ఎనిమిదవ అధ్యాయం
దేవుని రాజ్యం అంటే ఏమిటి?
-
దేవుని రాజ్యం గురించి బైబిలు మనకేమి చెబుతోంది?
-
దేవుని రాజ్యం ఏమి చేస్తుంది?
-
ఆ రాజ్యం ఈ భూమ్మీద దేవుని చిత్తం ఎప్పుడు జరిగేలా చూస్తుంది?
1. ఇప్పుడు ఏ ప్రఖ్యాత ప్రార్థన పరిశీలించబడుతుంది?
ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందికి పరలోక ప్రార్థన లేదా ప్రభువు ప్రార్థన అని చాలామంది పిలిచే ప్రార్థన గురించి తెలుసు. ఈ మాటలు యేసుక్రీస్తు ఇచ్చిన ప్రఖ్యాత మాదిరి ప్రార్థనను సూచిస్తాయి. అది చాలా అర్థవంతమైన ప్రార్థన, దానిలోని మొదటి మూడు విన్నపాలను పరిశీలించడం బైబిలు నిజంగా బోధిస్తున్న దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది.
2. తన శిష్యులు ప్రార్థించాలని యేసు బోధించిన మూడు విషయాలు ఏమిటి?
2 ఈ మాదిరి ప్రార్థన ఆరంభంలో యేసు తన అనుచరులను ఇలా ఆదేశించాడు: “కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి,—పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (మత్తయి 6:9-13) ఈ మూడు విన్నపాల విశేషత ఏమిటి?
3. దేవుని రాజ్యం గురించి మనం ఏమి తెలుసుకోవాలి?
3 మనం ఇప్పటికే యెహోవా అనే దేవుని పేరు గురించి చాలా తెలుసుకున్నాం. కొంతమేరకు దేవుని చిత్తమేమిటో, మానవాళి కోసం ఆయనేమి చేశాడో, ఇంకా ఏమి చేస్తాడో కూడా తెలుసుకున్నాం. అయితే “నీ రాజ్యము వచ్చుగాక” అని ప్రార్థించమని మనకు చెప్పినప్పుడు యేసు దేనిని సూచిస్తున్నాడు? దేవుని రాజ్యం అంటే ఏమిటి? అది రావడం దేవుని నామాన్ని ఎలా పవిత్రం లేదా పరిశుద్ధం చేస్తుంది? రాజ్యం రావడానికి దేవుని చిత్తం జరగడానికి ఎలాంటి సంబంధం ఉంది?
దేవుని రాజ్యం అంటే ఏమిటి?
4. దేవుని రాజ్యం అంటే ఏమిటి, దాని రాజు ఎవరు?
4 యెహోవా దేవుడు తాను ఎంపిక చేసుకున్న రాజుతో స్థాపించే ప్రభుత్వమే దేవుని రాజ్యం. దేవుని రాజ్యానికి రాజు ఎవరు? యేసుక్రీస్తు. రాజుగా యేసు మానవ పరిపాలకులందరికన్నా గొప్పవానిగా ఉండడమే కాక, “ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నాడు.” (ప్రకటన 17:14) ఏ మానవ పరిపాలకునికన్నా, వారిలోని అత్యుత్తమ పరిపాలకునికన్నా కూడా మరెంతో అధిక ప్రయోజనం చేకూర్చే శక్తి ఆయనకు ఉంది.
5. దేవుని రాజ్యం ఎక్కడనుండి పరిపాలిస్తుంది, దేనిని పరిపాలిస్తుంది?
5 దేవుని రాజ్యం ఎక్కడనుండి పరిపాలిస్తుంది? నిజానికి, యేసు ఎక్కడ ఉన్నాడు? ఆయన హింసా కొయ్యమీద చంపబడ్డాడనీ, ఆ తర్వాత ఆయన పునరుత్థానం చేయబడ్డాడనీ తెలుసుకోవడం బహుశా మీకు గుర్తుండవచ్చు. కొన్ని రోజుల తర్వాత ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు. (అపొస్తలుల కార్యములు 2:33) కాబట్టి, దేవుని రాజ్యం అక్కడే అంటే పరలోకంలోనే ఉంటుంది. అందుకే బైబిలు దానిని “పరలోక రాజ్యము” అని పిలుస్తోంది. (2 తిమోతి 4:18) దేవుని రాజ్యం పరలోకంలో ఉన్నప్పటికీ, అది భూమిని పరిపాలిస్తుంది.—ప్రకటన 11:15 చదవండి.
