పాఠకుల ప్రశ్న
ప్రమాణం చేయడం గురించి బైబిలు ఏం చెప్తుంది?
ప్రమాణం చేయడం అంటే ‘అందరిముందు నిజమే చెప్తామని మాటివ్వడం లేదా ఒక పనిని ఖచ్చితంగా చేస్తామని ఒట్టేయడం. సాధారణంగా ప్రజలు దేవుణ్ణి సాక్షిగా పెట్టి ప్రమాణం చేస్తుంటారు. ప్రమాణం చేయడం చాలా గంభీరమైన విషయం.’ దానిని మాట ద్వారా చేయవచ్చు లేదా రాసి కూడా చేయవచ్చు.
మత్తయి 5:33-37 లో యేసు అన్న మాటల్నిబట్టి, కొంతమంది అసలు ప్రమాణం చేయడమే తప్పని అనుకుంటారు. అక్కడ ఆయనిలా అన్నాడు: “అసలు ఒట్టే వేయొద్దు; . . . మీ మాట ‘అవును’ అంటే అవును, ‘కాదు’ అంటే కాదు అన్నట్టే ఉండాలి. వీటికి మించింది ఏదైనా, అది దుష్టుని నుండి వచ్చేదే.” నిజానికి మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఇశ్రాయేలీయులు కొన్ని సందర్భాల్లో ప్రమాణం చేయాలని అలాగే గతంలో దేవుని నమ్మకమైన సేవకులు ప్రమాణం చేశారని యేసుకు తెలుసు. (ఆది. 14:22, 23; నిర్గ. 22:10, 11) అంతేకాదు, స్వయంగా యెహోవా కూడా ప్రమాణాలు చేశాడని యేసుకు తెలుసు. (హెబ్రీ. 6:13-17) కాబట్టి మనం అస్సలు ప్రమాణం చేయకూడదని యేసు చెప్పట్లేదు. బదులుగా, చిన్నచిన్నవాటి గురించి లేదా అర్థంపర్థం లేనివాటి గురించి ప్రమాణాలు చేయకూడదని ఆయన హెచ్చరించాడు. అందుకే మనం ఏదైనా చేస్తామని మాటిస్తే దాన్ని ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనం అలా చేయాలని యెహోవాయే కోరుకుంటున్నాడు.
దేనిగురించైనా ప్రమాణం చేయమని మిమ్మల్ని అడిగితే ఏం చేయాలి? మొదటిగా, మీరు దేని గురించైతే ప్రమాణం చేయబోతున్నారో ఆ పనిని ఖచ్చితంగా చేయగలరో లేదో ఆలోచించుకోండి. ఒకవేళ మాట నిలబెట్టుకోలేమని మీకనిపిస్తే, అసలు ప్రమాణం చేయకపోవడమే మంచిది. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. “నువ్వు మొక్కుబడి చేసుకొని చెల్లించకుండా ఉండడం కన్నా అసలు మొక్కుబడి చేసుకోకపోవడమే మంచిది.” (ప్రసం. 5:5) తర్వాత, ప్రమాణం చేయడానికి సంబంధించిన లేఖన సూత్రాల్ని పరిశీలించండి. అలాగే బైబిలు సూత్రాల ఆధారంగా పెంచుకున్న మీ మనస్సాక్షి ప్రకారం నిర్ణయం తీసుకోండి. ఆ సూత్రాల్లో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.
కొన్ని ప్రమాణాలు దేవుని ఇష్టానికి తగ్గట్టుగా ఉంటాయి. ఉదాహరణకు, యెహోవాసాక్షులు పెళ్లి చేసుకునేటప్పుడు ప్రమాణం చేస్తారు. ప్రమాణం చేస్తున్నప్పుడు పెళ్లికొడుకు, పెళ్లికూతురు “కలిసి జీవించినంత కాలం” ఒకరినొకరు ప్రేమించి, సంరక్షించి, గౌరవించుకుంటామని దేవుని ముందు, సాక్షుల ముందు మాటిస్తారు. (కొంతమంది పెళ్లి చేసుకునేటప్పుడు ఇవే పదాల్ని ఉపయోగించకపోయినా, వాళ్లు కూడా దేవుని ముందు ప్రమాణం చేస్తారు.) ఆ తర్వాత వాళ్లను భార్యాభర్తలుగా ప్రకటిస్తారు. కాబట్టి, వాళ్లిద్దరు జీవించినంతకాలం ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి. (ఆది. 2:24; 1 కొరిం. 7:39) పెళ్లి ప్రమాణాలు సరైనవి అలాగే అవి దేవుని ఇష్టానికి తగ్గట్టు ఉంటాయి.
కొన్ని ప్రమాణాలు దేవుని ఇష్టానికి విరుద్ధంగా ఉంటాయి. సాధారణంగా తమ దేశాన్ని కాపాడుకోవడానికి సైన్యంలో చేరి, యుద్ధం చేయాలని కొన్ని దేశాల్లో ప్రజలు ప్రమాణం చేయాల్సిరావొచ్చు. కానీ నిజ క్రైస్తవులైతే అలాంటి ప్రమాణాన్ని ఎప్పుడూ చేయరు. అలాగే దేవుణ్ణి ఆరాధించం అని కూడా యోహా. 15:19; యెష. 2:4; యాకో. 1:27.
