర్మీయా 7:30, 31) గత శతాబ్దాల్లో యెహోవా తన జ్ఞానంతోనూ, ప్రేమతోనూ పొందికగల కారణాల మూలంగానే అప్పుడప్పుడూ బాధను అనుమతించి ఉండవచ్చు. కానీ తన ప్రియ కుమారుడైన యేసు బాధను మాత్రం ఆయన కలుగజేయలేదు. మరి, నిజానికి ఈ వాక్యం చెప్తున్నదేమిటి?

‘ఇష్టము’ అనే పదం కనిపించే రెండు సందర్భాలనూ గమనిస్తూ, మనం ఆ వచనాన్ని మొత్తంగా పరిశీలిస్తే దాని భావాన్ని గ్రహించడం సాధ్యమౌతుంది. యెషయా 53:10 లో ఇలా ఉంది: “అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను; ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము [“ఇష్టము,” NW] అతనివలన సఫలమగును.”

ఈ వచనం చివరలో ప్రస్తావించబడిన “యెహోవా ఇష్టము,” రాజ్యం ద్వారా ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చడంపై కేంద్రీకృతమై ఉందని బైబిలులోని పూర్తి సందేశం సూచిస్తుంది. యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడం ద్వారా ఆయన సర్వోన్నతాధిపత్యం ఉన్నతపర్చబడుతుంది. మానవజాతి వారసత్వంగా పొందిన పాపం విధేయులైన మానవుల నుండి తీసివేయబడుతుంది. (1 దినవృత్తాంతములు 29:11; కీర్తన 83:18; అపొస్తలుల కార్యములు 4:24; హెబ్రీయులు 2:14, 15; 1 యోహాను 3:8) దీనికంతటికీ కీలకం ఏమిటంటే దేవుని కుమారుడు మానవుడై, విమోచన క్రయధన బలిని అర్పించడమే. మనకందరికీ తెలిసినట్లుగా, ఈ ప్రక్రియలో యేసు బాధననుభవించాడు. ఆయన “తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను” అని బైబిలు మనకు చెప్తుంది. కాబట్టి యేసు ఆ బాధ నుండి నిజంగానే ప్రయోజనం పొందాడు.—హెబ్రీయులు 5:7-9.

తాను చేపట్టే మహాకార్యంలో కొంత వేదన ఇమిడి ఉందని యేసుకు ముందే తెలుసు. యోహాను 12:23, 24 వచనాల్లో వ్రాయబడివున్న ఆయన మాటల్లో ఈ విషయం స్పష్టమౌతుంది, అక్కడిలా ఉంది: “మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది. గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును.” అవును, చివరికి మరణం వరకూ తాను తన యథార్థతను కాపాడుకోవలసి ఉందని యేసుకు తెలుసు. ఆ వృత్తాంతం ఇలా కొనసాగుతుంది: “ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నేనేమందును?—తండ్రీ, యీ గడియ తటస్థింపకుండ నన్ను తప్పించుము; అయినను ఇందు కోసరమే నేను ఈ గడియకు వచ్చితిని; తండ్రీ, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతట—నేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను.”—యోహాను 12:27, 28; మత్తయి 26:38, 39.

ఈ సందర్భంలోనే మనం యెషయా 53:10ని అర్థం చేసుకోగలము. తన కుమారుడు ఒక విధంగా నలుగగొట్టబడతాడని యెహోవాకు తెలుసు. అయినప్పటికీ తత్ఫలితంగా వచ్చే మహిమాన్వితమైన, విస్తృతమైన శ్రేయస్సును మనస్సులో ఉంచుకుని, యేసు అనుభవించవలసి ఉన్నదాన్ని యెహోవా ఇష్టపడ్డాడు. ఆ భావంలో యెహోవాకు “నలుగగొట్టుట” లేక మెస్సీయను నలుగగొట్టడం ఇష్టమయ్యింది. యేసుకు కూడా తాను నెరవేర్చగల్గినదీ, తాను నెరవేర్చినదీ ఇష్టమయ్యింది. నిజంగా, యెషయా 53:10 ముగిస్తున్నట్లుగా, “యెహోవా ఇష్టము అతనివలన సఫలమగును.”