6, 7. యేసును అసాధారణ రాజుగా చేసేదేమిటి?
6 యేసు ఒక అసాధారణ రాజుగా ఎలావుంటాడు? ఎలాగంటే, ఆయన ఎన్నటికీ చనిపోడు. యేసును మానవ రాజులతో పోలుస్తూ బైబిలు ఆయన గురించి, “నాశనములేని జీవము” గలవాడు అని చెబుతోంది. (హెబ్రీయులు 7:15, 16) అంటే యేసు చేసే మంచి పనులన్నీ నిరంతరం ఉంటాయని దానర్థం. అంతేగాక ఆయన తన ప్రజల ప్రయోజనార్థం ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు.
7 యేసు గురించి చెప్పిన ఈ బైబిలు ప్రవచనాన్ని పరిశీలించండి: “యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును; యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు. నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును, భూ నివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శ చేయును.” (యెషయా 11:2-4) ఈ మాటలు, యేసు తన ప్రజలమీద నీతి, కనికరంగల రాజుగా ఉంటాడని చూపిస్తున్నాయి. అలాంటి పరిపాలకుడు ఉండాలని మీరు కోరుకుంటారా?
8. యేసుతో ఎవరు పరిపాలిస్తారు?
8 దేవుని రాజ్యం గురించిన మరో సత్యం ఏమిటంటే, యేసు ఒక్కడే పరిపాలించడు. ఆయనకు సహ పరిపాలకులు ఉంటారు. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు తిమోతికి ఇలా చెప్పాడు: “సహించిన వారమైతే ఆయనతోకూడ ఏలుదుము.” (2 తిమోతి 2:12) అవును, దేవుడు ఎంచుకున్న పౌలు, తిమోతిలతోపాటు ఇతర నమ్మకస్థులు యేసుతో కలిసి పరలోక రాజ్యంలో పరిపాలిస్తారు. ఆ విశేషాధిక్యత ఎంతమందికి ఉంటుంది?
9. యేసుతోపాటు ఎంతమంది పరిపాలిస్తారు, దేవుడు వారిని ఎంపిక చేయడం ఎప్పుడు ఆరంభించాడు?
9 ఈ పుస్తకంలోని 7వ అధ్యాయం సూచించినట్లుగా, అపొస్తలుడైన యోహాను ఒక దర్శనం చూశాడు, అందులో ఆయన “గొఱ్ఱెపిల్ల [యేసుక్రీస్తు] సీయోను పర్వతముమీద [పరలోకంలో రాజుగా తన స్థానంలో] నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతోకూడ” ఉండడం చూశాడు. ఆ 1,44,000 మంది ఎవరు? స్వయంగా యోహానే మనకు ఇలా చెబుతున్నాడు: “వీరు . . . గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు; వీరు దేవుని కొరకును గొఱ్ఱెపిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.” (ప్రకటన 14:1, 4) అవును, వారు యేసుక్రీస్తుతోపాటు పరలోకంలో పరిపాలించడానికి ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన నమ్మకస్థులైన ఆయన అనుచరులు. మరణం నుండి పరలోక జీవానికి పునరుత్థానం చేయబడిన తర్వాత, యేసుతోపాటు “వారు భూలోకమందు ఏలుదురు.” (ప్రకటన 5:9-10) ఈ 1,44,000 సంఖ్యను పూర్తి చేయడానికి దేవుడు అపొస్తలుల కాలంనుండి నమ్మకమైన క్రైస్తవులను ఎంపిక చేసుకుంటున్నాడు.
10. యేసు, 1,44,000 మంది కలిసి మానవాళిని పరిపాలించడం ఎందుకు ఒక ప్రేమపూర్వకమైన ఏర్పాటు?
