యోహాను 13:1-38
13 తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి, తండ్రి దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చేసిందని యేసుకు పస్కా పండుగకు ముందే తెలుసు. ఆయన లోకంలో ఉన్న తన అనుచరుల్ని ప్రేమించాడు కాబట్టి, వాళ్లను చివరి వరకూ ప్రేమిస్తూనే ఉన్నాడు.
2 వాళ్లు సాయంకాలం భోజనం చేస్తున్నారు. యేసును అప్పగించాలనే ఆలోచనను అపవాది అప్పటికే సీమోను కొడుకైన ఇస్కరియోతు యూదా హృదయంలో నాటాడు.
3 తండ్రి అన్నిటినీ తన చేతుల్లో పెట్టాడని, తాను దేవుని దగ్గరి నుండి వచ్చానని, తిరిగి దేవుని దగ్గరికి వెళ్తున్నానని యేసుకు తెలుసు కాబట్టి,
4 భోజనం బల్ల దగ్గరి నుండి లేచి, తన పైవస్త్రాలు తీసి పక్కనపెట్టాడు. ఆయన ఒక తువాలు తీసుకుని దాన్ని నడుముకు కట్టుకున్నాడు.
5 తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి శిష్యుల పాదాలను కడుగుతూ, తన నడుముకు కట్టుకున్న తువాలుతో తుడవడం మొదలుపెట్టాడు.
6 ఆయన సీమోను పేతురు దగ్గరికి వచ్చినప్పుడు అతను, “ప్రభువా, నువ్వు నా పాదాలు కడుగుతావా?” అన్నాడు.
7 అందుకు యేసు, “నేను చేస్తున్నది నీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమౌతుంది” అన్నాడు.
8 దానికి పేతురు, “నిన్ను ఎప్పటికీ నా పాదాలు కడగనివ్వను” అన్నాడు. అందుకు యేసు, “నేను నిన్ను కడగకపోతే నాతో నీకు వంతు లేదు” అన్నాడు.
9 అప్పుడు సీమోను పేతురు, “ప్రభువా, నా పాదాలు మాత్రమే కాదు నా చేతులు, తల కూడా కడుగు” అన్నాడు.
10 యేసు అతనితో ఇలా అన్నాడు: “స్నానం చేసిన వ్యక్తి శరీరమంతా శుభ్రంగా ఉంటుంది కాబట్టి అతను పాదాలు కడుక్కుంటే సరిపోతుంది. మీరు శుభ్రంగా ఉన్నారు, కానీ మీలో అందరూ శుభ్రంగా లేరు.”
11 తనకు నమ్మకద్రోహం చేస్తున్న వ్యక్తి ఎవరో యేసుకు తెలుసు. అందుకే, “మీలో అందరూ శుభ్రంగా లేరు” అని అన్నాడు.
12 ఆయన వాళ్ల పాదాలు కడిగి, తన పైవస్త్రాలు వేసుకున్న తర్వాత మళ్లీ బల్ల దగ్గర కూర్చొని వాళ్లతో ఇలా అన్నాడు: “నేను మీకు చేసింది మీకు అర్థమైందా?
13 మీరు నన్ను ‘బోధకుడు’ అని, ‘ప్రభువు’ అని పిలుస్తున్నారు. మీరు నన్ను అలా పిలవడం సరైనదే.
14 ప్రభువునూ, బోధకుణ్ణీ అయిన నేను మీ పాదాలు కడిగానంటే మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి.
15 నేను మీకు చేసినట్లే మీరు కూడా చేయాలని మీకు ఆదర్శం ఉంచాను.
16 నేను మీతో నిజంగా చెప్తున్నాను. దాసుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాదు. అదేవిధంగా, పంపబడిన వ్యక్తి తనను పంపించిన వ్యక్తి కన్నా గొప్పవాడు కాదు.
17 మీకు ఈ విషయాలు తెలుసు కాబట్టి, వీటిని చేస్తే మీరు సంతోషంగా ఉంటారు.
18 నేను మీ అందరి గురించి చెప్పట్లేదు; నేను ఎంచుకున్న వాళ్లు నాకు తెలుసు. అయితే, ‘నాతోపాటు భోజనం చేస్తూ వచ్చిన వ్యక్తి నాకు శత్రువు అయ్యాడు’* అనే లేఖనం నెరవేరాల్సి ఉంది.