వాళ్లు ప్రమాణం చేయరు. ఎందుకంటే అలా చేయడం దేవుని ఆజ్ఞలకు విరుద్ధం. నిజ క్రైస్తవులు “లోకానికి చెందినవాళ్లు కాదు” కాబట్టి మనం లోకానికి సంబంధించిన గొడవల్లో, యుద్ధాల్లో తలదూర్చం.—కొన్ని ప్రమాణాలు చేయాలా వద్దా అని క్రైస్తవులు తమ మనస్సాక్షి బట్టి నిర్ణయించుకోవాలి. యేసు చెప్పిన మాటల ప్రకారం, మనం ప్రమాణం చేయాలా వద్దా అని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఆయన ఇలా అన్నాడు: “కైసరువి కైసరుకు చెల్లించండి, కానీ దేవునివి దేవునికి చెల్లించండి.”—లూకా 20:25.
ఉదాహరణకు, ఒక క్రైస్తవుడు దేశ పౌరసత్వం కోసం లేదా పాస్పోర్ట్ కోసం అప్లై చేస్తున్నప్పుడు, ఆ దేశానికి నమ్మకంగా ఉంటాననే ప్రమాణం చేయాల్సివస్తుందని అతనికి తెలిసింది. ఒకవేళ అలా ప్రమాణం చేయడంవల్ల, ఆ దేశంలో బైబిలుకు విరుద్ధమైన పనులేమైనా చేయాల్సి వస్తుందని అతనికి తెలిస్తే, తన మనస్సాక్షిని బట్టి ఆ ప్రమాణం చేయకూడదని నిర్ణయించుకోవచ్చు. అయితే ఆ వ్యక్తి తన మనస్సాక్షికి తగ్గట్టు ప్రమాణం చేసేలా, ప్రమాణంలోని కొన్ని పదాల్ని మార్చడానికి ఆ దేశ ప్రభుత్వం అనుమతించొచ్చు.
పదాల్ని మార్చి ప్రమాణం చేయడం, రోమీయులు 13:1 లో ఉన్న సూత్రానికి అనుగుణంగా ఉందని చెప్పవచ్చు. అక్కడిలా ఉంది: “ప్రతీ ఒక్కరు పై అధికారాలకు లోబడివుండాలి.” పై అధికారులకు లోబడాలని యెహోవాయే కోరుకుంటున్నాడు కాబట్టి అలాంటి ప్రమాణం చేయాల్సివస్తే, దానిని చేయడం తప్పేమీ కాదని ఆ క్రైస్తవుడు నిర్ణయించుకోవచ్చు.
ప్రమాణం చేస్తున్నప్పుడు ఏదైనా వస్తువుమీద చేతులు ఉంచమని లేదా ఏదైనా సైగ చేయమని అడిగితే, అప్పుడు కూడా బైబిలు సూత్రాల ఆధారంగా పెంచుకున్న మీ మనస్సాక్షి ప్రకారం నిర్ణయం తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. ప్రాచీనకాలంలో రోమన్లు, సిథియన్లు కత్తుల్ని పట్టుకుని యుద్ధ దేవుడి సాక్షిగా ప్రమాణం చేసేవాళ్లు. గ్రీసు దేశస్థులైతే ప్రమాణం చేసేటప్పుడు ఒక చేతిని పైకెత్తేవాళ్లు. అలా చేయడం ద్వారా తమ మాటల్ని, పనుల్ని గమనించే ఒక దేవుడు ఉన్నాడని, మనుషులు ఆయనకు లెక్క అప్పచెప్పాలని వాళ్లు గుర్తించినట్లు అది చూపించింది.
అయితే ఒక యెహోవాసాక్షి అబద్ధ ఆరాధనకు సంబంధించిన ఏ జాతీయ చిహ్నం మీదా ప్రమాణం చేసి చెప్పడు. ఒకవేళ కోర్టులో బైబిలు మీద చేతులుంచి ప్రమాణం చేయమని మిమ్మల్ని అడిగితే అప్పుడేంటి? అలా చేయాలని మీరు నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే బైబిల్లోని నమ్మకమైన సేవకులు కూడా ఏదోక విధమైన సైగ చేసి ప్రమాణం చేశారు. (ఆది. 24:2, 3, 9; 47:29-31) మీరు అలా ప్రమాణం చేసేటప్పుడు నిజమే చెప్తామని, స్వయంగా దేవుని ముందు మాటిస్తున్నారని గుర్తుంచుకోవడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మిమ్మల్ని ఏ ప్రశ్న అడిగినా, నిజమే చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.
యెహోవాతో మన సంబంధం అన్నిటికన్నా ప్రాముఖ్యం కాబట్టి, ప్రమాణం చేయాల్సివస్తే దానిగురించి ప్రార్థించి, జాగ్రత్తగా ఆలోచించాలి. అది మన మనస్సాక్షికి గానీ, బైబిలు సూత్రాలకి గానీ విరుద్ధంగా ఉండకుండా చూసుకోవాలి. ఏదేమైనా మీరు ప్రమాణం చేయాలని నిర్ణయించుకుంటే, ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకోవాలి.—1 పేతు. 2:12.