10 మానవాళిని పరిపాలించడానికి యేసును, 1,44,000 మందిని ఎంచుకోవడం ఎంతో ప్రేమపూర్వకమైన విషయం. ఆనందకరమైన ఒక విషయం ఏమిటంటే, మానవునిగా జీవించడం, బాధలనుభవించడం అంటే ఏమిటో యేసుకు తెలుసు. అందుకే, యేసు గురించి పౌలు ఇలా అన్నాడు: “మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.” (హెబ్రీయులు 4:15; 5:8) ఆయన సహపరిపాలకులు కూడా మానవులుగా బాధలనుభవించి, సహించినవారే. దీనికి తోడుగా, వారు అపరిపూర్ణతతో పోరాడి అన్నిరకాల అస్వస్థతలను ఎదుర్కొన్నారు. కాబట్టి, మానవులు ఎదుర్కొనే సమస్యలను వారు తప్పకుండా అర్థం చేసుకుంటారు!
దేవుని రాజ్యం ఏమి చేస్తుంది?
11. దేవుని చిత్తం పరలోకంలో నెరవేరేలా తన శిష్యులు ప్రార్థించాలని యేసు ఎందుకు చెప్పాడు?
11 దేవుని రాజ్యం రావాలని తన శిష్యులు ప్రార్థించాలని యేసు చెప్పినప్పుడు, దేవుని చిత్తం “పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని కూడా వారు ప్రార్థించాలని ఆయన చెప్పాడు. దేవుడు పరలోకంలో ఉన్నాడు, అక్కడ నమ్మకమైన దేవదూతలు ఎల్లప్పుడూ ఆయన చిత్తం చేస్తూనే ఉన్నారు. అయితే దుష్టుడైన ఒక దూత దేవుని చిత్తం చేయడం మానేసి ఆదాము హవ్వలు పాపం చేయడానికి కారణమయ్యాడని మనం ఈ పుస్తకంలోని మూడవ అధ్యాయంలో తెలుసుకున్నాం. అపవాదియగు సాతాను అని మనకు తెలిసిన ఆ దుష్టదూత గురించి బైబిలు ఏమి బోధిస్తోందో మనం 10వ అధ్యాయంలో మరింత ఎక్కువ తెలుసుకుంటాం. సాతానుకు, అతడిని వెంబడించడానికి నిర్ణయించుకున్న దూతలకు అంటే దయ్యాలు అని పిలువబడే ఇతర ఆత్మ సంబంధ ప్రాణులకు పరలోకంలో కొంతకాలం ఉండడానికి అనుమతి లభించింది. కాబట్టి, అప్పుడు పరలోకంలో అందరూ దేవుని చిత్తం చేయడంలేదు. దేవుని రాజ్య పరిపాలన ఆరంభమైనప్పుడు, ఆ పరిస్థితి మారుతుంది. కొత్తగా సింహాసనాసీనుడైన రాజైన యేసుక్రీస్తు సాతానుతో యుద్ధం చేస్తాడు.—ప్రకటన 12:7-9 చదవండి.
12. ప్రకటన 12:10 లో ఏ రెండు ప్రాముఖ్యమైన సంఘటనల గురించి చెప్పబడింది?
12 అప్పుడు ఏమి జరుగుతుందో ఈ క్రింది ప్రవచనార్థక మాటలు వర్ణిస్తున్నాయి: “ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని—రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.” (ప్రకటన 12:10) ఆ బైబిలు వచనంలో వర్ణించబడిన రెండు ప్రాముఖ్యమైన సంఘటనలను మీరు గమనించారా? మొదటిది, యేసుక్రీస్తు అధికారంలోని దేవుని రాజ్యం పరిపాలన ఆరంభిస్తుంది. రెండవది, పరలోకం నుండి సాతాను ఈ భూమ్మీదకు పడద్రోయబడ్డాడు.
13. సాతాను పరలోకం నుండి పడద్రోయబడడంవల్ల కలిగే ఫలితమేమిటి?