19 అది జరిగినప్పుడు నేనే ఆయన్ని అని మీరు నమ్మేలా ముందుగానే మీకు చెప్తున్నాను.
20 నేను మీతో నిజంగా చెప్తున్నాను, నేను పంపించిన ఏ వ్యక్తినైనా చేర్చుకునేవాళ్లు నన్ను కూడా చేర్చుకుంటారు; నన్ను చేర్చుకునేవాళ్లు నన్ను పంపించిన దేవుణ్ణి కూడా చేర్చుకుంటారు.”
21 ఈ విషయాలు చెప్పిన తర్వాత యేసు ఎంతో ఆవేదన చెందాడు. “నేను నిజంగా మీతో చెప్తున్నాను, మీలో ఒకతను నన్ను అప్పగిస్తాడు” అని ఆయన స్పష్టంగా చెప్పాడు.
22 ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అర్థంకాక, శిష్యులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
23 వాళ్లలో యేసు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు ఆయన పక్కనే కూర్చొని ఉన్నాడు.
24 కాబట్టి సీమోను పేతురు, “ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చెప్పు” అని అతనికి సైగ చేశాడు.
25 అప్పుడు అతను వెనక్కి వాలి యేసు రొమ్మును ఆనుకొని, “ప్రభువా ఎవరతను?” అని అడిగాడు.
26 అందుకు యేసు, “నేను రొట్టె ముక్కను ముంచి ఎవరికి ఇస్తానో అతనే” అన్నాడు. కాబట్టి యేసు రొట్టెను ముంచి సీమోను ఇస్కరియోతు కొడుకైన యూదాకు ఇచ్చాడు.
27 యూదా ఆ రొట్టె ముక్కను తీసుకున్నాక, సాతాను అతనిలో ప్రవేశించాడు. కాబట్టి యేసు అతనితో ఇలా అన్నాడు: “నువ్వు చేస్తున్నది ఇంకా త్వరగా చేయి.”
28 అయితే, యేసు అతనితో ఎందుకలా అన్నాడో బల్ల దగ్గర కూర్చున్న వాళ్లెవ్వరికీ అర్థం కాలేదు.
29 యూదా దగ్గర డబ్బుల పెట్టె ఉంది కాబట్టి, “పండుగ కోసం మనకు అవసరమైనవి కొను” అనో, పేదవాళ్లకు ఏమైనా ఇవ్వమనో యేసు అతనికి చెప్తున్నాడని వాళ్లలో కొంతమంది అనుకున్నారు.
30 కాబట్టి అతను ఆ రొట్టె ముక్క తీసుకున్నాక వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయాడు. అది రాత్రిపూట.
31 అతను బయటికి వెళ్లిపోయినప్పుడు యేసు ఇలా అన్నాడు: “ఇప్పుడు మానవ కుమారుడు మహిమపర్చబడుతున్నాడు. ఆయన ద్వారా దేవుడు మహిమపర్చబడుతున్నాడు.
32 దేవుడే స్వయంగా మానవ కుమారుణ్ణి మహిమపరుస్తాడు, వెంటనే మహిమపరుస్తాడు.
33 చిన్నపిల్లలారా, నేను ఇంక కొంతకాలమే మీతోపాటు ఉంటాను. మీరు నా కోసం వెదుకుతారు; అయితే ‘నేను వెళ్లే చోటికి మీరు రాలేరు’ అని యూదులతో చెప్పిన మాటే ఇప్పుడు మీతో కూడా చెప్తున్నాను.
34 నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి.
35 మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.”
36 సీమోను పేతురు, “ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?” అని ఆయన్ని అడిగాడు. అందుకు యేసు, “నేను వెళ్తున్న చోటికి ఇప్పుడు నువ్వు నా వెంట రాలేవు కానీ తర్వాత వస్తావు” అన్నాడు.
37 అప్పుడు పేతురు యేసుతో ఇలా అన్నాడు: “ప్రభువా, నేను ఇప్పుడు నీ వెంట ఎందుకు రాలేను? నీ కోసం నా ప్రాణం ఇస్తాను.”
38 అందుకు యేసు, “నా కోసం నీ ప్రాణం ఇస్తావా? నేను నీతో నిజంగా చెప్తున్నాను. నేను ఎవరో నీకు తెలియదని నువ్వు మూడుసార్లు చెప్పే వరకు కోడి కూయదు” అన్నాడు.
అధస్సూచీలు
^ అక్ష., “నా మీదికి తన మడిమ ఎత్తాడు.”