92వ కథ
యేసు మృతులను లేపడం
మీరు ఇక్కడ చూస్తున్న పాపకు 12 సంవత్సరాలు. యేసు ఆమె చేతిని పట్టుకొని ఉన్నాడు, ఆమె తల్లిదండ్రులు పక్కన నిలబడి ఉన్నారు. వాళ్ళు ఎందుకు అంత సంతోషంగా కనిపిస్తున్నారో మీకు తెలుసా? మనం చూద్దాం.
ఆ పాప తండ్రి చాలా ప్రముఖమైన వ్యక్తి, ఆయన పేరు యాయీరు. ఒకరోజు ఆయన కుమార్తె అనారోగ్యంతో మంచం పట్టింది. ఆమె ఆరోగ్యం బాగు పడలేదు. ఆమె రోజురోజుకూ మరింత బలహీనమయ్యింది. తమ పాప చనిపోబోతున్నట్లు కనిపించడంవల్ల యాయీరు, ఆయన భార్య ఎంతో కలతపడ్డారు. ఆమె వాళ్ళకున్న ఒక్కగానొక్క కుమార్తె. కాబట్టి యాయీరు యేసు కోసం వెదకడానికి వెళ్ళాడు. ఆయన యేసు చేస్తున్న అద్భుతాల గురించి విన్నాడు.
యాయీరు యేసును వెదికి పట్టుకున్నప్పుడు, ఆయన చుట్టూ పెద్ద సమూహం గుమికూడివుంది. కానీ యాయీరు సమూహంలోనుండి చొచ్చుకొనిపోయి యేసు పాదాలమీద పడ్డాడు. ‘నా కుమార్తె చాలా చాలా అనారోగ్యంగా ఉంది, దయచేసి మీరు వచ్చి ఆమెను బాగు చేయండి’ అని యేసును వేడుకున్నాడు. యేసు వస్తానని చెప్పాడు.
వాళ్ళు నడిచి వెళ్తుంటే సమూహంలోని ప్రజలు యేసుకు మరింత దగ్గరగా రావడం ప్రారంభించారు. అకస్మాత్తుగా యేసు ఆగి, ‘నన్ను ఎవరు ముట్టుకున్నారు?’ అని ప్రశ్నించాడు. యేసు తనలోనుండి శక్తి బయటకు వెళ్ళినట్లు గ్రహించాడు కాబట్టి తనను ఎవరో ముట్టుకున్నారని ఆయనకు తెలిసింది. అయితే ఎవరు ముట్టుకున్నారు? 12 సంవత్సరాలనుండి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ ముట్టుకుంది. ఆమె వచ్చి యేసు వస్త్రాలు ముట్టుకొని, స్వస్థత పొందింది!
అలా జరగడం చూసి యాయీరు సంతోషించాడు, ఎందుకంటే యేసు ఎంత సుళువుగా ఒకరిని బాగు చేయగలడో ఆయన చూశాడు. ఇంతలో ఒక వ్యక్తి ఒక సందేశంతో అక్కడకు వచ్చాడు. అతను యాయీరుతో ‘ఇక యేసును శ్రమ పెట్టవద్దు. నీ కుమార్తె చనిపోయింది’ అని చెప్పాడు. యేసు ఆ మాటలు విని, ‘బాధపడవద్దు, ఆమె స్వస్థపరచబడుతుంది’ అని యాయీరుతో చెప్పాడు.
చివరకు వాళ్ళు యాయీరు ఇంటికి చేరుకునే సరికి, ప్రజలంతా ఎంతో బాధతో ఏడుస్తూ కనిపించారు. అయితే యేసు, ‘ఏడ్వవద్దు. బిడ్డ చనిపోలేదు. ఆమె కేవలం నిద్రిస్తోంది’ అన్నాడు. ఆ మాటలు విని వాళ్ళందరూ నవ్వి యేసును ఎగతాళి చేశారు, ఎందుకంటే ఆమె చనిపోయిందని వాళ్ళకు తెలుసు.
అప్పుడు యేసు ఆ పాప తల్లిదండ్రులను, తన ముగ్గురు అపొస్తలులను ఆ పాప పడుకొనివున్న గదిలోనికి తీసుకొని వెళ్ళాడు. ఆయన ఆమె చేతిని పట్టుకొని ‘లెమ్ము!’ అని చెప్పగానే మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా, ఆమె తిరిగి బ్రతికింది. ఆమె లేచి అటూ ఇటూ నడిచింది! అందుకే ఆమె తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు.
యేసు మృతులలోనుండి లేపిన మొదటి వ్యక్తి ఆ పాప కాదు. యేసు తిరిగి బ్రతికించిన మొదటి వ్యక్తి నాయీను అనే ఊరిలో నివసించే విధవరాలు కుమారుడని బైబిలు చెబుతోంది. ఆ తర్వాత, యేసు మరియ మార్తల సోదరుడైన లాజరును కూడా మృతులలోనుండి లేపాడు. యేసు దేవుని రాజుగా పరిపాలించేటప్పుడు ఇంకా చాలామంది మృతులను తిరిగి జీవానికి తెస్తాడు. మరి మనం దాని గురించి సంతోషించవద్దా?