13 ఆ రెండు సంఘటనల ఫలితాలు ఎలా ఉన్నాయి? పరలోకంలో జరిగినదాని గురించి మనం ఇలా చదువుతాం: “అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి.” (ప్రకటన 12:12) అవును, పరలోకంలోవున్న నమ్మకమైన దేవదూతలు ఆనందిస్తారు, ఎందుకంటే సాతానుకు అతని దయ్యాలకు ఇక అక్కడ స్థానంలేదు, పరలోకంలోవున్న ప్రతీ ఒక్కరు యెహోవా దేవునిపట్ల యథార్థంగా ఉన్నారు. అక్కడ పరిపూర్ణమైన, అవిచ్ఛిన్నమైన శాంతిసామరస్యాలు ఉన్నాయి. పరలోకంలో దేవుని చిత్తం నెరవేరుతోంది.
14. సాతాను ఈ భూమ్మీదికి పడద్రోయబడిన కారణంగా ఏమి జరిగింది?
14 మరి ఈ భూమి సంగతి ఏమిటి? బైబిలు ఇలా చెబుతోంది: “భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.” (ప్రకటన 12:12) భూమ్మీదకు పడద్రోయబడినందుకు, తనకు కొంచెం సమయం మాత్రమే మిగిలివున్నందుకు సాతాను కోపంగా ఉన్నాడు. అతడు కోపంతో ఈ భూమ్మీద క్షోభ లేదా “శ్రమ” కలిగిస్తున్నాడు. తర్వాతి అధ్యాయంలో ఆ “శ్రమ” గురించి మనం ఇంకా ఎక్కువ తెలుసుకుంటాం. అయితే ఆ విషయం దృష్ట్యా, ఆ రాజ్యం ఈ భూమ్మీద దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చగలదు అని మనం ప్రశ్నించవచ్చు.
15. భూమిపట్ల దేవుని చిత్తమేమిటి?
15 అయితే, భూమిపట్ల దేవుని చిత్తమేమిటో గుర్తుతెచ్చుకోండి. దాని గురించి మీరు 3వ అధ్యాయంలో తెలుసుకున్నారు. ఈ భూమి అమరులైన నీతియుక్త మానవులతో నింపబడిన పరదైసుగా ఉండాలని దేవుడు ఏదెనులో వివరించాడు. ఆదాము హవ్వలు పాపం చేసేలా సాతాను వారిని పురికొల్పాడు, అయితే అది ఈ భూమిపట్ల దేవుని చిత్తం నెరవేరడాన్ని ప్రభావితం చేసిందే గానీ, ఆయన చిత్తాన్ని ఏ మాత్రం మార్చలేదు. యెహోవా ఇప్పటికీ ‘నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొని, దానిలో నిత్యం నివసించాలని’ ఉద్దేశిస్తున్నాడు. (కీర్తన 37:29) దేవుని రాజ్యం దానిని ఎలా నెరవేరుస్తుంది?
16, 17. దేవుని రాజ్యం గురించి దానియేలు 2:44 ఏమి చెబుతోంది?
16 దానియేలు 2:44 లో ఉన్న ప్రవచనాన్ని పరిశీలించండి. అక్కడ మనమిలా చదువుతాం: “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” దేవుని రాజ్యం గురించి ఇది మనకేమి చెబుతోంది?
17 మొదటిగా, “ఆ రాజుల కాలములలో” లేదా ఇతర రాజ్యాలు ఇంకా ఉనికిలో ఉన్నప్పుడే దేవుని రాజ్యం స్థాపించబడుతుందని అది మనకు చెబుతోంది. రెండవదిగా, ఆ రాజ్యం నిరంతరం నిలుస్తుందని అది మనకు చెబుతోంది. దానిని వేరొక ప్రభుత్వం జయించదు, ఆక్రమించుకోదు. మూడవదిగా, దేవుని రాజ్యానికి, ఈ లోక రాజ్యాలకు మధ్య జరుగుతున్న యుద్ధాన్ని కూడా మనం చూస్తున్నాం. ఆ యుద్ధంలో దేవుని రాజ్యం జయిస్తుంది. చివరిగా, మానవాళిని ఆ ప్రభుత్వం మాత్రమే పరిపాలిస్తుంది. ఆ పిమ్మట, మానవులు ఇంతవరకు చవిచూడని అత్యుత్తమ పరిపాలనను చవిచూస్తారు.
