సాదాసీదాగా బ్రతకడంలో ఉన్న ఆనందం
డానియేల్, మిర్యామ్‌లు 2000వ సంవత్సరం సెప్టెంబరులో పెళ్లిచేసుకున్నారు. వాళ్లు స్పెయిన్‌లోని బార్సలోన అనే నగరంలో సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపారు. “మేము చేసే ఉద్యోగాల వల్ల పెద్దపెద్ద హోటళ్లలో భోజనం చేసేవాళ్లం, విదేశాలకు వెళ్లేవాళ్లం, ఖరీదైన బట్టలు వేసుకునేవాళ్లం. క్రమంగా ప్రీచింగ్‌కు కూడా వెళ్లేవాళ్లం” అని డానియేల్ చెప్తున్నాడు. కానీ వాళ్ల జీవితంలో ఒక మార్పు జరిగింది.
2006లో జరిగిన సమావేశంలో డానియేల్ ఒక ప్రసంగం విన్నాడు. అందులో ప్రసంగీకుడు ఈ ప్రశ్న వేశాడు, “‘నాశమునందు పడుటకు జోగుచున్న వారిని’ శాశ్వత జీవితం వైపు నడిపించడానికి మనం చేయగలిగినదంతా చేస్తున్నామా?” (సామె. 24:11) మనం ప్రకటించే బైబిలు సందేశం ప్రజల ప్రాణాల్ని కాపాడుతుంది కాబట్టి ప్రకటించాల్సిన బాధ్యత మనందరికీ ఉందని ఆ సహోదరుడు ప్రసంగంలో వివరించాడు. (అపొ. 20:26, 27) డానియేల్ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు, “యెహోవా నాతోనే మాట్లాడుతున్నట్లు అనిపించింది.” యెహోవా సేవలో ఎక్కువ సమయం గడిపితే సంతోషం రెట్టింపు అవుతుందని కూడా డానియేల్ ఆ ప్రసంగంలో విన్నాడు. తన భార్య మిర్యామ్ అప్పటికే పయినీరు సేవచేస్తూ ఎంతో సంతోషాన్ని, ఎన్నో ఆశీర్వాదాల్ని పొందడం అతను చూశాడు కాబట్టి ఆ మాటలు నిజమని డానియేల్‌కు తెలుసు.
ఆ ప్రసంగం విన్న తర్వాత తన జీవితంలో ఒక పెద్ద మార్పు చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అతనికి అనిపించింది. వెంటనే తన ఉద్యోగంలో పనిగంటల్ని తగ్గించుకుని, పయినీరు సేవ మొదలుపెట్టాడు. అతను, అతని భార్య అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లి సేవచేస్తే ఇంకెంత సంతోషంగా ఉంటారోనని డానియేల్ ఆలోచించాడు.
మొదట్లో ఎదురైన సవాళ్లు—ఆ తర్వాత పులకరింపజేసిన వార్త
2007, మేలో డానియేల్, మిర్యామ్‌లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి, వాళ్లు అంతకుముందు వెళ్లొచ్చిన పనామాకు వెళ్లారు. కరీబియన్ సముద్రం దగ్గరున్న బోకాస్ డెల్ టోరోలోని ఎన్నో ద్వీపాల్లో వాళ్లు ప్రకటించాలని అనుకున్నారు. అక్కడ నివసించే వాళ్లలో చాలామంది గ్నాబే భాష మాట్లాడేవాళ్లే. ఉద్యోగాలు చేసినప్పుడు దాచుకున్న డబ్బుతో పనామాలో దాదాపు ఎనిమిది నెలలపాటు ఉండొచ్చని డానియేల్, మిర్యామ్‌లు అనుకున్నారు.
వాళ్లు ఒక ద్వీపం నుండి మరో ద్వీపానికి పడవలో వెళ్లేవాళ్లు, ఆ ద్వీపాల్లో సైకిళ్ల మీద ప్రయాణించేవాళ్లు. వాళ్లు మొట్టమొదటిసారి మండుటెండలో ఎత్తైన పర్వతాల మీద సైకిల్‌పై 32 కి.మీ. చేసిన ప్రయాణాన్ని ఇప్పటికీ మర్చిపోలేదు. అప్పుడు డానియేల్ దాదాపు కళ్లు తిరిగి పడిపోయేంతగా అలసిపోయాడు. వాళ్లు వెళ్లే దారిలో ఉండే గ్నాబే కుటుంబాలు వాళ్లను సాదరంగా ఇంటికి ఆహ్వానించేవాళ్లు. ముఖ్యంగా డానియేల్, మిర్యామ్‌లు స్థానిక భాషలో కొన్ని మాటలు నేర్చుకున్నప్పుడు వాళ్లు అక్కడి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కొంతకాలానికే వాళ్లకు 23 బైబిలు అధ్యయనాలు దొరికాయి.
వాళ్ల దగ్గరున్న డబ్బంతా అయిపోయాక వాళ్లు బాధపడ్డారు. డానియేల్ ఇలా చెప్తున్నాడు, “స్పెయిన్‌కు తిరిగి వెళ్లిపోవాలనే ఆలోచన వచ్చినప్పుడు మా కళ్లలో నీళ్లు తిరిగాయి. మా బైబిలు విద్యార్థులను విడిచి వెళ్లాలంటే చాలా బాధేసింది.” కానీ నెల తర్వాత వాళ్లు ఒక వార్త విని ఆశ్చర్యపోయారు. దానిగురించి మిర్యామ్ ఇలా అంటోంది, “మేము ఇక్కడే ప్రత్యేక పయినీర్లుగా సేవ చేసే నియామకాన్ని అందుకున్నాం. మేము ఇక్కడే ఉంటున్నందుకు పట్టలేనంత ఆనందం కలిగింది.”
పట్టలేనంత ఆనందం
సంస్థలో జరిగిన మార్పులవల్ల, 2015 నుండి డానియేల్, మిర్యామ్‌లు ప్రత్యేక పయినీరు సేవ ఆపేయాల్సివచ్చింది. మరి ఇప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారు? “నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును” అని కీర్తన 37:5లో ఉన్న అభయం మీద వాళ్లు నమ్మకం ఉంచారు. అక్కడే ఉంటూ క్రమపయినీర్లుగా సేవచేసేందుకు వీలుగా ఉండే ఉద్యోగాలు వాళ్లకు దొరికాయి. ప్రస్తుతం వాళ్లు పనామాలోని బేరాగ్వాస్ సంఘంలో సేవచేస్తున్నారు.
డానియేల్ ఇలా అంటున్నాడు, “మేము స్పెయిన్‌ను వదిలి వచ్చేముందు సాదాసీదాగా జీవించగలమా అని అనుకున్నాం. కానీ ఇప్పుడు మేము అలా జీవిస్తున్నాం, అంతేకాదు మాకున్న అవసరాలన్నీ తీరుతున్నాయి.” వాళ్లకు అన్నిటికన్నా ఎక్కువ సంతోషాన్నిచ్చేది ఏమిటి? “వినయంగల ప్రజలకు యెహోవా గురించి నేర్పించడంలో ఉండే సంతోషాన్ని వేరే దేనితోను పోల్చలేం!” అని వాళ్లు అంటున్నారు.