93వ కథ
యేసు అనేకమందికి ఆహారం పెట్టడం
ఒక ఘోరమైన సంగతి జరిగింది. బాప్తిస్మమిచ్చు యోహాను చంపబడ్డాడు. రాజు భార్యయైన హేరోదియకు ఆయనంటే ఇష్టం లేదు. ఆమె రాజు ద్వారా యోహాను తలను నరికించింది.
యేసుకు ఆ విషయం తెలిసినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన ఒంటరిగా ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు. అయినా ప్రజలు ఆయనను విడిచిపెట్టకుండా వెంబడించారు. యేసు ఆ జనసమూహాలను చూసి వాళ్ళపై జాలిపడ్డాడు. కాబట్టి ఆయన వాళ్ళకు దేవుని రాజ్యం గురించి బోధించి, వాళ్ళలోని వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు.
ఆ రోజు సాయంకాలం శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ‘ఇప్పటికే బాగా ఆలస్యమయ్యింది, అంతేకాక ఇది ఏకాంత ప్రదేశం. దగ్గర్లోని గ్రామాలకు వెళ్ళి ఆహారం కొనుక్కోవడానికి ప్రజలను పంపించు’ అని చెప్పారు.
అప్పుడు యేసు ‘వాళ్ళు వెళ్ళనవసరం లేదు. మీరే వాళ్ళకు ఆహారం పెట్టండి’ అని సమాధానమిచ్చాడు. యేసు ఫిలిప్పు వైపు తిరిగి, ‘ఈ ప్రజలందరికీ సరిపడేంత ఆహారాన్ని మనం ఎక్కడనుండి కొనగలం?’ అని అడిగాడు.
దానికి ఫిలిప్పు, ‘ప్రతి ఒక్కరు కొంచెం కొంచెం తినడానికి కావలసిన ఆహారం కొనడానికైనా చాలా ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది’ అని చెప్పాడు. అప్పుడు అంద్రెయ, ‘ఇక్కడ ఉన్న అబ్బాయి దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి. కానీ అవి ఇంతమందికి అస్సలు సరిపోవు’ అని అన్నాడు.
యేసు ‘అందరిని నేలమీద కూర్చోమని చెప్పండి’ అన్నాడు. ఆ తర్వాత ఆయన తమకు ఆహారం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వాటిని ముక్కలుగా విరవడం ప్రారంభించాడు. శిష్యులు రొట్టెలను చేపలను అందరికీ పంచారు. అక్కడ 5,000 మంది పురుషులు, ఇంకా చాలా వేలమంది స్త్రీలు, పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ సంతృప్తిగా భుజించారు. తరువాత శిష్యులు మిగిలిన ముక్కలను పోగు చేసినప్పుడు 12 గంపలు నిండాయి!
ఆ తర్వాత యేసు తన శిష్యులను గలిలయ సముద్రాన్ని దాటడానికి పడవ ఎక్కించాడు. రాత్రివేళ పెద్ద తుపాను వచ్చి, అలలు పడవను అటు ఇటు ఊపేశాయి. శిష్యులు ఎంతో భయపడ్డారు. అలా ఉండగా అర్థరాత్రి సమయంలో వాళ్ళు ఒక వ్యక్తి నీళ్ళపై నడుచుకుంటూ తమవైపు రావడాన్ని చూశారు. వాళ్ళు చూస్తున్నదేమిటో అర్థంకాక భయంతో కేకలు వేశారు.
అప్పుడు యేసు ‘భయపడవద్దు, నేనే!’ అన్నాడు. అయినా వాళ్ళు నమ్మలేకపోయారు. కాబట్టి పేతురు ‘ప్రభువా, అది నువ్వే అయితే నన్ను కూడా నీళ్ళపై నడిచి నీ దగ్గరకు రానివ్వు’ అన్నాడు. యేసు ఆయనను రమ్మన్నాడు. పేతురు లేచి నీళ్ళపై నడవడం ప్రారంభించాడు! కానీ ఆయన భయపడడంవల్ల మునిగిపోవడం ప్రారంభించినప్పుడు యేసు ఆయనను రక్షించాడు.
ఆ తర్వాత యేసు మళ్ళీ వేలాదిమందికి ఆహారం పెట్టాడు. ఈసారి ఆయన ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉపయోగించి అలా చేశాడు. ఈసారి కూడా అందరూ తృప్తిగా భుజించారు. యేసు ప్రజలను ఇంత శ్రద్ధగా చూసుకోవడం అద్భుతంగా లేదా? దేవుని రాజుగా ఆయన పరిపాలించేటప్పుడు మనం దేని గురించీ చింతించవలసిన అవసరముండదు!