18. ఈ లోక ప్రభుత్వాలకు దేవుని రాజ్యానికి మధ్య జరిగే ఆ చివరి యుద్ధం పేరేమిటి?
18 దేవుని రాజ్యానికి, ఈ లోక ప్రభుత్వాలకు మధ్య జరిగే ఆ చివరి యుద్ధం గురించి బైబిలు ఎంతో చెబుతోంది. ఉదాహరణకు, అంతం సమీపిస్తుండగా “లోకమంతట ఉన్న రాజులను” మోసగించడానికి దుష్టాత్మలు అబద్ధాలు వ్యాపింపజేస్తాయని అది బోధిస్తోంది. దేని కోసం? ‘సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయడానికే.’ ఈ భూమ్మీది రాజులు “హెబ్రీభాషలో హార్మెగిద్దోనను, చోటుకు” పోగుచేయబడతారు. (ప్రకటన 16:14, 15) ఈ రెండు వచనాల్లో చెప్పబడిన దానినిబట్టి, మానవ ప్రభుత్వాలకు దేవుని రాజ్యానికి మధ్య జరిగే ఆ చివరి యుద్ధం హార్మెగిద్దోను లేదా అర్మగిద్దోను అని పిలవబడింది.
19, 20. భూమ్మీద దేవుని చిత్తం ఇప్పుడే నెరవేరడాన్ని ఏది అడ్డగిస్తోంది?
19 అర్మగిద్దోను యుద్ధం ద్వారా దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది? ఈ భూమిపట్ల దేవుని చిత్తమేమిటో మళ్లీ ఒకసారి ఆలోచించండి. పరదైసులో తన సేవ చేసే నీతిమంతులైన పరిపూర్ణ మానవులతో ఈ భూమి నిండి ఉండాలని యెహోవా దేవుడు సంకల్పించాడు. అది ఇప్పుడే నెరవేరడాన్ని ఏది అడ్డగిస్తోంది? మొదటిది, మనం పాపులం, మనం వ్యాధిగ్రస్తులమై మరణిస్తున్నాం. అయితే, మనం నిత్యం జీవించగలిగేలా యేసు మనకోసం మరణించాడని మనం 5వ అధ్యాయంలో తెలుసుకున్నాం. యోహాను సువార్తలోని ఈ మాటలు బహుశా మీకు గుర్తుండవచ్చు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”—యోహాను 3:16.
20 ఇంకొక సమస్య ఏమిటంటే చాలామంది దుష్ట కార్యాలు చేస్తున్నారు. వారు అబద్ధాలాడుతూ, మోసానికి, లైంగిక దుర్నీతికి పాల్పడుతున్నారు. వారు దేవుని చిత్తం చేయాలని కోరుకోవడం లేదు. అలాంటి దుష్ట కార్యాలు చేసేవారు అర్మగిద్దోను అనే దేవుని యుద్ధంలో నాశనం చేయబడతారు. (కీర్తన 37:10 చదవండి.) ఈ భూమ్మీద దేవుని చిత్తం నెరవేరకపోవడానికి ఇంకో కారణం ఏమిటంటే, దేవుని చిత్తం చేయమని ప్రభుత్వాలు ప్రజలను ప్రోత్సహించకపోవడం. చాలా ప్రభుత్వాలు బలహీనంగా, క్రూరంగా ఉన్నాయి లేదా అవినీతితో నిండిపోయాయి. బైబిలు సూటిగా ఇలా చెబుతోంది: “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.”—ప్రసంగి 8:9.
21. ఆ రాజ్యం ఏ విధంగా దేవుని చిత్తం ఈ భూమ్మీద నెరవేరేలా చేస్తుంది?
21 అర్మగిద్దోను తర్వాత, మానవాళి కేవలం ఒకే ప్రభుత్వం క్రింద అంటే దేవుని రాజ్యం క్రింద ఉంటుంది. ఆ రాజ్యం దేవుని చిత్తం నెరవేర్చి, అద్భుతమైన ఆశీర్వాదాలు తెస్తుంది. ఉదాహరణకు, అది సాతానును, అతని దయ్యాలను నిర్మూలిస్తుంది. (ప్రకటన 20:1-3) నమ్మకస్థులైన మానవులు ఇక ఎన్నటికీ వ్యాధిగ్రస్తులై మరణించకుండా ఉండడానికి యేసు బలికి ఉన్న శక్తి అన్వయించబడుతుంది. తత్ఫలితంగా వారు దేవుని రాజ్య పరిపాలనలో నిత్యం జీవించగలుగుతారు. (ప్రకటన 22:1-3 చదవండి.) ఈ భూమి పరదైసుగా మారుతుంది. అలా ఆ రాజ్యం ఈ భూమ్మీద దేవుని చిత్తం నెరవేరేలా చేస్తూ దేవుని నామాన్ని పవిత్రపరుస్తుంది. దీని భావమేమిటి? అంటే దేవుని రాజ్యంలో సజీవులుగా ఉన్న ప్రతీ ఒక్కరు చివరకు యెహోవా నామాన్ని ఘనపరుస్తారు.
దేవుని రాజ్యం ఎప్పుడు చర్య తీసుకుంటుంది?
22. యేసు భూమ్మీద ఉన్నప్పుడు లేదా ఆయన పునరుత్థానం చేయబడిన వెంటనే దేవుని రాజ్యం రాలేదని మనకెలా తెలుసు?
22 “నీ రాజ్యము వచ్చుగాక” అని ప్రార్థించమని యేసు తన అనుచరులకు చెప్పినప్పుడు, ఆ సమయానికి ఆ రాజ్యం ఇంకా రాలేదనే విషయం స్పష్టమవుతోంది. యేసు పరలోకానికి వెళ్లినప్పుడు వచ్చిందా? లేదు, ఎందుకంటే యేసు పునరుత్థానం చేయబడిన తర్వాత, కీర్తన 110:1 లోని ప్రవచనం ఆయన విషయంలో నెరవేరిందని పేతురు, పౌలు కూడా చెప్పారు. ఆ ప్రవచనం ఇలా ఉంది: “ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు—నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.” (అపొస్తలుల కార్యములు 2:32-35; హెబ్రీయులు 10:12-13) కాబట్టి యేసు వేచి ఉండవలసిన కాలం ఉంది.
రాజ్య పరిపాలనలో, దేవుని చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్లే ఈ భూమ్మీద కూడా నెరవేరుతుంది
23. (ఎ) దేవుని రాజ్య పరిపాలన ఎప్పుడు ప్రారంభమయింది? (బి) తర్వాతి అధ్యాయంలో ఏమి చర్చించబడుతుంది?
23 ఎంతకాలం? 19, 20 శతాబ్దాల్లో, యథార్థపరులైన బైబిలు విద్యార్థులు ఆ వేచివుండే కాలం 1914లో ముగుస్తుందని క్రమేపీ గ్రహించారు. (ఈ తేదీ గురించి, అనుబంధంలోని 215-218 పేజీలు చూడండి.) 1914లో ఆరంభమైన ప్రపంచ సంఘటనలు ఈ యథార్థ బైబిలు విద్యార్థుల అవగాహన సరైనదేనని ధృవీకరించాయి. 1914లో క్రీస్తు రాజయ్యాడనీ, దేవుని పరలోక రాజ్య పరిపాలన ఆరంభమైందనీ బైబిలు ప్రవచన నెరవేర్పు చూపిస్తోంది. కాబట్టి, మనం సాతానుకు మిగిలివున్న ఆ ‘కొంచెం సమయంలో’ జీవిస్తున్నాం. (ప్రకటన 12:12; కీర్తన 110:2) దేవుని రాజ్యం ఈ భూమ్మీద దేవుని చిత్తం నెరవేరేలా త్వరలోనే చర్య తీసుకుంటుందని కూడా మనం నమ్మకంగా చెప్పవచ్చు. ఇదొక అద్భుతమైన వార్త అని మీరు గుర్తిస్తున్నారా? అది నిజమనే విషయాన్ని మీరు నమ్ముతున్నారా? బైబిలు ఈ విషయాలను నిజంగా బోధిస్తోందని తెలుసుకోవడానికి తర్వాతి అధ్యాయం మీకు సహాయం చేస్తుంది.